కడప నగరం పసుపుమయం
posted on May 27, 2025 @ 7:22PM
కడప నగర శివారుల్లోని పబ్బాపురం లే ఔట్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహానాడుకు భారీ సంఖ్యలో తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. పూర్తిగా మహానాడు పసుపుమయం అయ్యింది. కళాకారులు, సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళ వాయిద్యాలతో స్వాగతాలు పలికారు. మహానాడు కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మంగళవారం నిర్వహించిన ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సభకు ప్రతినిధులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. కడప నగరంలో దాదాపుగా 36 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు వుంది. ఈ రింగ్ రోడ్డు గుండా రాయచోటి, కమలాపురం, పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాలకు రాక పోకలు సాగతుంటాయి. ఈ రింగ్ రోడ్డులో ఎక్కడ చూసిన వాహనాలు బారులు తీరాయి. ప్రజలతో కిట కిటలాడాయి. ప్రాంగాణానికి చేరుకొనేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించి పోవడంతో పోలీసులు కష్టపడి ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తూ వచ్చారు. ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు చేపట్టారు.
*వర్షం రాక పోవడంతో ఊపిరి
రుతు పవనాల ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా గత రెండు రోజులుగా అడపదడపా వర్షాలు కురుస్తున్నాయి. కడప నగరంలో కూడ వర్షాలు కురవడంతో మహానాడు ప్రాంగాణం బురదమయం అయ్యింది. మహానాడు నిర్వహకులు బురదమయం అయిన ప్రాంతాల్లో గ్రావెల్ పరచడంతో రాక పోకలు సాగించారు. ఈనెల 26 నుంచి 29 వరకు వాతావరణ శాఖ వర్షాలు కురుస్తాయని ప్రకటించడంతో నిర్వహకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. అయితే మంగళవారం ఉదయం నుండి ఎటువంటి వర్షాలు కురవక పోగా వాతావరణం చల్లగా మారింది. దీంతో నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటా వేసవిలో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తుంటామని, తీవ్ర ఉక్కపోతలకు గురయ్యే వారమన్నారు. అయితే సారి చల్లటి వాతావరణంలో మహానాడు నిర్వహించు కోవడం ఆనందంగా వుందన్నారు.
*భోజనాలు
తెలుగుదేశంపార్టీ ఆహ్వానం మేరకు నలుమూలల నుంచి పార్టీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. వారికి ఆంధ్ర, రాయసీమ, తెలంగాణలకు చెందిన 30 రకాల ప్రత్యేక వంటకాలను తయారు చేసి వడ్డించారు. చాలా కాలం తర్వాత మహానాడులో మాంసాహరం కూడ వడ్డించారు. మొదటి రోజు దాదాపుగా 30 వేల మందికి వడ్డించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నాం భోజనం, సాయత్రం స్నాక్స్ అందించారు. 1,700 మంది వంటవారు, మరో 88 మందిని వడ్డింపునకు వినియోగించారు. ఇక స్వీట్స్ లో తాపేశ్వరం కాజా, అల్లూరయ్య మైసూర్ పాక్, చక్కెర పొంగలి, ఫ్రూట్ హల్వా తదితర స్వీట్స్ పెట్టారు. భోజనాల వద్ద ఇబ్బందులకు గురయ్యారు.
*అంగరంగ వైభవంగా
మాహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు మహానాడు ప్రాంగణంలోని చిత్తూరు పార్లమెంట్ ప్రతినిధుల నమోదు కేంద్రంలో పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ముఖ్యనాయకులను ఆహ్వానించి చంద్రబాబు పార్టీ జెండా ఆవిష్కరించారు. వేదిక పై మా తెలుగుతల్లికి గీతాలాపన చేశారు. మృతి చెందిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నేతలకు, మహానాడు వేదికగా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో 1,033 మంది చనిపోయినట్లు పార్టీ నాయకుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే పహల్గం ఉగ్రదాడిలో మరణించిన వారికి మహానాడులో సంతాపం తెలిపారు.
*మహానాడు తీర్మాణాలు ఆమోదం
మొదటి రోజు మంగళవారం ప్రతినిధుల నమోదుతో సమావేశం ప్రారంభమైంది. తొలి ఏడాదిలో ప్రభుత్వ ఘన విజయాలు, శరవేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రజా రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణకు అడుగుల పై పలువురు పార్టీ నాయకులు తీర్మాణాలు ప్రవేశపెట్టడంతో నాయకులు ఆమోదం వ్యక్తం చేశారు. అలాగే శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు పై చర్చ, చంద్ర విజన్ తో సంక్షేమ కార్యక్రమం తీర్మాణం పై చర్చించి ఆమోదించారు.