కెసీఆర్ ఎక్కడున్నావ్?
posted on Jul 26, 2012 9:23AM
ఇక నెక్ట్స్ తెలంగాణానే అంటూ కాలం గడుపుతూ వచ్చిన తెరాస అథ్యక్షుడు కెసీఆర్ ఇటీవల ఎక్కడా కనిపించటం లేదు. వార్తల్లో లేకుండా విశ్రాంతి జీవితం గడుపుతున్న కెసీఆర్‌కు వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి వచ్చి వెళ్లిందన్న విషయం కూడా తెలిసినట్లు లేదు. అంతేకాకుండా తెరాస నేతలు కూడా కెసీఆర్ ప్రస్తావన లేకుండా పనులు చేసుకుంటూ పోతున్నారు. తమకు కెసీఆర్ అవసరమే లేదన్నట్లు ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. విజయమ్మ కెసీఆర్ కుమారుడు కెటిఆర్ ప్రాతినిథ్యం వహించే సిరిసిల్ల వస్తే కెసీఆర్ మాట వినిపించలేదేంటని యావత్తురాష్ట్రం ఆశ్చర్యపోయింది. ఉద్యమం చేయాల్సిన అవసరం లేదని ఇటీవల కెసీఆర్ చేసిన ప్రకటన అటు తెలంగాణావాదులకు, ఇటు సీమాంథ్రవాసులకు కోపం తెప్పించింది.
ఎందుకంటే మామూలుగా లొంగని కేంద్రం ఉద్యమం మానేస్తే ఎలా లొంగుతుందని తెలంగాణావాదులు ప్రశ్నించారు. అలానే తెలంగాణా వచ్చేస్తుందన్న ధీమాతో కెసీఆర్ మాట్లాడటం సీమాంథ్రులను కలవరపెట్టింది. సరైన సమాచారం ఏదైనా వచ్చిందేమో అని సమైక్యాంథ్ర ఆందోళన చెందే సమయంలో ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికవటం కొంత ఊరట కలిగించింది. అయితే తెలంగాణావాదులు మాత్రం రాష్ట్రపతి ఎన్నికపై మండిపడుతున్నారు. తమను వ్యతిరేకించే ప్రణబ్‌కు పట్టడం కట్టడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కెసీఆర్ లేకపోవటం వల్ల ఆత్మహత్యలు తప్పాయని, ఉండి ఉంటే సిరిసిల్ల ఘటనపై విద్యార్థుల ఆత్మహత్యలకు హైడ్రామా ఆడిరచేవారని తెరాసలోని కొందరు నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
కెసీఆర్ అందుబాటులో లేరన్న సంగతి తెలిసే తెరాస ఎంపీ, సినీనటి విజయశాంతి, హోంశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి కొంత హడావుడి చేశారు. తెలంగాణా ఉద్యమాన్ని తప్పుపడుతున్నారని ఆమె హోంమంత్రికి వివరించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలదని, వారు గూండాయిజం చేసైనా అనుకున్నది సాధిస్తారని, అనవసరంగా విజయమ్మకు సిఎం అధిక ప్రాధాన్యత కల్పించారని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణాకు మద్దతు ఇస్తారు కదా అని విజయశాంతి మంత్రిసబితను ప్రశ్నించి తన అనుమానాలను తీర్చుకుంది. ఏమైనా కెసీఆర్ కనిపించకుంటే విజయశాంతికి పండుగేనేమో!