ఉరకలు వేస్తున్న వరద గోదావరి
posted on Jul 28, 2012 12:03PM
నిన్న మొన్నటివరకు ఇసుక మేటలతో ఎడారిని సూచించిన గోదావరి, గత కొన్ని రోజులుగా ఎగువున కురుస్తున్న వర్షాలకుగాను వరదరూపంలో వచ్చిన నీటితో కనులపండుగగా మారింది. రైతుల కళ్లల్లో వెలుగులు నింపుతూ పొలాలన్నీ సస్యశ్యామలం చేస్తుంది. దీని వల్ల ఖరీఫ్ పంటకు దిగులు లేదని తెలుస్తుంది.రానున్న రెండు రోజుల్లో వరద ఉదృతి మరింత పెరిగే దిశలో ఉంది. ఇప్పటికే పొంగి పొర్లుతున్న ఇంద్రావతి, శబరి, ప్రాణహితల వల్ల గట్లు తెగిపోకుండా ఉండేందుకు ఇరిగేషన్ అధికారులు ఏటిగట్ల పటిష్టతపై దృష్టి సారించారు. రెండురోజుల నుండి ధవళేశ్వరం కాటన్ బ్యారేజి దగ్గర గేట్లన్నీ ఎత్తేశారు. గోదావరి లో నీటి మట్టం పెరుగుతుండటం వల్ల డెల్టాకాల్వలకు 10,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని అధికారులు తెలిపారు. ఇంకా నదిలో వరద ప్రవాహం పెరుగుతుండటం వల్ల దాదాపు నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని బంగాళా ఖాతం లోకి వదిలామని తెలిపారు.