తెలంగాణలో పేకాట క్లబ్‌లు ఉండకూడదు: కేసీఆర్

  తెలంగాణలో పేకాట క్లబ్ అనే మాటే వినపడకుండా తమ ప్రభుత్వం చేస్తుందని, ఈ విషయంలో పోలీసులు కూడా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఏర్పడాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖకు మూడు వందల బైక్‌లు వంద ఇన్నోవా వాహనాలను కేసీఆర్ హైదరాబాద్‌లోని టాంక్ బండ్ మీద జరిగిన ఒక కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ హైదరాబాద్ భద్రత విషయంలో తమ ప్రభుత్వ ఆలోచనలను తెలిపారు.   1. హైదరాబాద్ నగరం అంతటా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నాం. అవి మూడు నెలలో పనిచేయడం ప్రారంభిస్తాయి.   2. అత్యాధునిక సౌకర్యాలతో పోలీసు హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తాం.   3. తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తాం. 4. హైదరాబాద్‌లో పేకాట   క్లబ్ అనే మాటే వినపడకుండా చేస్తాం.   5. పోలీసులు స్టేషన్ పరిధులతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయాలి.

అమీర్‌ఖాన్ ‘పీకే’ పోస్టర్ కేసు.. కొట్టేసిన సుప్రీం కోర్టు...

  అమీర్‌ఖాన్ తాజా చిత్రం ‘పీకే’కి సంబంధించిన పోస్టర్ విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నగ్నంగా వున్న అమీర్‌ఖాన్ అవసరమైన చోట ఒక పాత మోడల్ టేప్ రికార్డర్ని అడ్డం పెట్టుకుని వుంటాడు. ఈ పోస్టర్ ఎంత సంచలనం సృష్టించిందో అంతే వివాదాస్పదం కూడా అయింది. ఈ పోస్టర్ మీద, ఈ సినిమా మీద సుప్రీం కోర్టులో కేసు నమోదు అయింది. ఈ సినిమా మీద రకరకాల ఆరోపణలు చేస్తూ, ‘పీకే’ సినిమా విడుదలను నిలిపివేయాలని సదరు పిటిషన్లు కోరాయి. అయితే గురువారం నాడు సుప్రీం కోర్టు ఆ కేసులు అన్నిటినీ కొట్టేసింది. కళలు, వినోదం విషయంలో సుప్రీం కోర్టు జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది. సదరు సినిమా చూడటం ఇష్టం లేనివాళ్ళు చూడకుండా వుండొచచని, విడుదల ఆపాలనడం మాత్రం న్యాయం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సినిమా విడుదలను ఆపితే నిర్మాత హక్కులకు భంగం కలుగుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా.. మొత్తుకుంటున్న జైరాం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించేసిన మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్‌కి ఇంతకాలం తర్వాత సడెన్‌గా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వదని ఆయనకి అనుమానం వచ్చేసింది. దాంతో ఆయన తెగ బాధపడిపోతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం లేనట్టు కనబడుతోందన్న సందేహాన్ని జైరాం రమేష్ ఆ లేఖలో వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అర్జెంటుగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా విషయమై జైరాం రమేష్‌కు ఇటీవల ప్రణాళిక, పథకాల అమలు శాఖ మంత్రి ఓ లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై ప్రణాళిక సంఘంలో ఓ ప్రత్యేక విభాగం పనిచేస్తోందని తెలిపారు. అయినప్పటికీ జైరాం రమేష్ కేంద్రానికి లేఖ రాసి తన మంచితనం చాటుకునే ప్రయత్నం చేశారు.

సమగ్ర కుటుంబ సర్వే నోటిఫికేషన్ జారీ...

  ఆగస్టు 19న తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఒకే రోజు 79లక్షల 55 వేల 673 కుటుంబాల సర్వే నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సర్వేలో 2 లక్షల 94 వేల 830 మంది ఎన్యూమరేటర్స్ పాల్గొంటారని, సర్వేలో పాల్గొనే ఉద్యోగులకు ప్రజలు కచ్చితమైన ఆధారాలు చూపాలని పేర్కొన్నారు. సర్వే నిర్వహించిన రెండు వారాలలోగా డాటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని, హైదరాబాద్ మినహాయించి 9 జిల్లాల్లో 14 వేల డాటా ఎంట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. సర్వేకు సంబంధించిన పూర్తి డాటా ఎంట్రీ సెప్టెంబర్ 4వ తేదీకి పూర్తి చేయాలని, పూర్తి చేసిన సర్వే వివరాలపై సెప్టెంబర్ 10 నుంచి స్కూట్న్రీ జరుగుతోందని పేర్కొన్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 30 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉండగా, వారికి ఒక్కొక్క బుక్‌లెట్‌లో పది ఫారాలు అదనంగా చేర్చి మొత్తం 30 సర్వే ఫారాలను ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో సర్వే ఫారాలు ఇంగ్లీష్‌లో, గ్రామీణ ప్రాంతాలలో తెలుగులో వుంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

పంద్రాగస్టు: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటి స్వాతంత్ర్య దినోత్సవాన్ని గోల్కొండ కోట మీద నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. గోల్కొండ కోటను ఇప్పటికే సర్వాంగ సుందరంగా అలంకరించారు. భద్రతా బలగాలు ఇప్పటికే గోల్కొండ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఇదిలా వుంటే, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం నాడు సాయుధ బలగాలు రిహార్సల్ చేశాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మూడు రూట్లలో గోల్కొండ కోటకు వివిఐపిలు, విఐపిలను అనుమతించేందుకు వీలుగా ప్రత్యేకంగా పాస్‌లను జారీ చేసి, వారి వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాలను కూడా కేటాయించినట్లు మహేందర్‌రెడ్డి వివరించారు. పంద్రాగస్టు రోజున ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు హైదరాబాద్ నగరంలో, గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయని ఆయన తెలిపారు.

నరేంద్రమోడీ సమర్థుడు: అమెరికా

  నరేంద్రమోడీ సమర్థుడైన పాలకుడు అని అమెరికా ప్రతినిధుల సభ పేర్కొంది. గడచిన 30 ఏళ్ళలో లేనివిధంగా భారతదేశంలో పూర్తి మెజారిటీ సాధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ సమర్థ పాలకుడని.. భారత్-అమెరికాల మధ్య ఆయన నవీన సంబంధాలను నెలకొల్పగలరని అమెరికా ప్రతినిధుల సభ పేర్కొంది. నరేంద్ర మోడీ హయాంలో భారత్ - అమెరికా దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగవుతాయని.. వాణిజ్యం, రక్షణ సహకారం బలోపేతమవుతుందన్న ఆశాభావాన్ని అమెరికా ప్రతినిధుల సభ వ్యక్తం చేసింది. త్వరలో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో... ఆ దేశ ప్రతినిధుల సభ ఒక నివేదికను రూపొందించింది. దానిని సభ్యులకు అందజేసింది.

‘సర్వే’పై నేడు హైకోర్టు విచారణ

  తెలంగాణ ప్రభుత్వం ఈనెల 19న సమగ్ర కుటుంబ సర్వే చేయాలని నిర్ణయించిన విషయం తెలిసింది. ఈ సర్వే గణాంకాల సేకరణ చట్టానికి విరుద్ధంగా వుందని, దీనిని నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరుగుతుంది. ఈ కేసు బుధవారం నాడే కోర్టు ముందుకు వచ్చింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని హై కోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని అడిగినప్పుడు ప్రభుత్వ న్యాయవాది సర్వేకి సంబంధించి ఇంకా సవరణలు వున్నాయని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించబోయే సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు, సవరణలతో గురువారం నాడు కోర్టుకు రావాలని ఆదేశాలు జారీ చేస్తూ, హైకోర్టు కేసును వాయిదా వేసింది. ఈ కేసును న్యాయమూర్తి జస్టిస్ అఫ్జల్ విలాస్ పుర్కర్ విచారణ చేస్తున్నారు.

పట్టు విడిచిన కేసీఆర్.. మెట్రో పనులు చకచక...

  హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో పట్టుదలగా వున్న కేసీఆర్ తన పట్టుదలను సడలించినట్టు కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మెట్రో రైలు లైనులు భూ గర్భంలోంచి వేయాలని కేసీఆర్ కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థకు సూచించారు. అయితే ఎల్ అండ్ టీ సంస్థ అందుకు అవకాశం లేదని తెలిపింది. అయితే కేసీఆర్ అందుకు అంగీకరించకపోవడంతో మెట్రో పనుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజీకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. బుధవారం నాడు ఏర్పాటు చేసిన మెట్రో రైలు సమీక్షా సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పోలీసులతో సమన్వయం చేసుకుని మెట్రో రైలు పనులు సాగించాలని ఆయన ఆదేశించారు. ఎల్ అండ్ టీ ఛైర్మన్ గాడ్గిల్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మెట్రో రైలు భూగర్భ లైను గురించి కేసీఆర్ ప్రస్తావించనట్టు తెలుస్తోంది. అంటే ఈ విషయంలో కేసీఆర్ తన పట్టు సడలించినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే మెట్రో రైలు ట్రైల్ రన్ కూడా జరిగింది.

సంపులో పడి బాలుడు మృతి

  ప్లే స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ళ బాలుడు నీటి సంపులో పడి మరణించాడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఈ దారుణం జరిగింది. వనస్థలిపురంలోని ఓ ప్లే స్కూల్‌లో వచన్ రెండున్నరేళ్ళ బాలుడిని తల్లిదండ్రులు చేర్పించారు. బుధవారం ఉదయం వచన్ స్కూలు సంపులో పడిపోయాడు. అయితే ఆ విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో బాలుడు మరణించాడు. ఆ తర్వాత గుర్తించిన స్కూలు యాజమాన్యం వచన్‌ని ఆస్పత్రికి తీసుకెళ్ళినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. స్కూలు యజమానులు స్కూలుకు తాళం వేసి పారిపోయారు.

లోక్‌సభలో పోలవరంపై ప్రకటన...

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి వుంది ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించినా ఆ దిశగా ముందుకు వెళ్తోంది. ఇటీవలే పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టిస్తున్నప్పటికీ రాజీపడకుండా ముందుకు వెళ్తోంది. తాజాగా బుధవారం నాడు లోక్ సభలో ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 276, ఒరిస్సాలోని 8, ఛత్తీస్‌ఘడ్‌లోని 4 గ్రామాలు ముంపుకు గురవుతాయని ఆయన లోక్ సభలో ప్రకటించారు. అలాగే మొత్తం 3,427 హెక్టార్ట అటవీ భూమి కూడా మునిగిపోతుందని లోక్‌సభకు తెలిపారు.

హై కోర్టులో సమగ్ర సర్వే కేసు... రేపటికి వాయిదా...

  ఈనెల 19వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన సమగ్ర సర్వే మీద అనేక వివాదాలు ముసురుకున్నాయి. తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలతోపాటు తెలంగాణ ప్రజలు కూడా ఈ సర్వేని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద హైదరాబాద్‌ హైకోర్టులో దాఖలైన పిటిషన్ మీద బుధవారం నాడు విచారణ జరిగింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని హై కోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని అడిగినప్పుడు ప్రభుత్వ న్యాయవాది సర్వేకి సంబంధించి ఇంకా సవరణలు వున్నాయని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించబోయే సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు, సవరణలతో గురువారం నాడు కోర్టుకు రావాలని ఆదేశాలు జారీ చేస్తూ, హైకోర్టు కేసును వాయిదా వేసింది.

నగ్నంగా ఊరేగించారు.. దారుణం...

  చేతబడి చేస్తోందన్న ఆరోపణలతో బీహార్‌లో ఓ యువతిని నగ్నంగా ఊరేగించారు. బీహార్‌లోని కతిహార్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. కనియాదేవి అనే యువతిని గ్రామస్థులంతా తిట్టి, కొట్టి, ఆమెను తీవ్రంగా అవమానించారు. గ్రామంలో ఓ బాలుడు మరణించడంతో ఈమే చేతబడి చేసిందన్న అనుమానంతో ఈ పనికి పాల్పడ్డారు. ఈ కేసులో ఆరుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. నిందితులలో ఒకరిని అరెస్టు చేశారు. బీహార్లోని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై చేతబడి ముద్ర వేసి వారిని చిత్రహింసలు పెట్టడం ఎప్పటినుంచో ఉంది. దీనిపై కఠిన చట్టాలు చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఎప్పుడో ప్రతిపాదించింది. బీహార్ మానవహక్కుల కమిషన్ కూడా దీనిపై స్పందించింది.