కరీంనగర్ లో కాంగ్రెస్ క్యాంప్.. ఎమ్మెల్సీ ఎన్నికలో కారుకు షాకేనా?

కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.  ఇక్కడి రెండు స్థానాలను ఏకగ్రీవం చేసుకుందామని ఆశించిన టీఆర్ఎస్​కు సొంత పార్టీ లీడర్లు షాకిచ్చారు. ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచిన మాజీ మేయర్ సర్దార్​రవీందర్ సింగ్, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు. అయినా పూర్తి బలం ఉన్నా అధికార పార్టీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. రవీందర్ సింగ్  రోజుకో రకంగా రూలింగ్​పార్టీకి చుక్కలు చూపుతున్నారు.  కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మద్దతు కూడగడుతూనే రూలింగ్​పార్టీ క్యాంపుల్లోని ఓటర్లతో టచ్​లో ఉన్నారనే వార్తలు గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి. 

కరీంనగర్ నియోజకవర్గం ఎమ్మెల్సీ పరిధిలో 1,324 ఓట్లు ఉన్నాయి. ఇందులో 994 మంది స్థానిక ప్రతినిధులు అధికార పార్టీ సభ్యులే. మిగితా 330 మంది కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారు. సంఖ్యా బలం ఆధారంగా రెండు సీట్లను కారు పార్టీ ఈజీగానే గెలుచుకుంటుంది. అయినా టీఆర్‌ఎస్‌ పార్టీ తన స్థానిక సంస్థల ప్రతినిధులను క్యాంపులకు తరలించింది. బెంగుళూరులో అధికార పార్టీ క్యాంపు రాజకీయాలు  కొనసాగుతున్నాయి. ఇదే ఇప్పుడు  ఆసక్తికరమైన చర్చకు తెరతీసింది. పూర్తి బలం ఉన్నా టీఆర్ఎస్  పార్టీ ఎందుకు క్యాంపు రాజకీయాలను చేస్తున్నది. స్వంత పార్టీ సభ్యులపై నమ్మకం కోల్పోయిందా.. క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశముందా...ఈటల రాజేందర్‌ చెబుతున్నట్లుగా రెబల్‌ అభ్యర్థి రవీందర్‌సింగ్‌ ఇక్కడ విజయం సాధించబోతున్నారా అన్న చర్చ అన్ని రాజకీయ పార్టీల్లో జోరుగా సాగుతున్నది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి రవీందర్‌సింగ్‌కు పరోక్ష మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది. బీజేపీకి స్థానిక సంస్థల్లో 100 మంది ప్రతినిధులు ఉండగా కాంగ్రెస్‌కు 200 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. 

టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎల్ రమణ, భాను ప్రసాదరావు పోటీ చేస్తున్నారు ఎల్​రమణ ఈ మధ్యే టీడీపీ నుంచి వలసరాగా,  భానుప్రసాద్​రావు ఒకప్పుడు కాంగ్రెస్​ నేత. ఇద్దరిలో ఏ ఒక్కరూ ఉద్యమ సమయంలో పార్టీ జెండా మోసినవారు కాదు. వీరిద్దరికీ ఫీల్డ్​లెవల్​ టీఆర్ఎస్​ లీడర్లతో గానీ, ప్రస్తుత ఓటర్లతో గానీ ఎమోషనల్​ సంబంధాలు లేవు. కానీ రవీందర్​సింగ్​  ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్​లో ఉండడంతో ఆయన సానుభూతి కలిసివస్తుందనే భయం రూలింగ్​ పార్టీని వెంటాడుతోంది. పార్టీలకతీతంగా లీడర్లను కలిసి మద్దతు కోరుతున్నారు రవీందర్ సింగ్. ఇప్పటికే కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే, కాంగ్రెస్ లీడర్ శ్రీధర్ బాబును కలిసి తనకు మద్దతు ఇవ్వాలని అడిగారు.  తాజాగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ పెట్టింది. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహిస్తున్నారు. మంథని నియోజకవర్గం నుంచి క్యాంపునకు 35 మంది ప్రజాప్రతినిధులు వెళ్లారు. పోటీలో లేని కాంగ్రెస్.. క్యాంపు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.  శ్రీధర్‌బాబు శిబిరం అధికార పక్షాన్ని దెబ్బతీసే లక్ష్యంతో రవీందర్‌సింగ్‌కు ఓటు వేసి గెలిపిస్తుందా అన్నది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. 

రవీందర్‌సింగ్‌ ఎమ్మెల్సీగా గెలువబోతున్నారంటూ  ఈటల రాజేందర్ ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందు నుంచే ఉమ్మడి జిల్లా పరిధిలోని తన మద్దతుదారులతో స్థానిక సంస్థల ప్రతినిధులను సమీకరించి వారి మద్దతు కూడగట్టారని స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను సూచించిన వారికి ఓటు వేసే విధంగా ఆయన వారిని సంసిద్ధులను చేశారని ప్రచారం జరుగుతోంది. రవీందర్‌సింగ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో తొలినుంచి ఉన్న వ్యక్తిగా అందరితో విస్తృత సంబంధాలు ఉన్నాయి. ఒక ఓటు టీఆర్‌ఎస్‌ పార్టీకి వేసినా అన్యాయం జరిగిన ఉద్యమసహచరుడిని అయిన తనకు ఇంకో ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా వివిధ రాజకీయ పక్షాల నేతలు, టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తివాదులు, ప్రజాసంఘాల నాయకులు రవీందర్‌సింగ్‌ గెలుపుకోసం తమకు పరిచయం ఉన్న, తమ మాట వినే ప్రతినిధులతో మాట్లాడి ఓట్లు వేయించే బాధ్యత తీసుకుని ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. 

మిగితా జిల్లాలతో పోలిస్తే కరీంనగర్​లో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇటీవల హుజూరాబాద్​ ఫలితమే ఇందుకు నిదర్శనమని  పొలిటికల్​ అనలిస్టులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయం కోసం రూలింగ్​ పార్టీ వేల కోట్లు ఖర్చు పెట్టినా ఓటుకు రూ.6వేల చొప్పున పంచినా చివరికి ఈటల రాజేందర్​ వైపే జనం మొగ్గుచూపారు. అందుకే తాము క్యాంపులుపెట్టినా, ఓటుకు ఇంత అని ముట్టజెప్పినా చివరకు ఓటర్లు ఏం చేస్తారోననే భయం టీఆర్ఎస్​ లీడర్లను వెంటాడుతోందని అంటున్నారు.