గోద్రా అల్లర్ల ప్రధాన సూత్రధారి అరెస్ట్..
posted on May 18, 2016 3:25PM

గోద్రా అల్లర్లు గుర్తుండే ఉంటాయి కదా.. గుజరాత్ లో సృష్టించిన ఈ అల్లర్లు జరిగి దాదాపు 14 సంవత్సరాలు అవుతోంది. అయితే ఇన్ని సంవత్సరాల తరువాత ఎట్టకేలకు ఈ అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారి అయిన మాజీ మునిసిపల్ కౌన్సిలర్ ఫరూక్ భానాను పోలీసులు అరెస్ట్ చేశారు. 2002 ఫిబ్రవరిలో గోద్రా స్టేషన్ సమీపంలో కొందరు వ్యక్తులు సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుపై దాడిచేసి దానికి నిప్పుపెట్టడంతో రైలు దహనమైంది. దాదాపు 60 మంది ప్రయాణికులు మరణించారు. అలా మొదలైన అల్లర్లలో దాదాపు వెయ్యిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో దీనిపై విచారణ జరిపిన స్పెషల్ కోర్టు మొత్తం 31 మందిని దోషులుగా నిర్దారించి వారిలో 11 మందికి మరణశిక్ష, 20 మందికి జీవితఖైదు విధించింది. ఇంకా ఆరుగురు నిందుతులు పారిపోయారు. వారిలో ఒకడే భానాను. ఇక అప్పటినుండి పోలీసులు భానాను కోసం గాలిస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ ఈ ఉదయం కలోల్ టోల్ నాకా వద్ద భానాను అరెస్ట్ చేశారు. భానాను ప్రశ్నించిన అనంతరం కోర్టు ముందు హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.