ఏపి కొత్త రాజధానిగా విజయవాడ-గుంటూరే..!

 

 

 

ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యనే ఏర్పాటు చేయనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు తమ పార్టీ నేతలకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీమాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు సీఎం క్యాంపు కార్యాలయంగా విజయవాడ-గుంటూరు మధ్యన ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఎంపిక చేసుకున్నారు. రాజధాని ఏర్పాటు పనులను ఇక్కడ్నుంచే పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వెంకయ్య నాయుడు కూడా హైదరాబాద్-సికింద్రాబాద్ లగా విజయవాడ-గుంటూరులను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు కూడా.


దేశంలోనే అతి పెద్ద నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ కన్నా విజయవాడ- గుంటూరు- తెనాలి- మంగళగిరి విస్తీర్ణం అతి పెద్దది. హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ విస్తీర్ణం 6300 చదరపు కిలోమీటర్లు కాగా, విజిటిఎం విస్తీర్ణం 7068 చదరపు కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో మౌలిక సౌకర్యాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతం రాజధానికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. గతంలో అనుకున్న మాదిరిగా నగరాల్లో కాకుండా పట్టణాల్లోనే రాజధాని నిర్మించాలని భావిస్తే విజిటిఎం పరిధిలో ఉన్న నాలుగు మున్సిపాల్టీల్లో మంగళగిరి లేదా నూజివీడు మున్సిపాల్టీలను ఎంపిక చేసే అవకాశాలు ఉంటాయంటున్నారు. చంద్రబాబు ఈ ప్రాంతాల్లోని రైలు, రోడ్డు, విమాన మార్గాలకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేస్తున్నారట. మరోవైపు గుంటూరు...విజయవాడల్లోనే రాజధాని అనే ప్రచారం నేపథ్యంలో భూముల రేట్లకు రెక్కలు వచ్చాయి.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu