కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్.. షర్మిల ఎవరి చేతిలో అస్త్రం?

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, కుమార్తె, అవశేష ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్  టీపీ పార్టీ స్థాపించి సంవత్సరం దాటింది.  అప్పటి నుంచి ఇప్పటివరకు, ఆమె రాజకీయాల్లో  క్రియాశీలంగానే  ఉన్నారు.   అయితే ఆమె పార్టీలో ఆమె కాకుండా ఇంకెవరైనా నాయకులు ఉన్నారా అంటే సమాధానం చెప్పడం అంత సులువు కాదు. ఒక విధంగా షర్మిల సింగిల్ విమెన్ ఆర్మీగానే పార్టీని నడుపుతున్నారు.  షర్మిలకు రాజకీయాలు కొత్తకాదు. రాజశేఖర రెడ్డి కుమార్తేగానే కాదు, జగన్ రెడ్డి సోదరిగానూ, ఆమె రాజకీయ ఆటుపోట్లను రుచి చూశారు. రాజశేఖర రెడ్డి ఉన్నంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించక పోయినా, ఆయన మరణం తర్వాత, మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ, స్థాపించిన తర్వాత షర్మిల పార్టీ వ్యవహరాల్లో చురుకైన పాత్రను పోషించారు. చివరకు ఆమె   తెలంగాణలో పార్టీ  పెట్టారు? అన్న జగన్ రెడ్డితో ఆస్తి  తగవో, రాజకీయ వివాదమో ఏదైనా ఉంటే,ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని అనుకుంటే, ఆమె పార్టీ పెట్ట వలసింది, అన్నతో పోరాడ వలసింది, ఏపీలో కదా?  కానీ ఆమె తెలంగాణలోనే తన పార్టీని స్థాపించారు.  ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడం వెనక,ఎ వరెవరిదో ప్రమేయం, ఏవేవో వ్యూహాలు ఉన్నాయని కథనాలు మీడియాలో పుంఖానుపుంఖాలుగా వచ్చాయి. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ఆమె పార్టీ వెనక  తెరాస ఉందనీ,  బీజేపీ పార్టీల వరకు ఎవరి హస్తమో  ఉందని, ఉందనీ, అసలు జగన్ రెడ్డే, ఆమె వెనక ఉన్నారనే ప్రచారం కూడ అప్పట్లో విస్తృతంగా జరిగింది.  అయితే, తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ బయలు దేరిన షర్మిల రాష్ట్రంలో అంచెలంచెలుగా  అలుపెరుగని పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె అలా వేల  కిలోమీటర్లు నడిచేశారు. ఇంకా నడుస్తున్నారు పాద యాత్ర పొడుగునా ఆమె తెరాస ప్రభుత్వం పై కత్తులు దూస్తున్నారు. పదునైన విమర్శల శరాలు సంధిస్తున్నారు. ముఖ్యమత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత.. ఇలా వీళ్ళు వాళ్ళని కాదు, మంత్రులు, తెరాస నాయకులు ఎవరినీ వదిలి పెట్ట కుండా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కొండొకచో వ్యక్తీ గత విమర్శలూ గుప్పిస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఆమె విమర్శలను తెరాస నేతలెవరూ ఖండించడం లేదు.  దేశ ప్రధాని, రాష్ట్ర గవర్నర్ సహా తమకు ప్రత్యర్ధులు అనుకున్న ప్రతి ఒక్కరినీ విమర్శలతో ఎండగట్టే  తెరాస నాయకులు, షర్మిల తెరాస నాయకులు, చివరకు ముఖ్యమంత్రి కేసేఆర్ పై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించినా పట్టించుకోవడం లేదు. కనీసం ఖండించడం లేదు. అందరినీ ఎండగట్టే కేసీఆర్, కీటీఆర్ సహా తెరాస నాయకులు ఒక్క షర్మిల విషయంలో మాత్రమే ఎందుకు మౌనం వహిస్తున్నారు?    ఎందుకంటే షర్మిల పార్టీ తెరాస అధినేత కేసీఆర్ స్పాన్సర్డ్ పార్టీ అని పరిశీలకులు చెబుతున్నారు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చే పార్టీగా షర్మిల నాయకత్వంలోని వెఎస్సార్ టీపీ తెరమీదకు వచ్చిందని అంటున్నారు. కేసీఆర్ స్వయంగా ఈ పార్టీకి అండదండలు అందిస్తున్నారని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే..  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ లో సిద్ధహస్తుడు. ఆయన వ్యూహ చతురుడు కూడా. ప్రత్యర్థి పార్టీల ఊహకు అందని వ్యూహాలతో ఎప్పటికప్పుడు వారిని గందరగోళంలో పడేస్తారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్, వ్యూహచతురతతోనే కేసీఆర్ గత ఎనిమిదేళ్లుగా తెలంగాణలో ఎదురు లేని నాయకుడిగా కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిన ప్రతిసారీ దాని నుంచి బయటపడేందుకు  ప్రజల దృష్టిని, విపక్షాల దృష్టినీ మళ్లీం చే వ్యూహాలకు ఆయన పదును పెడతారు. సరే ఇప్పుడా విషయం ఎందుకంటే.. డిల్లీ లిక్కర్ స్కాం, మంత్రులపై ఐటీ దాడుల స్పీడుతో కేసీఆర్ సర్కార్ ఒకింత ఇబ్బందుల్లో పడింది. జనం దృష్టి అంతా ఈ కుంభకోణం, దర్యాప్తు సంస్థల దాడులపైనే ఉంది. విపక్షాలన్నీ కూడా కేసీఆర్ పాలనలో అవినీతి, ఆయన కుటుంబం అవినీతే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా కేసీఆర్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. సరిగ్గా ఈ సమయంలోనే గత ఏడాదికి పైగా ఎలాంటి అడ్డంకులూ, ఆంక్షలు, అవాంతరాలూ లేకుండా సాగుతున్న షర్మిల పాదయాత్రపై దాడి జరగడం, ఆమె యాత్రను భగ్నం చేసి అరెస్టు చేసి ఇంటికి పంపించడం జరిగింది. ఇదేదో కాకతాళీయంగా జరిగిన సంఘటనగా అనుకోవడానికి వీల్లేదని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. దర్యాప్తు సంస్థల దూకుడు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందకు కేసీఆర్ వ్యూహ రచనకు అనుగుణంగానే షర్మిల పాదయాత్రపై రాళ్ల దాడి, వాహనం ధ్వంసం వంటి సంఘటనలు జరిగాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏడాది కాలంలో షర్మిల పాదయాత్రకు రాష్ట్రంలో రెడ్ కార్పెట్ పరిచి మరీ కొనసాగించేందుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఉరుములేని పిడుగులా ఆమె పాదయాత్రపై ఉక్కుపాదం మోపడం వెనుక ఉన్నది డైవర్షన్ పొలిటికల్ స్ట్రాటజీయే అంటున్నారు. వాస్తవంగా వరుసగా రెండో సారి తెలంగాణలో  తెరాస అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ప్రోది అవుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని షర్మిలను తెలంగాణలో పార్టీ పెట్టేందుకు ఆహ్వానించినది కేసీఆరేనంటున్నారు. ఆమె ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలన్నదే  కేసీఆర్ వ్యూహంగా చెబుతారు. అందుకే గత ఏడాది కాలంగా షర్మిల కేసీఆర్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబం అవినీతిపై ఎన్ని విమర్శలు చుస్తున్నా ప్రభుత్వం పట్టనట్టుగానే వ్యవహరించింది. ఆమె పాదయాత్రకు ఎటువంటి అడ్డంకులూ సృష్ఠించలేదు. అదే బండి సంజయ్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తోంది. దీంతో షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం వెనుక ఉన్నది కేసీఆర్ అన్న వాదనకు బలం చేకూరుతోంది. ఇటీవలి కాలంలో షర్మిల విమర్శల వేడి పెరిగినా.. కేసీఆర్ కానీ.. తెరాస శ్రేణులు కానీ పెద్దగా పట్టించుకోలేదు. చివరాఖరికి ఢిల్లీ వెళ్లి కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదులు చేసినట్ల ఆమె మీడియా సమావేశంలో ప్రకటించినా అందుకు సంబంధించిన ఫిర్యాదు కాపీని ఆమె మీడియాకు విడుదల చేయకపోవడంతో ఆమె నిజంగా ఫిర్యాదు చేశారా అన్న అనుమానాలు వెల్లువెత్తాయి. అలాగే షర్మిల వైఎస్సార్ టీపీ పార్టీ ఏర్పాటు వెనుక జగన్ ఉన్నారని కూడా రాజకీయవర్గాలలో విస్తృతంగా వినిపిస్తోంది.  2019 ఎన్నికలలో తాను ఏపీలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ చేసిన సహాయానికి రిటర్న్ గిఫ్ట్ గా ఏపీ సీఎం జగన్ షర్మిల చేత తెలంగాణలో తండ్రి పేర పార్టీ ఏర్పాటు చేయించారని కూడా చెబుతుంటారు. ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం కోసమే షర్మిల వైఎస్సార్ టీపీ పార్టీకి కేసీఆర్, తెరాస సర్కార్ అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలకు తగినట్టుగానే సోమవారం (నవంబర్ 28) షర్మిల పాదయాత్రపై దాడి, ఆమె అరెస్టు ఘటనల తరువాత రాష్ట్రంలో దర్యాప్తు సంస్థల దూకుడు, లిక్కర్ స్కాం, ఐటీ దాడులు, మల్లారెడ్డి ఓవర్ యాక్షన్ వంటి ఏ అంశాలూ చర్చలోకి కాదు కాదు సోదిలోకి లేకుండా పోయాయి. రాష్ట్రం మొత్తం షర్మిల పాదయాత్రపై జరిగిన దాడి, ఆమె అరెస్టుపైనే చర్చ జరుగుతోంది. దీనికి కొనసాగింపు అన్నట్లుగా మంగళవారం (నవంబర్ 29) ప్రగతి భవన్ ముట్టడి అంటూ మరో డ్రామాకు తెరలేచింది. ఇక్కడ కూడా హై డ్రామా మధ్య షర్మిలను పోలీసులు అరెస్టు చేసి ఎస్ ఆర్ నగర్ పీఎస్ కు తీసుకువెళ్లారు. ప్రగతి భవన్ ముట్టడికి బయలు దేరిన షర్మాను రాజ్ భవన్ రోడ్ లో పోలీసులు అడ్డుకున్నారు. అమె కారులోంచి దిగడానికి నిరాకరించడంతో క్రేన్ సహాయంతో కారును పీఎస్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాలోనూ సామాజిక మాధ్యమంలోనే హల్ చల్ చేస్తున్నాయి. రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల పోటాపోటీ విచారణలు సహా అన్ని రాజకీయ అంశాలూ మరుగున పడిపోయాయి. కేసీఆర్ వ్యూహం కూడా ఇదేననీ, ప్రజల దృష్టిని ప్రధాన సమస్యల నుంచి మళ్లించే వ్యూహంలో ఆయన సక్సస్ అయ్యారనీ పరిశీలకులు అంటున్నారు. 

పీకే ఎక్కడ ?

ప్రశాంత్ కిశోర్.. పీకే పేరు విని చాలరోజులు, కాదు నెలలు అయింది కదూ.. అవును, ఒకప్పడు దేశ రాజకేయాల్లో ప్రముఖంగా వినిపించిన ఎన్నికల వ్యూహకర్త పీకే అని పిలవబడే ప్రశాంత్ కిశోర్, ఇప్పడు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడా వినిపించడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో, అధికార పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా సేవలు అందిస్తున్న పీకే ఊసే లేదు. ఒకప్పుడు పీకే ను భుజానికి ఎత్తుకుని, ఆయనతో తనకు ఎనిమిదేళ్ళకు పైగా చాలా ‘క్లోజ్ రిలేషన్స్’ ఉన్నాయని చెప్పుకొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, ఆయన్నే నమ్ముకుని రెండవసారి అధికారంపై ఆశలు పెంచుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, ఇప్పుడు పీకే పేరే తలచుకోవడం లేదు.  అదలా ఉంటే, తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ఒక్క ఆయన స్వరాష్ట్రం బీహార్ లో మినహా మరెక్కడా ఆయన పేరు అంతగా ప్రస్తావనకు రావడం లేదు. అయితే, ఈ సంవత్సరం (2022) ప్రారంభంలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలలో, తృణమూల్  కాంగ్రెస్ విజయం తర్వాత పీకే ప్రతిష్ట పతాక స్థాయికి చేరింది. అయితే, అదే సమయంలో పీకే రాజకీయ వ్యూహకర్త వేషం చాలిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, ప్రత్యక్ష రాజకీయాల విషయంలోనూ అంతగా ఆసక్తి లేదని, చెప్పుకొచ్చారు. కానీ, ఆ తర్వాత, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు చాలా చాలా ప్రయత్నాలు చేశారు. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ పునర్జీవనానికి నడుం బిగించారు. ‘వ్యూహ’ రచన చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కుడా పీకే   సిద్ధమయ్యారు. అయితే, కారాణాలు ఏవైనా, ఆ రెండు ప్రయత్నాలు విఫల మయ్యాయి. ఆ తర్వాతనే, పీకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చేతులు కలిపారు. తెలంగాణలో తెరాసను మూడవసారి గెలిపించడంతో పాటుగా, జాతీయ స్థాయిలో కేసీఆర్ కు పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసేందుకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే, ఎందుకనో గానీ,కొద్ది నెలలుగా పీకే పేరు తెలంగాణలో వినిపించడం వినిపించడం లేదు. అలాగే, ఎపీలోనూ పీకే .ఐ ప్యాక్ టీం పనిచేస్తున్నా పీకే మాత్రం దూరంగానే ఉంటున్నారు.  ప్రస్తుతం పీకే, బీహార్ రాజకీయాలలో ప్రత్యక్ష భూమిక కోసం పావులు కదుపుతున్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని పాత మిత్రుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీతో జట్టు కట్టిన, ముఖ్యమంత్రి, జేడీ(యు) లీడర్ నితీష్ కుమార్ ఓడించడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.అయితే, ఇక్కడ ఆసక్తికర విషయం ఏమంటే, పీకే భూమి గుండ్రంగా ఉంటుందని మరోమారు నిరూపించారు. ఆయన ఎక్కడి నుంచి రాజకీయంగా తొలి అడుగు వేశారో, మళ్ళీ అక్కడికే వచ్చినట్లు తెలుస్తోంది. బీహారులో లాలూ – నితీష్ జోడీని ఓడించేందుకు బీజేపీతో జట్టు కట్టేందుకు సిద్ధమైనట్లు బీహార్ రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని అంటున్నారు. అందుకే.. వైసీపీ, టీఆర్ఎస్ లను వదిలేశారని అనుమానిస్తున్నారు.  అదొకటి అలాఉంటే, ప్రశాంత్ కిశోర్ ను మంచి ఎన్నికల వ్యూహకర్త అనాలా, మంచి పొలిటికల్  బిజినెస్ మాన్ అనాలా? అంటే, రాజకీయ విశ్లేషకులు పీకే, ఓ మంచి బిజినెస్ మాన్ అనే అంటున్నారు. రాజకీయ పార్టీల బలహీనతలను సొమ్ము చేసుకున్నారని, అంటున్నారు. అలాగే, పీకే ఖాతాలో చేరిన ఎన్నికల విజయాలు నిజంగా ఆయన వ్యూహబలంతో సాధించిన విజయాలేనా,అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రశాంత్ కిశోర్ తొలిసారిగా గెలిచే పార్టీలతో అయన డీల్ కుదుర్చుకున్నారే గానీ, ఆయన వ్యూహాల కారణంగానే  ఏ పార్టీ గెలిచింది లేదనీ కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ తొలి సారిగా, 2012లో గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేద్ర మోడీ గెలుపు కోసం పని చేశారు. నిజానికి అప్పటికి, ఆయన పూర్తి స్థాయి ఎన్నికల వ్యూహకర్తగా స్థిరపడలేదు.అలాగే,అప్పటికే రెండుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా   దేశంలోనే కాదు,  అంతర్జాతీయంగానూ నరేంద్ర మోడీకి ప్రత్యేక గుర్తింపు వుంది. మేథావి వర్గాల్లో గుజరాత్ మోడల్’ పరిపాలన గురించి చర్చ అప్పటికే మొదలైంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నఎన్నారైలు, అనేక మంది 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ గెలుపుకోసం వచ్చిన అనేక మంది ఎన్నారైలలో ప్రశాంత్ కిశోర్ ఒకరు.  గుజరాత్,  హెల్త్ మోడల్ ను విశ్లేషిస్తూ ఒక ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసం,ఆయన్ని మోడీ దగ్గరకు చేర్చింది. ఆ ఎన్నికలో పీకే, మోడీ గెలుపు కోసం పనిచేశారు. అయితే, 2012 ఎన్నికలలో మోడీ సాధించిన హట్రిక్ విజయం పూర్తిగా పీకే ఖాతాలో వేసుకున్నా, అది నిజం కాదు. మోడీతో పరిచయం ఏర్పడిన తర్వాతనే,2012లో సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సిఎజి) అనే ఎన్నికల ప్రచార బృందం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో సిఎజి బీజేపీ పక్షాన పనిచేసింది.ఆ విధంగా పీకే 2013 మేలో, కిషోర్ సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సిఎజి) ను స్థాపించారు. కిషోర్ మోడీతో విడిపోయాక, (సిఎజి) ను స్పెషలిస్ట్ పాలసీ సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-పిఎసి) గా మార్చారు. ఇక ఆతర్వాత ఏమి జరిగింది అన్నది తెలిసిందే.

కాంగ్రెస్సే నయమా.. గిడుగు గొడుగుతో ఏపీలో పుంజుకుంటుందా?

ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటోందన్న ధీమాను పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బాగా నష్టపోయిన మాట వాస్తవమే కానీ.. విభజిత ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనను చూసిన తరువాత జనం కాంగ్రెస్సే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చేశారన్నారు. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఢిల్లీ వెళ్లిన గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా వంటి పెద్దలను కలిసి వారి ఆశీర్వాదం తీసుకునేందుకు హస్తిన వచ్చినట్లు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న గిడుగు రుద్రరాజు పార్టీకి పునర్వైభవం తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉనికే ప్రశ్నార్థకంగా మారిన పార్టీని మళ్లీ గాడిలో  పెడతానంటున్న గిడుగు రుద్రరాజు క్షేత్ర స్థాయిలో కార్యకర్తలే పార్టీ బలం అంటున్నారు. అయితే విభజన తరువాత కాంగ్రెస్ కు కార్యకర్తల బలం కూడా కరవైంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతమౌతున్న సూచనలు లేశ మాత్రంగానైనా కనిపిస్తున్నా.. ఏపీలో మాత్రం ఆ పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించే నాథుడే కరవైన పరిస్థితి నెలకొని ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాలలో పార్టీ అధికారంలో లేకపోయినా..ఆ పార్టీకి నేతలు, కార్యకర్తలు చెక్కు చెదరకుండా నిలబడ్డారు. రాహుల్ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఈ సంగతి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అయితే ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ   కాంగ్రెస్ పతనం నుంచి పతనానికి ప్రయాణం సాగిస్తోంది.​ రాష్ట్ర విభజన ముందు వరకూ ఏపీలో కాంగ్రెస్ బలమైన పార్టీ. కానీ ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుంచీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగం బోట్లు అన్నట్లుగా తయారైంది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ను పట్టించుకునే నాథుడే లేని పరిస్థితి ఉంది. దేశంలో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉంది. అయినా ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ సమీప భవిష్యత్ లో  పుంజుకోగలద అన్న ఆశలూ ఆ పార్టీ నాయకులలో, శ్రేణుల్లో పుష్కలంగా ఉన్నాయి. రాహుల్ జోడో యాత్రతో పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కూడా కనిపిస్తోంది.  ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది. అది ఎక్కడా చెక్కు చెదరలేదు. అందుకే రాహుల్ జోడో యాత్రతో ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ బలంగా పుంజుకుంటుందన్న భావన రాజకీయ వర్గాలలో సైతం వ్యక్తమౌతోంది. అయితే ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. రాష్ట్ర విభజనను అప్పట్లోనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యతిరేకించింది. అప్పట్లో రాష్ట్ర కాంగ్రెస్ లో బలమైన నేతలుగా పేరొందిన వారంతా విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అధిష్ఠానాన్ని ధిక్కరించారు. ఫలితం లేకపోవడంతో వారిలో కొందరు రాజకీయాలకు దూరమయ్యారు. ఇంకొందరు తమ దారి తాము వెతుక్కున్నారు. మిగిలిన వారు క్రియాశీలంగా వ్యవహరించడం మానేశారు. అందుకే ఎనిమిదేళ్ల తరువాత కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందా అంటే ఉందనుకోవాలి అంతే అన్న పరిస్థితి ఉంది. రాష్ట్ర విభజన తరువాత ఏపీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రఘువీరా రెడ్డి ఎప్పుడెప్పుడు ఆ పగ్గాలు వదిలేద్దామా అన్నట్లుగానే ఆ పదవిలో కొనసాగారు. ఎప్పుడైతే 2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయానికి బాధ్యత వహిస్తూ అప్పటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారో.. వెంటనే రాహుల్ కు మద్దతుగా రఘువీరారెడ్డి ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత నుంచి ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారా అంటే కొనసాగుతున్నారు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా మెలుగుతున్నారు. ఆ తరువాత సాకే శైలజానాథ్ పార్టీ పగ్గాలు చేపట్టినా పెద్దగా ఫలితం లేకపోయింది. అప్పుడప్పుడు టీవీ టాక్ షోలలోనూ, పార్టీ అధిష్ఠానం పిలుపు ఇచ్చిన సందర్భాలలో నామ్ కే వాస్తే నిరసనల్లోనే తప్ప సాకే బయట పెద్దగా కనిపించలేదు. ఇప్పుడిప్పుడే పాదయాత్ర చేస్తానంటే సాకే కొంత యాక్టివ్ అవుతున్నట్లు కనిపించినా.. అంతలోనే ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఏపీలో కాంగ్రెస్ అనే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానంటున్నారాయన. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ఆశ పార్టీ అధిష్ఠానంలోనే లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ కు   నాయకులే కాదు , క్యాడరూ కూడా లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన గిడుగు రుద్రరాజు.. రాష్ట్రంలో పార్టీ ఒంటరి పోరు గురించి మాట్లాడుతున్నారు. కలుద్దామన్న దగ్గరకు రానిచ్చే పార్టీలు ఏపీలో లేవు. అన్నిటికీ మించి 175 స్థానాల్లోనూ నిలబెట్టడానికి అభ్యర్థులనే వెతుక్కోవలసిన పరిస్థితి రాష్ట్రంలో కాంగ్రెస్ ది. అంతెందుకు ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన గిడుగు రుద్రరాజు కూడా ఇప్పటి వరకూ ప్రత్యక్ష ఎన్నికలలో ఒక్కసారి కూడా పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా ఎన్నికైనా అదేమీ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల ద్వారా చేపట్టిన పదవి కాదు.  ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ను మళ్లీ ప్రజలకు చేరువ చేయడానికి ఆయన ఏం చేస్తారో చూడాల్సిందే అంటున్నారు పరిశీలకులు.

టెన్త్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. వర్సిటీలో ర్యాగింగ్ పేర చిత్ర హింసలు..

సమాజంలో హింసా ప్రవృత్తి పెరిగిపోతోంది. చిన్నపిల్లలు విద్యార్థులు సైతం  దారుణ నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు పెచ్చరిల్లుతున్నాయి. అందుబాటులోకి సెల్ ఫోన్ లు.. విచ్చలవిడిగా లభ్యమౌతున్న మాదరద్రవ్యాలు.. బిజీ లైఫ్ స్టైల్ కారణంగా తల్లిదండ్రులలో కరవైన చైల్డ్ కేరింగ్ ఇవన్నీ ఇందుకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.   సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారీతిగా వ్యవహరించడానికి పిల్లలు అలవాటు పడుతున్నారు. పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులు సైతం దారుణమైన హింసాకాండకు పాల్పడుతున్నారు. సమాజంలో పెరిగిపోతున్న వికృత వైపరీత్య పోకడలకు ఉదాహరణలుగా దేశంలో ఒకే రోజు వెలుగులోనికి వచ్చిన రెండు ఉదంతాలను చెప్పుకోవచ్చు. హైదరాబాద్ హాయత్ నగర్ లో టెన్త్ విద్యార్థులు తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే అసోంలో దిబ్రూగఢ్ వర్సిటీలో సీనియర్ విద్యార్థుల వికృత ర్యాగింగ్ కు బయపడి ఓ విద్యార్థి హాస్టల్ రెండో అంతస్థు పై నుంచి దూకి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ రెండు ఘటనలూ సమాజంలోని వికృత పోకడలు విద్యార్థులపై చూపుతున్న దుష్ట ప్రభావానికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.  హైదరాబాద్ ఘటన విషయానికి వస్తే గడ్డి అన్నారంలో నివసిస్తూ టెన్త్ చదువుకుంటున్న ఓ విద్యార్థిని నివాసానికి ఆమె సహ విద్యార్థులు వెళ్లారు. వాళ్లు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెను బెదరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదంతా వారి సెల్ ఫోన్ లో చిత్రీకరించి, ఎవరికీ చెప్పొద్దని బెదరించారు.  తరువాత మరో సారి కూడా ఈ వీడియో చూపి బెదరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా తాము చేసిన దారుణాన్ని వీడియో తీసి తోటి విద్యార్థులకు పంపారు. విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అసోంలో అయితే సీనియర్లు దారుణంగా ర్యాగింగ్ చేస్తుండటంతో భరించ లేని విద్యార్థి తాను ఉండే హాస్టల్ రెండో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సీనియర్లు తప్ప తాగి..తన చేతా తాగించి అసభ్యంగా ఫొటోలు తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తామని బెదరించే వారనీ, తన వద్ద డబ్బులు గుంజుకునే వారనీ ఆ విద్యార్థి చెప్పాడు. నాలుగు నెలలుగా శారీరక, మానసిక వేదనను అనుభవించి ఇక తన వల్ల కాదన్న నిర్ణయానికి వచ్చిన ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

వివేకా హత్య కేసు తెలంగాణకు బదలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీం కోర్టు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలంగాణకు బదిలీ అయ్యింది. ఈ మేరకు సుప్రీం కోర్టు మంగళవారం (నవంబర్ 29)ఆదేశాలు జారీ చేసింది.  ఈ కేసు విచారణ  ఇప్పటి వరకూ ఏపీలో కడప, పులివెందుల కోర్టులతో పాటు హైకోర్టు కూడా పర్యవేక్షిస్తోంది. అయితే  ఈ కేసులో సాక్షులతో పాటు అప్రూవర్ గా మారిన దస్తగిరికి కూడా ఏపీలో భద్రత లేకుండా పోయింది. వీరు పలుమార్లు ఇదే విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. అలాగే సీబీఐ దర్యాప్తునకు కూడా అగుడడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఏకంగా సీబీఐ అదికారులపైనే కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న ఈ కేసు దర్యాప్తును ఇకపై తెలంగాణలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో జగన్ అక్రమాస్తుల కేసు తరహాలోనే సీబీఐ ప్రత్యేక కోర్టులో వివూరా హత్య కేసు  విచారణ జరగ నుంది.  ఇప్పటివరకూ ఏపీలో సాగుతున్న వివేకా హత్య కేసు దర్యాప్తుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హతుడి కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే.    స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసు దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నారని, ఏపీలో నిష్పక్షపాత విచారణ జరుగుతున్న నమ్మకం లేదని, కేసు విచారణ బయట రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును సునీతా రెడ్డి కోరగా, ఈ కేసు విచారిస్తున్న సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యమని సుప్రీం కోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే. దీంతో సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదలీ చేయడానికి అంగీకరించింది.   తన తండ్రి మరణం వెనుక ఎవరున్నారో తేలాల్సిందే అంటూ మొక్కవోని దీక్షతో అలుపెరగని న్యాయపోరాటం చేసిన వివేకా కుమార్తె సునీత ఈ కేసు వెనుక ఉన్న సూత్రధారులు, పాత్ర ధారులకు శిక్ష పడాలంటే ఈ కేసు దర్యాప్తు పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగాలని, ఏపీలో అటువంటి పరిస్థితులు లేవనీ డాక్టర్ సునీత పేర్కొన్నారు. విపక్షంలో ఉండగా తన బాబాయ్ హత్య కేసు సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసిన జగన్.. రాష్ట్ర సీఎం అయిన తరువాత మాత్రం సీబీఐ దర్యాప్తు అవసరం లేదని కోర్టుకు చెప్పారు. అయితే సునీత మాత్రం తన తండ్రి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసి సాధించారు. ఆ తరువాత సీబీఐ దర్యాప్తునకు ఏపీలో అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయని పేర్కొంటూ కేసు విచారణ రాష్ట్రం బయట..అంటే వేరే రాష్ట్రంలో జరగాలని సుప్రీంను ఆశ్రయించారు.   అందుకు సుప్రీం అంగీకరించింది. ఆ మేరకు ఈ కేసును తెలంగాణకు బదలీ చేస్తూ సుప్రీం కోర్టు మంగళవారం (నవంబర్ 29) ఉత్తర్వులు జారీ చేసింది.  

సిగ్గుండాలి.. సంబరాలకు!

కింద పడ్డా పై చేయి మాదే అనడంలో వైసీపీ నేతలు సిద్ధహస్తులు. ఇందు కోసం వారు కోర్టు తీర్పులకు వక్రభాష్యాలు చెప్పడానికి కూడా ఇసుమంతైనా వెనుకాడరు.  అమరావతి పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో వైసీపీ నేతల వ్యాఖ్యలు, ప్రకటనలు, సంబరాల తీరు చూస్తుంటే.. నేడో రేపో విశాఖ కు రాజధానిని తరలించేసుకునేందుకు సుప్రీం కోర్టు తీర్పు అనుమతిచ్చేసిందన్న స్థాయిలో వైసీపీ  శ్రేణులు హంగామా చేస్తున్నాయి. వాస్తవానికి సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి శరాఘాతమే. రాష్ట్ర ప్రభుత్వం ఏది కోరుకుందో దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఔను హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.   అయితే అది రాజధాని విషయంలో శాసనాధికారం చేసే హక్కు లేదన్న దానిపై కాదు. నిర్దుష్ట కాలపరిమితిలో అమరావతి రైతులకు ప్లాట్లు అభివృద్ది చేసి అప్పగించాలన్నదానిపై స్టే ఇచ్చింది. అలాగే నిర్దుష్ట కాలపరిమితిలో అమరావతి అభివృద్ధి చేయాలన్న అంశంపై మాత్రమే సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే కూడా రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్ లో హైకోర్టు తీర్పు మేరకు అమరావతి అభివృద్ధి ఆరు నెలలలో సాధ్యం కాదు.. కొంత సమయం ఇవ్వాలని కోరినందునే. అదే సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వ విధానాలకు, మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు వచ్చేసిందన్నంతగా వైసీపీ చేస్తున్న హడావుడి చూస్తుంటే.. వారు కోర్టు తీర్పును అర్ధం చేసుకున్నారా అన్న అనుమానం కలగక మానదు. సుప్రీం కోర్టు సోమవారం పేర్కొన్న మేరకు అమరావతే రాజధాని అన్న విషయంపై స్టే ఇవ్వలేదు. కేంద్రం సహా అన్ని పక్షాల వాదనలూ విన్న తరువాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా చెప్పింది. దానికే ఇప్పుడు వైసీపీ నేతలు వక్రభాష్యాలు చెబుతున్నారు. సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే సుప్రీం తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని మీడియా సమావేశంలో చెప్పడమే కాకుండా.. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో వేలు పెట్టడానికి ఇతర వ్యవస్థలకు అధికారమే లేదంటూ తన పాండిత్యాన్ని ప్రదర్శించారు. సుప్రీం కోర్టు తీర్పుకు వక్రభాష్యం చెప్పడంలో మంత్రి గుర్నాథ్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి మూడు రాజధానులకు సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పిచ్చేసిందనీ, వచ్చే ఏప్రిల్ నుంచి జగన్ పాలన విశాఖ నుంచే ఉంటుందనీ ప్రకటించేశారు. సోమవారం (నవంబర్ 28) సుప్రీం కోర్టు తీర్పు మేరకు సందేహాలకు అతీతంగా ఇప్పటికి అయితే అమరావతే రాజధాని.. అన్ని పక్షాల వాదనలూ విన్న తరువాత సుప్రీం కోర్టు తన తుది తీర్పు ఇచ్చే వరకూ అమరావతే రాజధాని. అక్కడ నుంచి కార్యాలయాలు కాదు కదా చిన్న ఇటుకనైనా తరలించడానికి వీల్లేదు. సుప్రీం తీర్పు సారాంశం ఇది అయితే వైసీపీ మాత్రం ఆ తీర్పును తమకు అనుకూలంగా భాష్యం చెప్పుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయమే అమరావతి రాజధాని అన్న గత ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల మద్దతు లేదనడానికి నిదర్శనమని చెబుతున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవలసిన విషయమేమిటంటే 2019 ఎన్నికలు అమరావతిపై రిఫరెండం ఎంత మాత్రం కాదు. ఎన్నికలకు ముందు ప్రచార సభల్లోనూ, అంతకు ముందు తన పాదయాత్రలోనూ, అసెంబ్లీలోనూ కూడా  అప్పటి ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ అమరావతే రాజధాని అని విస్పష్టంగా చెప్పారు. అమరావతికి అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు ఇచ్చారు. కనుక ఇప్పుడు సజ్జల చెబుతున్నట్లు ప్రజా మద్దతు అమరావతికి ఉందో లేదో అన్నదే లిట్మస్ టెస్ట్ అంటే జగన్ తక్షణమే ప్రజా తీర్పు కోరాలి. అంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలి. అందుకు భిన్నంగా మూడురాజధానుల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది కోర్టు ధిక్కారమే అవుతుంది.    సీఆర్డీయేతో అమరాతి కోసం భూములిచ్చిన రైతులు  చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ దశలో ప్రభుత్వం వెనక్కు వెళ్లడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించ కూడదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.  రాజధానిపై చట్టం చేసే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదనడంతోపాటు  పలు  కీలకాంశాలతో హైకోర్టు ఇచ్చిన తీర్పులో... నిర్దుష్ట గడవులకు సంబంధించిన  అంశాలపై స్టే ఇస్తూ మాత్రమే సుప్రీం కోర్టు సోమవారం(నవంబర్ 28)ఆదేశాలు జారీ చేసింది. అంతే తప్ప మరే అంశంలోనూ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వలేదు. అంతే కాకుండా మూడు రాజధానుల అంశాన్ని ఏపీ సర్కార్ ఉపసంహరించుకుందనీ, ఇక అది ముగిసిన అంశమేననీ ఏపీ ప్రభుత్వం తరఫున వాదించిన మాజీ అటార్నీ జనరల్ వేణుగోపాల్  హైకోర్టు ముగిసిన అంశంపై తీర్పు ఎలా ఇస్తుందనీ ప్రశ్నించారు. అంటే ప్రభుత్వమే మూడు రాజధానుల అంశం ముగిసిందని పేర్కొన్నట్లైంది. అలాగే హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని కూడా ఏజీ సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ దశలో సుప్రీం కోర్టు ఏయే అంశాలపై స్టే కోరుతున్నారని ప్రశ్నించగా మాజీ ఏజీ గడువులకు సంబంధించిన అంశాలపైనే స్టే కోరుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ప్రభుత్వం కోరిన గడువు అంశాలపైనే సుప్రీం తీర్పు ఇచ్చింది.  

తాల్ బాలల దినోత్సవ వేడుకలు 2022

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో 14వ బాలల దినోత్సవం శనివారం 26 నవంబర్ 2022 న ఘనంగా నిర్వహించారు. 300 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో తాల్ సాంస్కృతిక కేంద్రం విద్యార్థులతో పాటు, లండన్ మరియు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 100 మంది బాలలు వివిధ కళలలో తమ ప్రతిభను ప్రదర్శించారు. సాంప్రదాయ, భక్తి, సినీ సంగీత నృత్య గీతాలు, చిత్రలేఖనము, ఫాన్సీ డ్రెస్, పలు రకాల వాయిద్య ప్రదర్శనలతో ఆద్యంతం కార్యక్రమం కనుల పండువగా జరిగింది. అయిదు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమం లో చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూకే ఎంపీ సీమా మల్హోత్రా పాల్గొని తాల్ ప్రతి ఏటా నిర్వహించే బాలల దినోత్సవ వేడుకలు కొనియాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు వారికి ఆటవిడుపుగా ఉండి ఉత్సాహాన్ని కలిగించటం తో పటు భావి తరాలను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది అని ఆశాభావం వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ అభినందించారు. ఇదే కార్యక్రమంలో ఒక చిన్నారి నృత్యం చేసిన బుల్లెట్ బండి పాటకి కొనసాగింపుగా కొందరు ఆడ పడుచులతో పాటు ఎంపీ సీమా మల్హోత్రా కూడా అడుగులో అడుగు వేసి నృత్యం చేయడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాల్ చైర్మన్ శ్రీమతి భారతి కందుకూరి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, తాల్ సాంస్కృతిక కేంద్రాలలో తమ పిల్లలను చేర్పించి, భావి తరాలకి తెలుగు భాష మరియు సంస్కృతిని అందించేలా సహకరించాలని తెలుగు వారిని కోరారు. తాల్ చేపట్టే ప్రతీ కార్యక్రమంలో తమ వంతు సహకారాన్నిఅందిస్తున్న తల్లిదండ్రులు, తాల్ సభ్యులు మరియు కార్యకర్తలకు తాల్ ఛైర్మన్ ధన్యవాదాలు తెలిపారు. ట్రస్టీ గిరిధర పుట్లూర్ తాల్ సాంస్కృతిక కేంద్రం (TCC) నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల వివరాలు తెలిపారు. TCC లో చేరి తెలుగు నేర్చుకుంటున్న జూలీ ల్యూఆంకో అనే విదేశీ మహిళా తెలుగు పద్యాలను చెప్పటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాల్ బాలల దినోత్సవం విజయవంతముగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన శ్రీదేవి అల్లెద్దుల, అనిల్ రెడ్డి, దివ్య రెడ్డి, సునీత అరిగే, సుజాత గాదంసేతి, భారతి సుదనగుంట, హరిణి గెడ్డం, అశోక్ మాడిశెట్టి, జ్యోతి కస్తూరి , స్వాతి మేడిశెట్టి, రాయ్ బొప్పన్న , రిషి లకు కల్చరల్ ట్రస్టీ నవీన్ గాదంసేతి కృతఙ్ఞతలు తెలిపారు. వైస్ చైర్మన్ రాజేష్ తోలేటి, ఇతర ట్రస్టీ లు అనిల్ అనంతుల, కిషోర్ కస్తూరి, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, అనిత నోముల కూడా ఇందులో పాల్గొన్నారు. విజయవంతంగా ముగిసిన ఈ కార్యక్రమానికి ఆద్యంతం సమయస్ఫూర్తితో వ్యాఖ్యాతగా వ్యవహరించిన RJ శ్రీవల్లి ని అందరూ అభినందించారు.   ఈవెంట్‌కి సంబంధించిన మరిన్ని చిత్రాల కోసం ఈ  క్రింది  క్లిక్ చేయండి: TAL Childrens Day 2022 Celebrations Photos

సిద్ధూ చిక్కాడు.. జైల్లో!

నవజోత్ సింగ్ సిద్ధు.. వెటరన్ క్రికెటర్.. తన కెరీర్ లో సిక్సర్ల సిద్ధూగా గుర్తింపు పొందాడు. ఆ తరువాత క్రికెట్ కామెంటరేటర్ గా అవతారం ఎత్తి తనదైన పంచ్ తో గుర్తింపు పొందాడు. ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేసి పదునైన విమర్శలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు.  అలాంటి సద్ధూ ప్రస్తుతం పటియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఎందుకంటే.. 1988లో జరిగిన రోడ్ యాక్సిడెంట్ కేసులో   సిద్ధూకు జైలు శిక్ష ప‌డింది. 34 ఏళ్ల నాటి రోడ్ రేజ్ కేసులో పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఈ ఏడాది మేలో ఏడాది శిక్ష పడింది. అందుకే గత ఆరునెలలుగా సిద్ధూ పటియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే జైలులో సిద్ధు  అత్యంత క్రమశిక్షణతో మెలుగుతున్నాడు. ముఖ్యంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడని జైలు అదికారులు చెప్పారు. ఆరు నెలల జైలు జీవితంలో సిద్ధూ 34 కిలోల బరువు తగ్గాడు. రోడ్ యాక్సిడెంట్ కేసులో ఏడాది జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే సిద్ధూ రోజూ నాలుగు గంటల పాటు మెడిటేషన్ చేయడమే కాకుండా, మరో రెండు గంటల పాటు యోగా, వ్యాయామం కూడా చేస్తున్నాడు. అంతే కాకుండా రెండు మూడు గంటలు పుస్తక పఠనానికి కేటాయిస్తున్నాడు. ఇక నిద్రకు కేవలం నాలుగు గంటల మాత్రమే కేటాయిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. మితాహారంతో ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపుతున్నాడని చెప్పారు. బారాక్ నంబర్ 10లో ఉంటున్న సిద్ధూ మొన్నటి వరకు   పంజాబీ సింగర్ సెలబ్రిటీ దలేర్ మెహందీతో పాటు సెల్ లో ఉన్నాడు. దలేర్ రిలీజ్ కావటంతో ప్రస్తుతం ఆయన మిగతా వారితో పాటు ఉంటున్నాడు.

శ్రద్ధావాకర్ హత్య కేసు నిందితుడిపై తల్వార్లతో దాడి

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్యకేసు నిందితుడు అఫ్తాబ్ ను తీహార్ జైలుకు తరలిస్తుండగా.. అతడిపై కత్తులతో దాడికి యత్నించడం కలకలం రేపింది. రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ బయట ఈ ఘటన జరిగింది. కొందరు వ్యక్తులు పోలీసు వాహనాన్ని అడ్డగించి తల్వార్లతో దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారిని అడ్డుకునే క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. అఫ్తాబ్ ను అక్కడి నుండి సురక్షితంగా తరలించారు. తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధావాకర్ ను అప్తాబ్ మే 18న హత్య చేసి ఆ తరువాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కుల చేసి ఆ ముక్కలను అటవీ ప్రాంతంలో పడేసిన సంఘటన సంచలనం సృష్ఠించిన సంగతి విదితమే. శ్రద్ధావాకర్ తండ్రి ఆమె కనిపించడం లేదంటూ నవంబర్ 10న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో అప్తాబ్ ను ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ తెరమీదకు వచ్చింది. సహజీవనంలో ఉన్నంత కాలం శ్రద్ధావాకర్ ను అప్తాబ్ చిత్ర హింసలకు గురి చేశాడనీ దర్యాప్తులో వెలుగు చూసింది.  శ్రద్ధా వాకర్ 2019 నుంచి తనకు నచ్చిన అప్థాబ్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంది. ఏడాది పాటు వారి సహజీవనం సంతోషంగానే సాగింది. అయితే 2020 నుంచి అప్తాబ్ ఆమెకు నిత్యం నరకం చూపేవాడని విచారణలో వెలుగులోకి వచ్చింది. అప్తాబ్ తనను చిత్రహింసలు పెడుతున్నాడంటూ శ్రద్ధావాకర్ 2020లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను హత్య చేయడానికి ప్రయత్నించాడని కూడా ఆ లిఖిత పూర్వక ఫిర్యాదులో పేర్కొంది. ఒక డేటింగ్ యాప్ ద్వారా 2019లో దగ్గరైన శ్రద్ధ, అఫ్తాబ్‌లు అప్పటి నుంచి సహజీవనం సాగిస్తున్నారు.   శ్ర‌ద్ధావాకర్ పెళ్లి కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించినప్పటి నుంచీ అంటే వారి సహజీవనం మొదలైన ఏడాది తరువాత నుంచి అప్తాబ్ చిత్రహింసలు మొదలయ్యాయని ఆమె ఫిర్యాదును బట్టి అర్ధమౌతుంది.   అప్తాబ్ తనను చిత్రహింసలకు గురి చేస్తున్న విషయం అతని తల్లిదండ్రులకూ తెలుసునని శ్రద్ధావాకర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ విషయాలన్నీ స్నేహితులకు చెప్పుకుని బాధపడేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ క్రమంలోనే అప్తాబ్ శ్రద్ధాను ఈ ఏడాది మేలో హత్య చేశాడు. ఒక పక్కా ప్రణాళిక మేరకే అప్తాబ్ శ్రద్ధావాకర్ ను హత్య చేశాడని  పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆఫ్తాబ్ మాత్రం ఆవేశంలో శ్ర‌ద్ధాను హ‌త్య‌చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో, ఇటీవ‌ల కోర్టులో చెప్పాడు. ఆఫ్తాబ్ నుంచి అస‌లు నిజాలు రాబ‌ట్టేందుకు కోర్టు నార్కో పరీక్షలకు  కూడా అనుమ‌తినిచ్చింది. కాగా న‌మ్మి వ‌చ్చిన ప్రియురాలిని అతి కిరాత‌కంగా హ‌త్య‌చేసిన ఆఫ్తాబ్‌ను ఉరితీయాల‌ని దేశ‌వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. 

షర్మిల అరెస్ట్ వెనక మేఘా వారి మెగా కథ?

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, చాలా కాలంగా అంచెల వారీగా రాష్ట్రంలో పాద పాదయాత్ర చేస్తున్నారు. తెరాస ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. అయినా, ఇంత వరకు తెరాస ప్రభుత్వం ఆమె పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకుల విషయంలో స్పందించిన విధంగా స్పందించ లేదు. కానీ, ఇప్పడు వరంగల్ జిల్లాలో షర్మిల పాదయాత్రను తెరాస నాయకులు ఆదుకున్నారు. కార్యకర్తలు రాళ్ళ దాడి చేశారు. పోలీసులు షర్మిలను, అరెస్ట్ చేశారు ... ఎందుకు ? ఏమిటి కారణం? కాళేశ్వరం మెగా ప్రాజెక్టులో మేఘా అవినీతిని, ఆమె టార్గెట్ చేయడమే కారణమా? సిబిఐ, కాగ్’కుఫిర్యాదు చేయడం, ప్రధాని లేఖ రాయడం ఇప్పడు తాజాగా  మేఘా వందకోట్ల ఆఫర్ ను బయట పెట్టడమే కారణమా ? వివరాలోకి వెళితే..  తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలకు అరెస్టులు , గృహ నిర్బంధాలు, అర్థరాత్రి తలుపులు తట్టి, తలుపులు పగల కొట్టి నాయకులను ఎత్తుకుపోవడం వంటి పోలీసు వేధింపులు కొత్త కాదు. ఒకప్పడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్, కుడి భుజంగా ఉన్న, ప్రొఫెసర్ కోదండరామ్ మొదలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్’, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పడు ఎవరు కాలు బయట పెట్టినా, పోలీసులు వారు గడప దాటాక ముందే అరెస్ట్ చేయడం లేదా గడప దాటకుండా గృహ నిర్బంధంలో ఉంచడం గత ఎనిమిదేళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ‘పవిత్ర’ ఆచారంగా సాగిపోతోంది. అలాగే, ప్రతిపక్ష పార్టీల నాయకుల పాదయాత్రలు అడ్డుకోవడం, రాళ్ల దాడులు చేయడం,  ప్రతిపక్ష నేతల వాహనాలకు నిప్పు పెట్టడం తెరాస  నాయకులు, కార్యకర్తలకు అలవాటుగా మారిపోయింది. ఇదంతా బంగారు తెలంగాణ నడుస్తున్న  చరిత్రలో ప్రతి రోజు  చూస్తున్నదే, వింటున్నదే.  అందుకే,  తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెరాస అధికారంలోకి వచ్చింది మొదలు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కడం, ప్రజాందోళనలను ఉక్కుపాదంతో అణిచివేయడం ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. తెరాస అధికారంలోకి వచ్చిన వెంటనే, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద దశాబ్దాలుగా ఉన్న ధర్నాచౌక్ ను అక్కడ నుంచి ఎత్తేసి, రాజధాని సరిఃద్దుల అవతలకు విసిరేసింది. అలాగే, ఇతర ఏ శాఖలో లేని విధంగా పోలీసు శాఖలో  ఖాళీలను, ముఖ్యంగా కానిస్టేబుల్, ఎస్ఐ  పోస్టుల ఖాళీలను భర్తీ చేసింది. అయితే, ఇదంతా రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించడం కోసమా అంటే కాదు, ప్రతిపక్షాలు, ప్రజల గొంతు నొక్కేందుకే, కేసీఆర్ ప్రభుత్వం పోలీసు శాఖను ప్రేమగా పెంచుకుంటూ వస్తోందని, ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నాయి. కొందరు గిట్టని వాళ్ళు అయితే పెంపుడు కుక్కలా అని కూడా అంటారు అదేమో కానీ, అన్ని శాఖల కంటే పోలీసు శాఖ పట్ల తెరాస సర్కార్ ప్రత్యేక ప్రేమను చూపుతోందనేది మాత్రం, ఎవరూ కాదన లేని నిజం.  అయితే, ప్రతిపక్షాలు, ప్రతిపక్ష నాయకుల పట్ల ఇంత కఠినంగా ఉంటూ వస్తున్నతెరాస ప్రభుత్వం, తెరాస పార్టీ ఎందుకనో గానీ, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమార్తె  షర్మిల విషయంలో మాత్రం మౌనంగానే ఉంటోంది. ఆమె  అంచెల వారీగా ఇంచు మించుగా సంవత్సర కాలంగా సాగిస్తున్న పాదయాత్రకు అటు పోలీసులు కానీ, ఇటు తెరాస నాయకులు, కార్యకర్తలు కానీ ఎక్కడా ఒకింత అవరోధం కల్పించేలేదు. అలాగని, ఆమె తనదారిన తాను, అలా చేతులు జేబులో పెట్టుకుని మౌనంగా నడుచుకుంటూ వెళ్లి పోతున్నారా, అంటే లేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని, ప్రభుత్వం, ఫ్యామిలీ అవినీతిని బీజీపీ, కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి కంటే ఘాటుగా విమర్శిస్తున్నారు. ఏ నియోజక వర్గంలో పాదయాత్ర జరుగుతుంటే, ఆ నియోజక వర్గం తెరాస ఎమ్మెల్యే టార్గెట్ గా డ్యాష్ ..డ్యాష్ భాషలో ఏకి పారేస్తున్నారు. ఒక్కొక ఎమ్మెల్యే అవినీతి చిట్టాను బయటకు తెసుకొచ్చి మరీ పబ్లిక్ లో ప్రశ్నిస్తున్నారు. అయినా, ఎందుకనో గానీ, తెరాస ప్రభుత్వం షర్మిల పాదయాత్రకు పెద్దగా అడ్డుకోలేదు. ఆమె చేస్తున్న విమర్శలను కూడా అంతగా పట్టించుకోలేదు. కానీ, ఈరోజు వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో ఇటు తెరాస కార్యకర్తలు, అటు రాష్ట్ర పోలీసులు ఒకే సారి ఆమె పాదయాత్రను అడ్డుకున్నారు. ముందుగా, తెరాస కార్యకర్తలు, షర్మిల వాహన శ్రేణి పై రాళ్ళ దాడి చేశారు. వాహనాల అద్దాలు పగల కొట్టారు. ఒకటి రెండు వాహనాలకు నిప్పంటించారు. దీంతో ఉద్రిక పరిస్థితి నెలకొంది. పోలీసులు ఎంటరయ్యారు. షర్మిలను, ఆమె వెంట పాదయాత్రలో పాల్గొన్న కొందరు నాయకులు  కార్యకర్తలను అరెస్ట్ చేశారు.  సరే, అదంతా మాములు కథ.  అయితే, ఇంతకాలంగా లేనిది,ఇప్పడు తెరాస ప్రభుత్వం షర్మిల మీద కన్నెర్ర చేయదానికి కారణం ఏమిటి. ఇంతవరకు, హేండిల్ విత్ కేర్ అన్నట్లు ప్రవర్తిస్తూ, ఆమె తిట్లను దీవెనలుగా భావిస్తూ వచ్చిన తెరాస ప్రభుత్వం ఇప్పడు ఎందుకు, ఒక్కసారిగా భగ్గుమంది? బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుని, షర్మిల పాదయాత్రను అడ్డుకోకపొతే బాగుండదని, విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని, తెరాస పార్టీ, ప్రభుత్వం సంయుక్తంగా షర్మిల పాదయాత్ర ను అడ్డుకున్నాయా? నర్సంపేటలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై షర్మిల చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఆగ్రహించి ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారా? అంటే లేదు. ఇది స్థానికంగా, ఎమ్మెల్యే అనుచరులో, స్థానిక పోలీసు అధికారులో తీసుకున్న నిర్ణయం కాదని, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే, షర్మిల యాత్రను ఇటు పార్టీ కార్యకర్తలు, అటు పోలీసులు టార్గెట్ చేశారని అంటున్నారు.  కొద్ది రోజుల క్రితం, ఒకసారి కాదు, రెండు సార్లు షర్మిల ఢిల్లీ  వెళ్ళారు. తెరాస ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సీబీఐకి, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) కు ఫిర్యాదు చేశారు. అంతటితో వదిలేయలేదు. కాళేశ్వరం అవినీతిపై స్పందించాలని కోరుతూ, ప్రధాని నరేద్ర మోడీకి లేఖ రాశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ప్రధాని రాష్ట్రానికి వచ్చిన సమయంలోనే, కాళేశ్వరం అవినీతిని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లేందుకు, రామగుండం, గోదావరిఖని, చుట్టుపక్కల గ్రామాల్లో కాళేశ్వరం అవినీతిని కళ్ళకు కట్టేలా, పోస్టర్లు వేశారు. కరపత్రాలు పంచారు. ఈ అన్నిటినీ మించి ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డి, ప్రాజెక్ట్ అవినీతిపై మౌనంగా ఉంటే వంద కోట్లు ఇస్తానని ఆఫర్ చేసింది నిజమే అని వెల్లడించారు. అందుకే, ఇప్పడు షర్మిల మీద తెరాస దాడికి తెరతీసిందని, అంటున్నారు. సో ... షర్మిల అరెస్ట్ వెనక చాలా పెద్ద కథ ఉంది. ముందు ముందు ఇంకా పెద్ద కథే ఉంటుందని అంటున్నారు.

హత్య చేసి పది ముక్కలుగా కోసి.. సొంత వాళ్ల పనే

మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. స్వార్థం, అవసరం ఇవే జీవితం అనే స్థితికి సమాజంలోని కొందరు దిగజారిపోయారు. ఇందు కోసం సొంత వారికి నడతేర్చేందుకు కూడా తెగిస్తున్నారు. ప్రేమ పేరుతో సహజీవనం చేసి శద్ధావాకర్ అనే మహిళను ఆమె ప్రియుడే అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి మరువక ముందే ఢిల్లీలో మరో దారుణ హత్యోదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల శద్ధావాకర్ అనే యువతిని ఆమె ప్రియుడే హత్య చేసి 35 ముక్కులుగా నరికిన సంఘటన తరహాలోనే.. ఈ కేసులో భార్యా, తన కుమారుడితో కలిసి భర్తను హత్య చేసి పది ముక్కులుగా నరికి రాం లీలా మైదానంలో పడేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మృతుడు అంజన్ కుమార్ బీహార్ కు చెందిన వాడే అయినా చాలా కాలంగా ఢిల్లీలోనే నివసిస్తున్నాడు. బీహార్ లో పెళ్లాం బిడ్డలు ఉంటారు. ఈ క్రమంలో అంజన్ దాన్ పూనమ్ అను మహిళతో కొంత కాలం సహజీవనం చేసి ఆ తరువాత పెళ్లి చేసుకున్నాడు. పూనమ్ కు అంతకు ముందే పెళ్లై ఇద్దరు పిల్లలు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మొదటి భర్త చనిపోయిన తరువాత పూనమ్ అంజన్ దాస్ ను పెళ్లి చేసుకుంది. ఎలాంటి సంపాదనా లేని అంజన్ దాస్ తరచూ పూనమ్ తో గొడవపడుతుండేవాడు. పూనమ్ నగలు అమ్మి ఆ సొమ్మును బీహార్ లోని తన మొదటి భార్యకు పంపేడు. ఈ క్రమంలో గొడవలు మరింత పెరిగాయి. అంతే కాకుండా అంజన్ దాస్ తన సవతి కుమార్తెపైనా, తన సవతి కొడుకు భార్యపైనా కూడా కన్నేశాడు. దీంతో విసినిపోయిన పూనమ్ తన కుమారుడితో కలిసి మద్యంలో మత్తు మందు కలిపి అంజన్ దాస్ కు ఇచ్చి.. అతడు స్ఫృహ కోల్పోయిన తరువాత హత్య చేసింది. శవాన్ని పది ముక్కలుగా కోసి రాం లీలా మైదానంలో పడేసింది. ఆ శరీర భాగాలను గుర్తించిన పోలీసులు శాస్త్రీయ పద్ధతిలో విచారించి.. చివరకు మృతుడు అంజన్ దాస్ గా గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు చేసి పూనమ్, ఆమె కుమారుడే ఈ దారుణానికి పాల్పడ్డారని తేల్చారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటన డిసెంబర్ 4న

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే డిసెంబర్  4న విశాఖలో పర్యటించనున్నారు. భారత నౌకాదళ దినోత్సవాల్లో భాగంగా జరగనున్న నేవీ డే విన్యాసాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. అనంతరం పలు కీలక ప్రాజెక్టులను ఆమె వర్చువల్ గా ప్రారంభించనున్నారు.  రాష్ట్రపతి భవన్ సెక్రటేరియెట్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం  దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదిముర్ము  డిసెంబర్ 4 మధ్యాహ్నం 2.15 గంటలకు  గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు బయలుదేరి వెళతారు.   3.25 గంటలకు విశాఖలోని నేవల్ ఎయిర్ స్టేషన్  ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ నుంచి 3.35 గంటలకు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని చోళ సూట్‌కు చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు . అనంతరం 4.05 గంటలకు ఆర్కే బీచ్ కు చేరుకుని నేవీ డే విన్యాసాలను ప్రారంభిస్తారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం లోని వివిధ శాఖలకు చెందిన మరికొన్ని ప్రాజెక్టులను రాష్ట్రపతి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. తరువాత సాయంత్రం 6.10 నిముషాలకు తూర్పునౌకాదళ అనంతగిరి కేంద్రానికి చేరుకుని నేవీడే రిసెప్షన్ లో పాల్గొంటారు.  రాత్రి  8 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నుంచి తిరుపతి బయలుదేరతారు. రాత్రి 8.40 గంటలకు రాష్ట్రపతి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇలా ఉండగా రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము ఏపీ పర్యటనకురావడం ఇదే ప్రథమం. ఈ పర్యటనలో భాగంగా ఆమె విశాఖలో రాష్ట్రపతి వర్చువల్‌గా ప్రారంభించే ప్రాజెక్టులు ఇవే..   రక్షణ శాఖ  కర్నూలులో నిర్మించిన నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌ (ఎన్‌వోఏఆర్‌), నిమ్మలూరులో నిర్మించిన అడ్వాన్స్‌డ్‌ నైట్‌విజన్‌ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఎన్‌హెచ్‌-340లో రాయచోటి నుంచి అంగళ్లు వరకు నిర్మించిన హైవే, ఎన్‌హెచ్‌-205లో నిర్మించిన నాలుగు లైన్ల ఆర్‌వోబీ, ఎన్‌హెచ్‌-44లో కర్నూలు టౌన్‌లోని ఐటీసీ జంక్షన్‌లో ఆరులైన్ల గ్రేడ్‌ సెపరేటెడ్‌ స్ట్రక్చర్, స్లిప్‌రోడ్స్, డోన్‌ నగర శివారులోని కంబాలపాడు జంక్షన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన సర్వీస్‌ రోడ్లు, రహదారులు ,గిరిజన శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్మించిన ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్, సైన్స్‌ సెంటర్‌లను వర్చువల్ గా ప్రారంభిస్తారు. అలాగే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్‌-342లో ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు రహదారి విస్తరణ పనులకు కూడా వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు.

తెలంగాణలో తెలుగుదేశం పునర్వైభవానికి యాక్షన్ ప్లాన్!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు.. సైకిల్‌ని మెరుపు వేగంతో సవారీ చేయించేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి.. పక్కాగా అమలు చేస్తోంది. అందులోభాగంగా రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ... నాయకుల్లో భరోసా కల్పిస్తోంది. అలాగే అన్ని డివిజన్లలో సభలు, సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. అదేవిధంగా నియోజకవర్గాల్లో  సమావేశాలు నిర్వహించడంతోపాటు .. ప్రతి నియోజకవర్గంలో 35 వేల మందితో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. లాగే గతంలో టీడీపీ ప్రభుత్వ హాయాంలో రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే కాకుండా.. అదే సమయంలో రాష్ట్రాభివృద్ధి ఏ విధంగా జరిగిందనే అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని.. అందుకు కరపత్రాలను సైతం ముద్రించి పంచాలని భావిస్తోంది. అలాగే ఇంటింటికి టీడీపీ అనే వ్యూహాంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇక పార్టీలోకి కీలక నేతలంతా.. అధికార పార్టీలోకి జంప్ కొట్టేయడంతో... సైకిల్ పార్టీ దాదాపు దశాబ్ద కాలం పాటు స్తబ్దుగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ పార్టీ పునర్ వైభవం తీసుకు వచ్చేందుకు ఎంత చేయాలో.. ఎలా చేయాలో.. అంతా చేసేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం కృత  నిశ్చయంతో ఉంది. ఆ క్రమంలో ఇప్పటికే టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్.. పగ్గాలు చేపట్టిన.. నాటి నుంచి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తలను కలిసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఇంటింటికి టీడీపీ వ్యూహాంలో భాగంగా.. గ్రామస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అలాగే ర్యాలీలు, కర్రపత్రాలు ముద్రించి పంచడం.. జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను సైతం చేపట్టాలని నిర్ణయించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపి.. వారి గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసే దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది. అలాగే పార్టీని క్లిష్ట సమయంలో అంటిపెట్టుకొని ఉన్న నేతలకు టికెట్లు ఇస్తామని ఇప్పటికే అధిష్టానం క్లియర్ కట్ గా ఓ సందేశాన్ని ఇచ్చింది. అలాగే పని తీరు ఆధారంగా టికెట్లు కేటాయించాలని  కూడా నిర్ణయించింది. ఇక పార్టీ రాష్ట్ర కమిటీతోపాటు  అనుబంధ సంఘాల్లో ఉన్న ఖాళీలను సైతం సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయనున్నారు. అలాగే బలహీనంగా ఉన్న అసెంబ్లీ లోక్‌సభ స్థానాల్లో అధ్యక్షులను మార్చి.. వారి స్థానంలో కొత్త వారిని నియమించి.. ఎన్నికలకు వెళ్లాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ 15 స్థానాలను గెలుచుకొంది. అలాగే 2019 ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలను మాత్రమే కైవసం చేసుకొంది. అయితే వచ్చే ఎన్నికల్లో అంటే 2023 లో జరిగే ఎన్నికల్లో టీడీపీ తన సత్తా చేటేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఏదీ ఏమైనా.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే దిశగా టీడీపీ అధిష్టానం బలమైన వ్యూహాన్ని రచిస్తోంది. అదీకాక.. పలు పార్టీలో ఉన్న అసంతృప్తి జీవులు... మళ్లీ తన సొంత టీడీపీ గూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిని మళ్లీ పార్టీలోకి తీసుకుని.. ముందుకు వెళ్లితే.. తెలంగాణలో మళ్లీ సైకిల్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

జనసేన ముందున్నది ఒకటే ఆప్షన్

సినిమాల్లో రాణించడం వేరు. రాజకీయాల్లో రాణించడం వేరు. సినిమాల్లో రాణించిన వారంతా రాజకీయాల్లో రాణించలేరు. రాణించలేదు.నిజం, రాజకీయాల్లో రాణించిన హీరోల కంటే, రాజకీయాల్లో వేలు పెట్టి చేతులు కాల్చుకున్న హీరోలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.  అందులోనూ అలాంటి ఇలాంటి హీరోలు కాదు, బాలీవుడ్’ బిగ్-బీ  అమితాబచ్చన్ మొదలు, మన మెగాస్టార్ చిరంజీవి వరకు చాలా మందే ఉన్నారు. అయితే, మనం ఇప్పడు, రాజకీయాల్లో ఫెయిల్ అయిన సినిమా హీరోల చరిత్రలోకి వెళ్ళడం లేదు. నడుస్తున్న చరిత్రలో, సినిమా హీరోగా, రాజకీయ నాయకునిగా డబుల్ రోల్ ప్లే చేస్తున్న, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ రాజకీయ భవిష్యత్ గురించి మాత్రమే మనం ఇప్పుడు మాట్లాడు కుంటున్నాం.   నిజం పవన్ కళ్యాణ్’ కు సినిమా హీరోగానే కాదు, రాజకీయ నాయకునిగా కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. అందులో సందేహం లేదు. ఆయన ఎక్కడికెళితే అక్కడ అభిమానుల సందడి, అప్పుడెప్పుడో అన్న నందమూరి తారక రామా రావు అన్నటుగా, నేల ఈనిందా? ఆకాశం దద్దరిల్లిందా.. అన్నట్లుగా వేలలలో కాదు, లక్షల్లో జనం అయన సభలకు హాజరవుతున్నారు. ఆయనకు జేజేలు పలుకుతున్నారు. ఒకరని కాదు, ఒక వర్గం, ఒక కులం అని కాదు, అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు ఆయనకు హరతులిస్తున్నారు. నిజానికి, ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరే ఇతర నాయకునికి లేని జనాకర్షణ సామర్ధ్యం పవన్ కళ్యాణ్ సొంతం అంటే అతిశయోక్తి కాదు.  అయినా, ఆయన రాజకేయాల్లో రాణిస్తారా? ఎన్నికల సంగ్రామంలో విజేతగా నిలుస్తారా, అంటే, ఇంతవరకు అయితే పవర్ స్టార, పొలిటికల్ స్క్రీన్’పై పెద్దగా ప్రభావం  చూపలేదు. గత (2019) అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేసిన పవ కళ్యాణ్ రెండు చోట్లా ఒడి పోయారు. ఇక పార్టీ జనసేన సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎంతో పాటుగా బీఎస్పీతో కలిసి పోటి చేసినా, జనసేన పోటీ చేసిన 130కి పైగా స్థానాల్లో ఒక ఒక్క స్థానంలో మాత్రమే పార్టీ గెలిచింది. ఆ గెలిచిన ఒకే ఒక్కడు కూడా అధికార వైసీపీలో చేరి పోయారు.   అయితే, అన్నీ ఉన్నా జనసేన ఎన్నికలలో ఎందుకు విజయం సాధించే లేక పోతోంది, అంటే, పార్టీ పుట్టి పుష్కరం పైగా అయినా, ఇంతవరకు పార్టీకి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జనసేన అంటే పవన్ కళ్యాణ్ కాదంటే, నాదెండ్ల మనోహర్ ఈ ఇద్దరే నాయకులు, మిగిలిన వారంతా ఆటలో అరటి పండుతో సమానం. ఇలా ‘ఏక్  నిరంజన్’ లా పవన్ కళ్యాణ్ ఒంటరి నాయకత్వం వలన పార్టీ జనంలోకి బలంగా వెళ్ళలేక పోతోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించినప్పుడు, ఆయన వెంట కాంగ్రెస్‌ మహామహులంతా టీడీపీలో చేరారు. నాదెండ్ల, జానారెడ్డి, నల్లపురెడ్డి, బెజవాడ గోపాలకృష్ణారెడ్డి వంటి అగ్రనేతలంతా ఎన్టీఆర్‌ వెంట నిలిచారు. నియోజకవర్గాల్లో ప్రముఖులైన డాక్టర్లు, వ్యాపారస్తులు, యువకులను గుర్తించి.. వారికి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించారు. టీడీపీ స్థాపించిన తర్వాత, గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకూ పార్టీ నిర్మాణం చేశారు. శిక్షణా శిబిరాలు, సభ్యత్వాలు నిర్వహించారు. చంద్రబాబు చేరిన తర్వాత కార్యకర్తల వివరాలు, పార్టీ కార్యక్రమాలను కంప్యూటరైజ్‌ చేశారు. శిక్షణా శిబిరాలను కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ లేకపోయినా, టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉండటానికి అవే కారణాలన్నది సుస్పష్టం. అందుకే టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా.. రాజకీయాల్లో తన గుర్తింపు చాటుకుని, స్థిరంగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.  చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కూడా టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి భారీ సంఖ్యలో అగ్రనేతలు చేరారు. కేంద్రమాజీ మంత్రి శివ శంకర్‌, భూమా నాగిరెడ్డి, ఉమ్మారెడ్డి, సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస్‌, ఆమంచి కృష్ణమోహన్‌, హరిరామజోగయ్య వంటి ప్రముఖులు చిరంజీవి వెంట నిలిచారు. నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్‌-టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, అగ్రనేతలు చేరడంతో క్యాడర్‌ పీఆర్పీ బలంగా కనిపించింది. ఫలితంగా 74 లక్షల ఓట్లు సాధించిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. బంగారు కంచమే అయినా గోడ దాపు లేనిదే నిలవలేదు. అలాగే, ఏ రాజకీయ పార్టీ అయిన పదికాలాలు  నిలవాలంటే, సంస్థాగత నిర్మాణం, బలమైన నాయకులు  అవసరం. అది లేక పోవడమే, జనసేనకు శాపం. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్’ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగితే, 2019 ఫలితాలే పునరావృతం అవుతాయి.అంతే కాదు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఫలితంలో మార్పు ఉండదు. బీజేపీ దేశంలో బలమైన శక్తి కావచ్చును, కానీ, ఆంధ్ర ప్రదేశ్’లో మాత్రం బీజేపీకి నిండా ఒక శాతం ఓటు బలం కూడా లేదు. అందుకే  వైసీపీని ఓడించే శక్తి ఒక్క టీడీపీకి తప్ప మరో పార్టీకి లేదు. సో .. వైసీపీని ఓడించి, జగన్ రెడ్డి పాలనకు ముగింపు పలకడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం అయితే, బీజేపీ తోక వదిలి సైకిల్ ఎక్కడం ఒక్కటే పవన్ ముందున్న మార్గమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

జగన్ సర్కార్ పై చార్జిషీట్లు ఏవీ.. ఎక్కడ..?.. మోడీ ఆదేశించినా బేఖాతరేనా?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తీరేమిటో.. వైఖరేమిటో బీజేపీ అధిష్ఠానానికే బోధపడటం లేదు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినా కూడా ఏపీ బీజేపీ నేతలకు పట్టించుకోవడం లేదు. తాజాగా మోడీ విశాఖ పర్యటన సందర్బంగా ఏపీలో జగన్ సర్కార్ వైఫల్యాలు, తప్పిదాలు, అవినీతి, అప్పులపై వరుసగా చార్జిషీట్లు తయారు చేయాలని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా చార్జిషీట్లను తయారు చేసి విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేయాలని కూడా మోడీ ఆదేశించారు. మోడీ ఈ ఆదేశాలు జారీ చేసి అప్పుడే మూడు వారాలు గడిచిపోయాయి. అయినా ఏపీ బీజేపీలో చలనం లేదు. ఏపీలో కూడా బలోపేతం కావాలన్న కార్యాచరణలో బీజేపీ అధిష్ఠానం అడుగులు వేస్తుంటే.. రాష్ట్ర బీజేపీ నాయకత్వం మాత్రం మోడీ ఆదేశాలను ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై పన్నెత్తి మాట కూడా అనేందుకు సిద్ధపడటం లేదు. విషయమేమిటంటే ఈ నెల 11న ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా పార్టీ రాష్ట్ర కోర్ కమిటీతో బేటీ అయ్యారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో జగన్ సర్కార్ తీరు తెన్నుల గురించి ప్రధాని మోడీ వారి నుంచి సమాచారం కోరారు.   పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్ తదితర నేతలు రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ప్రధానికి వివరించారు. అవినీతి రాజ్యమేలుతోందని మోడీకి వివరించారు. దీంతో మోడీ ఆయా అంశాలపై చార్జిషీట్ తయారుచేసి, ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలు, అవినీతి అంశాలపై చార్జిషీట్ రూపొందించాలని సూచించారు. అదే సమయంలో సమస్యలపై స్థానికుల నుంచి సంతకాలు తీసుకోవాలని కూడా సూచించారు. ఇది జరిగి మూడు వారాలైంది. అయినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్ర నాయకత్వం ఇప్పటి వరకూ కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయకపోవడాన్ని బీజేపీ సీనియర్లు తప్పుపడుతున్నారు.   ఏపీ బీజే పీ నాయకత్వంలో ముఖ్యులు జగన్ అనుకూల వైఖరి అవలంబిస్తోందనడానికి ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలని బీజేపీ సీనియర్లు అంటున్నారు. 

బండి సంజయ్ పాదయాత్రకు కోర్టు అనుమతి.. బట్ కండీషన్స్ అప్లై

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు  తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే పాదయాత్రకు పలు షరతులు విధించింది. సోమవారం (నవంబర్ 28) నుంచి బండి సంజయ్ తన ప్రజాసంకల్ప యాత్ర ఐదో విడత ప్రారంభించాల్సి ఉన్న సంగతి విదితమే. అయితే ఆఖరి నిముషంలో పోలీసులు యాత్రకు అనుమతి నిరాకరించారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి యాత్రకు బయలు దేరిన బండి సంజయ్ కు హౌస్ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో    బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. భైంసాలో సున్నితమైన పరిస్థితుల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. బహిరంగసభతో పాటు యాత్రకు కూడా భద్రత ఇవ్వలేమన్నారు. అయితే కోర్టు బండి సంజయ్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.  భైంసా పట్టణానికి 3 కిలోమీటలర్ల దూరంలో సభ నిర్వహించాలని పేర్కొంది. అలాగే  భైంసా పట్టణంలోకి పాదయాత్ర ప్రవేశించరాదని షరతు విధించింది. అలాగే 500 మందితో మాత్రమే పాదయాత్ర చేయాలని, సభకు మాత్రం 3 వేల మందికి అనుమతి ఉందని పేర్కొంది. సభను మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని స్పష్టం చేసింది. హైకోర్టులో బీజేపీ తరఫున రామచంద్రరావు, ప్రభుత్వం తరఫున ఏజీ ఏజీ బిఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. బండి సంజయ్ విడతల వారీగా నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇప్పటి వరకూ నాలుగు విడతలుగా 21 జిల్లాలలో 1178 కిలోమీటర్లను కవర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఐదో విడత పాదయాత్ర కోర్టు అనుమతితో మంగళవారం (నవంబర్ 29) నుంచి ప్రారంభం కానుంది.

జనసేనానిపై వైసీపీ నేతల విమర్శల దాడి

మీరు మా ఇప్పటం గ్రామస్థుల గడపలు కూల్చారు. నా గుండెల్లో గునపం దించారు.  ఇప్పటంలో కొట్టిన ప్రతి గడపా నా గుండెల మీద కొట్టినట్టే.  సజ్జలా.. మీకు చాలెంజ్ చేస్తున్నా.. 2024లో మీరెలా గెలుస్తారో చూస్తాం. వైసీపీని దెబ్బ కొట్టాలంటే బీజేపీ పెద్దలకు, ప్రధానికి చెప్పి చేయను. నేనే చేస్తా. ఇది నా నేల.. నేను ఆంధ్రుణ్ణి. ఆంధ్రాలో పుట్టా. ఆంధ్రలోనే తేల్చుకుంటా.. వైసీపీ నేతల్లా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయం. బీజేపీ పెద్దలను అడగం. నా యుద్ధం నేను చేస్తా. పిచ్చిపిచ్చిగా వాగిన వారందరికీ అధికారంలోకి రాగానే బదులిస్తా. ఇసుక తవ్వకాల వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది’ ఇవీ ఇప్పటం గ్రామంలో జగన్ రెడ్డి సర్కార్ ఇళ్లు కూల్చివేసిన బాధితులకు ఆర్థిక సాయం చేసిన సందర్భంగా వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. అంతే.. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు ఆర్కే రోజా, పేర్ని నాని, జోగి రమేశ్, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తదితరులు ఒక్కసారిగా విరుచుకుపడిపోయారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలవనివ్వకుండా చేస్తానన్న పవన్ ఛాలెంజ్ పై టూరిజం మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘మీడియావాళ్లకు చెబుతున్నాను. పవన్ కళ్యాణ్ గారికి చెబుతున్నాను. ఆయన వెనక ఉండి మాట్లాడిస్తున్న వాళ్లకూ చెబుతున్నాను. జగన్ గారిని కాదు కదా.. ఆయన ఎడమకాలిపై ఉన్న వెంట్రుకలు కూడా వీళ్లు పీకలేరు’ అంటూ రోజా నోటికి పదునుపెట్టారు. ‘ఇప్పటంలో తప్పు ఏదీ జరగలేదని హైకోర్టు లాగిపెట్టి లెంపకాయ కొట్టిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తన బుద్ధి మార్చుకోకపోతే ఎలా? ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిది. వాస్తవాన్ని హైకోర్టు కూడా అర్థం చేసుకుని ఇప్పటం గ్రామస్థులకు ఫైన్ వేసింది. దీన్ని పవన్ కళ్యాణ్ గ్రహించాలి’ అని రోజా సూచించారు. అక్కడితో ఆగని రోజా.. టీడీపీ చీఫ్ చంద్రబాబు పైన, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పైన కూడా విమర్శలు గుప్పించారు. ‘ఇప్పటంలో సమస్యకు చంద్రబాబే కారణం. అక్కడ సమస్య వస్తే చంద్రబాబో లేక లోకేశ్ వెళ్లాలి. ’కానీ, ఇప్పటానికి పవన్ ను పంపించి, జగన్ ను తిట్టించడం ఏంటి? పవన్ ను చంద్రబాబు వాడుకుని ఫూల్ ని చేస్తున్నారు. పవన్ ఉనికి కోసమే ఇదంతా చేస్తున్నారనిపిస్తోంది’ అంటూ దుయ్యబట్టారు. ‘పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే.. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీలో దింపాలి. అప్పుడే నువ్వు హీరోవి అవుతావు. రాజకీయాల్లో జీరో వేషాలు వేస్తే.. ప్రజలు నిన్ను హీరోను చేయరు. దమ్ముంటే ఒంటరిగా బరిలో దిగాలి’ అని పవన్  రోజా సవాల్ విసిరారు. మంత్రి జోగి రమేశ్ కూడా పవన్ వ్యాఖ్యలకు రిటార్డ్ ఇచ్చారు. ‘పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు నేను రెడీ.. పవన్ సిద్ధమా? అన్ని పార్టీలూ కలిసి వచ్చినా వైసీపీని ఏం చేయలేవు. పవన్ ది జనసేన కాదు.. సైకో సేన. ఈ సైకోగాళ్లు నెలకోసారి వచ్చి ప్రజలను రెచ్చగొడుతుంటారు’ అంటూ రమేష్ విమర్శలు  గుప్పించారు. ‘నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థివా? నువ్వు సాయపడేది ఎవరికి? నువ్వు సాగిలపడేది ఎవరికి? నువ్వు తొత్తుగా మారేది ఎవరికి?.. చంద్రబాబుకే’ అంటూ జోగి  అన్నారు ‘2019లోనే పవన్ సత్తా ఏంటో అర్థమైంది. 2009లో అన్న స్థాపించిన ప్రజారాజ్యంలో ఏం చేశారో కూడా చూశాం. ఇప్పుడు పవన్ కొత్తగా ఇంకేం చేయగలరు? ఇప్పటంలో రోడ్లను విస్తరిస్తుంటే పవన్ కు అభ్యంతరం ఏంటి?’ అని మంత్రి బొత్స కూడా గతాన్ని వర్తమానాన్ని కలగలిపి విమర్శలు గుప్పించారు పవన్ నాయుడు.. పవన్ నాయుడు.. అంటూ ప్రతిసారీ మీడియా ముందుకొచ్చి జనసేనానిపై విరుచుకుపడే  పేర్ని నాని  ‘జనసేనాని పవన్.. ఓ వారాంతపు నాయకుడు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూసేందుకే.. జగన్ పట్ల పవన్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. పంటలు తగులబెట్టినప్పుడు, పొలాల్లో రోడ్లు వేసినప్పుడు పవన్ గుండెల్లో ఏం గుచ్చుకోలేదా? అప్పుడు తోలు మందమైందా? పవన్ వచ్చాడని ఇప్పటంలో ఏమైనా ఆగిందా? మోడీ కాళ్లు పట్టుకునేది, పారిపోయేది పవనే’ అంటూ  

షర్మిల కార్ వ్యాన్ దగ్ధం.. తెరాస దాడులకు బెదిరేలేదంటూ వైఎస్సార్ టీపీ ధర్నా

తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస సర్కార్ విమర్శను సహించలేకపోతున్నది. ప్రభుత్వాన్ని విమర్శించే వారు రోడ్లపై తిరగడానికి వీల్లేదన్నట్లుగా ఆంక్షలు విధిస్తోంది. బండి సంజయ్ ఐదు విడత పాదయాత్రను అడ్డుకోవడమే కాకుండా బండి సంజయ్ ను హౌస్ అరెస్టు చేసింది. అదే రోజు వరంగల్ జిల్లా నర్సంపేట కొనసాగుతున్న వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రపై తెరాస కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఆమె వాహనశ్రేణిలోని కార్ వ్యాన్ ను దగ్థం చేశారు.  వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాదయాత్రలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర సాగిస్తున్నారు. వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాదయాత్రలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర సాగిస్తున్నారు. తన పాదయాత్రలో భాగంగా ఆమె ఏ నియోజకవర్గంలో పర్యటిస్తుంటే ఆ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తున్నారు. అలాగే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. ప్రధానంగా ఆమె తెరాస అగ్రనేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. చెన్నారావు పేట మండలం లింగగిరిలో లంచ్ బ్రేక్ కు ఆగారు. ఆ సమయంలో తెరాస కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆమె పాదయాత్ర వెంట వస్తున్న వాహనాలపై రాళ్ల దాడి చేశారు. అనంతరం షర్మిల కార్ వ్యాన్ ను దగ్ధం చేశారు.   ఈ ఘటనపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులతో, వాహనాల దగ్ధాలతో తనను బెదరించలేరని పేర్కొన్నారు. కాగా తెరాస కార్యకర్తలు దాడి చేస్తుంటే, వాహనాన్ని దగ్ధం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా దాడి, కార్ వ్యాన్ దగ్ధం ఘటనలకు నిరసనగా అక్కడే వైఎస్ఆర్ టీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో షర్మిల కూడా పాల్గొన్నారు. 

భోజనంలోకి చికెన్ లేదని పెళ్లి ఆపేశారు!

పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ చిన్న చిన్న కారణాలతో కూడా పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. పెళ్లి కొడుకుది ఒరిజనల్ జట్టు కాదు.. విగ్గు అని పీటల మీద జీలకర్రా బెల్లం పెడుతున్న సమయంలో బయటపడటంతో పెళ్లి కూతరు పెళ్లికి ససేమిరా అన్న సంగతి గతంలో విన్నాం. జుట్టు లేకపోతేనేం.. బట్ట తల అయితేనేం అని ఆ అమ్మాయి సరిపెట్టుకోలేకపోయింది. సరే పెళ్లి వద్దనుకొంది. అలాగే పెళ్లిలో బ్యాండ్ లేదని కూడా పెళ్లిళ్లు ఆపేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ కేవలం భోజనాల వద్ద మాటపట్టింపుతో గొడవపడి, ఘర్షణ పడి పెళ్లిని ఆపేసిన సంఘటన తెలంగాణలోని జగద్గిరి గుట్టలో జరిగింది. పెళ్లి భోజనాలలో చికెట్ వడ్డించలేదని పెళ్లి కూతురు తరఫువారితో పెళ్లి కొడుకు తరఫు వారు వాగ్వాదానికి దిగారు. గొడవ చిలికి చిలికి గాలివానగా మారి కోట్లాటకు దారి తీసింది. దీంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. ఇరువర్గాలూ పోలీసు స్టేషన్లలో పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్థిల్లండని దీవించాల్సిన పెద్దలే భోజనాల వద్ద చికెన్ లేదంటూ గొడవపడి పెళ్లి ఆగిపోవడానికి కారణమయ్యారు. మాటపట్టింపులతో   కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని కోటి ఆశలతో పీటలపై కూర్చున్న వధూవరులను విడదీయడంపై పెళ్లికి వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.