హిందూ ముస్లిం భాయ్ భాయ్.. మోహన్ భగవత్ నోట మత సామరస్యం మాట
posted on Jun 4, 2022 6:17AM
ఓడలు బళ్లు అవుతాయి, బళ్లు ఓడలవుతాయి అన్నది నానుడి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో కనిపిస్తున్న పరివర్తన లేదా మార్పు సరిగ్గా అలాంటిదేనని చెప్పవచ్చు. ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఒకప్పుడు హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని, దేశంలో మత సామరస్యానికి భగం కలిగించేలా హిందువులను రెచ్చగొట్టేలా ప్రసంగాలూ, కార్యక్రమాలు చేస్తుంటారని భావించే వారు.
కానీ తాజాగా మోహన్ భగవ్ మాటలు వింటే.. ఆర్ఎస్ఎస్ దేశంలో మత సామరస్యం కోరుకుంటోందనీ, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్న నినాదాన్ని భుజానికెత్తుకుంటోందనీ అవగతమౌతుంది. ఆలస్యంగానైనా సరే జ్ణానోదయం అయితే మంచిదే. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లోబాబ్రీమసీదు విషయంలో తమ ఆందోళన ప్రజాభీష్టం మేరకేనని చెబుతూనే.. దేశంలో అన్ని మసీదులనూ వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. మసీదుల్లో జరిగేదీ ప్రార్థనేనని, శివలింగం కోసం మసీదుల్లో అన్వేషించడానికి ఆర్ఎస్ ఎస్ వ్యతిరేకమనీ అన్నారు. అయినా చరిత్రను మార్చడానికి మనమెవరం అని కూడా అన్నారు. గత ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో పెచ్చరిల్లిన విద్వేషభావం దేశంలో సామరస్యాన్ని దెబ్బతీస్తుందని ప్రజాస్వామిక వాదులు ఆందోళన చెందుతున్న సమయంలో బీజేపీకి సైద్ధాంతిక పునాది వంటి ఆర్ఎస్ఎస్ లో ఇటువంటి పరివర్తన కచ్చితంగా ఆహ్వానించదగ్గదే.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మసీదులను తవ్వుదాం అంటూ చేసిన వ్యాఖ్యలను నేరుగా ఖండించకపోయినా..ప్రతి మసీదులోనూ శివలింగాన్ని వెతకాల్సిన అవసరమేమిటన్న మోహన్ భగవత్ ప్రశ్న బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ గానే పరిగణించాల్సి ఉంటుంది. రాజకీయ పబ్బం కోసం పార్టీల నేతలు దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం తగదన్న హెచ్చరికలాంటి సూచనా మోహన్ భగవత్ మాటల్లో ఉంది. పక్కా రాజకీయం కోసం బీజేపీ వెంపర్లాడుతుంటే. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా విద్వేష పూరిత ప్రసంగాలతో రెచ్చిపోతున్న బండి సంజయ్ కు ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు చెంపపెట్టు లాంటివనడంలో సందేహం లేదు.
రాష్ట్రంలోని మసీదులన్నిటినీ తవ్వుదా.. శివలింగాలు మాకు, శవాలు దొరికితే మీకు అంటూ ముస్లింలను ఉద్దేశించి బండి చేసిన వ్యాఖ్యలకు మోహన్ భగవత్ గట్టి కౌంటర్ ఇచ్చినట్లైంది. నాగపూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన నేరుగా బండి పేరును, బండి వ్యాఖ్యలను ప్రస్తావించకపోయినా జ్ణానవాపి మసీదు వివాదంపై స్పందిస్తూ దేశంలోని ప్రతి మసీదులోనూ శివలింగం కోసం వెతకాల్సిన పనేమిటని ప్రశ్నించారు. జ్ణానవాపి మసీదు వివాదంలో విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై కోర్టు నిర్ణయానికే వదిలేయాలన్నారు.
ఎక్కడో ఒక మసీదులో శివలింగం ఉందని అన్ని మసీదుల్లోనూ ఎందుకు వెతకాలి? దీని కోసం మరో ఉద్యమం చేపట్టేందుకు ఆర్ఎస్ఎస్ రెడీగా లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో హిందువులు కానీ ముస్లింలు కానీ ఆ వివాదాన్ని సృష్టించలేదని, ఆహ్వానించలేదనీ జ్ణానవాపి మసీదులో శివలింగం లభ్యం కావడంపై మోహన్ భగవత్ అన్నారు. జ్ణానవాపి కోసం మరో ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమన్నారు. అయోధ్య విషయం వేరనీ, అక్కడ రామమందిరం ప్రజాభీష్టం కనుక అందుకోసం ఉద్యమించామన్నారు. జ్ణానవాపి మసీదు విషయంలో ప్రజలు ఆందోళనలు, ఉద్యమాలూ కోరుకోవడం లేదని మోహన్ భగవత్ అన్నారు.హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నదే తమ సిద్ధాంతమంటూ.. నేటి ముస్లింల పూర్వీకులు హిందువులేననీ, మసీదుల్లో జరిగేవి కూడా ప్రార్ధనలేని మోహన్ భగవత్ అన్నారు.