ఆయుర్వేదం మందుల వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? చాలా మందికి తెలియని నిజాలివి..!

 

భారతదేశంలో పురాతన కాలం నుండి ప్రజలు  ఆయుర్వేద చికిత్సపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. నిజానికి ఒకప్పుడు ఏ జబ్బు వచ్చినా ఆయుర్వేద వైద్యమే జరిగేది. అయితే అల్లోపతి వైద్యం విస్తృతంగా వ్యాప్తి చెందాక ఆయుర్వేద వైద్యం ఆదరణ తగ్గింది. అల్లోపతి వైద్యం వల్ల తక్షణ ఫలితాలు ఉండటమే దీనికి కారణం. అయితే ఆయుర్వేదం  ఏ జబ్బును అయినా నిర్మూలిస్తుంది.  శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. కానీ అల్లోపతి శరీరాన్ని మత్తులోకి నెడుతుంది. చాలా రకాల జబ్బులను తాత్కాలికంగా మాత్రమే నయం చేయగలుగుతుంది.  అల్లోపతి వల్ల పెద్ద పెద్ద జబ్బులు నయం అయినా శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గుతుంది.  దీన్ని అర్థం చేసుకున్న ప్రజలు తిరిగి ఆయుర్వేదం వైపు అడుగులు వేస్తున్నారు.  ఆయుర్వేదంలో  చిన్న చిన్న జబ్బుల నుండి అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా చికిత్స సాధ్యమవుతుంది. అలాగే డయాబెటిస్, బిపి, కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుకోవచ్చు. అందుకే విదేశీ శాస్త్రవేత్తలు కూడా ఆయుర్వేద చికిత్సపై తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఆయుర్వేదం అనేది శరీరం, మనస్సు, ఆత్మ,  పర్యావరణం మధ్య సమతుల్యతను ప్రోత్సహించే భారతదేశ సాంప్రదాయ వైద్య విధానం. ఈ వైద్య విధానంలో మూలికలు, మొక్కలు, పువ్వులు,  పండ్లతో తయారు చేసిన మందులను వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఆయుర్వేద చికిత్సలో మసాజ్, యోగా,  ధ్యానం వంటి పద్ధతులను కూడా అవలంబిస్తారు. ఆయుర్వేదం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని  చాలా మంది భావిస్తారు. కానీ ఇది నిజంగా నిజమేనా? ప్రముఖ ఆయుర్వేద వైద్యులు దీని గురించి సమాచారం సరైన సమాధానం అందించారు. ఆయుర్వేద మందులకు నిజంగా దుష్ప్రభావాలు లేవా లేదా అది కేవలం అపోహనా అనే విషయం తెలుసుకుంటే..

ఆయుర్వేద వైద్యుల ప్రకారం ఆయుర్వేద  మందులకు కూడా దుష్ప్రభావాలు ఉంటాయి.   కానీ వైద్యుల సలహా మేరకు తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.   డాక్టర్ల ప్రకారం భారతదేశంలో  డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే చాలా మందులను కొనుగోలు చేసి  వాడుతుంటారు.  ఇందులో భాగంగా ఇంటి చిట్కాలు..  అందరికీ అందుబాటులో ఉండే  త్రిఫల, చ్యవనప్రాష్, అశ్వగంధ, మేదోహర్ గుగ్గులు మొదలైన కొన్ని ఆయుర్వేద మందులు ఉపయోగిస్తుంటారు. కానీ వీటిని కూడా తప్పు మార్గంలో తీసుకుంటే వీటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

ఆయుర్వేద మందులను సరైన పద్ధతిలో తీసుకోవడం అంటే  ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి. ప్రకృతిని (మనస్సు, శరీర నిర్మాణం) సరిగ్గా అంచనా వేసి, రుగ్మతకు కారణాన్ని తెలుసుకున్న తర్వాత సరైన సమయంలో, సరైన నిష్పత్తిలో.. తేనె, గోరువెచ్చని నీరు, మజ్జిగ మొదలైన సరైన అనుపానంతో లేదా ఇతర పద్దతులలో ఆయుర్వేద మందులను తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. కానీ చాలామంది వీటిని స్వంతంగా కొనుగోలు చేసి లేని సమస్యలు కూడా కొని తెచ్చుకుంటారు.

అసలు తప్పుగా వాడటం అంటే ఏంటి?

 చాలామంది వార్తాపత్రికలో/గూగుల్‌లో ఒక సమస్య  గురించి దానికి సంబంధించిన ఔషధం గురించి చదివి ఆ మందులు తమకు కూడా బాగా పనిచేస్తాయని సొంతంగా వాడటం చేస్తారు. నిజానికి ఇలా వాడే మందులు కొందరికి పని చేయవచ్చు.  కానీ అది శరీర తత్వం,  శరీరం లో ఉన్న వ్యాధి పరిస్థితిని బట్టి పనిచేస్తుంది.  కానీ జబ్బు అనేది అందరికీ ఒకే తీవ్రతలో ఉండదు. ఈ కారణంగా మందులను తప్పుగా తీసుకోవడం జరుగుతుంది. దీని వల్ల జబ్బు తగ్గడం మాట అటుంచితే.. దుష్ప్రభావాలు చాలా ఉంటాయి. ఆయుర్వేదం "అందరికీ ఒకే పరిమాణం సరిపోతుంది" అనే సూత్రంపై పనిచేయదు.  'వ్యక్తిగతీకరణ' సూత్రంపై పనిచేస్తుంది.  ప్రతి మనిషి ఇంకొక మనిషి కంటే ప్రత్యేకంగా ఉంటాడు.  అలాంటప్పుడు  చికిత్స కూడా ఒకే విధంగా ఉండదు అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.  కాబట్టి వైద్యుల సలహా లేకుండా ఆయుర్వేద మందులను కూడా స్వంతంగా వాడటం మంచిది కాదు.


                                    *రూపశ్రీ.


గమనిక:

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu