దినేష్ రాజకీయ ఆరంగ్రేటం చేయనున్నారా?
ఒకప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నమ్మిన బంటుగా పేరొందిన మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, ఆయన తన పదవీకాలం మరో రెండేళ్ళు పొడిగించాలన్న విజ్ఞప్తిని తిరస్కరించడంతో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్)లో అప్పీలు చేసుకొని అక్కడ రెండు సార్లు భంగపడ్డారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా హైకోర్టుకి వెళ్లి అక్కడ కూడా మరోసారి భంగపడి, చాలా అవమానకర పరిస్థితుల్లో పదవీ విరమణ చేయవలసి వచ్చింది. మళ్ళీ ఈ మధ్య సుప్రీంకోర్టుకి కూడా వెళ్లి అక్కడ కూడా లేదనిపించుకొని వచ్చారు. ఆయన తన పదవీ కాంక్ష వలన ఇన్నిసార్లు భంగపాటు ఎదుర్కొన్నారని అర్ధం అవుతోంది.
ఈ అవమానం జీర్ణించుకోలేని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసారు.
రాష్ట్రంలోనే అత్యున్నత పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసిన దినేష్ రెడ్డి అవినీతి, అక్రమం ఎక్కడ జరిగినా అడ్డుకొనే సత్తా కలిగి ఉంటాడని ప్రజలు భావించడం సహజం. కానీ, పదవిలో కొనసాగినంత కాలం అదే ముఖ్యమంత్రితో రాసుకు పూసుకు తిరిగి, ఇప్పుడు తన పదవీకాలం పొడిగించని కారణంగా ముఖ్యమంత్రిపై నిందలు వేయడం అనుచితం. ఒకవేళ ఆయనే గనుక నిజంగా గొప్ప నిజాయితీ గల పోలీసు అధికారి అయ్యి ఉంటే, నియమ నిబంధనలకు విరుద్దంగా నడుచుకోమని సాక్షాత్ ముఖ్యమంత్రే ఆదేశించినా దైర్యంగా తిరస్కరించి ఉండాలి.
కానీ, ఆయన లౌక్యంగా మసులుతూ పదవీ విరమణ చేసారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిని అభాసుపాలు చేసే ప్రయత్నంలో ఆయనే స్వయంగా ఏపీఎన్జీవోల సభకు సహకరించానని తన తప్పును తానే బయటపెట్టుకొన్నారు. ముఖ్యమంత్రి పేషీలోనే నేరాలు జరుగుతున్నపుడు ఆయన ఎందుకు అడ్డుకోలేదు? అంటే పదవిలో కొనసాగనిస్తే ఎటువంటి నేరనయినా చూసి చూడనట్లు వదిలిపెట్టేస్తారని అర్ధం అవుతోంది.
ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో స్వయంగా సీబీఐ విచారణ కూడా ఎదుర్కొంటున్న దినేష్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిపై ఇటువంటి ఆరోపణలు చేయడం వలన ముందుగా పోయేది తన పరువేనని గ్రహించాలి. తనపై మాజీ మంత్రి శంకర్ రావు ఆరోపణలు చేసినప్పుడు ఆయన ఏవిధంగా స్పందించారో, ఇప్పుడు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా స్పందిస్తే ఏమవుతుందో ఆయన గ్రహించాలి.
సాదారణంగా రాజకీయ నాయకులు వ్యవహరించే విధంగా ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్నారు. మరి త్వరలో ఆయన రాజకీయ ఆరంగ్రేటం చేయబోతున్నందునే ఈవిధంగా మాట్లాడుతున్నారా? అనే అనుమానం కలుగుతోంది. అదే నిజమయితే కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించి రెడ్డి కులస్తులు అదికంగా ఉండే కాంగ్రెస్ లో చేరే అవకాశం లేదు గనుక, ఇక వైకాపాలో జేరుతారేమో మరి చూడాలి.