political-news-img

నగరంలో కల్తీ మాఫియా... ఇప్పుడు నీటిలో కూడా కల్తీ!

హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పాలు, పండ్లు, మసాలాలు, అల్లం-వెల్లుల్లి, టీ పౌడర్, మాంసం వంటి అనేక ఆహార పదార్థాల్లో కల్తీ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కుళ్లిపోయిన గొర్రె, మేక మాంసం, చికెన్‌ను ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్న ఘటనలు బయటపడడంతో ప్రజలు బయట భోజనం చేయడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా త్రాగే నీటిలో కూడా కల్తీ బయటపడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని అంబర్‌పేట్ ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. బోర్‌వెల్ నుంచి వచ్చే నీటిని ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండా నేరుగా ప్యాకెట్లలో నింపి “మినరల్ వాటర్” పేరుతో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తక్కువ ధరకు లభిస్తున్న ఈ ప్యాకెట్ నీటిని ప్రజలు విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ విభాగం సంయుక్తంగా దాడులు చేపట్టాయి. దాడుల సమయంలో ప్లాంట్లలోని పరిస్థితులు చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. అపరిశుభ్రమైన వాతావరణం, లీకేజీలతో ఉన్న యంత్రాలు, పాకురు పట్టిన ట్యాంకులు, ఎలాంటి శుద్ధి లేకుండా నీటిని ప్యాకింగ్ చేయడం వంటి అంశాలు బయటపడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు ప్లాంట్లను అధికారులు సీజ్ చేసి, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ప్రతి వస్తువులో కల్తీ వెలుగులోకి వస్తున్న తరుణంలో, ఇప్పుడు త్రాగే నీటిలో కూడా కల్తీ బయటపడటం పరిస్థితిని మరింత భయంకరంగా మార్చింది. తక్కువ ధరకు లభించే ప్యాకెట్ నీటిని వినియోగించే ముందు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద ఉత్పత్తులపై వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు. నగరంలో కల్తీ దందాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు.

Publish Date: Apr 7, 2026 6:34PM

political-news-img

39,436.84 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు పచ్చజెండా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రపథాన నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంగళవారం (ఏప్రిల్ 7) జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో రూ. 39,436.84 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షా 11 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 16వ ఎస్ఐపీబీ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పి. నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరచడం ద్వారా నిరుద్యోగితను తగ్గించడమే ధ్యేయంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ, విద్యుత్, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో ఈ పెట్టుబడులు ప్రధానంగా రానున్నాయి. రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది. పెట్టుబడుల వివరాలను, ఉద్యోగాల గణాంకాలను పారదర్శకంగా వెబ్‌సైట్‌లో ఉంచాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రాయలసీమ ప్రాంతాన్ని దేశానికే తలమానికంగా నిలిచే సోలార్ హబ్ మార్చాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీమలో సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని, తద్వారా రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని సూచించారు. ఇందుకోసం పటిష్టమైన గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా ఏపీని మేటిగా నిలబెట్టేందుకు శ్రీసిటీ, అనంతపురం వంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్ వంటి ఇంధనాలను తయారు చేసే కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. పరిశ్రమల స్థాపనలో భద్రతా ప్రమాణాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా ఫార్మా మరియు గ్రీన్ ఎనర్జీ విభాగాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత 22 నెలల్లో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ఏపీ అభివృద్ధికి నిదర్శనమన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుల గ్రౌండింగ్ పనులు ప్రారంభించి, నిర్ణీత గడువులోగా పరిశ్రమలు అందుబాటులోకి వచ్చేలా చేయాలని సీఎం ఆదేశించారు.

Publish Date: Apr 7, 2026 6:22PM

political-news-img

బేగంపేటలో 145 ఏళ్ల వారసత్వం కట్టడం కూల్చివేత!

హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది. ఒకప్పుడు రాజసంతో మెరిసిన ఈ చారిత్రక భవనం ఇప్పుడు కూల్చివేత శబ్దాలతో కంపిస్తోంది. తెలంగాణలోని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ గ్రేడ్–II రక్షిత రాజభవనాన్ని ఒక నిర్మాణ సంస్థ కార్యాలయం కోసం కూల్చివేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ విషయం బయటపడటంతో వారసత్వ పరిరక్షణపై తీవ్ర చర్చ మొదలైంది.పైగాహ్ వంశానికి చెందిన ఒబైద్ ఉర్ రెహ్మాన్ ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. పాలిస్ లోని ఒక భాగంలో నివసిస్తున్న రెహ్మన్ మాట్లాడుతూ... శనివారం రోజు ఒక నిర్మాణ సంస్థ కార్యాలయం కోసం బేగంపేట్ లోని 145 సంవత్సరాల చరిత్ర గల చిరాన్ ఫోర్డ్ క్లబ్ భవనంలోని పలు నిర్మాణాలను తొలగిస్తూ స్థలం ఖాళీ చేసే పనులు వేగంగా సాగాయని తెలిపారు. “చిరాన్ ప్యాలెస్ తలుపులు ఇప్పటికే తీసేశారు… త్వరలో మొత్తం భవనం నేలమట్టం కావచ్చు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.1980ల నుంచి నగర ప్రముఖులకు వినోద కేంద్రంగా ఉన్న క్లబ్ ప్రస్తుతం మూసివేయబడిందని తెలిపారు. ఒకప్పుడు చరిత్రను మోసు కొచ్చిన ఈ భవనం భవిష్యత్తు ఏమవుతుందన్న ప్రశ్న ఇప్పుడు నగరవాసుల ముందుంది.

Publish Date: Apr 7, 2026 6:15PM

political-news-img

దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నివాసాలలో ఏసీబీ సోదాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కాళింగిరి శాంతి నివాసాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం (ఏప్రిల్ 6) మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఈ సోదాలు జరిగాయి. ఒక్క ఆమె నివాసాలపైనే కాకుండా ఆమెకు సన్నిహితుల నివాసాలలో కూడా ఈ సోదాలు జరిగాయి. తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. తాడేపల్లి, విజయవాడ ప్రాంతాల్లో ఆమెకు మూడు ఇళ్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ అండదండలతోనే ఆమె ఈ స్థాయిలో పదోన్నతులు పొందారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జనకు పాల్పడ్డారని చాలా కాలంగా శాంతిపై అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సోదాలలో స్వాధీనం చేసుకున్న కీలక పత్రాలు, ఆధారాలను విశ్లేషించిన అనం తరం ఏసీబీ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Publish Date: Apr 7, 2026 5:55PM

political-news-img

ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ అరెస్ట్‌

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సిడ్నీలో మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకు చిక్కిన ఘటన కలకలం రేపింది. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో భాగంగా వార్నర్ కారును ఆపి ర్యాండమ్ బ్రెత్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో ఆయన రక్తంలో ఆల్కహాల్ శాతం అనుమతించిన పరిమితి కంటే రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసులు వార్నర్‌ను అదుపులోకి తీసుకుని మారుబ్రా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత షూరిటీపై విడుదల చేశారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో భాగంగా వార్నర్ వచ్చే మే 7, 2026న సిడ్నీలోని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులో ఆయన డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కావడంతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. పీఎస్ఎల్ మధ్యలో సిడ్నీకి... ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్, మ్యాచ్‌ల మధ్య విరామం లభించడంతో తన స్వస్థలం సిడ్నీకి వెళ్లారు. ఈ సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన వార్నర్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Publish Date: Apr 7, 2026 5:51PM

political-news-img

పేర్ని పాకులాట ఎందుకంటే?

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం నియోజకవర్గంలో తెగ హడావుడి చేస్తున్నారు. అనుచరవర్గాన్ని చెదిరిపోకుండా చూసుకోవడానికి నానా పాట్లూ పడుతున్నారు. గత ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దాదాపు వైసీపీ క్యాడర్ చెల్లాచెదురైపోయినట్లు కనిపిస్తున్నది. జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది. మచిలీపట్నంలో గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేసి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు పేర్ని నానికి కుమారుడి రాజకీయ అస్తిత్వం కాపాడాలంటే జనంలో కనిపించడం వినా మరో మార్గం లేకుండా పోయింది. అందుకే అవనసరపు హడావుడితో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారనీ, కాదు కాదు వార్తల్లో ఉండటానికి పాకులాడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓడిపోయిన నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు మౌనాన్ని ఆశ్రయించినా, ఓడిపోయినప్పటికీ మచిలీపట్నంలో మాత్రం పేర్ని నాని హడావుడి చేస్తున్నారు. స్థానిక అంశాల నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయాల వరకు ప్రతిదానికీ స్పందిస్తూ మీడియా ముందుకు వస్తున్నారు. కేసులు, అరెస్టులు వంటి బెదిరింపులకు వెనకాడబోమంటూ సవాళ్లు విసురుతున్నారు. వాస్తవంగా కేసులు, అరెస్టుల వరకూ వచ్చే సరికి పలాయనం చిత్తగించి, అవి సద్దుమణగగానే మళ్లీ హడావుడి పెంచుతున్న పరిస్థితి. ఇందుకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ పై పేర్ని నానికి ఉన్న ఆందోళనే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు తాను సైలంట్ అయితే.. మచిలీపట్నంలో పోలిటికల్ ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకమౌతుందన్న ఆందోళనే నానిని చీటికీ మాటికీ మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ద్వారా లైమ్ లైట్ లో ఉండేందుకు తాపత్రేయపడేలా చేస్తున్నదని అంటున్నారు. అయితే నాని ఈ తాపత్రేయం ఎంతవరకూ ఫలిస్తుందన్నది మాత్రం ప్రశ్నార్థకమేనని పరిశీలకులు అంటున్నారు. రాజధాని అమరావతికి అతి సమీపంలోని నియోజకవర్గం అయిన మచిలీపట్నంలో అమరావతికి వ్యతిరేక స్టాండ్ తీసుకున్న పార్టీగా వైసీపీ పుంజుకునే అవకాశాలు అంతంతమాత్రమేనని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పేర్ని నాని ఎంతగా పాకులాడినా పట్టు నిలుపుకోవడం అంత తేలిక కాదనీ చెబుతున్నారు.

Publish Date: Apr 7, 2026 5:40PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img