ఎన్టీఆర్ పుట్ట‌క‌ పోయి ఉంటే!?

ఎన్టీఆర్ పుట్ట‌క పోయి ఉంటే సినిమాల్లో మ‌న‌కు స్టార్ డ‌మ్ ఎలాంటిదో   తెలిసేది కాదేమో. ఆనాటికి తెలుగు చిత్ర సీమ‌కు అతి పెద్ద హీరో చిత్తూరు నాగ‌య్య‌..  అప్ప‌ట్లో ఇటు చారిత్రక అటు పౌరాణిక అంటూ ఏ పాత్ర చేయాల్సి వ‌చ్చినా ఆయ‌నే చేసేవారు. ఎప్పుడైతే  ఎన్టీఆర్ పాతాళ భైర‌వి(1951) అనే ఒక సినిమా చేశారో ఆనాటి నుంచి తెలుగు చిత్ర సీమ డైన‌మిక్స్ మొత్తం ఛేంజ్ అయిపోయాయి. అప్ప‌టి  నుంచి ఎన్టీఆర్- ఎన్టీఆర్- ఎన్టీఆర్.. ఎటు చూసినా ఎన్టీఆర్ నామ జ‌పం  మొద‌లైంది.  చుక్క‌లు చాలానే ఉంటాయ్.. కానీ చంద్రుడొక్క‌డే అన్న‌ట్టు.. న‌టులు చాలా మందే ఉంటారు కానీ వాళ్ల‌లో మాత్రం మ‌హాన‌టుడు ఎన్టీఆర్ ఒక్క‌డే అన్న‌ట్టుగా త‌యారైంది  ప‌రిస్థితి.

ఇక రెండో విష‌యం ఏంటంటే రాముడు- కృష్ణుడు- రావ‌ణాస‌ురుడు- ధుర్యోధ‌నుడు- క‌ర్ణ‌- భిష్మ వంటి ప‌లు పౌరాణిక చిత్రాలు చేయ‌డం మాత్ర‌మే కాకుండా ఆనాటి మాస్ జ‌నాల ద‌గ్గ‌ర‌కు క్లాసిక్స్ అయిన రామాయ‌ణ,  మ‌హాభార‌తాల‌ను తీసుకెళ్లిన ఘ‌న‌త కూడా ఎన్టీఆర్ దే.  ఒక వేళ ఎన్టీఆర్ పుట్ట‌క పోయి ఉంటే..  కొంద‌రికి రాముడు, కృష్ణుడు ఎలా ఉండేవారో అస్స‌లు తెలియ‌క పోయేదేమో. అంత‌గా ఆయ‌న ఆయా పాత్ర‌ల‌కు జీవం పోశారు. ఎంతైనా ఇది తెలుగు వారు మాత్ర‌మే చేసుకున్న అదృష్ట‌మ‌ని చెప్పాల్సి  ఉంటుంది.

1928 మే 28న నిమ్మ‌కూరులో పుట్టిన ఎన్టీఆర్ కి మొద‌ట పెట్టాల‌నుకున్న పేరు కృష్ణ‌. బిడ్డ చూడ్డానికి బాల‌కృష్ణుడిలా ఉన్నాడనుకున్న త‌ల్లి వెంక‌ట‌రామ‌మ్మ‌  ముచ్చ‌ట ఆ నాడు తీర‌లేదు. మేన‌మామ వ‌చ్చి తార‌క రాముడ‌న్న పేరైతే బాగుంటుంద‌ని అనే స‌రికి.. ఆ మ‌హాత‌ల్లి త‌న సోద‌రుడి మాట కాద‌న‌లేక‌.. పెట్టిన పేరు తార‌క రామారావు.  కృష్ణ అని త‌న త‌ల్లి పేరు పెట్ట‌లేక పోయింది. ఆమె ముచ్చ‌ట ఎలాగైనా స‌రే తీర్చాల‌నుకున్నారో ఏమో ఎన్టీవోడు ఏకంగా 18 సార్లు శ్రీకృష్ణుడి వేషం ధ‌రించి.. ఇటు ఆ పాత్ర‌కు వ‌న్నె తేవ‌డం మాత్ర‌మే కాదు.. అటు తెలుగు ప్రేక్ష‌క‌జ‌నుల‌ను ఎంత‌గానో అల‌రించారు.  ఇదిలా ఉంటే ఇదే అంశం మీద మ‌నం గుర్తించాల్సిన  మ‌రో అంశ‌మేంటంటే.. ఎన్టీఆర్ త‌న పిల్ల‌ల్లో అంద‌రి పేర్ల‌కు కృష్ణ అన్న ప‌దం చేర్చి మ‌రీ పెట్ట‌డం వెన‌క ఆ నాడు త‌న త‌ల్లి త‌న‌కు కృష్ణ అన్న పేరు పెట్టలేక పోవ‌డ‌మే అన్న న‌మ్మ‌కాలుండొచ్చ‌నీ అంటారు.  అందుకే తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం కాగా. ఆ పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. కుమారుల పేర్లు ఏంట‌ని చూస్తే.. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కాగా.. లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తెల పేర్లు. అలా ఎన్టీఆర్ త‌న త‌ల్లి.. కృష్ణ అన్న పేరు పెట్టలేక పోయింద‌న్న బాధ‌ను తుడిచేస్తూ ఆ పేరు త‌న పిల్ల‌ల‌కు పెట్టి.. ఆమె క‌న్న‌రుణం తీర్చుకున్నారా అనిపిస్తుంది.   

త‌ర్వాత చెప్ప‌పుకోద‌గ్గ విష‌య‌మేంటంటే.. పారితోష‌కం.  అత్య‌ధిక పారితోష‌కం అందుకున్న తొలి త‌రం న‌టుల్లో ఎన్టీఆరే ముందుండేవారు. ఆయ‌న తొలి  నాళ్ల‌లో అంటే 1951 నుంచి మొద‌లైన స్టార్ డ‌మ్ ద్వారా ఆయ‌న నెల‌కు 500 నుంచి 5 వేల వ‌ర‌కూ జీతం తీసుకునేవారు. 1956లో విడుద‌లైన మాయా బ‌జార్ లో ఏకంగా 7500 రూపాయ‌లు తీసుకోవ‌డం.. అప్ప‌ట్లో అది అతి పెద్ద పారితోష‌కం.  సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవారు ఎన్టీఆర్. 1963 లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరాల వరకు  పారితోషికం నాలుగైదు అంకెల్లోనే ఉండేది. 1972 నుంచి ఎన్టీఆర్ పారితోషికం లక్షల్లోకి చేరింది. ఇది కూడా అప్ప‌ట్లో ఒక రికార్డే. అంటే పారితోష‌కంలో ఒక ట్రెండ్ సెట్ చేసింది కూడా ఎన్టీఆరేన‌ని చెప్పాలి.  యాక్టింగ్ తో ఒక స్టార్ డ‌మ్ క్రియేట్ చేయ‌డం  అత్యంత  ప్ర‌జాద‌ర‌ణ  పొంద‌డం.  సినిమా తీస్తే ఎన్టీఆర్ తోనే తీయాల‌న్న ఆలోచ‌న కొద్దీ నిర్మాత‌లు ఎగ‌బ‌డడం.. పారితోష‌కం అంత‌కంత‌కూ పెరుగుద‌ల అనే ప‌రిణామ క్ర‌మాన్ని తెలుగు సినీ ప‌రిశ్ర‌మ చూసింది కూడా ఎన్టీఆర్ ద్వారానే.

ద్విపాత్రాభిన‌యం, త్రిపాత్రాభిన‌యం, పంచ‌పాత్రాభిన‌యం ఇలా ఎన్టీఆర్ ఇక్క‌డా ఒక‌ ట్రెండ్ సెట్ చేశారు. రాముడు- భీముడితో మొద‌లైన ఈ ప‌రంప‌ర త‌ర్వాతి కాలంలో.. దాన వీర శూర క‌ర్ణ లో త్రిపాత్రాభిన‌యం, శ్రీమ‌ద్విరాట ప‌ర్వంలో ఐదు పాత్ర‌ల పోష‌ణ.. ఇలా ఈ విష‌యంలోనూ  ట్రెండ్ సెట్ట‌ర్ ఎన్టీఆరే. ఒక న‌టుడిగా ఉండి ద‌ర్శ‌క‌త్వంలోకి ప్ర‌వేశించిన తొలి త‌రం న‌టుల్లోనూ ఎన్టీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. కొంద‌రు ఇది వ‌ర‌కే ఉన్నా..   స్టోరీ- స్క్రీన్ ప్లే-  డైలాగ్స్ లో త‌న‌దైన ముద్ర వేయ‌డంతో పాటు, సూప‌ర్ డూప‌ర్ హిట్స్ అందించిన ఘ‌న‌త  మాత్రం ఎన్టీఆర్ దే.

ఇటు య‌మ‌గోల‌, అడ‌విరాముడు, వేట‌గాడు వంటి చిత్రాల ద్వారా మాస్ హిట్స్ అందించిన క్రెడిబిలిటీ కూడా ఎన్టీఆర్ దే. ఆ మాట‌కొస్తే సినిమాల్లో వంద  రోజులు, నూట యాభై రోజులు, 200, 250, 365 రోజులంటూ.. రోజులు- వారాలు- నెల‌లు- సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఆడిన సినిమాలు తీసిన చ‌రిత్ర కూడా మాస్ కా బాప్ ఎన్టీఆర్ పేరిటే లిఖించ‌బ‌డి ఉండేది.  అంటే సినిమాల్లో ఏ రికార్డు ఉన్నా ఆ  రికార్డుల‌న్నీ దాదాపు ఎన్టీఆర్ ని మొద‌ట ప‌ల‌క‌రించాకే త‌ర్వాత ఇతరుల ప‌ర‌మ‌య్యేవన్నంతగా ఎన్టీఆర్ ద స్టార్ ఆఫ్ ద ఎంటైర్ తెలుగు ఫిలిమ్ ఇండ‌స్ట్రీగా ఉన్నారు.

క్ర‌మ‌శిక్ష‌ణ అంటే ఎన్టీఆర్- ఎన్టీఆర్ అంటేనే క్ర‌మ‌శిక్ష‌ణ‌. ఉదాత్త‌మైన, పౌరాణిక‌మైన పాత్ర‌ల పోష‌ణ స‌మ‌యంలో త‌న హావ‌భావాల‌తో పాటు.. నిద్రాహారాల‌ను సైతం మార్చుకుని వాటి కోసం తీవ్రంగా శ్ర‌మించ‌డం  అనే విద్య‌ను కూడా ఎన్టీఆర్ నేర్పిందే. ఆయ‌న పౌరాణిక పాత్ర‌లు పోషించేట‌పుడు సాత్వికాహార‌మే తినేవారు. నేల‌పై నిద్రించేవారు.  ఇక న‌ర్త‌న శాల‌లో న‌టించేట‌పుడు నాట్యం రావాల్సి ఉండ‌గా.. అందు కోసం వెంప‌టి  చిన స‌త్యం ద‌గ్గ‌ర కూచిపూడి నాట్యం అభ్య‌సించారు ఎన్టీఆర్. అందుకే ఆయ‌న కెమెరా ముందు ఇంత వ‌ర‌కూ ఎప్పుడూ త‌డ‌బ‌డిందే లేదు. అంత‌గా ఎన్టీఆర్ ఇటు క్లాస్ అటు మాస్ ప్రేక్ష‌క జ‌న  నీరాజ‌నాలు అందుకున్నారు.

డైలాగ్ డిక్ష‌న్ కు కొత్త డిక్ష‌న‌రీ క‌నిపెట్టింది కూడా ఎన్టీఆరే.  డైలాగ్ కొడితే ఎన్టీఆర్ కొట్టిన‌ట్టు ఉండాల‌న్న పేరుండేది. ఇప్ప‌టికీ ఆయ‌న డైలాగ్.. ఏమంటివి ఏమంటివి.. ఆచార్య దేవా! డైలాగ్ డెలివ‌రీ ఒక ట్రెండ్ సెట్ట‌రే.  ఆయ‌న్ని ఫాలో అయ్యేవాళ్లే కానీ, ఆయ‌న ఫాలో అయిన వాళ్లు ఇంత వ‌ర‌కూ లేరంటే అతిశ‌యోక్తి కాదు.  అంత‌గా ప్ర‌తిదీ ఒక ల్యాండ్ మార్క్ లా స్థాపించారు ఎన్టీఆర్.  అందుకే ఆయ‌న విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ బిరుదాంకితుడ‌య్యారు. త‌న 44 ఏళ్ల సినీ ప్ర‌స్థానంలో 13 చారిత్ర‌కాలు, 55 జాన‌ప‌దాలు, 186 సాంఘీకాలు, 44 పౌరాణికాలు చేశారు. 1968లో ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం అందుకున్నారు. 1978లో ఆంధ్ర విశ్వ విద్యాల‌యం నుంచి గౌర‌వ డాక్ట‌రేట్, క‌ళాప్ర‌పూర్ణ స్వీక‌రించారు.

అందుకే ఎన్టీఆర్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం, ప్ర‌చార నిర్వ‌హ‌ణ  అన్నీ ఒక ట్రెండ్ సెట్ట‌ర్లుగా మారాయి. 1978లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో అట్టుడికేది. న‌లుగురు ముఖ్య‌మంత్రులు మారారు. అంతే కాదు ఇక్క‌డి సీఎంని ఎక్క‌డో ఢిల్లీలో నిర్ణ‌యించేవారు. దీంతో తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ స‌మ‌స్య ఉండేది. ఏదో నామ్ కే వాస్తే ప‌ద‌వులుండేవి. వీట‌న్నిటిని బ‌ద్ద‌లు కొట్టిన చ‌రిత్ర కూడా ఎన్టీఆర్ దే. ఇదెలా జ‌రిగిందో చూస్తే.. 1981లో ఊటీలో స‌ర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ జ‌రుగుతున్న సమయంలో..  షూటింగ్ విరామంలో ఒక విలేఖ‌రి.. ఒక ప్ర‌శ్న  వేశాడు. మీకు వ‌చ్చే 6 నెల‌ల్లో అర‌వై ఏళ్లు వ‌స్తాయ్. ఈ క్ర‌మంలో మీరేదైనా  కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్నారా? అని అడ‌గ్గా.. అందుకు ఎన్టీఆర్ తాను ఇక‌పై తెలుగు ప్ర‌జ‌ల కోసం నెల‌లో 15 రోజులు వారి సేవ‌కోసం కేటాయిస్తాన‌ని అన్నారు. తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని చెప్ప‌డానికి అదే తొలి సంకేతంగా మారింది. ఆనాటి నుంచి పెండింగ్ లో ఉన్న సినిమాల‌న్నిటినీ త్వ‌ర‌త్వ‌ర‌గా పూర్తి చేసిన ఎన్టీఆర్ 1982 మార్చి 21న హైద‌రాబాద్ వ‌చ్చారు. 1982 మార్చి 29వ తేదీ మ‌ధ్యాహ్నం.. రెండున్న‌ర గంట‌ల‌కు కొత్త  పార్టీ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంతే కాదు దానికి తెలుగు దేశం అనే పేరు సైతం ప్ర‌క‌టించారు ఎన్టీఆర్. 

పార్టీ ప్ర‌చారానికి త‌న పాత చెవ్రొలెట్ వ్యాను బాగు చేయించి.. దాన్నో క‌దిలే వేదిక‌గా త‌యారు చేయించారు. చైత‌న్య ర‌థం అంటూ దానిపై రాయించ‌డ‌మే కాకుండా తెలుగు దేశం పిలుస్తోంది రా క‌ద‌లిరా!  అంటూ నినాదాలు రాయించారు. దానిపై నుంచే అద్భుత‌మైన ప్ర‌సంగాలు చేశారు ఎన్టీఆర్. ఆ త‌ర్వాతి కాలంలో భార‌త రాజ‌కీయాల్లో ప్ర‌చార ర‌థాల‌కు ఈ చైత‌న్య ర‌థ‌మే ఒక స్ఫూర్తి   అంటే అతిశ‌యోక్తి కాదేమో. ప్ర‌చారంలో ఒక శ్రామికుడ్ని త‌ల‌పిస్తూ ఖాకీ డ్రెస్సు వేసుకుని మ‌రీ ప్ర‌చారం నిర్వ‌హించ‌డం కూడా అదే మొద‌లు. (ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా  కాషాయం ధ‌రించిందీ ఆయ‌నే. ఒక రాజ‌కీయ నాయ‌కుడు పిలిస్తే ఇంద‌రు ప్ర‌జ‌లు ఎగ‌బ‌డి వ‌స్తారా? అని ఈ ప్ర‌పంచానికి రుచి చూపించింది కూడా ఎన్టీఆరే. 

అప్ప‌టి వ‌ర‌కూ రాజ‌కీయ నాయ‌కుల ప్ర‌సంగాలంటే బోరు కొట్టేవి. కానీ ఎన్టీఆర్ ప్ర‌సంగిస్తే ప్ర‌జ‌ల్లో ఒక చైత‌న్యం వ‌చ్చి ఊగిపోయేవారు. తెలుగువారి ఆత్మ‌గౌర‌వం వంటి ప‌దాలు చేర్చి.. వాటి ద్వారా  ఆయ‌న చెప్ప మాట‌ల‌కు చెవులు కోసుకునేవారు తెలుగు ప్ర‌జ‌లు.  ఈ విష‌యంలోనూ ఆయ‌న  త‌ర్వాతే ఎవ‌రైనా. 1983 జనవరి 7 న   ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం- 199, కాంగ్రెసు- 60, సిపిఐ- 4, సిపిఎం- 5, బిజెపి- 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఎళ్ళ సుదీర్ఘ రాజ‌కీయ‌ చరిత్ర గ‌ల‌ కాంగ్రెసు పార్టీ.. 9 నెలల వ‌య‌సుగ‌ల‌ తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయిందంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య తేడా కూడా ఎన్టీఆరే. ఈ విష‌యంలోనూ ఎన్టీఆర్ రికార్డుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ్వ‌రూ అందుకోలేక పోయారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెల‌ల‌కే అధికారంలోకి అన్న‌ది కూడా ఎన్టీఆర్ పేరిట అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉండే పొలిటిక‌ల్ రికార్డ్.

ఇక ఎన్టీఆర్ గెలుపు ఓట‌ములు రెండూ రాజ‌కీయ సంచ‌ల‌నాలే. నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశంతో 1985 మార్చిలో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు. ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు ఎన్టీఆర్. కేంద్రం మిథ్య అని తేల్చి చెప్పిన ఘ‌న‌డు ఎన్టీఆర్. స‌రిగ్గా అదే స‌మ‌యంలో తాను అధికారం కోల్పోయాక ఆయ‌న్ను తిరిగి సీఎంగా నియ‌మించింది కూడా అదే కేంద్రంలోని కాంగ్రెస్. అంటే ఆయ‌నెంత విమ‌ర్శించినా.. ఆయ‌న్ను కాద‌నే ద‌మ్ము ధైర్యం కేంద్రానికి కూడా ఉండేది కాదు. అలాంటి కీర్తీ- ప్ర‌తిష్ట రెండూ ఎన్టీఆర్ సొంతం.. ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రంలో ప్ర‌తిప‌క్ష హోదా  పొంద‌డం కూడా ఎన్టీఆర్ సెట్ చేసిన ట్రెండ్స్ లో ఒక‌టి.

1989 ఎన్నికల్లో  ఓడిపోయినా భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. అదే నేష‌న‌ల్ ఫ్రంట్ ఏర్పాటు. ఆనాడు ఎన్టీఆర్ సృష్టించిన ఆ ఫ్రంట్ పాలిటిక్సే ఇప్ప‌టికీ ఎన్డీఏ, యూపీఏల‌కు ప్రేర‌ణ‌.  ఇక ఆయ‌న తీసుకొచ్చిన సంక్షేమ ప‌థ‌కాలే నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో న‌డుస్తున్నాయ్. ఎన్టీఆర్ రాజ‌కీయ రంగంలోకి రాకుంటే ఇవి కూడా వ‌చ్చేవి కావేమో. ఇక ప్ర‌క్షాళ‌న కార్య‌క్ర‌మాల్లోనూ ఎన్టీఆర్ ఒక ట్రెండ్ సెట్ట‌ర్.

అంతెందుకు మ‌నం నేడు హైద‌రాబాద్ ట్యాంక్ బండ్ పై చూస్తున్న చారిత్ర‌క పురుషుల విగ్ర‌హాల‌తో పాటు సాగ‌ర్  మ‌ధ్య‌లో నెల‌కొన్న బుద్ధుడి విగ్ర‌హం కూడా ఎన్టీఆర్ ఆలోచన, ఆచరణే. ఇక ప్ర‌త్య‌ర్ధి పార్టీ అయినా స‌రే నంద్యాల‌లో నాడు పీవీ న‌ర‌సింహ‌రావు పోటీ చేస్తే ఆయనకు  పోటీ పెట్ట‌కుండా సాటి తెలుగు వాడ‌న్న గౌర‌వ‌మిచ్చిందీ ఎన్టీఆరే. ఇక రెండు రూపాయ‌ల‌కు కిలో బియ్యం, సంపూర్ణ మ‌ద్యపాన నిషేధం,  ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు త‌గ్గింపు, శాస‌న మండ‌లి ర‌ద్దు.. ఇలా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు చాలానే.. సినిమా హాళ్ల‌కు స్లాబ్ సిస్ట‌మ్స్.. ఇలా ర‌క‌రాల రాజ‌కీయ నిర్ణ‌యాలకు ఆద్యుడు ఎన్టీఆరే. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు.. ఎన్టీఆర్ నాలుగు సినిమాల్లో న‌టించారు. ఇలాంటి  ఎన్నో విష‌యాల్లో ఎన్టీఆర్ కి తిరుగు లేదు. ఆ మాట‌కొస్తే ప్ర‌చార సినిమాలుగా విశ్వామిత్ర వంటి  చిత్రాలు తీయ‌డంలోనూ ఎన్టీఆర్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశార‌నే చెప్పాలి.
 
తన జీవితకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 సెప్టెంబరులో పెళ్ళి చేసుకున్నారు ఎన్టీఆర్. ఇదే ఆయ‌న కుటుంబ, రాజ‌కీయ జీవితాన్ని స‌మూలంగా మార్చేసింద‌ని చెప్పాలి.  ఆ త‌ర్వాత 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మ‌ర‌ణించారు విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు. మొత్తం 33 ఏళ్ల సినిమా జీవితం, 13 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఇటు క‌థానాయ‌కుడిగా, అటు మ‌హానాయ‌కుడిగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ పేరిట ఇంకా ఎన్నో రికార్డులు అలాగే నిల‌చి ఉన్నాయి. తిరిగి  ఆయ‌నే పుట్టి ఆయ‌నే వాటిని బ్రేక్  చేస్తే త‌ప్ప వాటినెవ‌రూ క్రాస్ చేయ‌లేరనడం అతిశయోక్తి కాదు. 
 
మీసాల నాగ‌మ్మ‌గా ఆయ‌న వేసిన తొలి పాత్ర‌, మ‌న దేశంలో ఆయ‌న పోషించిన తొలి  సినిమా ఇన్ స్పెక్ట‌రు పాత్ర‌.. త‌ర్వాత త‌ర్వాత ఆయ‌న పోషించ‌ని పాత్ర ఏదైనా ఉందా? అన్న‌ట్టు అన్ని పాత్ర‌ల‌నూ పోషించ‌డం మాత్ర‌మే కాదు. రాజ‌కీయాల్లోనూ ఒక పెను సంచ‌ల‌నంగా ఎదిగిన  ఎన్టీఆర్ ఉత్తానాలే కాదు ప‌త‌నాల‌ను అందుకోవాల‌న్నా గుండెలుండాలి. ఈనాటికీ అత్యంత ప్ర‌జాద‌ర‌ణ గ‌లిగిన తెలుగు సెల‌బ్రిటీల్లో ఆయ‌నదే తొలి  స్థానం. ఆ స్థానాన్ని చేరుకోవ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు. ఒక స‌మ‌యంలో అంటే ఆయ‌న రామ‌, కృష్ణ‌, వెంక‌టేశ్వ‌ర వంటి పౌరాణిక పాత్ర‌లు పోషిస్తున్న స‌మ‌యంలో ఇటు తిరుప‌తికి వ‌చ్చిన జ‌నం అటు చెన్నైకి వెళ్లి ఆయ‌న్ను రెండో వెంక‌టేశ్వ‌ర స్వామిగా చూసుకుని వెళ్లేవారు. ఆ కృత‌జ్ఞ‌త కొద్దీ టీటీడీలోనూ స‌మూల మార్పులు తెచ్చి.. ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టింది  కూడా ఎన్టీఆరే. 

ఇదీ ఎన్టీఆరే పుట్ట‌క పోయి ఉంటే తెలుగు సినీ రాజ‌కీయాల్లో ఇన్నేసి అంశాల‌ను మ‌న‌మెవ‌రం చూసి ఉండేవాళ్లం కామని అంటారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఒక సాధార‌ణ స‌బ్ రిజిస్ట్రార్ గా ఆయ‌న త‌న జీవితాన్ని వెళ్ల‌దీసి ఉంటే ఆయ‌న సంత‌కానికి  కేవ‌లం ఆస్తులపై పేరు మాత్ర‌మే మారి ఉండేదేమో.. అదే ఆయ‌న సినీ న‌టుడిగా తాను ఎద‌గ‌డంతో పాటు త‌న ప‌రిశ్ర‌మ‌ను సైతం అంతేలా ఎదిగేలా చేసిన  ఘ‌న‌డు. రాజాకీయాల్లో ఎంద‌రో ఆయ‌న సంత‌కం  పొందిన బీఫామ్స్ తో బీసీ ఎస్సీ క్రిష్టియ‌న్ ముస్లిం మైనార్టీలు చ‌ట్ట స‌భ‌ల్లో అడుగు పెట్టారు. వీట‌న్నిటినీ మ‌నం ఎన్టీఆర్ పుట్ట‌క పోయి ఉంటే చూసేవారం కాదేమో!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ

  జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బ‌రిలో దిగాలని ఆ పార్టీ డిసైడ్ అయింది. ఎన్నిక‌ల‌కు నెల రోజుల కంటే త‌క్కువ స‌మ‌యం ఉన్నప్ప‌టికీ సాధ్య‌మైన‌న్ని స్థానాల్లో పార్టీ అభ్య‌ర్థులు పోటీ చేయున్నట్లు తెలిపారు. ప్ర‌తి జ‌న‌సైనికుడు, వీర మ‌హిళ ఉత్సాహంగా ప్ర‌చారానికి సిద్ధం కావాల‌ని ప్ర‌క‌టించింది.  పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం, అధ్యక్షుడు  ప‌వ‌న్ క‌ల్యాణ్ భావ‌జాలాన్ని ప్ర‌జ‌ల్లోకి చేర‌వేయ‌డం ద్వారా తెలంగాణలో స‌రికొత్త రాజ‌కీయ వేధిక‌కు పునాధి వేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని సూచించింది. త్వ‌ర‌లోనే పార్టీ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది.   ఈ ఎన్నికల ప్రచారంలో జనసైనికులు చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని జనసేన పార్టీ పిలుపు నిచ్చింది.  

త్వరలో 73 రాజ్యసభ స్థానాలు ఖాళీ

  2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు. వాళ్ల వివరాలను రాజ్యసభ సచివాలయం బులిటెన్ ద్వారా వెల్లడించింది, వీళ్లలో దశాబ్దాలుగా పని చేసిన అనుభవఘ్నలైన నేతలు కూడా ఉన్నారు. రాజ్యసభలో ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ మధ్య కాలంలో 73 మంది ఎంపీలు సభ్యులు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ సభ్యుల పదవీ విరమణతో పలు రాష్ట్రాల నుంచి ఖాళీలు ఉంటాయి. ఈ 73 మంది సభ్యులలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది ఉన్నారు. మహారాష్ట్ర నుంచి ఏడుగురు, తమిళనాడు నుంచి ఆరుగురు సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు.  పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరి నుంచి ఐదుగురు చొప్పున సభ్యులు బయటకు వెళ్తున్నారు.ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున సభ్యులు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, హరియాణా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు.  హిమాచల్‌ప్రదేశ్, మణిపుర్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వైఎస్సార్‌సీపీకి చెందిన అయోధ్య రామి రెడ్డి, పరిమళ్‌ నత్వానీ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, అలాగే టీడీపీకి చెందిన సానా సతీష్‌బాబు తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ నాలుగు స్థానాలూ రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీలకే దక్కే అవకాశాలు న్నాయని భావిస్తున్నారు.  ఇక తెలంగాణ విషయాని కొస్తే, బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్‌ సురేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేశవరావు రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ కూడా పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణలో ఉన్న రెండు రాజ్యసభ స్థానాలను అధికార పార్టీ కాంగ్రెస్‌ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే త్వరలో ఖాళీ కానున్న 73 సీట్లకు ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది, ఏప్రిల్ నెలలో తొలి విడత నవంబర్ లో రెండో విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

అమరావతిపై మరోసారి జగన్ విషం.. ప్రజాగ్రహ సెగతో వైసీపీలో భయం!

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జగన్ అక్కసు తెలియంది కాదు. తాను అధికారంలో ఉండగా అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులంటూ సృష్టించిన గందరగోళ, అయోమయ పరిస్థితులే గత అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒక్కటన్నది నిర్వివాదాంశం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతిపై జగన్ కుట్రల ఫలితమే.. 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం. వైసీపీకి కనీసం ప్రతిక్ష హోదాకు కూడా అర్హత లేదని జనం ఆ ఎన్నికలలో తమ ఓటు ద్వారా విస్పష్ట తీర్పు ఇచ్చి 11 స్థానాలతో ఆ పార్టీని సరిపెట్టారు. కూటమి సర్దు బాట్ల కారణంగా కొన్ని స్థానాలలో వైసీపీ విజయం సాధించింది. లేకపోతే ఆ ఓటమి మరింత ఘోరంగా ఉండేదని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించిన సంగతి తెలిసిందే.  అయితే అంతటి ఘోర పరాజయం తరువాత కూడా అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్. తాజాగా అమరావతి నదీగర్భంలో నిర్మిస్తూ చంద్రబాబు ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. అమరావతి నిర్మాణం ప్రజాధనం వ్యయంగా అభివర్ణించిన ఆయన రాష్ట్ర రాజధానిని విజయవాడ, గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో నిర్మించాలన్నారు. అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. అమరావతిపై జగన్ ద్వేషం వెళ్లగక్కుతున్నారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.  దీంతో నష్ట నివారణకా అన్నట్లుగా మాజీ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగారు. జగన్ వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చడానికా అన్నట్లు హెరిటేజ్ కార్యాలయాన్ని నదీ గర్భంలో నిర్మించగలరా  అన్న జగన్ ప్రశ్నకు ముందు నారా చంద్రబాబు, ఆయన కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  అమరావతి విషయంలో జగన్ మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ మాట్లాడారు. జగన్ అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 24 గంటలలో పేర్ని నాని రంగంలోకి దిగడం, జగన్ వ్యాఖ్యల తీవ్రతను డైల్యూట్ చేసేలా మాట్లాడటం చూస్తుంటే అమరావతి విషయంలో వైసీపీ తీరు పట్ల ప్రజా వ్యతిరేక సెగలు వైసీపీకి మరోసారి గట్టిగా తగిలాయనే భావించాల్సి వస్తోంది.  

రాజకీయ గూఢచర్యంలో భాగమే ఈడీ దాడులు.. కేంద్రంపై తృణమూల్ ధ్వజం

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఐప్యాక్ కార్యాలయం, ఆ సంస్థ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసాలపై ఈడీ సోదాలు ఆ రాష్ట్రంలో పెను రాజకీయ వివాదానికి దారి తీశాయి. ఈ దాడులను ఆ రాష్ట్రంలో అధకారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ గూఢచర్యంగా అభివర్ణించింది. ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు జరుగుతుండగా మమతా బెనర్జీ అక్కడికి వెళ్లడాన్ని తృణమూల్ కాంగ్రెస్ సమర్ధించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ మహువామోయిత్రా మాట్లాడుతూ.. సీఎం మమతా బెనర్జీ తృణమూల్ అధినేత్రి కూడా అని పేర్కొన్నా మహువా మోయిత్రా, ఇంట్లో దొంగతనం జరుగుతున్నప్పుడు మన వస్తువులను కాపాడుకునే హక్కు మనకు ఉంటుంది కదా అన్నారు.   పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని  బీజేపీ సాగిస్తున్న దోపిడీని, గూండాయిజాన్ని ఎదుర్కొంటున్న ఏకైక నాయకురాలు మమతా బెనర్జీ మాత్రమేనన్న మహువా మోయిత్రా ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల జాబితా వంటి రహస్య డేటాను దొంగిలించేందుకే ఈడీ దాడులని తీవ్ర విమర్శలు చేశారు.  ఈడీ దాడులకు నిరసనగా  మమతా బెనర్జీ కోల్‌కతాలో భారీ పాదయాత్ర నిర్వహించారు.ఆ ర్యాలీకి సంఘీ భావంగా  ఢిల్లీలో నిరసన చేపట్టిన టీఎంసీ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, తమ దర్యాప్తును ముఖ్యమంత్రి అడ్డుకున్నారని ఈడీ, తమ పార్టీ సమాచారాన్ని అక్రమంగా సేకరించారని టీఎంసీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించాయి. వీటిపై విచారణను కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది.   ఇలా ఉండగా తమ పార్టీ రాజకీయ వ్యూహకర్త   ఐ-ప్యాక్ పై ఎ ఈడీ  దాడుల   నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనపైన, తన ప్రభుత్వంపైన  స్థాయికి మించి ఒత్తిడి పెంచితే బొగ్గు కుంభకోణంలో అమిత్ షా పాత్రకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెడతానని హెచ్చరించారు.  

హింసకు ప్రోత్సాహం.. ఇదేం రాజకీయం జగన్!?

జ‌గ‌న్ ది తొలి  నుంచీ హింసాత్మ‌క ప్ర‌వృత్తే. ఈ విష‌యం గతంలోనే పలుమార్లు రుజువైంది. తాజాగా మరోసారి వెల్లడైంది.  త‌న ఫ్లెక్సీల ముందు పొటేళ్ల‌ను అత్యంత హింసాత్మ‌కంగా న‌రికి.. ఆపై ఆ ర‌క్తాన్ని ఆయ‌న ఫ్లెక్సీల‌కు పూశారు. ఒక విధంగా చెప్పాలంటే రక్తాభిషేకం చేశారు  గ‌తంలో హోం మంత్రిగా  ప‌ని  చేసిన తానేటి వ‌నిత నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గోపాల‌పురం బ్యాచ్. అయితే  వీరిని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేసింది ఏపీ  పోలీస్ డిపార్ట్ మెంట్. వీరు విడుద‌ల‌య్యాక నేరుగా ఇళ్ల‌కు వెళ్లారో లేదో తెలీదు.  కానీ, స‌రాస‌రి జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌ వాలిపోయారు. వారిని స్వయంగా జగన్ వద్దకు మాజీ హోం మంత్రి తానేటి వ‌నిత‌ తీసుకువెళ్లారు.   హోం మంత్రిగా  ప‌ని చేసిన వనితకు డూస్ ఏంటి?  డోంట్స్ ఏంట‌ి?  అన్న‌ది క్లియ‌ర్ క‌ట్ గా తెలిసి ఉంటుంది. త‌మ‌కు తెలిసింది ఇత‌రుల‌కు కూడా చెప్పాలి. కానీ, వ‌నిత ఆ ర‌క్త‌సిక్త నిందితుల‌ను  ఏదో పెద్ద ఘ‌న‌కార్యం చేసిన‌ట్టు నేరుగా జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు తీసుకువచ్చి నిల‌బెట్టారు. దీంతో వారు కూడా తాము తిన్న పోలీసు లాఠీ దెబ్బ‌ల‌కు అక్క‌డ ఎక‌బికిన  ఏడ్చేశారు. ఇలా ఎప్పుడూ చేయ‌కండ‌ని వారించాల్సిన  జ‌గ‌న్..  మీకు నేను అండ‌దండ‌గా ఉన్నానంటూ.. భుజం త‌ట్టి  పంపించారు. జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి  కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా?  ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు.  దీంతో  వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని  కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.  అవ‌స‌ర‌మైతే కోటాను కోట్లు కుమ్మ‌రించేయగలరు?  అదే ఈ  రప్పార్పా నిందితుల ప‌రిస్థితి  అలాక్కాదు. వీరిని నేరుగా తీసుకెళ్లి తమదైన స్టైల్ ట్రీట్ మెంట్ ఇచ్చి మరీ వదిలారు పోలీసులు. చాలా మంది  వైసీపీ  వారు చేస్తున్న రివ‌ర్స్ ట్రోలింగ్ ఏంటంటే గ‌తంలో చంద్ర‌బాబు ఫ్లెక్సీల‌కు ర‌క్తాభిషేకం చేసిన ఫోటోలు, బాల‌కృష్ణ సినిమా విడుద‌ల  స‌మ‌యంలో పొటేళ్ల త‌ల‌లు అలంక‌రించిన  వీడియోల‌ను రీ పోస్ట్ చేస్తున్నారు. కానీ, వాట‌న్నిటిపైనా  చ‌ట్ట‌ప్ర‌కారం చర్యలు తీసుకున్న సంగతిని మాత్రం ఈ రివర్స్ ట్రోలింగ్ చేస్తున్న వారు బయటకు చెప్పడంలేదు. పైగా అప్పట్లో అలా రక్తాభిషేకం చేసిన వారిని చంద్రబాబు, బాలయ్య సమర్ధించలేదు. అటువంటి చర్యలు తగవని హితవు పలికారే తప్ప వారిని సమర్ధిస్తూ, ప్రోత్సహిస్తూ జగన్ లా ప్రకటనలు గుప్పించలేదు.   ప్ర‌స్తుత ప‌రిస్థితికి వ‌స్తే.. ర‌క్త త‌ర్ప‌ణం జ‌గ‌న్ కి. బాధలు, కేసులు ఈ నిందితులకు అన్నట్లుగా ఉంది.  వీరిని వారించాల్సిన జ‌గ‌న్ వారించ‌కుండా రెచ్చిపోండి నేనున్నాననడమంటే..  అర్ధమేంటి? జగన్ ప్రోత్సాహం, మద్దతు చూసుకుని వీరింకెంత రెచ్చిపోతారో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  ఇలాంటి హింసాత్మ‌క‌త గుర్తించిన జ‌నం వ‌చ్చే రోజుల్లో ఆ ప‌ద‌కొండు సీట్లు కూడా  ఇవ్వ‌కుండా పులివెందుల‌లో  కూడా  జ‌గ‌న్ని ఓడించి మూల కూర్చోబెడితే.. పార్టీకి కాస్తా  ఆయ‌న‌ పేక‌ప్ చెప్పేస్తారు. సంపాదించుకున్నదాంతో జ‌గ‌న్ కేం  తృప్తిగా  బ‌తికేస్తారు. కానీ ఇలాంటి నిందారోప‌ణ‌ల‌తో జీవితాంతం బ‌త‌కాల్సింది మాత్రం వీరే. కాబ‌ట్టి ఇలాంటి వారు ఒక సారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నారు పోలీసులు.. మ‌రి  పోలీసుల మాట విని బుద్ధిగా మ‌స‌లుకుంటారో.. లేక ఇలాగే రెచ్చి పోయి కేసుల మీద కేసులు నెత్తికి వేసుకుంటారో అది వారి వారి ఇష్టం. మ‌రి  మీరేమంటారు?

కవిత కొత్త పార్టీ.. బీఆర్ఎస్ భవిష్యత్తేంటి?

తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు కల్వకుంట్ల కవిత ప్రయాణం అత్యంత ఆసక్తికర అంశంగా మారింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె అయిన కల్వకుంట్ల కవిత  రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ఖాయమైన నేపథ్యంలో.. ఆమె కొత్త పార్టీ ప్రభావం బీఆర్ఎస్ పై ఏ మేరకు ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది.  కవిత తాను సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే ఆమె పార్టీ నిర్మాణ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ఆరంభించేశారు.  32 వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి పార్టీ ప్రకటన ఇక లాంఛనమే అని పరిశీలకులు సైతం అంటున్నారు. అయితే ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.   తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టడం ద్వారా.. ప్రత్యేక రాష్ట్ర ఫలాలను తెలంగాణ సమాజానికి అందించడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని తేల్చే దిశగా కవిత అడుగులు ఉన్నాయని అంటున్నారు.    ఇప్పటి వరకూ కవిత విమర్శలపై బీఆర్ఎస్ అగ్రనాయకత్వం స్పందించకపోవడం ఆ పార్టీని డిఫెన్స్ లో పడేసిందంటున్నారు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి కవిత దూకుడును అడ్డుకోకుంటే.. బీఆర్ఎస్ స్థానాన్ని కవిత ఆరంభించనున్న కొత్త పార్టీ ఆక్రమించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. 

ఉప్పు సముద్రం పాలౌతున్న వృధా జలాల వినియోగమే లక్ష్యం.. చంద్రబాబు

నీటి వివాదాల వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాటిని సామరస్యంగా పరిష్కరిం చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. జలవివాదాలను రాజకీయం చేయడం వల్ల ఎవరికీ ఎటువంటి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాన్ని ఇరువురు ముఖ్యమంత్రులూ కూడా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే జల వివాదాల పరిష్కారం విషయంలో ఏపీ ఒక అడుగు ముందుకు వేస్తే.. తాము పది అడుగులు ముందుకు వేస్తామన్నారు. అదే విధంగా చంద్రబాబు కూడా తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలను కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారని విమర్శించారు.    ఉప్పు సముద్రంలోకి వృధాగా పోతున్న నీటి వినియోగం విషయంలో తెలుగు రాస్ట్రాల మధ్య వివాదాలు అనవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.  తూర్పుగోదావరి జిల్లా రాయవరం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్‌బుక్కులు పంపిణీ చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో  ప్రసంగించిన ఆయన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని విమర్శించారు.  ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రశక్తే లేదని స్పష్టం చేసిన ఆయన  అనవసర వివాదాల వల్ల  ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు.    ప్రతి ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న 300 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో కరవు అనే మాటే ఉండదన్న చంద్రబాబు.. పోలవరం పూర్తయితే  నీటి సమస్యలు తీరతాయనీ,  పోలవరం నుంచి విశాఖపట్నం, అక్కడి నుంచి వంశధార వరకు నీటిని తీసుకెడతామని చెప్పారు.  పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ కూడా మిగులు జలాలను వాడుకోవచ్చన్న ఆయన  పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించి, అక్కడి నుంచి రాయలసీమకు నీరందించడం వల్లే ఆ ప్రాంతం హార్టికల్చర్ హబ్‌గా మారుతోందన్నారు.   

ఏపీ ఒక అడుగు ముందుకేస్తే మేం పదడుగులేస్తాం

జలవివాదాల పరిష్కారంపై తెలంగాణ సీఎం రేవంత్ ఏపీ ముఖ్యమంత్రికి ప్రతిపాదన తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదన చేశారు. రెండు రాష్ట్రాల  జలవివాదాలను నేరుగా చర్చించుకుని పరిష్కరించు కుందామంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిపాదించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  శుక్రవారం (జనవరి 9) ఆయన పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను  ఇరు రాష్ట్రాలూ పరిష్కరిం చుకోవాలన్నారు.  ఇందు కోసం ఏపీ ఒక అడుగు మందుకు వేస్తే తాము పదడుగులు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కోర్టుల ద్వారా కాకుండా జల వివాదాలను రాష్ట్రాల మధ్యే పరిష్కరించుకుందాని కోరారు.  జల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం కోసం తాము ప్రయత్నించడం లేదన్నారు. పంచయతీ కావాలా? నీళ్లు కావాలా అంటే తాను నీళ్లు కావాలనే అంటానని స్పష్టం చేశారు.   కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు సృష్టించవద్ద కోరారు.  తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ ఉండాలంటే పక్క రాష్ట్రం సహకారం తప్పని సరి అన్న రేవంత్ ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యా పరస్పర సహకారం ఉంటేనే సమస్యలు పరిష్కారమౌతాయన్నారు.  

వాస్తవ వేదిక.. ఇది కూటమి ప్రభుత్వం కాదు కుమ్మక్కు ప్రభుత్వం

దొంగలు దొంగలూ ఊళ్లు పంచుకున్న చందంగా ప్రస్తుత రాజకీయవ్యవస్థ తయారైంది. ఒకళ్లు చేసిన తప్పులను మరొకరు ప్రశ్నించకుండా, వ్యవస్థ లొసుగులను తమకు అనుగుణంగా మలచుకుంటూ ప్రజాధనాన్ని పంచుకుంటున్నట్లుగా రాజకీయ నాయకుల తీరు తరయారైందంటూ.. వాస్తవ వేదిక లో తెలుగువన్ ఎండీ రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ల చర్చా సారాంశం ఉంది.  వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో  గురువారం ప్రసారమైంది. ఆ చర్చలో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు సంగ్రహంగా..  రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పాలనలో జవాబుదారీతనం కరువవ్వడం, ప్రజాధనం దుర్వినియోగమౌతున్న తీరుపై రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్ వాస్తవ వేదికలో కళ్లకు కట్టారు.   ప్రభుత్వ వ్యవస్థల్లో ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ మేధాశక్తిని సామాన్యుల బాగు కోసం కాకుండా, పాలకుల తప్పులను కప్పిపుచ్చడానికి వాడుతున్నారని అభిప్రాయపడ్డారు. గతంలో ఐఏఎస్ అధికారులు అసెంబ్లీలో ప్రశ్నలకు భయపడేవారని, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని డోలేంద్ర ప్రసాద్ విస్పష్టంగా చెప్పారు.  ఇక ప్రస్తుతం రాష్ట్రంలో  ఉన్నది కూటమి ప్రభుత్వం కాదు కుమ్మక్కు ప్రభుత్వం అనిపిస్తోందన్నారు. ఇందుకు కారణాలు కూడా ఆయన ఉదహరించారు.  తాను కూటమి ప్రభుత్వాన్ని కుమ్మక్కు ప్రభుత్వంగా అభివర్ణించడానికి ఆయన కారణాన్ని కూడా వివరించారు. ప్రభుత్వ పథకాలు, పనుల కాంట్రాక్టుల అప్పగింతలో కూటమి ప్రభుత్వ లోపాలను ఎండగట్టే విషయంలో వైసీపీ చాలా సెలెక్టివ్ గా వ్యవహరిస్తోందన్నారు. అందుకు కారణం వాటిలో వైసీపీయులకు కూడా వాటాలు ఉండటమే కారణమని ఆరోపించారు.  ఇందుకు ఉదాహరణగా గతంలో ఎలక్షన్ల సమయంలో షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, స్మార్ట్ మీటర్ల విషయంలో గగ్గోలు పెట్టిన తెలుగుదేశం పార్టీ, అధికారంలోకి వచ్చాక అవే సంస్థలకు టెండర్లు ఇవ్వడాన్ని చూపారు. నాడు తాను విమర్శించిన సంస్థలకే  ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేంటని ప్రశ్నించారు.   ఇక దుర్మార్గానికి పరాకాష్ట అన్నట్లుగా ప్రజాధనం దుర్వినియోగం గురించి సోదాహరణంగా వివరించారు.  జగన్ హయాంలో తిండి కోసం రూ. 400 కోట్లు, రుషికొండ ప్యాలెస్ కోసం రూ. 600 కోట్లు, తిరుగుళ్ళ కోసం  250 కోట్లు, ఇక ప్రభుత్వ భవనాలు, పాఠశాలలకు పార్టీ రంగుల కోసం  రూ. 5000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయితే.. ప్రస్తుత తెలుగుదేశం కూటమి సర్కార్ లో కూడా పాలకులు స్టార్ హోటళ్లలో భోజనానికి రోజుకు నలభై నుంచి ఏభై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఇది వారి కష్టార్జితం కాదు కనుకనే యధేచ్ఛగా ఖర్చు పెట్టేస్తున్నారన్నారు. గతంలో అంటే కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో   రూపాయిలో 6 పైసలు మాత్రమే ప్రజలకు చేరేవనీ అదే ఇప్పుడైతే..   పద్దుల్లో లెక్కలు తప్ప ఒక్క పైసా కూడా ప్రజలకు అందకుండానే మాయమౌతోందన్నారు.  గతంలో అంటే 1995లో చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి జీవో సమాచారం ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డుల ద్వారా ప్రజలకు తెలిసేదనీ, నేడు  ప్రభుత్వం జారీ చేసే జీవోలు చాలా వరకూ రహస్యంగానే ఉంటున్నాయన్న డోలేంద్ర ప్రసాద్.. అత్యధిక జీవోలను వెబ్సైట్లలో అప్‌లోడ్ చేయడం లేదని విమర్శించారు.  తప్పుగా జారీ చేసే ఏ జీవో కూడా పబ్లిక్ డొమైన్ లో కనిపించడం లేదన్నారు.  ఇప్పటికే ఆర్టీఐ  చట్టాన్ని 90 శాతం నిర్వీర్యం చేసేశారనీ, ఆ చట్టం ద్వారా  సమాధానాలు రావడం లేదనీ పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే..  పోలీసుల ద్వారా కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇది ఎమర్జెన్సీ కంటే దారుణమైన నియంతృత్వ పోకడ అని విమర్శించారు,. దీనికి బాధ్యత ఎవరిదన్న రవిశంకర్ ప్రశ్నకు డోలేంద్ర ప్రసాద్ గత మూడు దశాబ్దాలుగా  రాజకీయాల్లో ఉన్న నాయకులందరూ వ్యవస్థ పతనానికి బాధ్యత వహించి క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు.   ప్రజలు మేల్కొని ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోకపోతే పరిస్థితులు మారవని, పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్ తరహా తిరుగుబాటు వచ్చే వరకు పరిస్థితిని తెచ్చుకోవద్దని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్ లు రాజకీయ నేతలకు హితవు చెప్పారు.  రాజకీయ వ్యవస్థ ప్రస్తుతం ఎలా ఉందంటే, "దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు" ఉంది. ఒకరు చేసే తప్పును మరొకరు ప్రశ్నించకుండా, వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ సామాన్యుడి సొమ్మును పంచుకుంటున్నారు.  

విపక్ష నేతకు సముచిత గౌరవం.. రేవంత్ సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్టేనా?

తెలంగాణ రాజకీయాలలో అధకార విపక్షాల మధ్య విమర్శలు సరిహద్దు గీత దాటి దుర్భాషల స్థాయికి వెడుతున్నాయనడాన్ని ఎవరూ కాదనలేరు. భాషా సంస్కారం తెలంగాణ రాజకీయాలలో కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి ఉంది. విమర్శలు దూషణల స్థాయికి మించి దగజారుతున్నదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితికి కారణం ఎవరన్నది పక్కన పెడితే.. నేతలు తమ భాషా సంస్కారాన్ని పెంచుకోవాలన్న సూచనలూ విజ్ణుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అది పక్కన పెడితే.. ఒక సంస్కారవంతమైన రాజకీయవాతావరణం మాత్రం ఇటీవలి కాలంలో తెలంగాణలో కనిపిస్తోందని చెప్పక తప్పదు.  ఎందుకంటే.. ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్నవారి మాటే ఫైనల్. విపక్ష గొంతు వినిపించడం సంగతి అటుంచి.. కనీసం వారికి ఇసుమంతైనా ప్రధాన్యత ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు భిన్నంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రతిపక్ష నేతకు విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇనుమడించేలా  రేవంత్ వ్యవహరించారన్న ప్రశంసలూ పరిశీలకుల నుంచి వచ్చాయి.   ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి రేవంత్ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాజకీయ వాతావరణం సుహృద్భావ పూరితంగా మారేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇక తాజాగా ఇద్దరు మహిళా మంత్రులు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ నివాసానికి స్వయంగా వెళ్లి మరీ మేడారం జాతరకు ఆహ్వానించడం  కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలి కాలంలో ఇటువంటి వాతావరణం కనిపించిన దాఖలాలు లేవు.  తెలంగాణ  రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకూ రెండు సార్లు  తెలంగాణ పండుగ మేడారం జాత‌ర జ‌రిగింది. అయితే.. ఆ రెండు సార్లూ కూడా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి ఇంటికి వెళ్లి ఆయ‌న‌కు ఆహ్వాన ప‌త్రిక‌ ఇచ్చి ఆహ్వానించిన దాఖలాలు లేవు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి  ఎన్నడూ కూడా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని పట్టించుకోలేదు.  అయితే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. విమర్శల విషయంలో ప్రతిపక్షానికి దీటుగా ఆయన కూడా మాటల తూటాలు విసురుతున్నప్పటికీ.. వ్యవహార తీరు విషయంలో మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో స్వయంగా ప్రతిపక్ష నేత సీటు వద్దకు వెళ్లి అభివాదం చేయడం గానీ, ఇప్పుడు  మంత్రులు కొండా సురేఖ‌, సీత‌క్క‌లు స్వ‌యంగా ఎర్ర‌వ‌ల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కువెళ్లి మేడారం జాత‌ర‌కు సంబంధించిన ఆహ్వాన ప‌త్రిక‌ను అందించడం కానీ నిజమైన డెమొక్రటిక్ వాల్యూస్ కు పెద్ద పీట వేయడమేనని పరిశీలకులు అంటున్నారు.  రాజకీయాలకు అతీతంగా జ‌రుగుతున్న ఈ కార్య‌క్ర‌మానికి కేసీఆర్ ను ఆహ్వానించడం, అలాగే అసెంబ్లీలో కేసీఆర్ వద్దకు రేవంత్ స్వయంగా వెళ్లి పలకరించడం వెనుక  వెనుక వ్యూహంఉందంటూ జరుగుతున్న ప్రచారానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం కనిపించడం లేదు.  ఇదే వాతావరణం కొనసాగాలన్నఆకాంక్ష తెలంగాణ సమాజం నుంచి వ్యక్తమౌతున్నది.