దమ్ముందా..కిరణ్ సవాల్
posted on Jan 29, 2014 7:49PM

రాష్ట్ర శాసనసభకు పంపించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ముసాయిదా బిల్లునే మీకు దమ్ముంటే పార్లమెంటులో ప్రవేశపెట్టండి అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇదే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే తాను రాజకీయాల నుండి వైదొలుగుతానని సవాల్ కూడా చేశారు. తాను బిల్లును మార్చమని అడగటం లేదని, పార్లమెంటులో ప్రవేశ పెట్టవద్దని చెబుతున్నానని చెప్పారు. బిల్లు పైన ఓటింగుకు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 86 మంది మాట్లాడితే అసెంబ్లీ అభిప్రాయం చెప్పినట్లా అని ప్రశ్నించారు. బిల్లులోని లోపాలు ఎత్తి చూపేందుకే తాను మరో మూడు వారాల సమయాన్ని కోరినట్లు చెప్పారు. విభజనపై వారి ఉద్దేశ్యం చెప్పకుండా ఏ ప్రాతిపదికన ఈ సభ అభిప్రాయం చెప్పాలని ప్రశ్నించారు.విభజనకు తాను వ్యతిరేకమని, ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని, తెలుగు ప్రజలు కలిసి ఉండాలనేదే తన అభిప్రాయమన్నారు.