ఏపీ శాసనసభ సమావేశాలలో వైకాపా రభస
posted on Aug 18, 2014 @ 11:07AM
కొద్ది సేపటి క్రితం మొదలయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వైకాపా సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో ఇప్పటికి రెండు సార్లు వాయిదాపడి, మళ్ళీ మూడవసారి మొదలయ్యాయి. కానీ వైకాపా సభ్యులు సభను కొనసాగనివ్వడం లేదు. రాష్ట్రంలో క్షీణిస్తున్నశాంతి భద్రతలపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై స్పీకర్ చర్చకు అంగీకరించేవరకు తమ ఆందోళన విరమించమని వైకాపా స్పష్టం చేసింది. వారి ఆందోళన నడుమే స్పీకర్ సభా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార తెదేపా హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని వైకాపా నేత శ్రీకాంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు మంత్రి అచ్చెం నాయుడు అంతే ధీటుగా బదులిస్తూ ఆపని చేసినవారే ప్రభుత్వాన్ని నిందించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని ఎద్దేవా చేసారు. ప్రస్తుతం రాష్ట్రం ఒక సంధి దశలో ఉంది. అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఈ సమస్యలన్నిటిపై అధికార, ప్రతిక్ష పార్టీలు శాసనసభలో చర్చించి, వాటి పరిష్కారం కోసం ప్రయత్నించవలసి ఉంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 12వరకు జరగవలసి ఉండగా, తెలంగాణా రాష్ట్ర శాసనసభ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని ఈనెల 6వ తేదీతోనే ముగిస్తున్నారు. జీరో అవర్లో దానిపై చర్చకు స్పీకర్ అనుమతించినప్పటికీ విలువయిన కొద్దిపాటి సమయాన్ని హత్యారాజకీయాలపై చర్చజరగాలంటూ వైకాపా సభను స్తంభింపజేయడం చాలా అనుచితం.