కోడలు ఈ పనులు చేస్తే ఎలాంటి అత్తగారైనా ఫ్లాట్ అవ్వాల్సిందే..!

 

వివాహం అంటే భార్యాభర్తల బంధం అని చాలామంది అనుకుంటారు. అది నిజమే అయినా వివాహం అయిన తరువాత భార్యాభర్తల బంధం కంటే ఎక్కువగా అత్తాకోడళ్ల మధ్య  జరిగేవే ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తలు ఉద్యోగస్థులై.. వారు కుటుంబానికి దూరంగా ఉండి ఉద్యోగాలు చేసుకుంటే అత్తాకోడళ్ల సమస్య ఉండదు. కానీ.. అత్తమామలతో కలిసి ఉండే జంటలు ఉంటాయి. ఇలాంటప్పుడు అత్తాకోడళ్ల మధ్య చాలా బేధాభిప్రాయాలు వస్తుంటాయి.  ముఖ్యంగా చాలాసార్లు అత్తగారు పెత్తనం పేరుతో కోడళ్లను తిట్టడం, ఎగతాళి చేయడం, ఇబ్బందిగా మాట్లాడటం,  పనుల పేరుతో విశ్రాంతి లేకుండా చేయడం,  కొడుకు కోడలు సంతోషంగా ఉండకుండా చేయడం వంటివి చేస్తుంటారు. ఇదంతా వారి అహానికి సంబంధించినది.  

అయితే.. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు కనీసం భర్త అయినా భార్యకు సపోర్ట్ చేయకుండా తన తల్లికే సపోర్ట్ చేస్తుంటే మాత్రం అది కోడళ్లకు చాలా నరకప్రాయంగా ఉంటుంది.  కానీ ఎలాంటి అత్తలను అయినా తమ వైపు తిప్పుకుని వారిలో తమ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడేలా చేసే చిట్కాలు కొన్ని ఉన్నాయి.  ఈ చిట్కాలు పాటిస్తే ప్రతి కోడలు తన అత్తగారి దగ్గర పాజిటివ్ మార్కులు కొట్టేస్తుంది.  అవేంటో తెలుసుకుంటే..

ప్రత్యర్థిగా కాదు..

అత్తగారిని కుటుంబంలో ఒక సభ్యురాలిలా చూసుకోవాలి. చాలా మంది అత్తగారు అంటే  ప్రత్యర్థి అని,  ఆమె తమకు వ్యతిరేకం కాబట్టి తాము కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉండాలి అనుకుంటారు. కానీ  ఆమెను గౌరవిస్తున్నట్లు ఆమె అర్థం  చేసుకునేలా చేయాలి. ఎగతాళికి చేసినప్పుడు దానికి వెంటనే రియాక్ట్ అవ్వడానికి బదులు వాతావరణాన్ని చెడగొట్టకుండా ఉండటం తెలివైన పని. ఎందుకంటే భర్త కూడా అత్తవైపు ఉన్నప్పుడు అత్తగారు తప్పుగా ప్రవర్తించినా,  తప్పుగా మాట్లాడినా చివరకు దోషులుగా మిగిలేది కోడళ్లే. అందుకే వాతావరణం వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండేలా చూడాలి.

ఇష్టాఇష్టాలు..

చాలావరకు భర్త ఇష్టాఇష్టాలు తెలుసుకుని భార్య మసలుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ.. కేవలం భర్త విషయమే కాదండోయ్.. అత్తగారి ఇష్టాఇష్టాల మీద దృష్టి పెట్టడం మంచిది.  అత్తగారికి ఇష్టమైన పనులు, ఇష్టమైన ఆహారం, ఇష్టమైన వస్త్రధారణ.. ఇలాంటివన్నీ అత్తగారికి ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పడంలో సహాయపడతాయి.  తనకు ప్రాధాన్యత ఇస్తున్నారని అనిపిస్తే అత్తగారు కోడలి విషయంలో మారిపోతుంది.

బాధ్యత..

ఇంటి పనుల్లో సహాయం చేయడం,  లేదా ఇంటి పనుల విషయంలో  బాధ్యత వహించడం చేయాలి. అడగకుండానే పనులు చేయడం వల్ల  అత్తగారు మంచి అభిప్రాయంలోకి వచ్చేస్తారు. ఇది క్రమంగా ఆమె వైఖరిని మార్చుకోవడానికి సహాయపడుతుంది.

ఫిర్యాదులు..

భర్తపై ఫిర్యాదులు చేయడం చాలా మంది చేసే పని. అయితే భర్త మీద చేసే ఫిర్యాదులు అత్తగారి అహాన్ని దెబ్బతీస్తాయి.  అందుకే అతని తప్పులను అత్తగారితో ఎప్పుడూ చెప్పకూడదు.  ముఖ్యంగా  అత్తగారితో నేరుగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. ఏవైనా అపార్థాలు ఉంటే వాటిని అర్థమయ్యేలా గౌరవంగా వివరించి చెప్పుకుని పరిష్కరించుకోవాలి. ఎప్పటికీ అత్తగారితో  వాదనలు చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇది  సంబంధాన్ని మరింత దెబ్బతీస్తుంది. ముఖ్యంగా అత్తగారితో వచ్చే బేధాబిప్రాయాలు భార్యాభర్తల బంధం దెబ్బతినడానికి కారణం అవ్వచ్చు కూడా.

నిర్ణయాలు..

కుటుంబ నిర్ణయాల విషయంలో ఎల్లప్పుడూ  అత్తగారి సలహా తీసుకోవడం మరచిపోకూడదు. ఆమె అభిప్రాయం ముఖ్యమని ఆమెకు అనిపించేలా చేయాలి. దీనివల్ల ఆమెకు మీ పట్ల గౌరవం,  ఆప్యాయత పెరుగుతుంది.

చురుగ్గా ఉండాలి..

పండుగలు, కుటుంబ కార్యక్రమాలు లేదా చిన్న వేడుకల సమయంలో ఉత్సాహంగా ఉండాలి.  అత్తగారిని కూడా వేడుకలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.  ఆమె ఇష్టాలను పరిగణించండి. ఇది అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని మధురంగా చేస్తుంది  కుటుంబంలో కోడలి స్థానాన్ని స్థిరపరుస్తుంది.

ప్రశాంతత ముఖ్యం..

ఒత్తిడి లేదా కోపం ఉన్న సమయాల్లో ప్రశాంతంగా ఉండాలి. వాదించడానికి బదులుగా సరైన సమయం కోసం వేచి ఉండాలి. విషయాన్ని తెలివిగా పరిష్కరించుకోవాలి.  అత్తగారు తప్పుగా ప్రవర్తిస్తున్నారు అని  నిరూపించడానికి ప్రయత్నించకుండా ఉండాలి.  ఆమెను తప్పుగా చూపించడం కంటే ఆమె ప్రవర్తన మార్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి. ఆమె తప్పుగా ఉన్నానని ఆమెకే అర్థమయ్యేట్టు చేయాలి.

 పాజిటివ్ గా ఉండాలి..

ఎల్లప్పుడూ సానుకూల దృక్పథాన్ని,  సహనాన్ని కలిగి ఉండాలి. సంబంధాలు రాత్రికి రాత్రే మారవు. ప్రేమ, అవగాహన,  సమయంతో, ప్రతి ఒక్కరి హృదయంలో స్థానం సంపాదించడం సులభం.

                                *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu