ఫిఫా వరల్డ్ కప్.. వేల్స్ పై ఇరాన్ విజయం..చివరి నిముషాల్లో అద్భుతం

ఖ‌తార్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2022లో ఇరాన్ జ‌ట్టు బోణి కొట్టింది. వేల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో విజ‌యం సాధించి ప్రపంచ‌క‌ప్‌లో త‌మ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. ఆట అద‌న‌పు స‌మ‌యంలో రూజ్‌బే చేష్మీ (90+9 నిమిషం), రామిన్ రిజయాన్(90+11 నిమిషం)లో చెరో గోల్ చేయ‌డంతో ఇరాన్ అద్భుత విజ‌యాన్ని అందుకుంది.  ఇరు జ‌ట్లు హోరా హోరీగా తలబడ్డ ఈ మ్యాచ్లో వేల్స్ గోల్‌పోస్ట్‌పైకి ఇరాన్ ఆట‌గాళ్లు ప‌దే ప‌దే దాడులు చేసినా ఫ‌లితం లేక‌పోయింది. వేల్స్ డిఫెన్స్  స‌మ‌ర్థ‌వంతంగా వాటిని అడ్డుకుంది. దీంతో తొలి అర్థ‌భాగంలో ఇరు జ‌ట్లు ఒక్క గోల్ కూడా చేయ‌లేక‌పోయాయి. సెకండాఫ్‌లోనూ దాదాపుగా అదే ప‌రిస్థితి కొన‌సాగింది. ఆట మ‌రికాసేప‌ట్లో ముగుస్తుంద‌న‌గా వేల్స్ గోల్ కీప‌ర్ వేన్ హెన్నెస్సీ అత్యుత్సాహం ఆ జ‌ట్టు కొంప ముంచింది. ప్ర‌త్య‌ర్థి ఆట‌గాడిని అడ్డుకునే విష‌యంలో కాస్త దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో రిఫ‌రీ అత‌డికి రెడ్ కార్డు చూయించాడు. దీంతో వేల్స్ 10 మంది ఆట‌గాళ్ల‌తోనే మ్యాచ్ కొన‌సాగించింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌త్య‌ర్థికి ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. నిర్ణీత స‌మ‌యం ముగిసే స‌మ‌యానికి ఇరు జ‌ట్లు ఒక్క గోల్ కూడా చేయ‌లేక‌పోయాయి. అద‌న‌పు స‌మ‌యంలోనూ గోల్ చేయ‌డంలో విఫ‌లం కావ‌డంతో ఇక మ్యాచ్ దాదాపు డ్రా అనుకుంటున్న త‌రుణంలో ఇరాన్ ఆట‌గాళ్లు అద్భుతం చేశారు. 90+9 నిమిషంలో ఇరాన్ ప్లేయర్ రూజ్‌బే చేష్మీ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించి ఖాతా తెరువ‌గా మరో రెండు నిమిషాల వ్యవధిలోనే ఆ ఆనందాన్ని డబుల్ చేస్తూ మరో ఇరాన్ ప్లేయర్ రామిన్ రిజయాన్ గోల్ కొట్టాడు. దీంతో ఇరాన్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ లోగా అద‌న‌పు స‌మ‌యం ముగియ‌డంతో మ్యాచ్ ఇరాన్ సొంతమైంది. త‌మ తొలి మ్యాచ్‌లో 6-2 తేడాతో ఇరాన్ ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీలో ముందు అడుగువేయాలంటే ఈ మ్యాచ్‌లో త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితిలో గెలిచి రౌండ్ ఆఫ్ 16 ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది.

మియావ్ మియావ్ పిల్లి.. సెంచరీ నాటౌట్?!

ఈ ఫొటోలో కనిపిస్తున్న పిల్లి వయస్సు 120 సంవత్సరాలు. నమ్మ లేకపోతున్నారు కదా! కానీ నమ్మక తప్పదు.  ఎందుకంటే ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలం జీవించిన పిల్లిగా దీనికి గన్నిస్ బుక్ ఆప్ రికార్డ్స్ లో స్థానం లభించింది. ఈ పిల్లి బతికిన వయస్సును మనుషుల వయస్సుతో పోలిస్తే 120 ఏళ్లు అందుకే ఈ పిల్లి వయస్సు 120 ఏళ్లు అని చెబుతారు. వాస్తవానికి ఈ మార్జాలం 26 ఏళ్ల కిందట పుట్టింది. ఏ పిల్లైనా సరే మహా బతికితే ఓ 18 ఏళ్లు బతుకుతుంది. అలాంటిది ఈ పిల్లి 26 ఏళ్లుగా జీవిస్తూ ప్రపంచంలోనే అతి ఎక్కువ వయస్సున్న పిల్లిగా గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. మనుషుల జీవన ప్రమాణంతో పోల్చి చెప్పుకోవాలంటే..దీని వయస్సు ఇప్పుడు 120 ఏళ్లుగా చెప్పాలి.పిల్లి సగటు వయస్సును మించి ఇప్పటికే ఇది పదేళ్లు ఎక్కువగా బతికేసింది. ఈ

రేవంత్ సొంత అజెండాతో భవిష్యత్ కార్యాచరణ.?

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉంది. ఆ పార్టీ రాస్ట్ర నాయకుడిగా ప్రజాకర్షణ శక్తి ఉన్న యువనేత రేవంత్ రెడ్డి ఉన్నారు. అన్నీ ఉన్నా అదేదో అన్నట్లు.. కాంగ్రెస్ తనకున్న మద్దతులు ఓట్లుగా మలచుకోవడంలో మాత్రం విఫలమౌతోంది. ఇందుకు నేతల మధ్య విభేదాలు, గ్రూపుల ఘర్షణలూ కరణమే అయినా అది ఒక్కటే కారణం కాదు. రాష్ట్ర విభజనకు ముందు వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉందనడంలో సందేహం లేదు. అంతెందుకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందంటే అందుకే తెరాస సుదీర్ఘ ఉద్యమమొక్కటే కారణం కాదు. కేంద్రంలో అప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా విస్మరించడానికి వీలులేని ఒక కారణమే. కేంద్రం ఆమోదం లేకుండా రాష్ట్రం ఆవిర్బవించే అవకాశమే లేదు. తెలంగాణ కంటే ఉవ్వెత్తున ఎగసిన గూర్ఖాలాండ్ వంటి ఉద్యమాలు విజయవంతం కాకపోవడమే ఇందుకు ఉదాహరణ. ఇక తెలంగాణ విషయానికి వస్తే అప్పట్లో అధిష్ఠానాన్ని తెలంగాణకు అనుకూలంగా అంగీకరించేలా చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని విస్మరించడం సాధ్యం కాదు. సరే అన్నీ కలిసి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇందు కోసం కాంగ్రెస్ అధిష్ఠానం ఏపీలో పార్టీ కాడెను వదిలేసింది. ఏకంగా ఆ రాష్ట్రంలో పార్టీ శూన్యంగా మిగిలిపోతుందని తెలిసీ త్యాగానికి సిద్ధపడింది. ఆ మేరకు తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుందని అంచననా వేసింది. తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావానికి క్రెడిట్ అంతా తెరాస ఖాతాలో పడింది. అప్పటి నుంచీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి తిరోగమనం నుంచి తిరోగమనంగా తయారైంది. ఈ పరిస్థితిలో  రాష్ట్ర విభజన తరువాత తన రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని అనివార్యంగా హస్తం గూటికి చేరిన నేత రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ హై కమాండ్.   కేవలం ఒక రాజకీయ పార్టీలో వంద మంది నేతలలో ఒకరిగా మిగిలిపోయు వ్యక్తిత్వం కాదు రేవంత్ రెడ్డిది. తనదైన ప్రత్యేకత, రాజకీయ వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. తెలుగుదేశం పార్టీలో  కూడా రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ప్రత్యేకత ఉన్న ముఖ్య నేతగా ఎదిగారు. 2009 ఎన్నికల సమయంలో తన ప్రచారంతో రాష్ట్రాన్ని ఉర్రూతలూగించిన జూనియర్ ఎన్టీఆర్ కు ప్రసంగాలు చేయడంలో శిక్షణ ఇచ్చినది రేవంత్ రెడ్డే అని చెబుతారు. అలాంటి వ్యక్తి  రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ తెలుగుదేశం దాదాపుగా నిర్వీర్యమైపోయిందన్న భావనతో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ లోనూ తన ప్రత్యేకత చాటుకుని పలువురు సీనియర్లను అధిగమించి మరీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాత్రం ఆయన పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందంగా సాగుతోంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత గత ఎనిమిదేళ్లుగా ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. యువత పార్టీ వైపు ఎక్కువగా దృష్టి సారించింది. క్షేత్ర స్థాయిలో క్యాడర్ లో ఉత్సాహం ఉరకలేసింది. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు రేవంత్ పార్టీ పటిష్టత దిశగా వేసే ప్రతి అడుగునూ అడ్డుకోవడానికి కాంగ్రెస్ లోని ఆయన వ్యతిరేకులు అడుగడుగునా అడ్డం పడ్డారు. ఆయన ఒక అడుగు ముందుకు వేస్తే.. వారు రెండడుగులు వెనక్కు వేసి పార్టీ పురోగతికి అవరోధంగా నిలిచారు.  ఈ అవరోధాలను అధిష్ఠానం అండతో అధిగమించి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో ఆయన అడుగులు వేసినప్పటికీ.. మునుగోడు ఉప ఎన్నికల ఫలితం తరువాత ఆయనకు కూడా తత్వం బోధపడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు బయటి శత్రువులు కంటే ఇంటి శత్రువులే ఎక్కువ అన్న నిర్దారణకు వచ్చిన ఆయన ఇప్పుడు తన భవిష్యత్ కార్యాచరణపై సీరియస్ గా దృష్టి పెట్టారు. రేవంత్ రెడ్డి  సన్నిహితుల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రావడం అన్న మిషన్ ను పక్కన పెట్టి రేవంత్ రాష్ట్రంలో ఓ పాతిక నియోజకవర్గాలపై సీరియస్ గా దృష్టి సారిస్తారు. ఆ పాతిక నియోజకవర్గాలలోనే అధిష్ఠానాన్ని ఒప్పించి తన వర్గం వారికి పార్టీ టికెట్లు సాధిస్తారు. వాటిలో తన వారిని గెలిపించుకోవడంపైనే దృష్టిసారిస్తారు.  అలా గెలిపించుకున్న పాతిక మంది ఎమ్మెల్యేలతో రాష్ట్ర రాజకీయాలలో బలమైన శక్తిగా రేవంత్ అవతరించే అవకాశాలున్నాయంటున్నారు. మరో వైపు  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కాసాని జ్ణానేశ్వర్ తెలంగాణ తెలుగుదేశం సారథ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు రానున్న జోరందుకోనున్నాయన్న అంచనాలున్నాయి. సెటిలర్స్ అధికంగా ఉన్ననియోజకవర్గాలతో పాటు మరి కొన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం అభ్యర్థులు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడుతుందనీ, హంగ్ అనివార్యమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ గా రేవంత్ అవసరిస్తారని అంటున్నారు. ఆ వ్యూహంతోనే రేవంత్ అడుగులు పడుతున్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

న్యూజిలాండ్ తో వన్డే సీరిస్ తొలి మ్యాచ్ లో టీమ్ ఇండియా చిత్తు

న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇండియా..నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల స్కోరు చేసింది. అయితే భారత్ నిర్దేశించిన 307 పరుగుల విజయ లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 17 బంతులు అంటే 2.5 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. ఛేదనలో న్యూజిలాండ్ కు గొప్ప ఆరంభమేమీ దక్కలేదు. 35 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కివీస్ స్కోరు బోర్డుపై 88  పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయి క్లిష్ట పరిస్థిల్లో ఉన్న సమయంలో స్కిప్పర్ కేన్ విలియమ్సన్, లాథమ్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దడమే మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని ఛేదించారు.  ఒక విధంగా భారత్ చేసిన 306 పరుగులు భారీ స్కోరే. అయితే బౌలర్ల వైఫల్యంతో కొండ లాంటి లక్ష్యం కూడా న్యూజిలాండ్ ఉఫ్ మని ఊదేసింది. న్యూజిలాండ్ కెప్టెన్ 94 నాటౌట్ తో కలిసి లాథమ్ 145 నాటౌట్ న్యూజిలాండ్ కు సునాయాస విజయాన్ని అందించారు. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభమన్ గిల్ లుతొలి వికెట్ కు 124 పరుగుల భాగస్వామ్యం సాధించారు.   స్కిప్పర్ శిఖర్ ధావన్  72, ఓపెనర్ శుభమన్ గిల్ 50, శ్రేయస్స అయ్యర్స్ 80 అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 36 సిక్సర్లతో 37 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.  భారీ స్కోరును ఢిఫెండ్ చేయడంతో టీమ్ ఇండియా బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఉమ్రాన్ 2 వికెట్లు పడగొట్టగా, వాషింగ్టన్ సుందర్ కు ఒక వికెట్ దక్కింది. వీరిద్దరితో సహా టీమ్ ఇండియా బౌలర్లందరూ ధారాళంగా పరుగులివ్వడంతో న్యూజిలాండ్ సునాయాసంగా విజయం సాధించింది. లాథమ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

కేంద్రం కరుణిస్తేనే జీతాలు, పెన్షన్లు ...

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అర్జెంటుగా వైద్యులు కావాలి ... వైద్యులంటే డాక్టర్లు కాదు. సుమతీ శతకకారుడు చెప్పిన, అప్పిచ్చు వైద్యులు కావాలి. అవును, రాష్ట్ర ఆర్ధికఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. అప్పు పుట్టందే పూట గడిచే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను వెంట పెట్టుకుని ఢిల్లీకి పయనమై వెళ్ళారు. ఎసరు పోయి మీద పెట్టి బియ్యం అప్పు కోసం ఇరుగుపొరుగు ఇళ్లకు పరుగులు తీసినట్లు,మరో వారం రోజుల్లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లించవలసి ఉండగా ఆర్థిక మంత్రి బుగ్గన ‘అప్పు ప్లీజ్’ అంటూ హస్తినకు పరగులు తీశారని అంటున్నారు.  జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు కూడా ఖజానాలో కాసులు లేని పరిస్థితి. అందుకే, ఆర్థిక మంత్రి బుగ్గన, అధికారులను వెంట పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళారని, అధికార వర్గాల సమాచారం.   నిజానికి  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళ నుంచి ఇదే పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మీటలు నొక్కి ఖాజానా ఖాళీ చేయడం,అవసరానికి ఆర్థిక మంత్రి బుగ్గన అక్కడా ఇక్కడా తిరిగి అప్పులు తెచ్చి అవసరాలకు సర్దుబాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే అర్హిక మంత్రిని అయిన వాళ్ళే ముద్దుగా అప్పుల మంత్రి అంటుంటారు, అలాగే, మంత్రివర్గ విస్తరణలో బుగ్గన వద్దంటున్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పట్టుపట్టి మళ్ళీ బుగ్గనకే ఆర్థిక శాఖను అప్పగించింది కూడా, అందుకే అంటారు. అప్పులు చేయడంలో ఆయనకున్న అనుభవ, సామర్ధ్యాలను గుర్తించే ముఖ్యమంత్రి బుగ్గనకు మళ్ళీ ఆర్థిక శాఖను ఇచ్చారని అంటారు.   అయితే, ఇప్పడు ఇక అప్పులు పుట్టే పరిస్థితి లేదు సరికదా, రాష్ట్ర అప్పులు ఎఫ్ఆర్బీఎం గీత దాటిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం, అప్పులపై ఆంక్షలు విధించింది. కేంద్రం అనుమతి ఇస్తేనేగానీ, కొత్త అప్పులు చేసేందుకు లేకుండా కేంద్ర ప్రభుత్వం,ఎఫ్ఆర్బీఎం చట్టానికి సవరణలు చేసింది. ఈ సవరణలు అన్ని రాష్ట్రాలకు వర్తించేవే అయినా, ఇతర రాష్టాలు అంతో ఇంతో ఆర్థిక క్రమశిక్షణతో బండి లాగిస్తున్నాయి.కానీ, ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడోనే, 175కు 175 యావలోపడి  ఆర్థిక క్రమ శిక్షణను పక్కకు తప్పించారు.   మీటలు నొక్కడమే తప్ప మరో ఆర్థిక సూత్రం ఏదీ తెలియదని ముఖ్యమంత్రి తేల్చేశారు.  ఇక అక్కడినుంచి బుగ్గనకు కొత్త తిప్పలు మొదలయ్యాయి. ముందు అప్పిచ్చు వాడిని వెతుక్కోవాలి,ఆ తర్వాత కేంద్రం అనుమతి తీసుకుని అప్పు తెచ్చుకోవలసిన పరిస్థితి వచ్చింది.  అందుకే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని, వచ్చే మంగళవారం, ఆర్బీఐ బాండ్లు వేలం వేసి జీతాల గండం గట్టేక్కేందుకు బుగ్గన ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారని అంటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కరుణించి వేలంలో ఆర్బీఐ బాండ్లు పాడుకునేందుకు అనుమతివ్వాలని వేడుకునేందుకే బుగ్గన బృందం ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. నిజానికి, కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా జగన్ రెడ్డి పభుత్వం పట్ల కొంత సానుకూల వైఖరినే అవలబిస్తూ వస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ ఎంతగా మొర పెట్టుకున్నా, కొత్త అప్పులకు ససేమిరా అంటున్న మోడీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ విషయంలో మాత్రం కొంచెం చాల ఎక్కువ వెసులుబాటు కలిపిస్తోందని తెలంగాణ మంత్రులు, అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టి, వివక్ష చూపుతోందని, తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు సహా పలువురు మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, బుగ్గన అభ్యర్ధను ఓకే చేస్తారా లేక,  లేదు పొమ్మంటారా, అనే దానిపై, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపు ఆధారపడి ఉంటుంది.  అదలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం, బీజేపీఫై  ప్రత్యక్ష యుద్ధం సాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టానికి చేసిన సవరణలకు వ్యతిరేకంగా కేంద్రాన్నిఅసెంబ్లీ వేదికగా కడిగి పారేసేందుకు సిద్దమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా ఆర్థిక దిగ్భందనం సృష్టించి రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటోందని, ముఖ్యమంత్రి ఆరోపించారు. వచ్చె నెల ( డిసెంబర్) లో జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో, ఇదే విషయంపై కేంద్రాన్ని  ఎండగడతామని  ప్రకటించారు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్ధనను ఏ మేరకు అనుమతిస్తుంది అనేది అనుమానమే అంటున్నారు. అదే నిజమై, బుగ్గన బృందం వట్టి చేతులతో వెనక్కి వస్తే, డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లు అనుమానమే అంటున్నారు. అయితే, ఇలా జీతాలు, పెన్షన్లు ఆలస్యం కావడం కొత్తమే కాదు, ఒక విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన  తర్వాత, గత సంవత్సరం సంవత్సరంన్నర కాలంగా  ఉద్యోగుల జీతాలు సకాలంలో వస్తాయనే నమ్మకం ఉద్యోగులకు లేకుండా పోయిందని అంటున్నారు. జీతాలు, పెన్షన్లు ఎప్పుడొస్తాయో, ఎవరికీ తెలియని పరిస్థితే ఉందని అంటున్నారు.

ఔను జనవరి 27 నుంచి పాదయాత్ర.. మంగళగిరి బాధ్యత ఇక మీదే.. లోకేష్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి కుమారుడు నారా లోకేష్ వచ్చే నెల27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు అదికారికంగా ధృవీకరించారు. మంగళగిరి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయనీ విషయం ప్రకటించారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర తన పాదయాత్ర సాగుతుందన్నారు.   మంగళగిరి నియోజకవర్గంలోని నూతక్కి గ్రామంలో శుక్రవారం బాదుడే బాదుడు కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో తన పాదయాత్ర నాలుగు రోజుల పాటు ఉంటుందన్నారు. పాదయాత్ర కారణంగా తాను నియోజకవర్గానికి దాదాపు ఏడాది కాలం దూరంగా ఉంటానని లోకేష్ ఈ సందర్బంగా చెప్పారు. పార్టీకి మంగళగిరి కంచుకోటగా మారిందనీ, వచ్చే ఎన్నికలలో ఇదే నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని లోకేష్ ఆ సందర్భంగా చెప్పారు. తనను ఓడించేందుకు సీఎం జగన్ కుయుక్తులను పార్టీ నాయకులు, కార్యకర్తలు సమర్థంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.  మంగళగిరి బాధ్యతలను మీకు అప్పగించి,   రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు తాను పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఇంత కాలం తండ్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి నీడలోనే రాజకీయంగా ఎదిగినా ఇప్పుడు.. పూర్తిగా పరిణితి చెందిన నేతగా ఎదిగారు. అయితే అది అంత సునాయాసంగా మాత్రం జరగలేదు. రాజకీయాలలో తొలి అడుగులు వేసే సమయంలోనే రాజకీయ ప్రత్యర్థులు ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. బాడీ షేమింగ్ చేశారు. ఆహారం, ఆహార్యంపై ఎగతాళి చేశారు. పప్పు అన్నారు. అడుగడుగునా విమర్శలు చేశారు. అయితే అన్నిటినీ తట్టుకుని తనదైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని ఇప్పుడు ప్రత్యర్థులకు సింహస్వప్నంగా ఎదిగారనడంలో సందేహం లేదు.  ఇప్పడు లోకేష్ అంటే సమస్య ఎక్కడ ఉంటే అక్కడ బాధితులకు అండగా నిలబడతారు. ప్రత్యర్థుల విమర్శలను దీటుగా తిప్పి కొడతారు. ఆయన పర్యటనలు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడమే కాదు.. ప్రజలకు భరోసానూ ఇస్తున్నాయి.  అతి తక్కువ సమయంలో లోకేష్ తనను తాను ఒక ప్రజానాయకుడిగా మార్చుకున్నారు.  తండ్రి చాటు బిడ్డగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన లోకేష్ ఇప్పుడు ఆ ఛాయ నుంచి బయటపడి తనకంటూ సొంతంగా ఒక వ్యక్తిత్వం ఏర్పరుచుకున్నారు.  ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఆయన పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే జిల్లాల పర్యటనలతో ప్రజలలో తెలుగుదేశం పార్టీకి ఒక సానుకూల వాతావరణాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఏర్పరిచారు. ఇప్పుడు దానికి మరింత ముందుకు తీసుకుపోవడానికి లోకేష్ పాదయాత్ర దోహదపడుతుందనడంలో సందేహిం లేదు. పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడే పచ్చ కండువా కప్పుకుని జనంలోకి వచ్చి ఆ తరువాత ఇంటికే పరిమితమయ్యే కొందరు సీనియర్ నాయకుల బద్ధకాన్ని ఈ పాదయాత్ర వదిలిస్తుందని భావిస్తున్నారు. అలాగే యువతను భారీగా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించడానికి లోకేష్ యాత్ర ఒక కెటలిస్ట్ అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ స్వయంగా తాను పాదయాత్ర ప్రారంభించే తేదీని అధికారికంగా ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీలో ఆనందోత్సాహాలు వ్యక్తమౌతున్నాయి.

అయ్యప్ప దీక్షలో ముస్లిం టోపీ.. మరో వివాదంలో మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్

ఏపీ రాజకీయాలలో నిత్యం వివాదాలతో సహవాసం చేసే వారి జాబితాలో కచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కచ్చితంగా ముందు వరుసలా ఉంటారు. వివాదాలను ఆయన ఆహ్వానిస్తారో.. లేక వివాదాలే ఆయనను వెతుక్కుంటూ వస్తాయో తెలియదు కానీ.. కచ్చితంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మాత్రం ఆయన తరచూ నిలుస్తుంటారు. తాజాగా ఆయన మరో వివాదానికి కేంద్రంగా మారారు. ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హిందువులన అవమానించారన్న ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. మండలం రోజులు(40 రోజులు) నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో నల్లటి దుస్తులు ధరించి పాటించాల్సన అయ్యప్ప దీక్షలో ఉన్న మంత్రి ముస్లిం టోపీ, కండువా వేసుకోవడంపై  తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అనిల్ కుమార్ యాదవ్ తీరుపై మండి పడుతోంది. దీక్షా నియమాలను ఉల్లంఘించిన ఆయనను శబరిమలై వెళ్లకుండా అడ్డుకోవాలని డిమాండ్  తెరపైకి వచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ అనిల్ కుమార్ యాదవ్ పై విమర్శలు గుప్పించారు. నిర్లక్ష్యం, అహంకారంతో అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నారని అన్నారు. దీక్షా నియమాలను పాటించని మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను శబరిమలై వెళ్లకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. 

మంత్రి రోజాకు డ్యాన్సుల మోజేమిటో?

ఏపీ టూరిజం మంత్రి రోజా ఏమి చేసినా ఏదో వివాదంగానో, సంచలనంగానో మారి తీరుతుంది. ఇదొక ఆనవాయితీగా మారిపోయింది.  రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న స్వర్ణోత్సవాన్ని సాంస్కృతిక సంబరాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో పర్యాటక మంత్రి రోజా విద్యార్థినులతో కలిసి స్టేజిపై డ్యాన్స్ చేశారు. అప్పట్లో అది సంచలనం సృష్టించింది. ఆ తరువాత గుంటూరులో జరిగిన జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో మరోసారి ఆమె వేదికపై చెక్కభజన కళాకారులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ కూడా నెటిజన్లను ఆకర్షించింది.  జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో రోజా డ్యాన్సుల వీడియోలు యూట్యూబ్ లో, సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. రాష్ట్ర పర్యాటక మంత్రి బాధ్యతల్లో ఉన్న రోజా ఇలా జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో  వేదికలపై డ్యాన్సులు చేయడంపై మాత్రం నెటిజన్లు ఓ రేంజ్ లో  ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై అభిమానం ఉండటాన్ని ఎవరూ ప్రశ్నించరు కానీ.. ఇలా స్థాయి, హోదా మరచి వేదికలపై గంతులేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.  ఆమె తీరు, శైలి మంత్రి పదవికి గౌరవం తెచ్చిపెట్టేదిగా ఎంత మాత్రం లేదనీ, పైపెచ్చు మొత్తం కేబినెట్ కే మచ్చగా మారేలా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు.  రాక రాక  వచ్చిన మంత్రి పదవిని సద్వినియోగం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడాల్సింది పోయి.. ఆ పదవిని కూడా జబర్దస్త్ గా కామెడీ చేస్తున్నట్లు రోజా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రి పదవి చేపట్టిన తరువాత జబర్డస్త్ షో నుంచి రోజా తప్పుకున్న రోజా.. తన డ్యాన్సుల మోజును ఇలా తీర్చుకుంటున్నారా అని నిలదీస్తున్నారు.   రోజాకు ఎట్టకేలకు మంత్రి పదవి అయితే దక్కింది కానీ, ఆమాత్య పదవి దక్కిన క్షణం నుంచే అది ఎప్పుడు ఊడుతుందా అన్న టెన్షన్ రోజాకు పట్టుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అసలే రోజా ఫైర్ బ్రాండ్. దానికి జగనన్న మద్దతు ఉందనే ధైర్యం తోడైంది. దాంతో తన నియోజకవర్గంలోని పార్టీ నేతలతో నిత్యం ఏదో ఒక పేచీ పెట్టుకుంటూనే వస్తున్నారు. దాంతో నియోజకవర్గంలో స్థానిక నేతల నుంచి రోజాకు ఏమాత్రం మద్దతు లభించడం లేదు.  దాంతో పాటు ఆమెను ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఖాతరు చేయని పరిస్థితి నగరి నియోజకవర్గంలో నెలకొని ఉంది. ప్రోటోకాల్ కూడా పట్టించుకోకుండా రోజాను ఆహ్వానించకుండానే పార్టీ కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపించేస్తున్నారు.  ఈ క్రమంలోనే రోజా జగన్ కు ఫిర్యాదు కూడా చేశారు. నగరి నియోజకవర్గంలోని ఓ వర్గం వైసీపీ నేతలు తనను అవమానిస్తున్నారని, ఇలా అయితే.. రాజకీయాలు చేయడం కష్టం అని రోజా వాపోయినట్లు ఓ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మరో పక్కన జగన్ చేయించుకుంటున్న సర్వేల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా రోజా పెర్ఫార్మెన్స్ పై వ్యతిరేక అభిప్రాయాలు వచ్చాయంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇదే విషయాన్ని నియోజకవర్గాల బాధ్యులు, ఎమ్మెల్యే సమీక్ష సందర్భంగా జగన్ రెడ్డి కుండబద్దలు కొట్టిన విషయం బయటకు వచ్చింది. ఇలా అయితే.. వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చేది లేదని కరాఖండిగా జగన్ చెప్పేశారు కూడా. దాంతో పాటు వచ్చే ఎన్నికల లోపు జగన్ తన మంత్రివర్గాన్ని మరోసారి పునర్వ్యవస్థీకరిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. అదే జరిగితే రోజాకు మంత్రి పదవీ గండం తప్పదనే అంచనాలు వస్తున్నాయి. మంత్రి పదవి వచ్చినప్పటి నుంచీ రోజా స్వామీజీల చుట్టూ తిరుగుతున్నారు. గుడులు, గోపురాలకు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పదవి కాస్తా ఊడిపోయే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉండడంతో స్వామీజీలను ఆశ్రయించడం వల్లో.. దేవుళ్లను మొక్కడం వల్లో పదవిని కాపాడుకోవచ్చనే ధైర్యం రోజాలో సన్నగిల్లిందేమో అంటున్నారు. అందుకే జగనన్న సంబరాల్లో తన నటనా వైదుష్యాన్ని, నాట్య కౌశలాన్ని ప్రదర్శించి ఆయననే మెప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నారంటున్నారు. అందుకే ఇలా సాంస్కృతిక వేదికలపై ప్రదర్శనలిస్తున్నారంటున్నారు. పర్యాటక మంత్రి బాధ్యతలంటే.. ఇలా చెక్క భజనలు చేయడమా? అని జనం ప్రశ్నిస్తున్నారు. రోజా తన ధోరణిని మార్చుకోకపోతే.. ఇక చెక్క భజనే చేసుకోవాల్సి ఉంటుందేమో అని జనం చెప్పుకుంటున్నారు.

ప్రపంచాన్ని అబ్బుర పరిచిన జపాన్ సాకర్ ప్లేయర్స్, అభిమానుల స్వచ్ఛ సేవ

ప్రపంచం మొత్తం ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్ తో ఊగిపోతోంది. తమ అభిమాన జట్ల విజయాన్ని అభిమానులు సంబరాలతో వేడుకలు చేసుకుంటున్నాయి. కిక్కిరిసిన స్టేడియంలలో కూడా ఈ విజయోత్సాహాలు ఆకాశమే హద్దుగా సాగుతున్నాయి. అయితే వీటికి భిన్నంగా విజయం సాధించిన తరువాత జపాన్ ఆటగాళ్లు, ఆ జట్టు అభిమానులూ వేడుక జరుపుకున్న తీరుకు ప్రపంచం మొత్తంఫిదా అయిపోయింది.   నెటిజన్లు  జపాన్ ఆటగాళ్లనూ, ఆ జట్టు అభిమానులనూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం జర్మనీ, జపాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో జపాన్ విజయం సాధించింది. వెంటనే స్టేడియంలో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటుతాయని అంతా భావించారు. కానీ జపాన్ ఫ్యాన్స్ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో, ప్రపంచం మొత్తం మెచ్చుకునేలా సంబరాలు జరుపుకున్నారు.   జ‌ర్మ‌నీపై జ‌పాన్ విజ‌యం సాధించిన త‌రువాత ఆ జ‌ట్టు అభిమానులు స్టేడియంలోని గ్యాల‌రీలలో చెత్త‌ను శుభ్రం చేశారు. మ్యాచ్ చూసే స‌మ‌యంలో ఆహార‌ ప‌దార్థాల‌ను తినిప‌డేయ‌డం, కూల్ డ్రింక్స్ బాటిల్స్‌, ఇత‌ర వ‌స్తువుల ప్యాకెట్లు స్టేడియంలో పడేయడం తెలిసిందే. వీటిని తొల‌గించేందుకు స్టేడియం సిబ్బంది ప్రేక్షకులంతా స్టేడియంను ఖాళీ చేసేసిన తరువాత శ్రమిస్తారు. వారికి ఆ శ్రమ ఎందుకు అనుకున్నారో ఏమో జపాన్ ఫుట్ బాల్ జట్టు అభిమానులు తమ జట్టు విజయం సాధించిన సందర్భాన్ని ఇలా స్టేడియంలో స్వచ్ఛ సేవ చేయడం ద్వారా జరుపుకున్నారు. స్టేడియంలో ప్రేక్షకులు చెల్లా చెదురుగా పాడేసిన వస్తువులన్నిటినీ సంచులన నింపి ఒక చోటుకి చేర్చారు. తమ అభిమానులతో జపాన్ ఫుట్ బాల్ జట్టు సభ్యులు కూడా చేతులు కలిపారు. జ‌ర్మ‌నీపై  విజ‌యం త‌రువాత జపాన్ ఆటగాళ్లు   డ్రెసింగ్ రూంలో  ఎంజాయ్ చేయ‌డం మానుకొని మరీ స్వచ్ఛ సేవలో పాల్గొన్నారు. ఇదంతా ప్రపంచాన్ని అబ్బుర పరిచింది. జపాన్ ఫుట్ బాల్ జట్టు ఆటగాళ్లు, అభిమానుల స్వచ్ఛ సేవ సెలబ్రేషన్స్ సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.  వారి స్వచ్ఛ దీక్షకు ప్రపంచం నీరాజనాలర్పిస్తోంది. 

తల మాసిందా.. గుండు తప్పదు.. ఎంప్లాయీస్ కుఎయర్ ఇండియా హెచ్చరిక

ఎయిరిండియా.. టాటా యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిన తరువాత ప్రయాణీకులకు సేవల విషయంలో గణనీయమైన పురోగతి సాధించింది. అలాగే ఆదాయ మార్గాలను పెంచుకుంటూ.. నష్టాల భర్తీలో శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇందుకోసం  టాటాయాజమాన్యం వినూత్న పద్ధతులను అవలంబిస్తోంది. అలాగే ప్రయాణీకులను గౌరవించే విషయంలోనూ, వారికి మర్యాదల విషయంలోనూ కూడ అందరి ప్రశంసలూ పొందుతూ ముందుకు సాగుతోంది. కొత్త యాజమాన్యం వచ్చిన తరువాత సేవలలో నాణ్యత భేష్ అన్న ప్రశంసలూ అందుకుంటోంది. అయితే ఈ క్రమంలో సిబ్బంది ఆహార్యం విషయంలో సంస్థ యాజమాన్యం పెడుతున్న కండీషన్స్ ఒకింత కఠినంగా ఉంటున్నాయని చెప్పక తప్పదు. సంస్థలో పని చేసే వారంతా శుభ్రతకు పెద్ద పీట వేయాలని చెబుతూ కొత్త నిబంధనలను విధించింది. ముఖ్యంగా ఎయిర్ హోస్టింగ్ విషయంలో మగవారి జట్టు విషయంలో అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నది. పురుషులలో హెయిర్ ఫాల్ ఉంటే మాత్రం గుండు చేయించుకు తీరాల్సిందే అంటోంది. అంతే కాదు మగవారు జుట్టు పొడుగ్గా పెంచుకునే స్టైలిష్ విధానాలకు తిలోదకాలివ్వాల్సిందేనని స్పష్టం చేసింద. ఇక సిబ్బందిలోని ఆడవారి విషయంలోనూ కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. మహిళా సిబ్బంది ముత్యాల చెవి రింగులు ధరించడానికి వీల్లేదని నిబంధన విధించింది. వేళాడే చెవికమ్మలపై నిషేధం విధించింది. అలాగే ఉంగరాలు కూడా చిన్నచిన్నవి అయితే మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. అంతే కాదు ఒక చేతికి ఒక ఉంగరం మాత్రమే ఉండాలి.  అలాగే చీర లేదా ఇండో-వెస్ట్రన్ డ్రెస్‌ ఏదైనా సరే చెప్పులు ధరించడం తప్పనిసరి. అలాగే ముఖాన బొట్టు తప్పని సరి చేసింది.

పతంజలి పేరుతో లో దుస్తుల వ్యాపారమా?.. బాబా రామ్ దేవ్ పై బీజేపీ ఎంపీ ఫైర్

యోగాగురు రామ్ దేవ్ బాబా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. పతంజలి బ్రాండ్ తో ఆయుర్వేద ఉత్పత్తులను విస్తృతంగా మార్కెటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా కోవిడ్ సమయంలో ఆయన చేసిన ప్రచారం, ప్రకటనలు వివాదాస్పదమయ్యాయి. పతంజలి బ్రాండ్ తో బాబారామ్ దేవ్, ఆ గ్రూప్ ఎండి బాలకృష్ణలు కోట్లాది రూపాయల టర్నోవర్ తో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా.. కాషాయ వస్త్రధారణతో బాబా రామ్ దేవ్ హిందుత్వకు ప్రతీకగా దర్శనమిస్తుంటారు. అలాగే ఆయన మాటలు, ప్రసంగాలతో తాను కేంద్రంలోని అధికార బీజేపీకి దగ్గర మనిషినన్న బిల్డప్ ఇస్తుంటారు. అయితే ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి హిందుత్వ కార్డ్ ఉపయోగించడం, అలాగే ఆధునిక యోగా పితామహుడు పతంజలి పేరును తమ వ్యాపారాలకు బ్రాండ్ గా చేసుకోవడంపై బీజేపీ గుర్రుగా ఉంది. ఇది తగదని హెచ్చరిస్తోంది.  ఆయుర్వేదిక్ ఉత్పత్తుల బ్రాండ్ గా పతంజలి పేరును ఉపయోగించుకోవడంపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విమర్శలు గుప్పించారు. మామూలుగా పతంజలి అనే పేరు ఆధ్మాత్మికతకు మారుపేరుగా అందరూ భావిస్తారు. ఆధునిక యోగా పితామహుడిగా మహర్షి పతంజలి పేరు ప్రసిద్ధి పొందింది. అటువంటి పేరును తమ వ్యాపారానికి సోపానంగా మార్చుకోవడాన్ని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తప్పుపట్టారు. కేవలం పతంజలి పేరు కారణంగానే నాణ్యత గురించి పట్టించుకోకుండా జనం పెద్ద ఎత్తున బాబారామ్ దేవ్ ఆయుర్వేదిక్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారన్నారు. పతంజలి పేరును ఉపయోగించుకోవడం మాని సొంత పేరుతో బ్రాండ్ నిర్మించుకోవాలని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్  బాబారామ్ దేవ్ కు సూచించారు.  పతంజలి పేరును వారి వ్యాపార సంస్థకు తీసివేయాలని,  అలా చేయకుండా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, అలాగే న్యాయపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ లోని మహర్షి పతంజలి జన్మస్థలమైన కొండార్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ హెచ్చరికలు చేశారు.   రామ్‌దేవ్ వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడాన్ని తాన తప్పు పట్టడం లేదనీ,  పంతంజలి పేరుమీద నెయ్యి, నూనె, సబ్బు, మసాలాలు, లోదుస్తుల వ్యాపారం చేయడాన్ని తప్పుపడుతున్నాననీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.

కేసీఆర్ పై హత్య కేసు.. బండి డిమాండ్ కు కారణమేంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై హత్య కేసు నమోదు చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అంతటి తీవ్ర డిమాండ్ కు కారణమేమిటంటే. ఫారెస్టు అధికారి శ్రీనివాసరావు రెండు రోజుల కిందట భద్రాద్రి జిల్లాలో పోడు సమస్యలపై ఉద్యమిస్తున్న గుత్తి కోయల దాడిలో మరణించిన నేపథ్యంలో ఆ హత్యకు కేసీఆర్ దే బాధ్యత అని బండి సంజయ్ ఆరోపించారు. ఫారెస్టు అధికారి చంద్రశేఖరరావుది ప్రభుత్వ హత్యేనని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సీఎం కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని, పోడు సాగు చేసుకునే రైతులకు పట్టాలిస్తాననీ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చడంలో విఫలమైనందునే పోడు రైతులు ఆందోళన బాట పట్టారన్నారు. ఇచ్చిన హామీలను విస్మరించి కేంద్రాన్ని బదనాం చేయడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని బండి అన్నారు. పోడు సమస్యల విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరే పోడు రైతుల ఆగ్రహానికి కారణమన్న బండి సంజయ్ వారి ధర్మాగ్రహం ఫారెస్టు అధికారిని బలితీసుకుందన్నారు. ఇలా ఉండగా ఫారెస్టు అధికారి శ్రీనివాసరావుది ప్రభుత్వ హత్యేనని ఇప్పటికే కాంగ్రెస్ విమర్శలు గుప్పించిన సంగతి విదితమే.  ఇక దర్యాప్తు సంస్థల తకిణీలూ, సోదాలపై రాజకీయ విమర్శలు చేయడాన్ని కూడా బండి సంజయ్ తప్పుపట్టారు. ప్రజలను వేధించి, అడ్డగోలుగా ఆస్తులు సంపాదించిన వారిని తెరాస వారైనందుకు వదిలేయాలా, వారిపై దర్యాప్తు సంస్థలు నజర్ పెట్టద్దా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీపై కూడా సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు జరిగిన సంగతిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో పని చేయవనీ, అవి స్వతంత్ర సంస్థలనీ బండి సంజయ్ అన్నారు.  

రాజస్థాన్ లో కాల్పులు.. రెండ్రోజులు ఇంటర్నెట్ బంద్!

రాజస్థాన్ లో జరిగిన కాల్పుల ఘటన కారణంగా రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఇంటర్నెట్ బంద్ చేశారు. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ లోని బిల్వారా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మరణించారు.   గతంలో  ఈ ప్రాంతంలో ఆదర్శ తపాడియా అనే వ్యక్తి హత్య జరిగింది. ఆ హత్యకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కాగా నలుగురు వ్యక్తులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపి పరారయ్యారంటున్నారు. కాగా ఈ కాల్పుల్లో మరణించిన వ్యక్తి ముస్లిం కావడంతో మత ఘర్షణలు పెచ్చరిల్లే అవకాశం ఉందని భావించిన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా బిల్వారా ప్రాంతంలో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది మే నెలలో తపాడియా అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆ సందర్బంగా ఈ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు నాటి హత్యకు ప్రతీకారంగానే ఈ కాల్పుల ఘటన జరిగిందని భావిస్తున్న నేపథ్యంలో అధికారులు ముదు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ప్రాంతమంతా పోలీసుల పహారాలో ఉంది. కాల్పులు జరిపి పరారైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తెలంగాణలో పానీపూరి డిసీజ్!

తెలంగాణలో కొత్త రోగం వెలుగులోకి వచ్చింది. ఆ రోగం పేరు పానీపూరీ డిజీస్. ఇదేం కొత్త రోగం కాదు. టైఫాయిడే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఈ టైఫాయిడ్ జ్వరాలు పానీపూరీ తినడం వల్లనే వస్తున్నాయట. అందుకే ఇప్పుడు వస్తున్న టైఫాయిడ్ జ్వరాలకు తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు పానీపూరీ డిసీజ్ అని నామకరణం చేశారు. పానీ పూరీ వల్ల టైఫాయిడ్ జ్వరాలతో పాటు పచ్చ కామెర్లు, పేగులలో మంట వంటివి కూడా సంక్రమించే ముప్పు ఉందని చెబుతున్నారు. పానిపూరి కారణంగా ఇప్పటి వరకూ కనీసం 2700 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయన్నారు. ప్రజారోగ్యానికి ఇంత హాని చేస్తున్న పానీపురీని మాత్రం నిషేధించలేదు. నిజమే  రాష్ట్రంలో పానీపూరీ బండ్లపై ఎలాంటి నిషేధం లేదు. ప్రతి గల్లిలోనూ పానీపూరీ బండ్లు కనిపిస్తూనే ఉంటాయి. పరిసరాల శుభ్రతతో సంబంధం లేకుండా.. ఈగలు ముసురుతున్న జనం గుంపులు గుంపులుగా ఆ బండ్ల ముందు నిలబడి పానీపూరీలు లాగించేయడం నిత్యం కనిపించే దృశ్యమే. అయితే నిషేధించరట కానీ.. పానీపూరి తినకుండా ఉండటమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష అంటున్నారు. ఇటీవలి కాలంలో పలు టైఫాయిడ్ జ్వరాలకు పానీపూరితో లింకుందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీవివాసరావు అన్నారు.  తోపుడు బండ్లపై విక్రయించే పానీ పూరీ తింటే ఆరోగ్యంపై ప్రభావం చూపడం తథ్యమని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్ల మీద బండిపై పానీ పూరి లు ఇష్టంగా లాగించేయడం మానుకోవాలని ప్రజలకు సూచించారాయన. అలాగే పానీ పూరి తయారీదారులు, బండ్లపై వాటిని విక్రయించేవారు  శుభ్రత పాటించాలన్నారు.   పానీపూరీలో కలిపేందుకు వాడే నీటిని కాచి వడ పోయాలని, అలాగే వాటిని బండ్లపై విక్రయించే వారు  పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. అంతే కానీ.. ప్రజారోగ్యానికి చేటు చేస్తున్న పానీపూరి విక్రయాలపై నిషేధం విధించే యోచన మాత్రం చేయడం లేదు. పైగా  మూడు, నాలుగు రోజులు జ్వరం ఉంటే  డాక్టర్‌కు చూపించుకోవాలని, వారి సూచన మేరకు తగు పరీక్షలు చేయించుకోవాలని ప్రజల హెచ్చరించారు. జాగ్రత్తలు పాటించకపోతే, జిహ్వచాపల్యాన్ని అరికట్టుకోకుంటే. . వేల రూపాయలు ఆసుపత్రి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని శ్రీనివాసరావు చెబుతున్నారు.  

ఐటీ వెంట ఈడీ ఎంటర్?

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, రాజకీయ శక్తి సామర్ధ్యాల గురించి. ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆయన తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయగలరు. అయితే, అది అన్ని వేళల సాధ్యమవుతుందా,అంటే అవునని అనలేము. కాదని చెప్పలేము. నిజానికి, రాజకీయాలలోనే కాదు, ఏ రంగంలో అయినా, వారివారి రంగాల్లో వారు ఎంత ఉద్దండులే అయినా, ఎల్లకాలం ఒకేలా ఉండదు.ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవడం అనుభవంలో ఉన్న విషయమే.  అయినా రేపటి సంగతి ఎలా ఉన్నా ఈరోజుకు, తెలంగాణ వరకు కేసీఆర్ తిరుగులేని నాయకుడు. అందులో సందేహం లేదు.  కానీ, జరుగతున్న పరిణామాలను గమనిస్తే, ఆయన గ్రహస్థితి మారుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. నిజానికి, రాజకీయంగానే కాదు,జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినా, అక్టోబర్ నెలలో దీపావళి పండగ వెళ్ళిన మర్నాడు సంభవించిన పాక్షిక సూర్య గ్రహణం, కేసేఆర్ జన్మ రాశి పై ప్రతికూల ప్రభావం చూపుతుందని, జ్యోతిష శాస్త్ర పండితులు సూచించారు. సరే అదలా వుంచి, విషయంలోకి వస్తే, మంత్రి మల్లారెడ్డి, ‘రాగ్స్ టు రిచ్స్’ స్టొరీ అందరికీ తెలిసిందే అయినా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి, ఐటీ అధికారులు రెండు రోజులు ఆయనకు సంబందించిన ఇళ్లు, వాకిళ్లు, కాలేజీలు, కార్యాలయాలు, బంధు మిత్రుల ఇళ్లు, కార్యాలయాలు ఇలా మొత్తం ఓ 50, 60 చోట్ల నిర్వహించిన సోదాల్లో ఏమి దొరికాయో, ఏమి దొరకలేదో స్పష్టంగా తెలియదు కానీ, ఈ దాడులు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ విషయంలో ఎవరికీ వారు గుంభనంగా వ్యవహరిస్తున్నా, ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే భయం మాత్రం అందరిలో ఉన్నట్లే కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.   నిజానికి, స్వయంగా మంత్రి మల్లారెడ్డి చెప్పినట్లుగా, విద్యా వ్యాపార సంస్థలపై ఐటీ దాడులు జరగడం, అందులో లెక్కలకు ఎక్కని నోట్ల కట్టలు దొరకడం మాములు విషయమే. మల్లారెడ్డి అస్తులపై ఐటీ దాడులు జరగడం కూడా ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే రెండుసార్లు దాడులు జరిగాయి. ఆయనే సరదాగా చెప్పినట్లు ఇది  ‘హట్రిక్’ దాడి. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస మధ్య గత కొంత కాలంగా సాగుతున్న రాజకీయ యుద్ధంలో భాగంగా  ఐటీ సోదాలు జరగడంతో,ఈ దాడులు రాజకీయ ప్రాధాన్యతను సంతరిం చుకున్నాయి. అంతే కాదు,పైకి మంత్రి మల్లారెడ్డి టార్గెట్’ గా దాడి జరిగినట్లు కనిపిస్తున్నా,ఈమొత్తం వ్యవహారంలో ఎంతకీ తెగని రాజకీయ చిక్కుముళ్ళు కూడా ఉన్నాయని అంటున్నారు.అసలు మూలాలు మరెక్కడో ఉన్నాయని అంటున్నారు.  గత మూడు నాలుగు నెలలుగా రాష్ట్రంలో జరుగతున్న పరిణామాలను గమనిస్తే, ముఖ్యమంత్రి కేసేఆర్ మీద జాతక చక్రం ప్రభావం బలీయంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఒక్క ఐడియా జీవితాన్నే మార్చి వేస్తుంది అన్నట్లుగా, ఢిల్లీ లిక్కర్ స్కాం’లో తెరాస ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపించింది మొదలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, తెరాసల మధ్య యుద్ధం, ప్రధానంగా కవిత కేంద్రగానే జరుగుతోంది.కవిత కోసమే కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. కొత్త ఎత్తులు వేస్తున్నారని, అందులో భాగంగానే, మంత్రి మల్లారెడ్డి  రెడ్డి బకరా అయ్యారని అంటున్నారు.  నిజానికి మల్లారెడ్డి ఎపిసోడ్’లో ఇంతవరకు జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు కథ ముందుందని తెరాస నాయకులే అనుమానిస్తున్నారు.పొట్టోడిని పోడుగోడు కొడితే, పొడుగోడిని పోచమ్మ తన్నింది అన్నట్లు, లిక్కర్ కుభాకోణం నుంచి కవితను సేవ్ చేసేందుకు, బీజేపీని ఇరకాటంలోకి నెట్టే ఉద్దేశంతో ఎమ్మెల్యేల ఎర ఎపిసోడ్ ను తెరమీదకు తెచ్చారు. అయితే, న్యూటన్ థర్డ్ లా, ప్రకారం ‘ ప్రతి చర్యకూ అందుకు  సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది’, అనే సూత్రాన్ని పాటిస్తూ బీజేపీ మంత్రి మల్లారెడ్డి మీదకు ఐటీని వదిలింది. ఐటీ వరకు అయితే ఓకే, కానీ, ఐటీ వెంట ఈడీ ఎంటర్ అవుతోందని అంటున్నారు. ఐటీ సోదాల్లో వెలుగు చూసినట్లు చెపుతున్న, మల్లారెడ్డి ‘మాయాజాలం’ వివరాలను ఐటీ అధికారులు ఈడీకి అందించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే, మంత్రి మల్లారెడ్డి మరింతగా చిక్కుల్లో ఇరుక్కోవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఐటీ సోదాల్లో పెద్ద మొత్తంలో హవాలా లావాదేవీలకు సంబందించిన వివరాలు దొరికిందే నిజం అయితే, ఈడీ ఎంటర్ అవుతుందని, ఆ తర్వాత ఏమి జరుగుతుందో, అందరికీ తెలిసిందే అంటున్నారు.  అదలా ఉంటే మంత్రి మల్లారెడ్డి, అయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలలో దొరికినట్లు చెపుతున్న హవాలా లావాదేవీల ఆధారంగా, మంత్రి మల్లారెడ్డి సహా  సంబంధిత కంపెనీలకు చెందిన 16 మంది డైరెక్టర్లకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28, 29వ తేదీల్లో తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఆర్థిక లావాదేవీలకు చెందిన డాక్యుమెంట్స్‌‌ను తీసుకురావాలని స్పష్టం చేసింది. మరోవైపు స్వాధీనం చేసుకున్న హవాలా ట్రాన్సాక్షన్స్ ఆధారాలను ఈడీకి అందించేందుకు ఐటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదలా ఉంటే తెరాస నాయకులు కొందరు, కేసీఆర్ తమ కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు మల్లారెడ్డి వంటి వారు బలిపశువులు కావలసి వస్తోందనే ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. అయితే, మల్లారెడ్డి మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్’పై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అయన నా ‘దేవుడు’ అంటున్నారు.  మరి ముఖ్యమంత్రి తమ శక్తి సామర్ధ్యాలను ఉపయోగించి మల్లారెడ్డిని సేవ్ చేస్తారా, లేక కొందరు నేతలు అనుమానిస్తున్నట్లుగా, ఫ్యామిలీ ఫస్ట్ అంటాటా, అనేది తేలవలసి ఉందని అంటున్నారు.

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలతో కేంద్రంతో కేసీఆర్ యుద్ధం మరో లెవెల్ కు

కేంద్రంతో యుద్ధాన్ని కేసీఆర్ మరో లెవెల్ కు తీసుకువెళ్లేందుకే నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల్లో పీకల్లోతు కూరుకుపోవడమే ఇందుకు కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. సంపన్న రాష్ట్రం తెలంగాణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడానికి కేంద్రమే కారణమంటూ కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఎలుగెత్తడానికి రెడీ అయిపోయారు. ఇందు కోసం ఆయన వచ్చే నెలలో వారం రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోందని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చాటేందుకు సిద్ధమైపోయారు. అసలు విషయమేమిటంటే.. తెలంగాణ ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు తగ్గట్లుగా రుణాలు అందడం లేదు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి అదనంగా కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేశారని.. వాటినీ   రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.అయితే అదే సమయంలో కేంద్రం ఏపీ పట్ల అవాజ్యానురాకం ప్రదర్శిస్తూ ఎడాపెడా అప్పులకు అనుమతులు ఇస్తుండటంతో సహజంగానే కేంద్రం తెలంగాణ పట్ల రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆ విషయాన్నేఇప్పుడు అసెంబ్లీ వేదికగా జనానికి వెల్లడించేందుకు కేసీఆర్ రెడీ అయిపోయారు.  తెలంగాణపైక కేంద్రం కక్ష పూరిత ధోరణిలో వ్యవహరిస్తూ పురోగతిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని కేసీఆర్ అంటున్నారు. అభివృద్థి బాటలో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణను నిలువరించేందుకు అనవసర ఆంక్షలతో కేంద్రం కళ్ళేలు వేస్తున్నదని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చాటాలని నిర్ణయానికి వచ్చేశారు.    తెలంగాణ కు సమకూరవలసిన ఆదాయంలో 40 వేల కోట్ల రూపాయలకు పైగా గండి పడటాన్ని   ప్రజలకు వివరించి  కేంద్రం వివవక్షను  ప్రజలందరికీ సవివరంగా తెలియజెప్పేందుకు వచ్చేనెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలలో వారం రోజులపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై లోతైన చర్చను చేపట్టేందుకు కేసీఆర్ సర్కారు సిద్ధమైంది.   కేంద్రం అనుసరిస్తున్నఅసంబద్ధ ఆర్థిక విధానాల ద్వారా రాష్ట్రాల భవిష్యత్తుకు, ప్రగతికి ఆటంకంగా మారిందని కేసీఆర్ గత కొంత కాలంగా ప్రతి వేదికపైనా గట్టిగా చెబుతున్న సంగతి విదితమే. ప్రతీ ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్రం విడుదల చేసే బడ్జెట్ గణాంకాలను అనుసరించే రాష్ట్రాలు  బడ్జెట్ ను రూపొందించుకుంటాయి. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రతి రాష్ట్రానికి ఆనవాయితీగా ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితులను ముందస్తుగా కేంద్రం వెల్లడిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తెలంగాణకు ఇచ్చే ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితిని 54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించింది. దీనిని అనుసరించి తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ను రూపొందించుకున్నది. కాగా, కేంద్రం అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్ర ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితిని 39 వేల కోట్లకు కుదించింది. తద్వారా రాష్ట్రానికి అందాల్సిన 15 వేల కోట్ల నిధులు తగ్గాయి. అంతే కాకుండా ఆర్థికంగా పటిష్టంగా వున్న రాష్ట్రాలకు అదనంగా 0.5 శాతం నిధుల సేకరణకు ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితి ఉంటుంది. ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ సౌలభ్యాన్ని కూడా పొందనీయకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తామంటెనే 0.5 శాతం రుణ పరిమితికి అనుమతిస్తామనే వ్యవసాయ వ్యతిరేక రైతాంగ వ్యతిరేక నిబంధనను ముందుకు తెచ్చి బలవంత పెట్టిందని కేసీఆర్ సర్కారు ఆరోపిస్తోంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నిర్వహణ నిర్ణయంతో మొత్తం మీద కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకే కేసీఆర్ సిద్ధమయ్యారని చెప్పాల్సి ఉంటుంది.

రాజ్యాంగ పదవుల్లో రాజకీయ నియామకాలు

రాజ్యాంగ  పదవులలో అధికార నియామకాల విషయంలో, వివాదాలు తలెత్తడం కొత్త విషయం కాదు. సీబీఐ, ఈడీ,సీవీసీ డైరెక్టర్లు, సీఈసీ కమిషనర్ల నియామకాల నుంచి, విశ్వ విద్యాలయాల వైస్ వైస్ చాన్సలర్ల నియామకాల వరకు, అనేక సందర్భాలలో రాజ్యాంగ పదవుల్లో రాజకీయ నియామకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడం, ఆ నియామకాలు  వివాదంగా మారడం చాలా కాలంగా ఉన్నదే. ఇప్పడు, మళ్ళీ మరోమారు అలాంటి వివాదమే తెరపైకొచ్చింది.  కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు కమిషనర్లలో ఒక కమిషనర్ పోస్ట్ చాలాకాలం ఖాళీగా ఉంది, ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం, కేంద్ర న్యాయశాఖ సిఫార్సు చేసిన నలుగురిలోంచి, మాజీ ఐఎఎస్ అధికారి అరుణ్ గోయల్ ను ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించింది. ఆయన ఆ వెంటనే బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ నియామక ప్రక్రియను సుప్రీం కోర్టు తప్పు పట్టింది.  కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియామకం కోసం న్యాయశాఖ, అనేక పేర్లను పరిశీలించి నలుగురి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసింది. నవంబరు 18న ఆ ఫైల్‌ను ప్రధాని కార్యాలయానికి పంపించింది. ప్రధాని అదే రోజున ఒక పేరును ప్రతిపాదించారు... ఇలా ఒకే రోజులో ప్రధాని కార్యాలయం నిర్ణయం తీసుకోవడంతో గోయెల్ నియామకం నిబంధనల ప్రకారమే జరిగిందా అని అనుమానం సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియను ఎందుకంత వేగంగా పూర్తి చేయవలసి వచ్చిందని, ధర్మాసనం ప్రశ్నించింది.  అరుణ్ గోయల్ ఇటీవలే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం, ఆ వెంటనే ఎన్నికల కమిషనర్‌గా నియామకం పొందడం వెనుక అనుమానాలు వ్యక్తం చేసింది. కేంద్ర న్యాయశాఖ నలుగురి పేర్లను సిఫార్సు చేస్తే, వారిలో అందరికంటే వయస్సులో చిన్నవారైన అరుణ్‌ గోయల్‌ పేరును ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు. ఫైల్ సర్క్యులేట్ కాకుండానే, ఒకే రోజులో ప్రధాని కార్యాలయం ఎలా నిర్ణయం తీసుకుంది. ఒకే రోజులో అప్పాయింట్మెంట్ ఎలా జరిగింది. ఎందుకంత హడావుడిగా, వేగంగా ఆమోదించాల్సి వచ్చింది? అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గత 5 రోజులుగా విచారిస్తోంది. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సీటీ రవికుమార్‌‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తోంది. ఇదే సమయంలో ఈసీ నియామకం జరగడంతో సుప్రీం కోర్టు, బుధవారం ఆకేసు విచారణ సందర్భంగా అనుమానాలు వ్యక్త పరుస్తూ, ప్రశ్నలు సంధించింది. అరుణ్‌ గోయల్‌ నియామక ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లను కోర్టుకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి గురువారం (నవంబర్ 24) కోర్టుకు సమర్పించారు.  సదరు ఫైళ్లను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం తీరుపై మరోసారి అసహనం వ్యక్తం చేసింది. 24 గంటలు కూడా గడవక ముందే మొత్తం నియామక ప్రక్రియను ఎలా పూర్తి చేశారని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదేం నియామకం?ఎందుకీ తొందర?అంటూ ధర్మాసనం నియామక ప్రక్రియ విషయంలో అసంతృప్తిని వ్యక్తపరిచింది.అయితే అదే సమయంలో సుప్రీం ధర్మాసనం, ఇక్కడ మేం అరుణ్‌ గోయల్‌ సామర్థ్యాలను శంకించట్లేదు.నియామక ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాం అని స్పష్టం చేసింది. మే15వ తేదీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉందని, నాటి నుంచి నవంబరు 18వ తేదీ వరకు ఏం జరిగిందో చెప్పాలని ఏజీని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అటార్నీ జనరల్‌ వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కమిషనర్‌ ఎంపిక ప్రక్రియలో ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు. గతంలోనూ 12 నుంచి 24 గంటల్లో నియామకాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. న్యాయశాఖ ప్రతిపాదించిన నాలుగు పేర్లను డీఓపీటీ డేటాబేస్‌ నుంచే తీసుకున్నారు.ఆ వివరాలన్నీ బహిరంగంగానే అందుబాటులో ఉన్నాయి. ఇక, పేరు ఎంపిక సమయంలో వ్యక్తి సీనియార్టీ, పదవీ విరమణ వయసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వయసుకు బదులుగా బ్యాచ్‌ ఆధారంగా సీనియార్టీని పరిగణిస్తారు అని  వివరణ ఇచ్చారు. ఈ అంశంపై విచారణ చేపట్టడం, అనుమానాల నివృత్తి కోసం వేసే ప్రశ్నల ద్వారా.. కేంద్రానికి తాము వ్యతిరేకమని అర్థం చేసుకోకూడదని సుప్రీం ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ వ్యాఖ్యానించారు. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంలో లిఖితపూర్వక వాదనలు దాఖలు చేసేందుకు ఇరుపక్షాలకు 5 రోజుల సమయం ఇచ్చింది. వాద, ప్రతివాదనలు విన్న తర్వాత సీఈసీ, ఈసీలను పారదర్శకంగా నియమించడానికి స్వతంత్ర ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలా? వద్దా? అనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.  అయితే, ఈ వివాదం ఇంతటితో ముగిసి పోతుందని అనుకోలేమని, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట జరిగిన ఈ నియామకం విషయంలో రాజకీయ దుమారం చెలరేగినా ఆశ్చర్య పోనవసరం లేదని, రాజీకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే, రాజ్యాంగ పదవుల నియామకాల్లో తలెత్తే సమస్యలు, వివాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొన వలసిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ప్రస్తుతం విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లకు మధ్య వివాదాలు రగులుతున్న నేపధ్యంలో, రాజ్యాంగ పదవుల నియామకాల విషయంలో జాతీయ స్థాయిలో సమగ్ర చర్చ అవసరం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మూడు దశాబ్దాలుగా ఓటమి ఎరగని ఎమ్మెల్యే ..

ఒక్కసారి మంత్రి చేయి గణనాధ... నువ్వు ఓడకుంటే ఒట్టుపెట్టు గణనాధ ... ఇది ఎప్పుడో ఎవరో సినిమా కవి రాసిన పాట. అందరి విషయంలో కాకున్నా, కొందరి విషయంలో అది నిజమే అయింది. మంత్రులే కాదు, ఒక్కసారి  ఎమ్మెల్యేగా గెలిచిన వారు మళ్ళీ రెండవసారికే ప్రజల విశ్వాసం కోల్పోవడం కూడా కొందరి విషయంలో నిజమే. అయితే, వరసగా ఎనిమిది సార్లు, తొమ్మిది సార్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన వారు కూడా లేక పోలేదు.అలాగే అసలు ఓటమి అన్నదే ఎరగని రాజకీయ ఉద్దండులు ఉన్నారు. అలాగే ఉద్దండులు అనుకున్న ఇందిరా గాంధీ, వాజపేయి, అద్వానీ, ఎన్టీఆర్ వంటి మహా నాయకులూ కూడా ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.  అయితే, ఇప్పడు ఈ చర్చ ఎందుకంటే, అందుకో కారణముంది. వచ్చే నెల (డిసెంబర్) మొదటి వారంలో ప్రధాని మోడీ స్వరాష్ట్రంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే కదా. మొత్తం 182 స్థానాలున్న, గుజరాత్ లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8 న ఇప్పటికే పోలింగ్ పూర్తి చేసుకున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాలలో ఒకటి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల  స్వరాష్ట్రం గుజరాత్ అయితే, రెండవ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు, జేపీ నడ్డా స్వరాష్ట్రం. ఆవిధంగా ఈ రెండు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాగే, రెండు రాష్ట్రాలఅసెంబ్లీ ఎన్నికలు రెండు రాష్ట్రాలలో ప్రధాన ప్రతిపక్షగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి  కూడా కీలకంగానే భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు జరిగి, ఇంచుమించుగా 25 సంవత్సరాల తర్వాత జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో, గాంధీ కుటుంబం వెలుపలి, సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత జరుగతున్న తొలి ఎన్నికలు కావడం  చేతనూ  హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, దేశం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఖర్గేకు ఇది తొలి పరీక్ష. అయితే, ఇంతవరకు వచ్చిన  సర్వేలన్నీ, రెండు రాష్ట్రాలలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందనే అంటున్నాయి. అయితే  సర్వేలు నిజం అవుతాయా లేదా అనేది తేలేందుకు డిసెంబర్ 8 వరకు ఆగవల్సిందే.  సరే, అదెలా ఉన్నా, అది గుజరాత్ అనే కాదు, మరే రాష్ట్రం అయినా అసెంబ్లీ ఎన్నికలు అనగానే, అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి. అలాగే, ఆసక్తికర వ్యక్తులు, వారి వారి గెలుపు ఓటములు  ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇప్పుడు మనం పైన గుర్తు చేసుకున్న, ‘ఒక్కసారి మంత్రి చేయి గణనాథా, నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథా’ పాటలో లాగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారే మళ్ళీ గెలవడం అయ్యేపని కాదని అనుకుంటున్న సమయంలో, గుజరాత్ లోని ద్వారకా ఎమ్మెల్యే పణుభా మాణెక్ ఏకంగా వరసగా ఏడు పర్యాలు,అది కూడా ఒకే నియోజక వర్గం, నుంచి గెలిచి, ఇప్పడు ఎనిమిదవ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మళ్ళీ బరిలో దిగారు.  ఏకంగా 32 ఏళ్లుగా ఒకే నియోజక వర్గం నుంచి గెలుస్తూ వస్తున్న పణుభా మాణెక్ నియోజక వర్గం అయితే మారలేదు కానీ, పార్టీ అయితే మారారు. ముందుగా ఆయన  1990లో తొలిసారిగా స్వతంత్ర అభ్యర్ధిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అలాగే 1995, 1998లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ఆయన స్వతంత్ర అభ్యర్ధిగానే విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాణెక్, 2002 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్‌పై గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకుని, 2007, 2012, 2017లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.అయితే,  1995 నుంచి, ఇంచుమించుగా 27 ఏళ్లుగా   రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయంలో ఎవరికైనా, అనుమానాలు ఉంటే ఉంటాయేమో, కానీ, పణుభా మాణెక్ గెలుపు విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి అనుమానం లేదని  నియోజక వర్గం ప్రజలు, అదే విధంగా మాణెక్, విశ్వాసం వ్యక్త పరుస్తున్నారు. అదేమంటే ప్రజలతో పెనవేసుకున్న సమబంధాలే తనకు శ్రీరామ రక్ష అంటున్నారు, మాణెక్.

చిక్కుల్లో రఘురామ.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సిట్ నోటీసులు

 వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో రఘురామ రాజుకు దెబ్బ మీద దెబ్బ  తగులుతోందని చెప్పక తప్పదు.  గతంలో ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన అరికాళ్ల మీద విపరీతంగా కొట్టారంటూ వచ్చిన ఆరోపణలు గత ఏడాది పెను సంచలనం సృష్టించాయి.  తాజాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరు కావాలంటూ రఘురామకు తెలంగాణ సిట్ అధికారులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న బంజారాహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిట్ ఆ నోటీసులలో పేర్కొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాను అని రఘురామ అన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రఘురామను విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. దీంతో మరోసారి రఘురామకృష్ణరాజు మరోసారి వార్తల్లోకి వచ్చారు. గత ఏడాది మే 14న ఏపీ సీఐడీ అధికారులు రఘురామను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా రఘురామ వ్యవహరించారనే అభియోగంతో ఆయనను అరెస్ట్ చేశారు. రఘురామపై 124 ఏ, 153 బీ, 505 ఐపీసీ, 120 బీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇతరుల మధ్య విద్వేషాలు కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, ఉన్నత పదవుల్లో ఉన్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజద్రోహం సహా పలు కేసులు పెట్టారు.  అయితే.. తనను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు తీవ్రంగా కొట్టారని రఘురామ ఆరోపించడం తీవ్ర సంచలనంగా మారింది.  పోలీసుల దెబ్బలతో తన కాళ్లు వాచిపోయాయని చెప్పడంతో గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయన శరీరంపై గాయాలు లేవని హైకోర్టుకు చెప్పారు. ఆ వెంటనే రఘురామ సుప్రీంకోర్టులో వైద్య పరీక్షలపై పిటిషన్ వేశారు. రఘురామను వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని, రఘురామ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున వైద్యపరీక్షల పర్యవేక్షణకు జ్యుడీషియల్ అధికారిని నియమించాలని అప్పుడు తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు అదేశించింది. ఆర్మీ ఆస్పత్రి నివేదిక ప్రకారం.. రఘురామ ఎడమకాలి వేలు ఫ్రాక్చర్ అయిందనీ, ఇతర గాయాలు కూడా ఉన్నట్లు తేలింది. రఘురామ బెయిల్ పిటిషన్ పై తీవ్ర వాదోపవాదనలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఆయనకు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచీ రఘురామ ఏపీ సీఎం జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తూనే ఉండడం విశేషం. రఘురామను సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం, భౌతికంగా కొట్టడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించడం విశేషం. రఘురామ అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును హెచ్చార్సీ తప్పుపట్టింది. అప్పటి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, హోం మంత్రిత్వశాఖ చీఫ్ సెక్రటరీకి నోటీసులు కూడా ఇచ్చింది. ఇప్పుడు తాజాగా  ఎమ్మెల్యేలకు ఎర  కేసు దర్యాప్తులో భాగంగా రఘురామకు సంబంధించిన పలు కీలక విషయాలను సిట్ సేకరించిందని సమాచారం. ఈ క్రమంలోనే రఘురామను విచారణకు రావాలని తెలంగాణ సిట్ 41ఏ నోటీసు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పుడు ఏపీ సీఐడీ యాక్షన్ వెనుక సీఎం జగన్ హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కూడా రఘురామకు తెలంగాణ సిట్ నోటీసులు ఇవ్వడం వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అక్కడ సీఎం, ఇక్కడ సీఎం ఇద్దరూ ఒకే తానులో ముక్కల్లాంటి వారే అని.. రఘురామను ఇరుకున పెట్టేందుకు ఇద్దరి సంయుక్త వ్యూహం ఏమైనా ఉందా? అనే సంశయాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి.