ఇందిరమ్మ బాటతో వోట్లు రాలవు
posted on Jul 28, 2012 11:48AM
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ పోవడం పట్ల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సంపాదనకు, ఖర్చుకూ పొంతన కుదరని ఈ రోజుల్లో ప్రభుత్వం ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించాడానికి సక్రమమైన చట్టం తేవాలని, ఆదాయాలతో నిమిత్తంలేకుండా ప్రజలందరికీ సార్వత్రిక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే స్వామినాధన్ సిఫార్సులకు అనుగుణంగా రైతాంగానికి మద్దతుధర అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టణాల్లో రోజుకు 32 రూపాయలు, పల్లెల్లో 28 రూపాయలు ఆదాయం పొందే వారిని పేదవారిగా పరిగణించకూడదంటూ ప్రణాళికా సంఘం చెప్పడం హాస్వాస్పదం. కొన్ని చోట్ల రేషన్ షాపుల్లో ఒకటి రెండు రోజులు మాత్రమే పంపిణీ చేసి మిగతా రేషన్ అంతా నల్లబజారుకు తరలించడం వల్ల చాలా చోట్ల నిరుపేదలు కడుపునిండటం కష్టమవుతుంది.
ఇప్పటికే భారత దేశంలో సమతుల్య ఆహారం కొరత వల్ల ఏటా ప్రజలు అనేక రోగాలు పడుతున్నారు. గ్రామీణ, మద్యతరగతి ప్రజల్లో రక్తహీనత వేథిస్తున్న సమయంలో రాష్ట్రంలో ఆహార భద్రత కోసం గట్టి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాపంపిణీ విధానాన్ని బలోపేతం చేసి పేద కుటుంబాలన్నిటికీ కార్డులు మంజూరు చేయాలి. పేదల బ్రతుకులు బాగు చేయకుండా ఇందిరమ్మ బాటలు పట్టడం ద్వారా ప్రజలకు ఒరిగేది ఏమీ వుండదు. ఇటువంటి బాటలు వోట్లు రాల్చవని గతానుభవాలు చెబుతున్నాయి. కేవలం ఆడంబరాలకోసం ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలు జరుపుతుంటారని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా పేద, మద్యతరగతి కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందేలా చేసి అర్హులైన వారికి తెల్ల కార్డులు మంజూరు చేసి ప్రభుత్వం తన చిత్తశుద్దిని రుజువు చేసుకోవాలి.