గతుకుల బాటలో పవన్ రాజకీయ ప్రస్థానం!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కచ్చితంగా ఒక విలక్షణ రాజకీయ వేత్త. సినిమా రంగం నుంచి రాజకీయాలలోకి ప్రవేశించిన ఆయనకు ఇప్పటికీ ఆ సినిమాటిక్ ట్విస్టులు, మలుపులపై మోజు పోలేదు. అందుకే ఆయన తన రాజకీయ గమనంలో రోజుకో ట్విస్టులు తెరమీదకు తెస్తూ ఉంటారు. ఆ ట్విస్టులు ప్రజలనే కాదు.. చాలా సందర్భాలలో పార్టీ శ్రేణులనూ అయోమయానికి గురి చేస్తుంటాయి. ఒక సినిమా హీరోగా  పవన్ కల్యాణ్ కు అశేష అభిమాన బలం ఉందనడంలో సందేహం లేదు. ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ఆ అభిమాన బలమే ఒక ప్రధాన కారణమని కూడా చెప్పాలి. అయితే సినీ ప్రేక్షకాభిమాన బలం రాజకీయ నాయకుడిగా ఆయనకు దన్నుగా నిలుస్తుందా అంటే ఒకింత సందేహమే. రాజకీయాలలో కాలు పెట్టేందుకు సినీ అభిమానం దోహదపడుతుందే తప్ప.. రాజకీయాలలో నిలదొక్కుకునేందుకు, అధికార అందలం ఎక్కడానికి అదొక్కటే సరిపోతుందా అంటే మాత్రం కచ్చితంగా కాదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంలో ఆయన వ్యవహార శైలి, ప్రసంగాలు, వాగ్దానాలు అన్నిటినీ రాజకీయ వర్గాలే కాదు.. సామాన్య జనం కూడా నిశితంగా గమనిస్తున్నారు.  నిజమే ఆయన అడుగు బయట పెడితే.. నేల ఈనిందా అన్న స్థాయిలో కాకపోయినా.. భారీగానే జనం వస్తుంటారు. అయితే అది ఆయన జనసేన పార్టీకి దన్నుగా నిలిచే  పరిస్థితి ఉందా అంటే మాత్రం అనుమానమే అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీకి కర్త, క్రియ, కర్మ ఆయనే. ఆయన అడుగు బయటకు వేస్తేనే జనం.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే జనం.. అంతే.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలలో జనసేన పార్టీ ఉందా? లేదా అనే పరిస్థితే ఉంటుంది. జనసేన పార్టీకి బలం, బలహీనతా కూడా పవన్ కల్యాణే.   ఇక పవన్ కల్యాణ్ విషయానికి వస్తే.. ఆయన స్పందనలన్నీ సినిమాటిక్ గానే ఉంటాయి. సున్నిత మనస్థత్వం, పట్టలేని ఆగ్రహం, చిన్నపిల్లాడిలా అలక, అంతలోనే సంతోషం ఇలా ఒక్కో సారి ఒక్కో తీరుగా ఆయన బుహుముఖాలుగా జనానికి దర్శనమిస్తుంటారు. అధికారం మనదే అని ఒకసారి.. తన రాజకీయ ప్రస్థానం అధికారం కోసం కాదని మరోసారి.. ప్రశ్నిస్తానే తప్ప సమాధానాలు తన వద్ద లేవని ఇంకో సారి ఇలా రకరకాలుగా మాట్లాడుతూ తన కన్ఫ్యూజన్ ను జనంపై రుద్దుతారు.  కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానిది, ప్రపంచపు బాధ శ్రీశ్రీది' అన్నట్లుగా రాజకీయాలలో పవన్ కల్యాణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి పాత్ర పోషిస్తున్నారా అనిపించక మానదు. ప్రతి విషయానికీ విపరీతంగా కదిలిపోయి.. వైరాగ్యపు మాటలు మాట్లాడటం.. అంతలోనే పట్టరాని ఆవేశంతో రగిలిపోయి.. చెప్పులు చూపించడం.. పరుష పదజాలంతో రెచ్చిపోవడం.. మళ్లీ కొంత కాలం మౌనంగా మిగిలిపోవడం. ఆ కారణంగానే ఇంతటి ప్రజాభిమానం ఉండి కూడా 2019 ఎన్నికలలో జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానంలో విజయం సాధించడానికే పరిమితమైంది. స్వయంగా తాను పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పవన్ కల్యాణ్ పరాజయం పాలయ్యారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు సన్నద్ధమౌతున్న తరుణంలోనూ జనసేనానిలో అదే కన్ఫ్యూజన్.. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా పొత్తుల చర్చకు తెరలేపింది పవన్ కల్యాణే. రాష్ట్రంలో జగన్ దుష్ట పాలనను అంతమొందించడానికి తాను కట్టుబడి ఉన్నానని చెబుతూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని ప్రకటించారు. అక్కడితో ఊరుకోకుండా ఈ విషయంలో తానే స్వయంగా బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడతాను అంటూ పొత్తు చర్చలకు తెరతీశారు. ఇప్పుడు ఆయనే స్వయంగా మళ్లీ ఒంటరి పోరు అంటూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికకు కారణమౌతున్నారు. వాస్తవానికి పార్టీ నిర్మాణం, నియోజకవర్గ స్థాయి నేతలూ లేకుండానే జనసేన పార్టీ గత ఎనిమిది నెలలుగా నెట్టుకు వస్తోంది. ఇప్పటికీ అదే సరిస్థితి.   ఆ పార్టీకి బలం బలహీనతా కూడా పవన్ కల్యాణే అవ్వడానికి అదే కారణం. ఇప్పటికీ జనసేనా పార్టీకి రాజూ పవన్ కల్యానే.. సేవకుడూ పవన్ కల్యాణే.  తెలుగు రాష్ట్రాలలో ఎందరో సినీనటులు రాజకీయ పార్టీలు పెట్టారు. స్వయంగా పవన్ కల్యాణ్ సొదరుడు చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ స్థాపించి.. ఒక్క ఎన్నికతోనే రాజకీయ తత్వం బోధపడి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేవారు. అప్పుడు చిరంజీవి అయినా, ఇప్పుడు పవన్ కల్యాణ్ అయినా రాజకీయ పార్టీ పెట్టి ప్రజా సేవలో తరించాలన్న నిర్ణయం తీసుకోవడానికి స్ఫూర్తి మాత్రం తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఎన్టీఆర్ అనడంలో సందేహం ఎంత మాత్రం లేదు. అయితే ఎన్టీఆర్ రికార్డు స్థాయిలో  పార్టీ స్థాపించిన 9 నెలలోనే పార్టీని విజయపథంలో నడిపించడానికి ఆయన పకడ్బందీగా పార్టీ నిర్మాణాన్ని చేపట్టడమే కారణం. అయితే పార్టీ నిర్మాణంపై దృష్టి సారించకుండా కేవలం సినీ గ్లామర్ తోనే గెలిచేయగలం అనుకుంటే అలా గెలిపించడానికి జనం సిద్ధంగా లేరని పలు మార్లు ఇప్పటికే రుజువైంది.  పార్టీ స్థాపించి ఎనిమిదేళ్లు దాటుతున్నా ఇప్పటికీ జనసేనకు క్షేత్ర స్థాయిలో నిర్మాణం లేదు. ఇప్పటికీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ నిలబెట్టేందుకు సరైన అభ్యర్థులను గుర్తించిన పరిస్థితి లేదు.  ఇక పార్టీలో పవన్ కల్యాణ్ తప్ప జనం గుర్తు పెట్టగలిగే నాయకుడు మరొకరు కనిపించరు. ఇటీవల ఇప్పటం విషయంలో పవన్ వ్యవహరించిన తీరు బూమరాంగ్ అయ్యింది. ఇందుకు పవన్ కల్యాణ్ రాజకీయ అపరిపక్వత, అతి ఆవేశమే కారణం. ఇక అన్నిటికీ మించి అదేదో సినిమాలో వీకెండ్ ఫార్మింగ్ అన్నట్లు పవన్ కల్యాణ్ లీజర్ టైం పాలిటిక్స్ చేస్తున్నారన్న భావన జనసేన శ్రేణుల్లోనే వ్యక్త మౌతోంది. సినిమా షూటింగ్ లలో బిజీగా ఉంటూ ఖాళీ సమయాల్లో జనసేన కార్యక్రమాలు చేపడుతున్నారన్న అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో వ్యక్త మౌతోంది.  ఇక జనసేన విస్తరణకు మరో పెద్ద అవరోధం ఏమిటంటే బీజేపీతో మైత్రి. అమరావతి రాజధాని నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వరకూ బీజేపీ తీరు పట్ల రాష్ట్రంలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. అటువంటి పార్టీతో మైత్రి కొనసాగిస్తున్న పవన్ కల్యాణ్ పైనా దాని ప్రభావం పడుతోంది. అలాగే.. తనను ఎంతగా విస్మరిస్తున్నా కమలాన్ని పట్టుకు పవన్ కల్యాణ్ ఎందుకు వెళాడుతున్నారన్న ప్రశ్న కూడా ఉత్పన్నమౌతోంది. ఔను మిత్రపక్షం అంటూ జనసేనాని చెబుతుండటమే తప్ప.. ఇన్నేళ్లలో జనసేన పట్ల బీజేపీ మిత్ర ధర్మం చూపిన సంఘటన ఒక్కటీ లేదు. ఆత్మకూరు, బద్వేల్ ఉప ఎన్నికలలో పోటీ వద్దు అని జనసేనాని నిర్ణయిస్తే.. దానికి భిన్నంగా బీజేపీ ఒంటరిగా పోటీలోకి దిగింది.నడ్డా, అమిత్ షా వంటి వారు రాష్ట్ర పర్యటనలకు వచ్చినప్పుడు కనీసం మర్యాద పూర్వకంగా కూడా జనసేన అధినేతతో భేటీ కాలేదు. ఇప్పుడైనా ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో జనసేనానితో భేటీ అయ్యారంటే అందుకు కారణం.. అంతకు ముందు విశాఖలో  జనసేనానికి కదల నివ్వకుండా చేసిన వైసీపీ వైఖరిని ఎండగడుతూ.. తెలుగుదేశం అధినేత జనసేనానితో భేటీ అవ్వడం, సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడటం వల్లనే అని వేరే  చెప్పాల్సిన పని లేదు. మొత్తం మీద పవన్ కల్యాణ రాజకీయ ప్రస్థానం గతుకుల బాటలో సాగుతోందనే చెప్పాలి.  

రేవంత్ కుర్చీకి అసమ్మతి సెగ ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుర్చికి ఎసరొచ్చిందా? అంటే, పార్టీలోని కొందరు ముఖ్య నాయకులు అవుననే అంటున్నారు. అలాగే, ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఆయన, పలికిన పలుకులు, చేసిన వ్యాఖ్యలు అలాంటిది ఏదో జరుగుతోందనే అనుమానాలకు తావిచ్చేలా ఉందనీ అంటున్నారు. రేవంత్ రెడ్డి, ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సహా పార్టీ పెద్దలను కలిసి వచ్చిన తర్వాత ఆయన స్వరంలో మార్పు వచ్చింది. ఢిల్లీ పెద్దల్లో పీసీసీ మార్పు ఆలోచన అంకురించిదని,అందుకే రేవంత్ రెడ్డి స్వరం మారిందని అంటున్నారు.    నిజానికి, రేవంత్ రెడ్డి  పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన మరు క్షణం నుంచే, ఆయనను కుర్చీ దించే ప్రయత్నాలు మొదలయ్యాయి. నిజానికి, కాంగ్రెస్ పార్టీలో ఇదేమి కొత్త కాదు. అందుకే, కాంగ్రెస్ పార్టీలో పైకి వెళ్ళే వారిని కాలు పట్టి గుంజే పీతల సంస్కృతి ఎక్కువని అంటారు. సరే, అది వేరే విషయం అనుకోండి.అదలా ఉంటే, ఢిల్లీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి, బహుశా, మొదటి సారిగా తమ మనోవేదనను బయట పెట్టారు. పార్టీలోని కొదరు  సీనియర్లు తనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ కుర్చీలో కూర్చునేందుకు ప్రయత్నిస్తున్నారని, మీడియా ఇంటర్వ్యూలో  బహిరంగంగా వాపోయారు.  అయితే, పార్టీలో నలుగురైదుగురు మాత్రమే తన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని, మిగిలిన వారంతా తనకు హరతులిస్తున్నారని, తననాయకత్వాన్ని సమర్దిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పు కొచ్చారు. కానీ,అందులో నిజం లేదని, ముఖ్యనేతలు అనుకునే వారిలో కేవలం నలుగురైదుగురు మాత్రమే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సమర్దిస్తున్నారని గాంధీ భవన్’ లో ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, మిగిలిన వారిలో  కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, నిన్న మొన్న పార్టీ వదిలి పోయిన మర్రి శశిధర్ వంటి కొందరు బహిరంగంగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తే, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి, మాజీ సీఎల్పీ నాయకుడు జానా రెడ్డి వంటి సీనియర్ నేతలు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని, పార్టీలోనే చాలా కాలంగా చర్చ జరుగుతోంది.  నిజానికి, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో, ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖ్య నాయకులు సహా, ప్రచార బాధ్యతలు తీసుకున్న ముఖ్య నాయకులు ఎవరూ మనసు పెట్టి పనిచేయలేదు. అది అందరికీ తెలిసిన రహస్యమే. ఎన్నికల ప్రచార సమన్వయ బాధ్యతల నుంచి మధు యాష్కీ గౌడ్ తప్పుకున్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచారానికి దూరంగా ఉండేందుకు విదేశాలకు వెళ్లి పోయారు.నిజానికి, పార్టీ సీనియర్ నాయకులలో మెజారిటీ నాయకులు, తెరాస, బీజేపీ అభ్యర్ధులను ప్రత్యర్ధులుగా భావించలేదు, రేవంత్ రెడ్డినే తమ ప్రధాన ప్రత్యర్ధిగా టార్గెట్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ఆయన్ని దెబ్బ తీసేందుకు, అందివచ్చిన అవకాశంగా భావించారు. అందుకే, కాంగ్రెస్ అభ్యర్ధి డిపాజిట్ కోల్పోయారు.అంతే కాదు,మునుగోడులో కాంగ్రెస్ ఓటమిని పార్టీ ఓటమి కాదు,పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఓటమి కాదు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటమి, అనే విధంగా కేంద్ర నాయకత్వానికి నివేదికలు సమర్పించారు. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు, సీనియర్ నాయకులను చులకను చేస్తూ ఆయన, అయన వర్గం చేసిన వ్యాఖ్యల కారణంగానే మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధి డిపాజిట్ కోల్పోయారని కొందరు నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తే, ఇంకొందరు నేతలు కేంద్ర నాయకత్వానికి నివేదికలు పపంపారు. ఈ నేపద్యంలోనే ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డి సహా ఇతర ముఖ్యనేతలను పిలిపించి నలుగు రోజుల పాటు వివిధ స్థాయిల్లో చర్చలు జరిపారు. ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి చేసిన, కుర్సీ ఖేల్ వ్యాఖ్యలు మరింత ప్రధాన్యత సంతరించుకున్నాయి.   రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత, పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని, పార్టీ బాగా పుంజుకుందని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిజంగా కూడా, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్’గా బాధ్యతలు చేపట్టిన తర్వాతమ కొంత జోష్ పెరిగిన మాట నిజమే. కానీ,అదే సమయంలో రేవంత్ సారధ్యంలో జరిగిన హుజురాబాద్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు నియోజక వర్గాల్లోనూ ఓడిపోయింది, రెండు నియోజక వర్గాల్లో డిపాజిట్ కోల్పోయింది. మరోవంక, కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు, కేవలం రేవంత్ రెడ్డి నాయకత్వం కారణంగానే,పార్టీని వదిలి వెళ్ళారు.అంతే కాదు, ఈటెల రాజేందర్ మొదలు బూర నరసయ్య గౌడ్ వరకు తెరాస అసమ్మతి నాయకులు, చివరకు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగా భావించే కొండా విశ్వేశ్వర రెడ్డి సహా వేర్వేరు పార్టీల సీనియర్ నాయకులు, బొట్టు పెట్టి పిలిచినా గాంధీ భవన్ గడప తొక్కలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. బీజేపీలో బాట పట్టారు. అదే బాటలో ఇంకొందరు తెరాస, కాంగ్రెస్ నాయకులు కూడా, బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.  అదెలా ఉన్నప్పటికీ,మునుగోడు తర్వాత, కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్’కు పడిపోయిందనే, అభిప్రాయం రాజకీయ వర్గాల్లోనే కాదు,సామాన్య ప్రజల్లోకి విస్తరించింది.అధికార తెరాస కూడా,బీజేపీనే ప్రధాన ప్రత్యర్హ్ది అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ నేపధ్యంలో ఇంతకాలం రేవంత్ రెడ్డి విషయంలో మౌనంగా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు కూడా, రేవంత్ హఠావో’ అంటున్నవారితో గొంతు కలుపుతున్నట్లు తెలుస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్వర రెడ్డి ఎపిసోడ్’లో అది బయట పడిందని అంటున్నారు.ఇంతకాలం, రేవంత్ రెడ్డి సన్నిహుతునిగా ఉన్న మహేశ్వర రెడ్డి ఇప్పుడు ఉత్తమ కుమార్ వర్గం వైపు మొగ్గుచుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.ఈ అన్నిటికీ కొసమెరుపుగా, రేవంత్ రెడ్డి చేసిన కుర్చీ వ్యాఖ్యాలు, అలాగే, పాద యాత్ర విషయంలో, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య సాగుతున్న తెరచాటు యుద్ధం, పీసీసీ చీఫ్ మార్పు వ్యూహాగానాలకు బలం చేకూరుస్తోంది అంటున్నారు.

ఒకే మ్యాచ్ .. ఒక వైపు సంబరాలు.. మరో వైపు విధ్వంసం

ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో  ఒక మ్యాచ్ కారణంగా  బెల్జియంలో ఒక వైపు సంబరాలు హోరెత్తితే.. మరో వైపు విధ్వంసం చెలరేగింది. ఇంతకీ విషయమేమిటంటే.. ఫిఫా వరల్డ్ కప్ లో బాగంగా మోరాకో, బిల్జియంల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బెజ్జియం 0-2 తేడాతో ఘోరంగా ఓడిపోయింది.  మొరాకో గెలుపు, బిల్జియం  ఓటమితో బ్రస్సెల్స్ లో సంబరాలు,  విధ్వంస కాండ ఓకే సమయంలో చెలరేగాయి. కారణమేమిటంటే.. బ్రెజిల్ లో దాదాపు 5లక్షల మంది మోరాకో వాసులు ఉంటారు. వారంతా మొరాకో విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు..  వారంతా వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో తమ దేశం జట్టు ఓటమిని జీర్ణించుకోలేని బెల్జియం వాసులు బ్రస్సెల్ లో విధ్వంస కాండకు తెగబడ్డారు.  కొందరు ఆందోళనకారులు దుకాణాలను ధ్వంసం చేసి వాహనాలను దగ్ధం చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అల్లర్లకు సంబంధించి 12 మందిని అరెస్ట్ చేశారు.    

జనసేన గూటికి మేకతోటి

అధినేత ఆమెను మామూలుగా అవమానించారా? తొలి కేబినెట్ లో ఏకంగా హోంమంత్రి పదవి ఇచ్చారు. ఆమెను ఎంతో గౌరవ స్థానంలో కూర్చోబెట్టినట్టే కూర్చోబెట్టి ఆ తర్వాత అవమానకరంగా మంత్రి పదవి ఊడబెరికారు. దీంతో అలక వహించిన ఆ కీలక నేత కొన్నాళ్లు మౌనమే తన  భాష అన్నట్లు గడిపారు. ఆపైన జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలకు కూడా రాం.. రాం.. చెప్పేశారు.  అయినా కొద్ది రోజులుగా స్తబ్ధుగా ఉన్నారు. తాజాగా పలువురు పార్టీ జిల్లాల అధ్యక్షులు, సమన్వయ కర్తలను మార్చిన అధినేత ఆ జిల్లా బాధ్యతలను డొక్కా మాణిక్య వరప్రసాద్ కు అప్పగించారు.  మాజీ మంత్రి మేకతోటి సుచరిత చాన్నాళ్లుగా వైసీపీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. హోం మంత్రిగా వైసీపీలో ఒక వెలుగు వెలిగిన తనకు పార్టీలో రోజు రోజుకూ ప్రాధాన్యం తగ్గిపోతున్న తీరును ఆమె గమనిస్తున్నారు. మంత్రి పదవి పోగొట్టుకుని, జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని వదులుకున్న క్రమంలో వైసీపీలో సుచరిత యాక్టివ్ గా కనిపించలేదు. అయినప్పటికీ తనను వైసీపీ  పెద్దలు కానీ.. మరెవరు కానీ కనీసం పలకరించలేదనే బాధ సుచరితలో   గూడుకట్టుకుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల సమయానికి ముందే సంచలన నిర్ణయం తీసుకునేఅవకాశాలున్నాయని అంటున్నారు. ఆ దిశగా సుచరిత ఇప్పటికే కసరత్తు ఆరంభించేశారని గుంటూరు జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో.. రాజకీయంగా తన ఉనికిని ఎలా కాపాడుకోవాలనే దానిపై, మళ్లీ ఎలా యాక్టివ్ కావాలనే అంశాల పైన సుచరిత దృష్టిసారిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసి, వేరే పార్టీ తీర్థం తీసుకోవాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. సుచరిత వైసీపీని వీడితే ఆమెకు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటనే చర్చ గుంటూరు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుచరితకు ఉన్న ఆప్షన్లలో ఒకటి నారా చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ.. వైసీపీతోనూ, ఆ పార్టీ చీఫ్ జగన్ తోనూ నువ్వా.. నేనా.. అనే రీతిలో ఢీకొనగల సత్తా ఉన్న పార్టీ. టీడీపీలో చేరితే.. వైసీపీని ఢీకొనగలిగే శక్తి తనకు వస్తుందనే యోచన సుచరిత చేస్తున్నారని అంటున్నారు. కాగా.. వైసీపీ నుంచి తప్పుకున్నా టీడీపీలో చేరే అవకాశం అంతగా ఉండకపోవచ్చనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే పలు వేదికలపై సుచరిత సుతిమెత్తగా అయినా.. టీడీపీపై విమర్శలు చేశారు. అందుకే ఆమె ఇప్పుడు  పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ వైపు చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే.. ఆ పార్టీ తరఫున ఈసారి ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి బరిలో దిగాలనే ఆకాంక్షను సుచరిత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఓకే అంటే.. వెనుకా ముందూ చూడకుండా జనసేన పార్టీ కండువా కప్పుకునేందుకు ఈ మాజీ హోం మంత్రి సిద్ధంగా ఉన్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో కీలకంగా ఉండే ఎస్సీ నియోజకవర్గం ప్రత్తిపాడులో గత ఎన్నికల్లో విజయ బావుటా ఎగరేయడంతో జగన్ కుటుంబం ఆమెను ఎంతో ముఖ్యమైన నాయకురాలిగా భావించింది. అందువల్లే సుచరితకు జగన్ తొలి కేబినెట్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హోం మంత్రి పదవి వరించింది. తదననంతర పరిణామాలలో ఏం జరిగిందే తెలియదు కానీ ఇటీవలి కాలంలో సుచరితకు వైసీపీలో ఎటువంటి ప్రాధాన్యతా లభించడం లేదు.

హతవిధీ ఇంకేం దారి.. దిక్కుతోచని స్థితిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్!

నెల్లూరు నగర వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏం బాగాలేదు.  సినిమా కష్టాల్లా అన్ని కష్టాలూ ఆయనకే వస్తున్నాయనిపిస్తోంది.  మంత్రిగా ఉండగా..  అనిల్ కుమార్ యాదవ్ ఓ  రేంజ్ లో చెలరేగిపోయాడు. తన పర బేధం లేకుండా  అందర్నీ దూరం చేసుకున్న ఫలితం,  ఆ మంత్రి పదవి కాస్తా హుష్ కాకి అయిన తర్వాత.. ఆయనకు తెలిసివస్తోందంటున్నారు. మంత్రిగా ఉండగా   ఆయన వెంట అడుగులో అడుగు వేసి జై కొట్టిన వారంతా..ఇప్పుడు ఆయన కంటికి కూడా కనిపించకుండా దూరం జరిగారని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని సైతం ఆయన చాలా లైట్ తీసుకున్నారని.. ఇంకా చెప్పాలంటే.. ఆయన ఎంపిక చేసిన వారి ఇళ్లకే వెళ్లి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారనే చర్చ సైతం జిల్లా పార్టీ వర్గాల్లో వైరల్ అవుతోందని సమాచారం. ఈ కార్యక్రమంలో కూడా అనిల్ తోపాటు అతి కొద్దిమంది మాత్రమే పాల్గొంటున్నారని.. ఈ వ్యవహారంపై ఇప్పటికే సీఎం జగన్‌కు నివేదిక అందిందని... అందుకే ప్రాంతీయ సమన్వయ కర్త పదవి నుంచి ఆయన్ని తప్పించారనే టాక్ సైతం  హాట్ హాట్‌గా నడుస్తోంది.  మరోవైపు ఎన్నికలు సీజన్.. దూసుకొచ్చేస్తోంది. అలాంటి సమయంలో పనంతా కేడర్‌తోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కేడర్‌ కోసం.. కేడర్‌ను తన చుట్టు తిప్పుకోవడం కోసం.. అనిల్ ఇప్పటికే రంగంలోకి దిగి.. లక్షలాది రూపాయిలు ఖర్చు చేస్తున్నారని అంటున్నారు.  ఇంకో సీఎం జగన్ తన..  తొలి కేబినెట్‌లో అనిల్ కుమార్ యాదవ్‌కు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా చాన్స్ ఇచ్చారని... అయితే మంత్రిగా ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ బాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడి   జగన్ వద్ద మంచి మార్కులే కొట్టేశారని.. ఆ క్రమంలో   జిల్లాలోని పార్టీ సీనియర్ నేతలతోనే కాదు.. సీనియర్ ఎమ్మెల్యేలతో సైతం అనిల్..  డొంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరించేవారని.. చెబుతున్నారు. జగన్ గుడ్ లుక్స్ లో ఉన్నందున మలి కేబినెట్ లో కూడా తన స్థానం పదిలం అన్న ధీమాతో ఉండేవారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.   అయితే తనకు మంత్రి పదవిని ఊడబీకి జిల్లాకే చెందిన   కాకాణి గోవర్దన్ రెడ్డికి జగన్ మలి కేబినెట్‌లో స్థానం కల్పించడాన్ని జీర్ణించుకోలేకపోయిన అనిల్ కుమార్ యాదవ్  అప్పట్లో వ్యవహరించిన తీరుతో  జగన్ గుడ్ లుక్స్ కు దూరమయ్యారంటారు.  మంత్రిగా ఉన్న సమయంలో  అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలే.. పార్టీలో ప్రస్తుతం ఆయన ఏకాకిగా మిగిలిపోయిన పరిస్థితి రావడానికి కారణమని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  అదీకాక.. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి పి. నారాయణ బరిలో దిగే అవకాశం ఉందని.. అలాంటి పరిస్థితుల్లో  వైకాపా అభ్యర్థిగా... మరింత బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని  జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లో పార్టీ టికెట్ దక్కదన్న ఆందోళన మొదలైందని పార్టీ వర్గాలే అంటున్నాయి.   ఇప్పటికే  నెల్లూరు జిల్లాలో వైసీపీ గ్రాఫ్ భారీగా పడిపోయిందనీ, ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ కేడర్ లోనే మద్దతు కోల్పోయిన అనీల్ కుమార్ యాదవ్ కు మరోసారి టికెట్ ఇస్తే మొదటికే మోసం వస్తుందని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  ఏదీ ఏమైనా.. అనిల్ కుమార్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేస్తారా? లేక వెంకటగిరి నుంచి బరిలోకి దిగుతారా? లేదంటే శాసన మండలికి పంపిస్తారా? అనేది  ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ నిర్ణయిస్తారంటున్నారు. ఇవేమీ కూడా ఇవ్వకుండా జగన్  ఆయనకు రిక్తహస్తం చూసే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్ ను ఎత్తుకెళ్లారు!

గ్రేట్ ట్రెయిన్ రాబరీ అని ఓ హాలీవుడ్ సినిమా ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచింది. ఆ సినిమాలో ట్రైన్ లో రవాణా అవుతున్న నిధిని దొంగ చాకచక్యంగా చోరీ చేసి అందరి దృష్టిలో హీరోగా నిలుస్తాడు. ఇదే కాదు.. రాబిన్ హుడ్ లా పెద్దలను దోచి పేదలకు పెంచే దొంగలను హీరోలుగా చిత్రిస్తూ పలు తెలుగు సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమాలన్నిటినీ తలదన్నే లాంటి చోరీ ఒకటి జరిగింది. ఇక్కడ దొంగలు చోరీ చేసింది డబ్బునో, నగలనో కాదు.. ఏకంగా ఒక సెల్ టవర్ ను. అది కూడా ఏ అర్దరాత్రో అపరాత్రో కాదు. పట్ట పగలు. ఇటీవలి కాలంలో ఏటీఎంలను ఎత్తుకెళ్లిపోయిన దొంగల గురించి విన్నాం.. కానీ ఏకంగా సెల్ టవర్ ను ఎత్తుకుపోయిన దొంగలను మొదటి సారి చూస్తున్నాం. బీహార్ లో ఈ వింత దొంగతనం జరిగింది. సెల్ టవర్ ఎత్తుకు వెళ్లిన వారు ఏదో దొంగచాటుగా రాలేదు. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అధికారులమంటూ వచ్చి దర్జాగా పట్టపగలే ఎత్తుకెళ్లారు. చోరీ చేస్తున్నామన్న భయం కానీ, దొరికిపోతామేమోనన్న బెదురు కానీ వారిలో ఏ కొసానా కనిపించలేదు. టవర్ తీసేయడానికి కారణం తమ సెల్ ప్రొవైడర్ కంపెనీ నష్టాల ఊబిలో కూరుకుపోవడమేనని అడిగిన వారికి చెప్పారు. అందరూ చూస్తుండగానే భారీ టవర్ కు కిందకు పడుకోపెట్టి.. ఏ పార్టుకాపార్టు విడదీసి చక్కా పట్టుకుపోయారు. దీని విలువ పాతిక లక్షలకు పైనే ఉంటుందని చెబుతున్నారు. అంతా అయిన తరువాత కంపెనీవారికి సమాచారం అందడంతో వారు వచ్చి ఇది దొంగల పనేనని తేల్చారు. పట్నాలోని ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెల్ టవర్ కు గత కొన్ని నెలలుగా కిరాయి కట్టడం లేదన్న విషయం తెలుసుకున్న ఓ దొంగల ముఠా దానికి చోరీ చేసేందకు పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. అందర్నీ నమ్మించి, అందరూ చూస్తుండగానే తమ పని చక్క పెట్టేసింది. 

ఇంట్లో ఎలుకల మందు పెడుతున్నారా?.. జగ్రత్త జైలు పాలౌతారు!

ఇంట్లో ఎలుకలు తిరుగుతుంటే.. ఆ ఇల్లాలికి భయం చిరాకు వెంటాడుతుంటాయి. వాషింగ్ మిషన్ నుంచి అన్నిటినీ కొరికి పెట్టేసి పాడు చేయడమే కాకుండా.. అల్మార్లలో స్టోర్ చేసుకున్న పప్పులనూ వదలకుండా పాడు చేస్తుంటాయి. ఇక బట్టల సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. చింపి పోగులు చేస్తుంటాయి. పారాడే వయస్సున్న చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో అయితే ఎలుకలతో మరీ ఇబ్బంది. వీటన్నిటినీ అధిగమించడానికి ఇళ్లల్లో ఎలుకల బోన్లు పెడతాం. దానివల్లా లాభం లేదనుకుంటే ఎలుకల మందు పెట్టి ఎలుకలను చంపేస్తాం. అలా చంపేసినందుకు హత్య కేసు పెడతామంటూ పోలీసులు వస్తే... అదే కనుక జరిగితే దేశంలో జైళ్లలో కాకుండా బయట ఉండే వారి సంఖ్య చాలా తక్కువ అయిపోతుందనడంలో సందేహం లేదు. ఇంత ఉపోద్ఘాతమేమిటని అనుకుంటున్నారా.. ఎలుకను చంపాడని చెప్పి ఓ వ్యక్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆశ్చర్యం వద్దు ఇది నిజమే.. ఉత్తర ప్రదేశ్ లో మనోజ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు చేసిన నేరం ఎలుకను హత్య చేయడమే. ఓ ఎలుక తోకకు రాయి కట్టి నీటిలో ముంచి చంపేశాడంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు మనోజ్ కుమార్ ను అరెస్టు చేశారు. ఎలుక శవాన్ని పోస్టు మార్టం కోసం పంపారు. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎలుకను హత్య చేసినందుకు మనోజ్ కుమార్ కు జీవిత ఖైదు విధిస్తారా, లేక ఉరి వేస్తారా అంటూ నెటిజనులు జోకులు పేలుస్తున్నారు.

బండి ఐదో విడత పాదయాత్ర అడుగు కదపనివ్వమంటున్న పోలీసులు.. నడిచి తీరుతాం అంటున్న బీజేపీ శ్రేణులు

తెలుగు రాష్ట్రాలలో పాదయాత్రలు ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాయి. అమరావతి రైతుల పాదయాత్రలో సంభవించిన ఉద్రిక్త పరిణామాలు మరుపనకు రాకముందే.. తెలంగాణలో బండి సంజయ్ పాదయాత్ర ఐదో విడత ప్రారంభానికి ముందే యుద్ధ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర సోమవారం(నవంబర్ 28)  నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లా భైంసా నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా ఆదివారం (నవంబర్ 27) నుంచే పోలీసులు భైంసాను తమ అధీనంలోకి తీసుకున్నారు. యాత్రకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్న బండి సంజయ కు తీరిగ్గాఅప్పుడు అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నారు. భైంసాలో నెలకొన ఉన్న సున్నిత పరిస్థితుల కారణంగా యాత్ర కొనసాగిస్తే.. ఉద్రిక్తతలు పెచ్చరిల్లి షర్ఫణలు జరిగే ప్రమాదం ఉందని చెబుతూ పోలీసులు యాత్రకు అనుమతి నిరాకరించారు.  శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వడం లేదని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రకటించారు. అయితే బీజేపీ నేతలు మాత్రం యాత్ర కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర సాగుతున్నప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులు .. పాదయాత్ర అనుమతి రద్దు చేసి.. బండి సంజయ్ ను కరీంనగర్‌ తీసుకు వెళ్లి ఇంట్లో వదిలి పెట్టిన సంగతి విదితమే.  అప్పట్లో  హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుని మరీ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐదో విడత పాదయాత్రకు  అదే సీన్ రిపీట్ అయ్యింది. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా బండి సంజయ్ పాదయాత్ర  చేయడం ఖాయమని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికే నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే భైంసాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే  కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల దూకుడుతో రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భైంసా నుంచి బండి పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో అక్కడి పరిస్థితులు ప్రత్యక్ష యుద్ధం జరుగుతోందా అన్నట్లుగా మారిపోయాయి.  ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. బండి భైంసాకు వెళుతుండగా మార్గ మధ్యంలో జగిత్యాల మండలం తాటిపల్లి వద్ద అడ్డుకుని యాత్రకు అనుమతి లేదని ముందకు వెళ్లేందుకు వీళ్లేదనీ స్పష్టం చేశారు. అయితే బండి పోలీసులను ఖాతరు చేయకుండా వారిని తప్పించుకుని ఓ కార్యకర్త వాహనంలో భైంసా వైపు దూసుకెళ్లారు. ఈ దశలో బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడమే కాక తోపులాటల వరకూ వెళ్లింది. అయితే పోలీసులు బండిని వెంబడించి కోరుట్ల మండలం వెంకటాపురం వద్ద నిలిపివేశారు. ఈ సందర్భంగా బండి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  రోడ్డుపైనే కార్యకర్తలతో కలిసి ధర్నాకు కూర్చున్నారు. దీంతో పోలీసులు బండి సంజయ్ ను అరెస్టు చేసి జగిత్తాలకు తరలించారు.  బండి పాదయాత్రకు అనుమతి నిరాకరించడం, బండిని అరెస్టు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందంటూ విమర్శలు గుప్పించాయి. భైంసా, నిర్మల్, జగిత్యాలలో ఏ క్షణాన ఏం జరుగుతుదో అన్నంతగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వైపు బండి సంజయ్ ను పోలీసులు జగిత్యాలలో గృహ  నిర్బంధంలో ఉంచారు. మరో వైపు పాదయాత్రకు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది.  ఇప్పటి వరకూ రాష్ట్రంలో బండి సంజయ్ నాలుగు విడతల్లో 21 జిల్లాలలో 1178 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన సంగతి విదితమే.

ఆత్యాచారానికి పాల్పడి.. ఆపై యాసిడ్ పోసి..ప్రేమించిన వాడే పొట్టన పెట్టుకున్నాడు..

చట్టాలెన్ని తెచ్చినా, కఠిన శిక్షల హెచ్చరికలు చేసినా మహిళలపై అత్యచారాలు, అఘాయిత్యాలు ఆగడం లేదు సరికదా రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దగ్గరి వాళ్లు, అయిన వాళ్ల చేతుల్లోనే దారుణంగా హతమారిపోతున్నారు. తాజాగా ప్రేమించిన వాడే కాలయముడై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆపై ముఖంపై యాసిడ్ పోసి కిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నమ్మి వచ్చిన ప్రేయసిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి, ఆపై అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన జార్ఖండ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. 20 ఏళ్ల యువతి రాంచీలోని ఓ కాలేజీలో పీజీ చదువుతోంది. కొన్ని నెలలుగా ఆమె  దీప్ అనే యువకుడూ ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. నవంబర్ 20 న ఆమె దీప్ తో కలిసి బయటికి వెళ్లింది. అప్పటి నుండి  ఆమె జాడ తెలియలేదు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రెండ్రోజుల తర్వాత..లోహర్ దగా గ్రామానికి సమీపంలో ఉన్న రాతి క్వారీల సమీపంలో యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఆమె ముఖం గుర్తుపట్టకుండా యాసిడ్ పోసి కాల్చేసి.. దారుణంగా హతమార్చాడని దర్యాప్తులో తేలింది. నిందితుడు దాప్ నారాయణ్ సింగ్ అలియాస్ చర్కు ని అరెస్ట్ చేశారు.  

ఆసియా కప్ కు మీరు రాకుంటే.. వన్డే వరల్డ్ కప్ కు మేం రాం

వచ్చే ఏడాది ఆసియాకప్ జరగనుంది. ఆ  టోర్నీకి పాకిస్థాన్ వేదిక కావడమే ఇప్పుడు ఇరు దేశాల మధ్యా వివాదానికి కారణమైంది.  ఇరు దేశాల మధ్యా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రెండు దేశాలూ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం లేదన్న సంగతి విదితమే. ఐసీసీ టోర్నీలలో మాత్రమే అదీ తటస్థ వేదికలపై మాత్రమే రెండు దేశాల మధ్యా మ్యాచ్ ల జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ కు పాకిస్థాన్ వేదిక కావడంతో భారత్ అక్కడకు వెళ్లి ఆడుతుందా అన్న విషయంపై అనుమానాలు వ్యక్త మయ్యాయి. ఇప్పటికే బీసీసీఐ ఈ విషయమే దాదాపు స్పష్టత ఇచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ గడ్డపై భారత్ ఆడేది లేదని తేల్చేశారు. దీనిపైనే పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ రిటార్డ్ ఇచ్చారు. పాక్ లో టీమ్ ఇండియా ఆడక పోతే.. తామూ అదే బాట పడతామనీ,  2023లో భార‌త్ వేదిక‌గా జ‌రిగే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌మ జ‌ట్టు ఆడ‌ద‌ని తెలిపాడు. గ‌త కొంత‌కాలంగా పాక్ జ‌ట్టు అత్యుత్త‌మంగా రాణిస్తోంద‌ని, ఏడాది కాలంలో టీమ్ఇండియాను రెండు సార్లు ఓడించామ‌ని ర‌మీజ్ రజా గుర్తు చేశారు. మా జ‌ట్టు ప‌టిష్టంగా మారింది అని చెప్ప‌డానికి ఇంత‌క‌న్నా నిద‌ర్శ‌నం ఏం ఉంటుంద‌ని అన్నాడు.  భార‌త్‌  ఇక్క‌డికి వ‌స్తే.. మేం ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌టానికి వెలుతాం. వాళ్లు రాక‌పోతే.. మేమూ వెళ్లం. మా జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌కుంటే ఆ టోర్నీని ఎవ‌రు చూస్తారని   ఓ వార్తా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ర‌మీజ్ రాజా అన్నాడు. దీనిపై క్రికెట్ అభిమానులు మండిప‌డుతున్నారు. భార‌త్ గ‌నుక పాక్ కు వెళ్ల‌కుంటే ఆసియా క‌ప్ క్రేజ్ ప‌డిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. పాక్ ఒక‌వేళ ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌కుంటే ఆ దేశానికే న‌ష్టం అని చెబుతున్నారు. ఐసీసీ టోర్నీలో పాల్గొన‌డం ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని పాక్ కోల్పోవాల్సి వ‌స్తుంద‌న్నారు. ఇక ఇండియా కూడా ఏడాది కాలంలో రెండు సార్లు పాక్ ను ఓడించింద‌నే విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.

డుక్కుడుక్కు డుక్కని బుల్లెట్ పై వచ్చిన రాహుల్!

మధ్యప్రదేశ్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఆయన ప్రసంగాలు, వేషధారణ ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నయి. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన చేస్తున్న విమర్శలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. రాహుల్ గాంధీ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల కంటే సైద్ధాంతిక రాజకీయాలకు, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జోడో యాత్ర లక్ష్యం ఎన్నికల విజయం కాదని సమాజంలో ద్వేషభావాన్ని రూపుమాపిఐక్యతను సాధించడమేనని కాంగ్రెస్ మొదటి నుంచీ చెబుతూనే వస్తోంది. అందుకు తగ్గట్టుగానే రాహుల గాంధీ కూడా తన ప్రసంగాలాలో బీజీపీ, ఆర్ఎస్ఎస్’జాతీయ వాద హిందుత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సైద్ధాంతిక విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బీజేపీ,ఆర్ఎస్ఎస్ ల వల్ల దేశానికి వాటిల్లే ముప్పు గురించి హెచ్చరిస్తున్నారు.  హెచ్చరిస్తున్నారు. గత మూడు రోజులుగా రాష్ట్రంలో సాగుతున్న యాత్రలో ప్రింయాంకాగాంధీ, రాబర్ట్ వాద్రా పాల్గొనడం కొత్త చర్చకు తావిచ్చింది. అదలా ఉంటే ఆదివారం రాహుల్ గాంధీ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు. రాజ్యంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ జన్మస్థలమైన డాక్టర్ అంబేడ్కర్ నగర్ లో రాహుల్ గాంధీ పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. సాయంత్రానికి ఇండోర్ చేరుకున్న రాహుల్ అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. ఇలా ఉండగా ఆదివారం నాటి యాత్రలో విశేషమేమిటంటే రాహుల్ గాంధీ కొద్ది దూరం బుల్లెట్ బైక్ నడిపారు. ఇది పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆయన వెంట కార్యకర్తలు పరుగులు తీశారు. కాంగ్రెస్ జిందాబాద్ నినాదాలతో అంబేడ్కర్ నగర్ మార్మోగింది. 

రాహుల్ వేషం పై రాజకీయ రగడ

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో జోరుగా సాగుతోంది. రెండు మూడు రోజుల్లో, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. సరే  రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గేహ్లాట్, ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న యువనేత సచిన్ పైలట్ వర్గాల మధ్య ‘ప్రత్యక్ష’ యుద్ధం జరుగతున్ననేపథ్యంలో రాహుల్ యాత్ర ఎలా ముందుకు సాగుతుంది, అనే విషయంలో వినిపిస్తున్న, ఉహాగానాలు,విశ్లేషణలను పక్కన పెడితే, ప్రస్తుతం మధ్య ప్రదేశ్, రాహుల్ యాత్ర చాలా చాలా  హుషారుగా సాగుతోంది. రాహుల్ యాత్రలో సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా, ఆమె భర్త భర్త రాబర్ట్  వాద్రా, కుమారుడు రేహాన్ వరసగా మూడు రోజులు పాల్గొనడంతో,రాహుల్ యాత్రకు కొత్తకళ వచ్చింది. ముఖ్యంగా ప్రియాంక వెంట, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రేహాన్ కూడా రావడంతో రాజకీయంగాను కొత్త చర్చ తెరమీదకు వచ్చింది.  రాహుల్ గాంధీ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల కంటే సైద్ధాంతిక రాజకీయాలకు, సైద్ధాంతిక పోరాటాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జోడో యాత్ర లక్ష్యం కూడా ఎన్నికల విజయం కాదని, జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ సహా ఇతర నాయకులు పలు సందర్భాలలో పేర్కొన్నారు. రాహుల గాంధీ కూడా తమ ప్రసంగాలాలో బీజీపీ, ఆర్ఎస్ఎస్ జాతీయ వాద హిందుత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బీజేపీ,ఆర్ఎస్ఎస్ లను ప్రస్తావిస్తూ హెచ్చరిస్తున్నారు.  ఈనేపధ్యంలో, కాంగ్రెస్ పార్టీలో ఇంత వరకు గాంధీలు పోషించిన పాత్రను ఇకపై వాద్రాలు పోషిస్తారని, అందుకే ప్రియాంక కుటుంబ సమేతంగా యాత్రలో పాల్గొన్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. రాహుల్ గాంధీ యాత్ర తర్వాత కూడా, ఇదే ధోరణి అవలంబిస్తే ప్రియాంక, రాబర్ట్ వాద్రా పార్టీని తమ గుప్పిట్లోకి తీసుకుంటారని అంటున్నారు. నిజానికి, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాలపై కొంత ఆసక్తి చూపారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని, ప్రకటించిన విషయాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు.  అదలా ఉంటే, రాహుల్ గాంధీ, మధ్యప్రదేశ్‌  యాత్రలో వేష ధారణ మారిపోయింది. గతంలోనే,నేనూ హిందువునే అని ప్రకటించుకున్న రాహుల గాంధీ,. ఈసారి ఏకంగా పక్కాగా పండిత వేష కట్టారు. ఓంకారేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. నర్మదా నదీ తీరాన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమయంలో  రాహుల్ ఓంకార ముద్రలున్న శాలువా కప్పుకుని, రుద్రాక్ష మాలలు ధరించి, పెద్ద పెద్ద బొట్లతో అచ్చమైన పూజారికి రోల్ మోడల్ అన్నట్లు వేషం కట్టారు. పండితునిగా దర్శనమిచ్చారు. ఆ  ఫోటోని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. నిజానికి, రాహుల్ వేషం పై సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. మెచ్చుకున్న వాళ్ళు మెచ్చుకున్నారు. ట్రోల్ చేసిన వారు ట్రోల్ చేశారు. అదంతా ఒకెత్తు అయితే, రాహుల్ పోస్ట్ ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రీట్వీట్ చేస్తూ చేసిన వ్యాఖ్య  వివాదంగా  మారింది. అలాగే, అంతకు ముందు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ,రాహుల్ వేషధారణలో వచ్చిన మార్పును మెచ్చుకుంటూనే,  గడ్డం పెంచిన రాహుల్ గాంధీని చూడగానే సద్దామ్ హుస్సేన్‌ గుర్తుకు వస్తున్నారని  ట్రోల్ చేశారు. అది మరొక వివాదం అయింది . ఇప్పుడు కాంగ్రెస్, బీజేపే నాయకుల మధ్య రాహుల్ గాంధీ కొత్త వేషం పై హాట్ హాట్ గా  వివాదం నడుస్తోంది. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కేంద్ర మంత్రి హిందూ ఆచారాలను అవమానిస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. అలాగే, మరో కాంగ్రెస్ ప్రతినిధి లావణ్య బలాల్ రాహుల్ గాంధీపై మీకున్న విద్వేషం తారస్థాయికి చేరుకుంది   అని ఆమె స్మృతీ ఇరానీకి సుతిమెత్తగా చురకలు అంటించారు. అలాగే, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిమంత శర్మ రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, రాహుల్ గాంధీని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు, హిమంత శర్మ సిగ్గు పడాలి. ఇప్పుడు ఆయన( హేమంత్ బిశ్వ శర్మ రాజకీయాల్లో ఇంత ఉన్నత స్థానంలో ఉన్నారంటే అదంతా రాహుల్ గాంధీ పుణ్యమేనని గుర్తుంచుకోవాలి అని ట్వీట్ చేశారు. ఇలా రాహుల్ గాంధీ సాగిస్తున్న బారత్ జోడో యాత్ర,ఓ వంక రాజకీయ వేడిని పుట్టిస్తోంది, మరో వంక సైద్ధాంతిక చర్చలకు ఆస్కారం కలిపిస్తోంది. అలాగే, కాంగ్రెస్ పార్టీలో రేపటి మార్పులకు సంకేతంగా నిలుస్తోంది.

జాతీయ దూకుడుకు బ్రేక్ కేసీఆర్ మరో యూ టర్న్?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాలలో దూకుడు పెంచే విషయంలో పునరాలోచనలో పడ్డారా? రాష్ట్ర, జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో తాజాగా ఆయన ఇంట గెలిచి రచ్చగెలవాలనే నిర్ణయానికి వచ్చారా? అంటే, రాజకీయ పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో జరుగతున్న ముందస్తు ఎన్నికల సన్నాహాలు, ఇతర పరిణామాలను గమనిస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో మరోమారు యూ టర్న్ తీసుకున్నట్లే ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి పొలిటికల్  ఫోకస్ జాతీయ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల వైపుకు మరలినట్లే ఉందని పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మరో ఎనిమిది నెలలలోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని, ముందస్తు సంకేతాలు ఇవ్వడంతో ముందస్తు ఆలోచనకు మరింత బలం చేకూరిందని అంటున్నారు.ముందు రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించి ఆ తర్వాత జాతీయ రాజకీయలపై ఫోకస్ పెట్టాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే అదే ఫైనల్ నిర్ణయం అనుకునే వీలులేదనీ కేసీఆర్ ను ఎరిగిన నేతలు అంటున్నారు. నిజానికి పార్టీ వర్గాల సమాచారం మేరకు  ముఖ్యమంత్రి ప్రస్తుతానికి రాష్ట్ర శాసన సభ ఎన్నికల పైనే దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా  ముందస్తు ఎన్నికలకు వెళ్ళడమా వెళ్ళక పోవడమా అనే మీమాంసలో ముఖ్యమంత్రి ఉన్నారు, ఈ విషయంలో ఒక నిర్ణయానికి వస్తేనే గానీ, జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టే పరిస్థితి లేదని పార్టీ నాయకులు అంటున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం, దక్షిణాది రాష్ట్రాలపై ముఖ్యంగా కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాలపై దృష్టిని కేంద్రేకరిస్తుందనే సమాచారంతో, ముఖ్యమంత్రి ఇటు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు, అటు జాతీయ రాజకీయ ప్రస్థానం గురించి విభిన్న కోణాల్లో ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.  నిజానికి, తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ, విజయదసమి (అక్టోబర్ 5) తెరాస విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం చేశారు. అయినా, ఆ తర్వాత పెద్దగా ముందడుగు పడలేదు.  ఆ వెంటనే, కేంద్ర ఎన్నికల సంఘానికి, పేరు మార్పుకోసం, తెరాస మాజీ ఎంపీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద కుమార్ నాయకత్వంలో తెరాస నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, నవంబర్  7న కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, పార్టీ పేరు మార్పుకు అవసరం అయిన మేరకు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పేరున బహిరంగ పత్రికా ప్రకటన వెలువడింది. టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లుగా ఆ ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ పార్టీ పేరు మార్చే విషయంలో ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే, వాటిని 30 రోజుల లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపవచ్చని పేర్కొన్నారు.అంటే, డిసెంబర్ 7 తర్వాతగానీ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అవకాశమే కాదు అవసరం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేదు. పార్టీ పేరు మార్పు విషయంలో ఎన్నికల సంఘం ఇన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలనే నిబంధన ఏదీ లేదు. సో ... డిసెంబర్ 7 తర్వాత గానీ, ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. అంతే కాదు, ముగ్గురు కమిషనర్లు హాజరైన పూర్తి స్థాయి సమావేశంలో మాత్రమే, పార్టీ పేరు మార్పు నిర్ణయం తీసువలసి ఉంటుందని అంటున్నారు. అయితే, ఇటీవల ఎన్నికల సంఘం మూడవ కమిషనర్ గా అరుణ్ గోయల్ నియామకం జరిగినా, ఆయన నియామక ప్రక్రియను సుప్రీం కోర్టు తపు పట్టిది. న్యాయవిచారణ జరుగుతోంది. సో .. ఇప్పట్లో తెరాస పేరు మార్పు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం లేదని అంటున్నారు.  బీఆర్ఎస్ ముందడుగు పడక పోవడానికి అదొక సాంకేతిక కారణం అయినా ప్రధాన కారణం మాత్రం రాజకీయ మైనదే అంటున్నారు. దేశంలో, రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో జాతీయ రాజకీయాల్లో దూకుడు పెంచే విషయంలోముఖ్యమంత్రి పునరాలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అందుకే, డిసెంబర్ రెండో వారంలో ఢిల్లీలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలనే నిర్ణయం విషయంలోనూ వెనకడుగు వేశారని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు,ఆతర్వాత జిల్లాలలో బహిరంగ సభలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా టీఆర్ఎస్/ బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్ధి బీజేపీనే అనే విషయంలో క్లారిటీ వచ్చిన నేపధ్యంలో కేంద్రం, బీజేపీ పై యుద్ధం కొనసాగుతుందని అంటున్నారు.

కౌన్ బనేగా ఏపీ ‘సీఎస్’ ఆఖరిక్షణంలో కొత్త ట్విస్ట్

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్‌శర్మ పదవీ కాలం  నవంబర్ 30తో ముగుస్తుంది. ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపధ్యంలో  డిసెంబరు 1వ తేదీ బాధ్యతలు చేపట్టే కొత్త సీఎస్ ఎవరు? అనే విషయంలో, ఇటు రాజకీయ వర్గాల్లో, అటు అధికార వర్గాల్లోనూ గత కొంత కాలంగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి,  కొన్ని పేర్లు వినిపించినా ముందునుంచి సీనియర్ ఐఎఎస్ జవహర్‌రెడ్డి రేస్ లో ముందున్నారు. ఆయన నియామకం ఇంచుమించుగా ఖరారు అయిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే, ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని, అందరూ భావిస్తున్న సమయంలో,కొత్తగా మరో పేరు తెర మీదకు వచ్చింది.  అయితే ముందు నుంచి జవహర్ రెడ్డి వైపే మొగ్గుచూపిన ముఖ్యమంత్రి ఆఖరి క్షణంలో  పునరాలోచన చేయడం వెనక ఉన్న కారణం ఏమిటనే విషయంలో  భిన్న అభిప్రాయలు వ్యక్త మవుతున్నాయి. అయితే, ముఖ్యమంత్రి మనసు మార్చుకోవడం వెనక ఇంకా ఇతర కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ  ప్రధానంగా, జవహర్ ‘రెడ్డి’ పేరే కారణం అంటున్నారు. ప్రభుత్వంలో రెడ్డి వాసన తగ్గించేందుకు ముఖ్యమంత్రి సమీర్ ‘రెడ్డి’ నియామకం విషయంలో పునరాలోచన చేస్తున్నారని అంటున్నారు. పార్టీ పదవుల విషయంలోనూ ముఖ్యమంత్రి కొంత మేరకు రెడ్డి ట్యాగ్ ప్రాధాన్యత తగ్గించి, బీసీలకు పార్టీ పదవుల్లో కొంచెం ఎత్తు పీట వేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.   అదలా ఉంటే, సీఎస్ రేసులో కొత్తగా కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణే పేరు వినిపిస్తోంది. 1988 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అరమణే  ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్రం రక్షణశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన్ను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలుస్తోంది. మరోవంక, గిరిధర్‌ అరమణే   శనివారం(నవంబర్26)  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో భేటీ అయ్యారు. కొత్త సీఎస్‌ నియామకంపై కసరత్తు జరుగుతున్న సమయంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.    ఆంధ్రప్రదేశ్ కేడర్‌ కు చెందిన ఐఎఎస్ అధికారుల సీనియార్టీ  జాబితాలో గిరిధర్‌ అరమణే రెండో స్థానంలో ఉన్నారు. గిరిధర్ అరమణే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడితే 2023 జూన్‌ 30 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఈనెల 30న పదవీ విరమణ చేయబోతున్నారు. డిసెంబరు 1వ తేదీ నుంచి కొత్త సీఎస్ బాధ్యతలు చేపట్టాల్సిఉంటుంది. సో.. కొత్త సీఎస్‌ నియామకంపై నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.  నిజానికి, ముఖ్యమంత్రి ఫస్ట్ ఛాయస్ ‘రెడ్డి’ అందులో సందేహం లేదు. అందుకే, ముందు నుంచి, ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రెటరీగా ఉన్న జవహర్‌రెడ్డి పేరు మాత్రమే ప్రముఖంగా వినిపించింది. అయితే  వచ్చేది ఎన్నికల సంవత్సరం  కాబట్టి ఆ దిశగానే నియామకం ఉంటుందని అంటున్నారు. అయితే అదే సమయంలో అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఖచ్చితంగా ‘కౌన్ బనేగా సీఎస్’ సస్పెన్స్ కొనసాగుతుందనీ అంటున్నారు. అయినా, మరి కొద్ది గంటల్లోనే అధికారిక ప్రకటన వెలువడనున్న నేపధ్యంలో తినబోతూ రుచులెందుకు అంటూ ఐఎఎస్ అధికారులు గుంభనంగా ఉంటున్నారు. కొస మెరుపుగా, రెడ్డి ఛాయస్ కు అడ్డు పడింది ఎవరు? అనే చర్చ కూడా అధికార, రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. ఇంతకాలం  ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి పూర్తి స్వేఛ్చ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఆయనకు ముకుతాడు బిగించేందుకు, గిరిధర్‌ అరమణేను రాష్ట్రానికి పంపుతోందా  అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే  కేంద్రం కావాలనే గిరిధర్‌ అరమణే పేరును తెర మీదకు తెచ్చిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదైనా, సీఎస్ ఎవరైనా, అన్ని విధాలా పట్టాలు తప్పిన ఏపీ సర్కార్ ను మళ్ళీ పట్టాల మీదకు తీసుకురావడం, అయ్యే పని కాదనే, ఐఎఎస్ లు అంటున్నారు. అవును ఐఎఎస్ లే కాదు, సామాన్య  ప్రజలు కూడా రాష్ట్రానికి మళ్ళీ  మంచి రోజులు రావాలంటే, మళ్ళీ చంద్రబాబు రావాలని అంటున్నారు.

మూఢ భక్తి పాడుగానూ.. పామును వెక్కిరిస్తే ఊరుకుంటుందా?

మూఢనమ్మకాలు ఒక్కోసారి ప్రాణం మీదకు తీసుకువస్తాయి. నిద్రలో పీడకలలు వస్తున్నాయని జ్యోతిష్యుడిని ఆశ్రయించిన ఓ వ్యక్తి ఆ జ్యోతిషుడు ఇచ్చిన సలహాను పాటించి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అదృష్టం బాగుండి బతికి బయటపడడమైతే పడ్డాడు కానీ.. మూఢనమ్మకమే ప్రాణం మీదకు తెచ్చిందని తెలుసుకున్నాడో లేదో. కలలను కూడా శాస్త్రీయంగా విశ్లేషించి పీడకలల బారి నుంచి విముక్తి కలిగించేందుకు కౌన్సెలింగ్  ఇచ్చే కేంద్రాలున్నాయి. కానీ ఈ కాలంలో కూడా పీడకలలు చేటు చేస్తాయని నమ్మే వ్యక్తులు ఉన్నారనడానికి తమిళనాడుకు చెందిన రాజాయే నిదర్శనం.    గోపిచెట్టిపాళయంకు చెందిన రాజా ఒక రైతు  రాజాకు ఇటీవల తరచూ..  పాము కాటు కల వస్తుండటంతో భయపడి ఓ జ్యోతిష్యుడిని ఆశ్రయించాడు. అతడి సలహా మేరకు రాజా పాములపుట్ట ఉన్న ఓ అలయానికి వెళ్లి పుట్టకు పూజలు చేసి పాములా మూడు సార్లు నాలుక బయటకు చాపాడు. అంత వరకూ బానే ఉంది.. కానీ ఆ పుట్టలో ఉన్న పాము రాజా నాలుకపై కాటేసింది. వెంటనే ఆలయ పూజారి, రాజా కుటుంబ సభ్యులు పాము కాటువేసిన ప్రాంతంలో నాలుకను కోసివేసి.. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు.   ఆస్పత్రిలో వైద్యులు సగం తెగిపోయిన నాలుకకు చికిత్స చేసి.. పాము విషానికి విరుగుడు  ఇంజెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు.  మూఢ నమ్మకాలు ఎంత ప్రమాదమో ఇప్పుడు రాజుకు తెలిసి వచ్చి ఉంటుంది.  

హీరోయిన్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసి..

హీరోయిన్లు, యాంకర్లను టార్గెట్ చేసుకుని వాళ్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కోనసీమ జిల్లాకు చెందిన పందిరి వెంటక వీర్రాజుగా గుర్తించారు. యాంకర్ అనసూయ ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి అసభ్య క్యాప్షన్స్ పెడుతూ వేధింపులకు గురి చేయడంతో పాటు, ఆమె వ్యక్తిగత జీవితంపైనా అభ్యంతరకర కామెంట్లు చేస్తుండటంతో కొద్ది కాలం కిందట అనసూయ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ లు మారుస్తుండటంతో పందిరి వెంకట వీర్రాజు అంత తేలికగా దొరకలేదు. కోనసీమలోని అతడి స్వగ్రామం ట్రేస్ చేసి దాదాపు వారం రోజుల పాటు నిఘా వేసి ఎట్టకేలకు అతడిని  అరెస్టు చేశారు. మార్ఫింగ్ ఫొటోలతో ఒక్క అనసూయనే కాకుండా అతడు కొందరు స్టార్ హీరోయిన్లు సహా మొత్తం 267 మంది హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ ట్విట్టర్ అక్కౌంట్ నుంచి అసభ్య వ్యాఖ్యలతో పోస్టు చేసినట్లు పోలీసులు కనుగోన్నారు. 

డీజిల్ అయిపోయింది..అంబులెన్స్ ఆగిపోయింది.. రోగి ప్రాణం పోయింది!

ఆరోగ్య సేవల విషయంలో నిర్లక్ష్యం కారణంగా రోగి నిండు ప్రాణం బలైపోయిన సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలించడానికి వచ్చిన అంబులెన్స్ లో మార్గ మధ్యంలో డీజిల్ అయిపోయి ఆగిపోయింది. దీంతో రోగి బంధువులు అంబులెన్సును దాదాపుకిలో మీటర్ దూరం తోసుకుని వెళ్లి డీజిల్ కొట్టించారు. అయినా ఆ అంబులెన్స్ కదల లేదు. దీంతో మరో అంబులెన్స్ కు ఫోన్ చేసి అది వచ్చి ఆసుపత్రికి తరలించేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. రోగి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. రాజస్థాన్ లోని దానాపూర్ గ్రామానికి చెందిన తేజియా పొలంలో పని చేస్తుండగా ఒక్కసారిగా అనారోగ్యంతో కుప్పకూలిపోయాడు. దీంతో  బంధువులు అంబులెన్సుకు కాల్ చేసి దానిలో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో డీజిల్ అయిపోయి అంబులెన్స్ ఆగిపోయింది. అక్కడికి  కిలోమీటర్ దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ వరకూ అంబులెన్సును బంధువులు తోసుకుంటూ తీసుకెళ్లారు. అక్కడ డీజిల్ కొట్టించినా అంబులెన్స్ కదలలేదు. మొరాయించింది. దీంతో చేసేది లేక మరో అంబులెన్స్ ను పిలిపించుకుని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తేజను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తేజ బంధువులు అంబులెన్స్ ను తోసుకువెళుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.  ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు అవసరమైన రోగులను ఆసుపత్రికి తీసుకువెళ్లే అంబులెన్స్ లో డీజల్ ఉందో లేదో చూసుకోనంత అధ్వానంగా వాటి సేవలు ఉన్నాయని నెటిజన్లు మండి పడుతున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సులే నాణ్యతా లోపాలతో, సేవా లోపాలతో రోగుల ప్రాణాలు తీస్తున్నాయని మండిపడుతున్నారు. అంబులెన్స్ మార్గమధ్యంలో మెరాయించకుండా ఉంటే రోగి బతికేవాడని అంటున్నారు.   

ఫ్యాను’ నీడకు ‘గంటా’..!?

ఏ ఎండకు ఆ గొడుగు అన్న సామెతకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా సరైన ఉదాహరణ అని చెప్పవచ్చు. ఎన్నో పార్టీలు మారి, చివరికి తన నీడన చేరిన గంటా శ్రీనివాసరావును ఆదరించి, ఎంపీని చేసి, మంత్ర పదవులు ఇచ్చి గుర్తింపు ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల విశ్వాసం, కృతజ్ఞత లేకుండా ఇప్పుడు పార్టీ మారుతున్నారంటూ వార్తలు రావడం గమనార్హం. అది కూడా తెలుగుదేశం పార్టీకి ఆగర్భ శత్రువైన వైసీపీ పంచన చేరేందుకు గంటా రెడీ అవుతుండడం దారుణం అంటున్నారు.  గంటా శ్రీనివాసరావుకు రాజకీయ భిక్షపెట్టింది తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే. 1999లో టీడీపీలో చేరడం ద్వారా రాజకీయాల్లో ప్రవేశించి, తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి లోక్ సభా స్థానం నుంచి ఎన్నికయ్యారు గంటా. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో గంటాకు మంత్రి పదవి దక్కింది. ఇక 2014 ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీలో చేరి భీమిలి నుంచి శాసనసభ్యుడిగా గెలిచిన గంటాకు చంద్రబాబు నాయుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ, ప్రాథమిక, సెకండరీ, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల మంత్రిగా అవకాశం కల్పించారు. అలా చంద్రబాబు దయతో రాజకీయంగా  పలుకుబడి సంపాదించుకున్న గంటా శ్రీనివాసరావు అడుగులు ఇప్పుడు వైసీపీ వైపు వేస్తున్నారనే వార్తలు రావడం సంచలనం అవుతోందంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఇటీవలే తన బంధువులు, సన్నిహితులతో చర్చించి, పార్టీ మారే విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వైసీపీ పెద్దల నుంచి కూడా గంటాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.  డిసెంబర్ 1 గంటా బర్త్ డే. ఆ తర్వాత వైసీపీలో చేరాలని గంటా ముహూర్తం పెట్టుకున్నారనే లీకులు ఆయన సన్నిహితుల నుంచి వస్తుండడం గమనార్హం. డిసెంబర్ మూడో వారంలో విశాఖపట్నంలో జరిగే జగన్ సభ సందర్భంగా వైసీపీ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. జగన్ రెండో కేబినెట్ లో మంత్రి పదవి కోల్పోయిన అవంతి శ్రీనివాసరావు వైసీపీలో గంటా చేరికను తీవ్రంగా వ్యతిరేకించడం వల్లనే గంటా చేరిక ఆలస్యమైందని కూడా అంటున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, విశాఖలో పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్న విజయసాయిరెడ్డి కూడా గంటా చేరికకు అడ్డంకులు పెట్టారంటారు. ఇప్పుడు వారిద్దరి మాటా పార్టీలో అంతగా చెల్లని పరిస్థితి రావడంతో  పాటు.. గంటాకు సన్నిహితుడైన పంచకర్ల రమేష్ బాబు తాజాగా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడయ్యారు. దీంతో గంటా వైసీపీ చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారనే అంచనాలు వస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో చేరుతున్నారంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. రాజకీయంగా కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న గంటీ జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ గాడ్ ఫాదర్ చిరంజీవిని కలిశారు. అయినప్పటికీ జనసేనలో చేరకుండా ఇప్పుడు వైసీపీ వైపు ఎందుకు చూస్తున్నారనేది అంతు చిక్కడం లేదంటున్నారు. 

తెలుగుదేశం నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై హత్యాయత్నం

ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. ఎవరికీ రక్షణ లేని వాతావరణం నెలకొని ఉంది. తెలుగుదేశం నాయకుడు, నెల్లూరు సిటీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిపై శనివారం హత్యాయత్నం జరిగింది. నాగ వెంకట రాజశేఖరరెడ్డి అనే వ్యక్తి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని ఉద్దేశ పూర్వకంగా కారుతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో కోటంరెడ్డికి గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కారుతో ఢీకొట్టిన యువకుడు పరారయ్యాడు. ఈ దాడికి కారణం తెలియాల్సి ఉంది. ఆ యువకుడు నేరుగా కోటంరెడ్డి నివాసానికి వచ్చి వాగ్వాదానికి దిగాడనీ, తొలుత కోటంరెడ్డి కుమారుడితో గొడవపడ్డాడని చెబుతున్నారు. అనంతరం సర్ది చెప్పి ఆ యువకుడిని కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి పంపించేశాడని అంటున్నారు. వెళ్లినట్టే వెళ్లిన యువకుడు రివర్స్ లో కారులో వచ్చి కోటంరెడ్డిని ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టి పరారయ్యడు.    ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటం రెడ్డిని తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ఘటనకు గల కారణాలను ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మాజీ మంత్రి సోమినేని చంద్రమోహన్‌ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. కోటం రెడ్డికి తృటిలో ప్రాణాపాయం తప్పిందనీ ....కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇంటికి వచ్చి, వార్నింగ్ ఇచ్చిమరీ కారుతో ఢీ కొట్టడంపై అనుమానాలున్నాయనీ సోమిరెడ్డి అన్నారు. కాగా ఈ ఘటనలో కోటంరెడ్డి కాలు ఫ్రాక్చర్ అయిందనీ, దాడి వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. నెల్లూరు జిల్లాను వైసీపీ నేతలు డ్రగ్స్ అడ్డాగా మార్చేశారన్నారు.  రాజశేఖరరెడ్డి కారు వెనుక మరో కారు కూడా ఉందని చెబుతున్నారు. అది ఎవరిదనేది ట్రేస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇంటికి వచ్చి మరీ కారుతో ఢీ కొట్టిన రాజశేఖరరెడ్డి తీరు అనుమానాస్పదంగా ఉందని కోటంరెడ్డి కుటుంబీకులు చెబుతున్నారు. మద్యం మత్తులో ఉన్నాడనీ పేర్కొన్నారు.