ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగితే మ్యాజిక్కే!
posted on Dec 30, 2025 2:08PM

భారతీయుల వంటింట్లో బోలెడు దినుసులు ఉంటాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు మెరుగ్గా ఉంటాయి. అటు మౌత్ ఫ్రెషనర్ గా, ఇటు వంటల్లో రుచిని పెంచడానికి ఉపయోగించే దినుసుల్లో సోంపు అగ్ర స్థానంలో ఉంటుంది. సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? సోంపు నీరు ఎలా తయారు చేసుకుని తాగాలి? ఇవన్నీ తెలుసుకుంటే సోంపుతో కలిగే బెనిఫిట్స్ ను అందరూ పొందవచ్చు.
సోంపు నీటి ప్రాధాన్యత..
సోంపు నీటిని శక్తివంతమైన, ఆరోగ్యకరమైన పానీయంగా ఉపయోగిస్తున్నారు. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తరచుగా సోంపును మౌత్ ఫ్రెషనర్‌గా మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ సోంపు దీని కంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అనేక వ్యాధులను నయం చేయడంలో శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది.
సోంపు నీరు ఎలా తయారు చేయాలి?
సోంపును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇది కడుపు సంబంధిత వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.
సోంపు నీరు ప్రయోజనాలు..
ఉదయం ఖాళీ కడుపుతో సోంపు నీటిని తాగితే, శరీరంలో అనేక సానుకూల మార్పులు కలుగుతాయి. సోంపు నీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది.
సోంపు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు సంబంద వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇది యాసిడ్ కారణంగా ఏర్పడే ఎసిడిటీ, యాసిడ్ రిప్లక్స్ వంటి ఉదర సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కడుపు చికాకును తగ్గిస్తుంది, కడుపును మంటను తగ్గించి కడుపును శాంతపరుస్తుంది.
ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కుంటున్న అతి ఆకలి సమస్యకు సోంపు చెక్ పెడుతుందట. కడుపు నిండినప్పటికీ పదే పదే ఆహారం తినాలని అనిపించడం, ఆకలి వేయడం వంటి లక్షణాలు ఆరోగ్యానికి హానికరం. సోంపు నీరు తాగడం వల్ల అనవసరంగా అతిగా ఆకలి వేయడం అనే సమస్య తగ్గుతుంది.
ప్రతి రోజూ ఉదయాన్నే సొంపు నీరు తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. ఇది కడుపుకు సంబంధించిన అనేక వ్యాధులు, సమస్యలను తగ్గిస్తుంది.
సోంపు నీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే సోంపులో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
సొంపు నీరు మహిళలకు ఋతుస్రావ సమయంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. పాలిచ్చే స్త్రీలలో పాలు పెరగడానికి కూడా సహాయపడుతుంది.
-రూప