తెలుగుదేశం మహానాడు తోలి రోజు సూపర్ హిట్

తెలుగుదేశం పెద్ద పండుగ మహానాడు ఈ సారి కడపలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి రోజు మంగళవారం (మే26) పూర్తిగా పార్టీ అజెండాలపైనే సాగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు లోకేశ్  తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం,   స్త్రీశక్తి,  పేదల సేవలో సోషల్‌ రీఇంజినీరింగ్‌, అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత అన్న ఆరు శాసనాలను ప్రతిపాదించారు. అలాగే పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే నిలబడింది, ప్రజల కోసమే పని చేసిందని చెప్పారు. నాలుగు దశాబ్దాల పైబడిన తెలుగుదేశం ప్రస్థానంలో పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ పార్టీ జెండాను వదల కుండా మోసిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పిన లోకేష్.. మరో నాలుగు దశాబ్దాలు పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించేందుకు అవసరమైన అంశాలపై మహానాడు వేదికగా సమగ్ర చర్చ జరగాలన్నారు.

ఇక పార్టీ అధినేత చంద్రబాబు అయితే  పార్టీ పటిష్ఠత, రాష్ట్రఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తన ఆలోచనలు, ప్రణాళికలను తొలిరోజు మహానాడు వేదికపై ఆవిష్కరించారు.  అదే సమయంలో చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కూడా గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తేడాలను కళ్లకు కట్టారు. ఇక కార్యకర్తల విషయంలో జగన్ అధికారంలో ఉన్నసమయంలో ఒకలా.. అధికారం కోల్పోయిన తరువాత మరోలా మాట్లాడుతున్న తీరును చక్కగా ఎండగట్టారు.  అదే సమయంలో తెలుగుదేశం కార్యకర్తల నిబద్దత, పోరాటాలు, త్యాగాలను గుర్తు చేసుకోవడమే కాకుండా.. పార్టీ కోసం కార్యకర్తలు చేసిన త్యాగాలను వృధాకానివ్వబోమని భరోసా ఇచ్చారు. అయితే అది ఒట్టి భరోసా మాత్రమే కాదని ఇప్పటికే ఆచరణలో చేసి చూపడంతో కార్యకర్తలలోనే కాదు, ప్రజలలోనూ వారి పట్ల విశ్వసనీయత పెరిగింది.  మొత్తం మీద మహానాడు తొలి రోజు సూపర్ సక్సెస్ అయ్యింది. రాష్ట్రం నలుమూలల నుంచీ తరలి వచ్చిన కార్యకర్తల ఉత్సాహం ఇనుమడింప చేసేలా పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఇతర నాయకులు, మహానాడు వేదికగా చేసిన తీర్మానాలు ఉన్నాయి. 

Teluguone gnews banner