సీఎం లోకేష్.. ముహూర్తం ఫిక్సైందా?
posted on Dec 19, 2025 @ 1:43PM
లోకేష్ ని 2027 ఉగాది నాటికల్లా ముఖ్యమంత్రిని చేసే దిశగా కొన్ని పావులు కదులుతున్నట్టు కనిపిస్తోంది. లోకేష్ ఢిల్లీ వెళ్లి మోడీ కలిసినపుడు జరిగే ప్రధాన చర్చ ఇదేనంటారు చాలా మంది. ఇటు ఢిల్లీ, అటు నాగ్ పూర్ వర్గాల సమాచారాన్ని బట్టి చూస్తే ఇదే జరగవచ్చన్న అభిప్రాయం పరిశీలకుల్లో సైతం వ్యక్తం అవుతోంది. ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వరలో లోకేష్ కి ముఖ్యమంత్రి పదవిని అప్పగించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోకేష్ కు సీఎం పదవి విషయంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి అగ్రనాయకత్వం సుముఖంగా ఉందంటున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కావడం లేదంటున్నారు పరిశీలకులు. సీఎం పదవి కోసం పవన్ తొందరపడటం లేదనీ, ఆయన తన పాతికేళ్ల పొలిటికల్ కేరీర్ లు ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు.
అన్నిటికీ మించి లోకేష్ కు సీఎం పట్టాభిషేకం చేయడానికి నంబర్స్ కూడా బలంగా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కు మించిన సంఖ్యా బలం ఉంది. ఇక కూటమి ఐక్యత విషయానికి వస్తే.. పవన్ కు కూటమి అవసరమా? కూటమికి పవన్ అవసరమా? అన్న ప్రశ్నే తలెత్తే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ కూటమి పటిష్ఠత గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రగతిలో లోకేష్ క్రెడిట్ ను గుర్తించడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చైర్ కు లోకేష్ లైన్ క్లియర్ అయ్యిందనే అంటున్నారు పరిశీలకులు.