1500 కోట్ల కుంభకోణం.. బయటపెట్టిన బెంజ్..
posted on May 13, 2017 12:55PM

ఒక బెంజ్ కారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1500 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టింది. అదెలాగ అంటారా.. అసలు సంగతి తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఈ కుంభకోణం జరిగింది విశాఖపట్టణంలో. శ్రీకాకుళానికి చెందిన వడ్డి శ్రీనివాసరావు కోల్ కతాలో ఉల్లిపాయల ఏజెంట్ గా పని చేసేవాడు. అయితే అక్కడ సంపాదించిన కొద్ది డబ్బుతో ఇక్కడికి తిరిగివచ్చి.. శ్రీకాకుళం పరిసరాల్లో చిన్నపాటి మైనింగ్ వ్యాపారం ప్రారంభించాడు. అంతే ఒక్కసారిగా వారి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ఇళ్లు, కార్లు ఇలా అన్నింట్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వడ్డి శ్రీనివాసరావు కొడుకు వడ్డీ మహేశ్ మెర్సిడెజ్ బెంజ్ కారు కొన్నాడు. దీంతో ఇప్పటికే అతని మీద కన్నేసిన ఐటీ విభాగం ఇంత లగ్జరీ మోడల్ కారు ఎలా కొన్నారని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అదే హవాలా.
ఐటీ శాఖాధికారులు మరింత లోతుగా వెళ్లగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ తండ్రీకొడుకులు మొత్తం 12 ఉత్తుత్తి కంపెనీల పేరిట ఏకంగా 29 బ్యాంకు ఖాతాలు తెరిచారు. వాటిలో 12 ఖాతాలు వడ్డి మహేశ్ కుటుంబ సభ్యులవే కావడం విశేషం. ఈ బ్యాంకు ఖాతాల ద్వారా హవాలా మార్గంలో డబ్బును విదేశాలకు తరలించడం మొదలుపెట్టారు. ఒక్కొ డాలరుకు 85 పైసల కమీషన్ చొప్పున తీసుకుని భారీ ఎత్తున... విదేశాల నుంచి కస్టమైజ్డ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేస్తున్నామని చెబుతూ... నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారానే చైనా, హాంకాంగ్, సింగపూర్ దేశాలకు డబ్బు పంపారు. మొత్తం 1500 కోట్ల రూపాయలు ఈ కుంభకోణంలో చేతులు మారినట్టు అధికారులు గుర్తించారు.