తమకంటే ఎమ్మెల్యే లకే ఎక్కువ విలువ.. వైసీపీ ఎంపీల ఆవేదన!!

  ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. పార్లమెంటరీ సమావేశంలో వైయస్ఆర్సీపి పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలకు ఇచ్చినంత ప్రాధాన్యత  తమకు ఇవ్వడం లేదని కినుకు వహించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ ఎంపీలు తమ అసహనాన్ని దాచుకోవడం లేదు, పార్టీ లైన్ దాటితే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని జగన్ హెచ్చరికలు జారీ చేసి మరీ పంపినప్పటికీ వైసిపి ఎంపిలు ఎవ్వరు కూడా లెక్కచేయలేదు. తెలుగు మీడియం కోసం రఘురామ కృష్ణంరాజు పార్లమెంట్ లోనే ప్రశ్నలు సంధించారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసుకునేందుకు విజయసారెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఎంపీలు తమ అసంతృప్తిని పూర్తిస్థాయిలో బయటపెట్టారు.ఈ సమావేశానికి పలువురు ఎంపీలు డుమ్మాకొట్టారు. మిగిలిన వారిలో అనేక మంది తమ తమ నియోజక వర్గాల్లో తమకు ఎదురవుతున్న పరిస్థితులను ఏకరవు పెట్టారు.  తమకంటే ఎమ్మెల్యే లకే ఎక్కువ  విలువ లభిస్తోందనీ తమ మాటలను అసలు పట్టించుకునే వారే లేరని అలాంటప్పుడు తాము పదవిలో ఉండి ఏం ప్రయోజనమని విజయసాయిరెడ్డిపై ఎంపిలు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తొంది. ఎమ్మెల్యేలతో సమానంగా తమకూ అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి పనికీ ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవడం ఏదైనా చెయ్యాలంటే వారు అడ్డుపడటం సహజంగా మారిపోయిందన్నారు. జగన్ తో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఈ విషయాలన్నింటినీ తీసుకెళ్లండంటూ విజయసాయిరెడ్డిని ఎంపీలు కోరారు. నామినేటెడ్ పదవుల భర్తీలో కూడా ఎంపీల మాటలను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. పదవులన్నీ ఎమ్మెల్యేలే భర్తీ చేస్తే ఇక తమకంటూ ప్రాధాన్యం ఏముంటుందని ప్రశ్నించినట్లుగా సమాచారం. ఇటీవల కాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో జాతీయ స్థాయిలో జగన్ పాలన పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని ఎంపీలు అభిప్రాయపడ్డారు.అందుకే జగన్ ప్రభుత్వ విధానాల్లో జాతీయంగా ప్రచారం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఎంపీలకు విజయసారెడ్డి సూచించారు. టిడిపి ఎంపీలు జగన్ కు వ్యతిరేకం గా పార్లమెంట్ లో మాట్లాడితే అడ్డుకోవాలని సూచించారు. ఇతర పార్టీల ఎంపీలకు జగన్ పాలన గొప్పతనాన్ని వివరించాలని సూచించారు.

బ్రేకింగ్... కాకతీయ యూనివర్సిటీలో 38 అధ్యాపకుల తొలగింపు

  కాకతీయ యూనివర్సిటీలో 38 మంది అధ్యాపకుల తొలగింపు వివాదం ముదురుతుంది. తమను తొలగించడం అన్యాయమని బాధితులు నిరసన తెలుపుతుంటే.. మరో అధ్యాపక బృందం వారిని తప్పు పడుతోంది. పాలక వర్గం తీసుకున్న నిర్ణయం సమంజసమైనదేనని చెబుతున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 38 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ ల తొలగింపు వివాదం రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతుంది. 38 మంది కూడా అక్రమంగా విధుల్లోకి చొరబడ్డారని మరో వర్గం ఆరోపిస్తోంది. అయితే ప్రభుత్వం తాజాగా కొత్త పాలక వర్గాన్ని నియమించటంతో.. వారిని కొత్త పాలక వర్గం నుంచి తొలగించడం జరిగింది. అలా తొలగించిన రోజు నుంచి ఏదో ఒక ఆందోళన చేస్తూనే ఉన్నారు. అప్పటివరకు ఈ ప్రొఫెసర్లను పొగిడిన వాదంతా.. వాళ్ళ తొలగింపుపై పాలకవర్గం తీసుకున్న నిర్ణయం సక్రమమే అంటున్నారు. ఆ ప్లేస్ లో వేరే ఎలిజిబుల్ క్యాండెట్స్ కు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. మొత్తంగా కాకతీయ యూనివర్సిటీలో ఆధ్యాపకుల తొలగింపు విషయంలో జరుగుతున్న వివాదం  చివరకు ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.  

ప్రభుత్వానిది పంతం..మాది పట్టుదల.. సమ్మె విడువం :- ఆర్టీసీ జేఏసీ

  పంతం.. పట్టుదల..తో ఆర్టీసీ కార్మికుల సమ్మె 47 వ రోజుకు చేరింది. ఒక వైపు వరుస చర్చలు.. మరోవైపు ఆందోళనలు.. ఇంకో వైపు కోర్టు వాదనలు ఎన్ని జరుగుతున్న సమ్మెకు మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు. ఈ క్రమంలోనే ఇవాళ ( నవంబర్ 20న ) మరోసారి రాజకీయ పార్టీలతో  భేటీకానుంది ఆర్టీసీ జేఏసీ. సమ్మెపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో  ఏ నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం పంతం వీడటం లేదు.. కార్మిక నేతలు పట్టుదల వదలడంలేదు.. నిర్విరామంగా కొనసాగుతున్న సమ్మెను కొనసాగించాలా వద్దా అనే దానిపై అశ్వత్థామరెడ్డి సారధ్యంలో టీఎంయూ కార్మికుల సమావేశం. రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఈయూ సిబ్బంది భేటీలు విడివిడిగా జరిగాయి. అయితే తుది నిర్ణయం కోసం జరుగుతున్న చర్చల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజిరెడ్డి వర్గం సమ్మె కొనసాగించాల్సిందే అని నినాదాలు చేసింది. మొత్తంగా డిపోల వారీగా అభిప్రాయాలు సేకరించే పనిలో పడ్డారు జేఏసీ నాయకులు. ఉన్నపళంగా సమ్మె విరమిస్తే ఉద్యోగ భద్రత మాటేంటని ప్రశ్నిస్తున్నారు కొందరు కార్మికులు. సమ్మె విరమించిన ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంటుందా లేదా అన్న అనుమానం ఉండడంతో వేచి చూడాలని చెబుతున్నారు. మ్యాటర్ లేబర్ కోర్టుకు వెళ్లింది కాబట్టి ఆ నిర్ణయం వచ్చే వరకు వేచి చూద్దామంటున్నారు. రకరకాల అభిప్రాయాలున్న నేపథ్యంలో ఏం చేద్దామన్నా దానిపై జేఏసీ నేతలంతా ఒకసారి భేటీయ్యారు. మొత్తంగా సమ్మె ఆగాలా సాగాలా అన్న దానిపై ఇవ్వాల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని జేఏసీ మీటింగ్ తర్వాత చెప్పారు అశ్వత్థామరెడ్డి.  

జగన్ కు ఎదురుదెబ్బ :- మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్న వైసీపీ ఎంపీ రాజు

  ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా పార్టీ నేతలు ఎవరు మాట్లాడినా కఠినంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ హెచ్చరించినట్లు తెలిసింది. పేద పిల్లల అభ్యున్నతి కోసమే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నామని ప్రభుత్వం చెబుతుంది. లోక్ సభలో తమ ప్రభుత్వ వైఖరికి భిన్నంగా మాట్లాడిన ఎంపీ రఘురామకృష్ణం రాజు పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ ఇన్ చార్జ్ వైవి సుబ్బారెడ్డితో మాట్లాడి రఘురామకృష్ణం రాజు వివరణ తీసుకోవాలని ఆదేశించారు జగన్. ఈ విషయం టీవీ చానళ్లలో రాగానే రఘురామకృష్ణం రాజు స్పందించారు. తాను పార్లమెంటులో తప్పేమీ మాట్లాడలేదని ప్రముఖ ఛానెల్ ఆంధ్రజ్యోతికి తెలిపారు. నేను ఇంగ్లిష్ మీడియం వద్దని కానీ తెలుగు మీడియమే కావాలని కానీ చెప్పలేదు. మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్న 350, 350 A అధికరణలు గురించే ప్రస్తావించాను. నా ప్రసంగంలో ఇంగ్లీష్ అనే పదమే రాలేదు. ప్రాచీన భాషా కేంద్రాన్ని మైసూరు నుంచి ఏపీకి మార్చడం గురించి నేను చేసిన ప్రశ్న అది. నాకు ఇష్టమైన తెలుగు భాషకు సంబంధించిన ప్రశ్న కావడంతో నేను మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుకు అన్యాయం చేస్తోందని తెలుగు మీడియం తీసేస్తోందని టిడిపి ఎంపి కేశినేని నాని అన్నారు. అయితే జగన్ సీఎం అయ్యాక తెలుగుకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని తెలుగు వారికి గర్వకారణమైన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతిని తెలుగు అకాడమి అధ్యక్షురాలిగా నియమించారని చెప్పాను. తెలుగు అకాడమీ విభజన ఇంకా జరగలేదని ఆస్తుల విభజన జరిగితే ఏపీకి 200 కోట్లు వస్తాయని కేంద్రం దృష్టికి తెచ్చారు. మాతృభాషకు సంబంధించి రాజ్యాంగంలోని 350,350A ప్రకారం కేంద్రమే ఈ బాధ్యత తీసుకోవాలని అన్నాను. ఇంతకు మించి ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 350,350A అధికరణంలోని మాతృభాష బోధన గురించి ప్రస్తావించారు కదా అని అడిగినప్పుడు రాజ్యాంగం ప్రకారం మాతృ భాష పరిరక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరాను. ఆ మాతృభాష ఏదైనా కావచ్చు అని తెలిపారు. తెలుగు భాష వేరు..మాధ్యమం వేరు.. తెలుగును పరిరక్షించుకోవాలన్నది మా పార్టీ సిద్ధాంతం కూడా అందుకే తెలుగు అకాడమీని జగన్ పునరుద్ధరించారని తెలిపారు. అయితే పార్లమెంట్లో తాను ఆంగ్లంలో చేసిన ప్రసంగాన్ని అర్ధం చేసుకోలేక జగన్ కి ఎవరైనా తప్పుగా చెప్పారేమోనని సందేహం వ్యక్తం చేశారు. తననెవరూ సంజాయిషీ అడగలేదని అడిగితే ఇదే వివరణ ఇస్తానన్నారు. నేను తెలుగు భాషకు మద్దతుగా మాట్లాడాను. ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించలేదు, తరవాత జరిగిన ఓ టీవీ చర్చలోనూ సీఎం నిర్ణయాన్ని సమర్థించారు. అయినా నిప్పులేనిదే పొగరాదు అంటారు. నన్ను సంజాయిషీ అడిగితే వీడియోలతో సహా వివరణ ఇస్తాను, ఆ బాధ్యత నాపై ఉంది. అలాగే నన్ను అపార్థం చేసుకుంటే అర్థం చేసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందని రఘురామ కృష్ణంరాజు చెప్పారు.తనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు రాగానే రఘురామకృష్ణం రాజు తానే వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ చేసినట్లు తెలిసింది. లోక్ సభలో మాట్లాడేటప్పుడు చట్టాలను నిబంధనలకు కోట్ చేయాల్సి ఉంటుంది. అందుకే రాజ్యాంగంలోని అధికరణలను ప్రస్తావించానని చెప్పినట్లు సమాచారం. దీనిపై ఈరోజు ( నవంబర్ 20న ) మాట్లాడదామని వైవి సుబ్బారెడ్డి బదులిచ్చినట్లు తెలిసింది. నిజానికి రఘురామకృష్ణం రాజు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారంటూ జగన్ అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీకి సమాచారం ఇవ్వకుండా కేంద్ర మంత్రులను.. ప్రధానిని కలుస్తున్నారని.. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎంపీలతో జరిగిన భేటీలో పరోక్ష హెచ్చరికలు చేశారని చెబుతున్నారు. ఈలోపే మాతృ భాషపై ఎంపీ చేసిన ప్రసంగం జగన్ కు మరింత ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం  

చంద్రబాబు మారాడు... 10 నిమిషాల్లోనే జై తెలుగుదేశం అంటున్నారు

టిడిపి అధినేత చంద్రబాబు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమిపై రెండు రోజులుగా సమీక్షలు జరుపుతున్నారు. నియోజకవర్గంల్లో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. పనిలో పనిగా తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉంటారు.. ఎవరు పోతారో అనే విషయం పై కూడా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సమీక్షలో భాగంగా చంద్రబాబు ఈ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల పార్టీకి గన్నవరం ఎమ్మెల్యే వంశీ, టీడీపీ నేత దేవినేని అవినాష్ గుడ్ బై చెప్పారు. దీంతో పార్టీకి ఏ నేతలు దూరంగా ఉంటున్నారు అనే వివరాలను చంద్రబాబు సేకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు రోజుల సమీక్ష సమావేశాల్లో కూడా చంద్రబాబు ఈ విషయం పై ఫోకస్ పెట్టారు. జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లలో టిడిపి కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచింది. 13 సీట్లు కోల్పోయింది. ఇక్కడ పార్టీని స్ట్రాంగ్ చేసే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఇక్కడ నాయకత్వం యాక్టివ్ గా ఉందా లేదా అనే విషయాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. మరోవైపు సమీక్ష సమావేశాల్లో చంద్రబాబును చూసిన కార్యకర్తలు ఇప్పుడు ఓ విషయంలో తెగ సంబరపడిపోతున్నారు. ఇంతకు ముందు చంద్రబాబు మీటింగ్ అంటేనే కార్యకర్తలు భయపడిపోయేవారు. సమీక్షల పేరిట ఆయన గంటలు గంటలు జరిపేవారు. మైకు అందుకుంటే గంటన్నరకు పైగా మాట్లాడేవారు. దీంతో చెప్పిందే చెప్పి చంద్రబాబు విసిగించేవారని కార్యకర్తలు విసిగిపోయారు. అయితే ఇపుడు చంద్రబాబు సమీక్షలు జరుపుతున్న తీరు చూసిన నేతలు కార్యకర్తలు మాత్రం కొత్త విషయం చెబుతున్నారు. చంద్రబాబు మారారు గంటలు గంటలు మాట్లాడలేదు. కేవలం 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే పరిమితమవుతున్నారు. ఏదైనా విషయం సూటిగా సుత్తి లేకుండా చెప్తున్నారు. దీంతో మీటింగ్ అంటే భయపడే పరిస్థితి పోయిందని కార్యకర్తలంటున్నారు. మొత్తానికి చంద్రబాబు మారరని కార్యకర్తలూ స్టాంప్ వేశారు. ఇక నేతలు ఏం చెబుతారో చూడాలి.

ఎస్సీగా నిరూపించుకోండి... వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి సమన్లు...

  తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి... కుల వివాదంపై విచారణ మొదలైంది. తనను కులం పేరుతో దూషించారంటూ ఉండవల్లి శ్రీదేవి ఫిర్యాదు చేయడంతో తుళ్లూరు పోలీసులు పలువురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే, ఉండవల్లి శ్రీదేవి అసలు ఎస్సీనే కాదని, ఆమె క్రిస్టియన్ అంటూ నిందితులు, అలాగే లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం... జాతీయ మానవ హక్కుల కమిషన్ అండ్ జాతీయ ఎస్సీ కమిషన్ తోపాటు రాష్ట్రపతిని ఆశ్రయించారు. తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందిన శ్రీదేవి ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దాంతో, ఉండవల్లి శ్రీదేవి... హిందువో... క్రిస్టియనో... తేల్చాలంటూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యానికి ఆదేశాలు వచ్చాయి. అయితే, ఉండవల్లి శ్రీదేవి... క్రిస్టియన్ కాదు... హిందువు అంటూ రిపోర్ట్ ఇవ్వాలంటూ సీఎంవో నుంచి ఒత్తిడి వచ్చిందని, దానికి ఎల్వీ ఒప్పుకోకపోవడంతో... ఆకస్మిక బదిలీ చేశారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎన్నికల కమిషన్ కు కూడా ఆదేశాలు వెళ్లడంతో... ఈసీ ఆర్డర్స్ మేరకు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్... తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సమన్లు పంపారు. నవంబరు 26న మధ్యాహ్నం విచారణకు రావాలని ఆదేశించారు. ఎస్సీగా నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలు, ఆధారాలతో రావాలని, కావాలంటే బంధువులను కూడా వెంట తెచ్చుకోవచ్చని సూచించారు. అమెండ్-మెంట్ 1950 పేరా 3 ప్రకారం దళితులు మతం మార్చుకుంటే ఎస్సీ హోదాను, రిజర్వేషన్ హక్కులను కోల్పోతారని... ఉండవల్లి శ్రీదేవి తాను క్రిస్టియన్ అని చెప్పుకున్నందున ఆమె ఎన్నిక చెల్లదని లీగల్ రైట్స్ ప్రోటెక్షన్ ఫోర్స్ అంటోంది. అయితే, ఈ దళిత క్రిస్టియన్ వివాదం ఎప్పట్నుంచో ఉంది. ఎస్సీలు... క్రైస్తవ్యంలోకి వెళ్తే... రిజర్వేషన్లను కోల్పోతారని, వాళ్లు బీసీ-సీగా పరిగణించబడతారని రాజ్యాంగం చెబుతోంది. అయితే, పుట్టిన కులం ఎలా మారుతుందని... కులం వేరు... మతం వేరంటూ పలు సందర్భాల్లో కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అయితే, ఎవరైతే క్రైస్తవ్యంలోకి వెళ్తారో... వాళ్లు స్వచ్ఛందంగా బీసీ-సీ సర్టిఫికెట్ తీసుకుంటే తప్ప... ఎస్సీ హోదా పోయే అవకాశమే లేదు. ఒకవేళ బీసీ-సీలోకి వెళ్లినా... ఆ వ్యక్తి యొక్క సామాజిక గుర్తింపు అంటే సమాజపరంగా అతని కులం... ఇతరులు గుర్తించే విధానం కూడా మారే అవకాశం లేదు. క్రైస్తవ్యాన్ని స్వీకరించినా, హిందుత్వంలో ఉన్నా... ఏ కులంలో అయితే పుట్టాడో... ఆ కులంతోనే ఆ వ్యక్తిని సమాజం గుర్తిస్తుంది... పిలుస్తుంది. మరి అలాంటప్పుడు కులం ఎలా మారుతుందనే ప్రశ్న వస్తోంది. అయితే, ఇఫ్పుడు తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి... హిందువా? లేక క్రిస్టియనా? తేల్చాలంటూ ఏకంగా రాష్ట్రపతి కార్యాలయం... అలాగే ఎన్నికల కమిషన్ నుంచే ఆదేశాలు రావడంతో.... తేనెతుట్టెను కదిపినట్లయ్యింది. అయితే, టెక్నికల్ గా ఉండవల్లి శ్రీదేవి బీసీ-సీలోకి మారనంతవరకు ఆమె ఎస్సీగానే పరిగణించబడుతుంది. చర్చికి వెళ్తుంది కాబట్టి ఆమె ఎస్సీ కాదని తేల్చడం అంత ఈజీ పని కాదు. అందుకు ఎన్నో అడ్డంకులు వస్తాయి. కేవలం శ్రీదేవి మాటలను పరిగణనలోకి తీసుకుని ఆమె ఎస్సీ హిందువు కాదు... క్రిస్టియన్ అని తేల్చితే మాత్రం... అది శ్రీదేవి ఒక్కరితో పోదు... దాదాపు ఎస్సీ ప్రజాప్రతినిధులందరి మెడకు చుట్టుకుంటుంది. ఎందుకంటే ఎస్సీ ప్రజాప్రతినిధుల్లో అధికశాతం క్రైస్తవ్యాన్ని అనుసరించేవాళ్లు ఉన్నారనేది కాదనలేని నిజం. ఒకవేళ ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ కాదని జేసీ నివేదిక ఇస్తే మాత్రం ఎమ్మెల్యే పదవి కోల్పోవడం ఖాయం. అదే సమయంలో ఇతర ఎస్సీ ప్రజాప్రతినిధులపైనా ఇలాంటి కేసులు, ఫిర్యాదులు రానున్నాయి. ఎందుకంటే అట్రాసిటీ కేసులు, మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న హిందూ సంస్థలు, కొన్ని వర్గాలు.... ఆయా ఎస్సీ ప్రజాప్రతినిధుల క్రైస్తవ మూలాలపై ఆధారాలు సేకరించి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి, ఉండవల్లి శ్రీదేవి కుల వివాదం ఎలాంటి సంచలనాలకు తెరలేపుతుందో చూడాలి.

తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్... సతమతమవుతోన్న లక్ష్మణ్...

  తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. పాత, కొత్త నేతల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది. కొత్తగా పార్టీలో చేరిన నేతలకు, పాత లీడర్లకు అస్సలు పొసగడం లేదు. క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకునే బీజేపీలో ఈ పాత... కొత్త పంచాయతీ రాష్ట్ర నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ బలపడటానికి ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తూ, పార్టీలో చేర్చుకుంటున్న బీజేపీ... ఆ తర్వాత వాళ్లకు కీలక పదవులు కట్టబెట్టడంతోనే అసలు తంటా వస్తోంది. ముఖ్యంగా కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలను కోర్ కమిటీలోకి తీసుకోవడంపై పాత కాపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు వాళ్లకు ఏ అర్హతలున్నాయని కోర్ కమిటీలోకి తీసుకుంటున్నారని రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జాతీయస్థాయిలోనైనా... రాష్ట్రస్థాయిలోనైనా... బీజేపీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా... కోర్ కమిటీ ఆమోదమే కీలకం. కోర్ కమిటీ తీసుకునే నిర్ణయాలకు నేతలంతా శిరసావహించాల్సిందే. అయితే, ఆ కోర్ కమిటీలోకి ఎవరి తీసుకోవాలనే విచాక్షణాధికారం పూర్తిగా ఆయా అధ్యక్షులకే ఉంటుంది. అయితే, అలాంటి కీలకమైన కోర్ కమిటీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను నేరుగా తీసుకోవడాన్ని పలువురు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన డీకే అరుణ, జితేందర్ రెడ్డి, పెద్దిరెడ్డి, పొంగులేని సుధాకర్ రెడ్డి, గరికపాటి, వివేక్... ఇలా పలువురికి కోర్ కమిటీలో చోటు కల్పించారు. అయితే, కీలకమైన కోర్ కమిటీలోకి కొత్తగా వచ్చినవారిని చేర్చుకుంటూపోతే... ఎప్పట్నుంచో పార్టీలో కొనసాగుతున్న సీనియర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకున్న లీడర్లకు సైతం కీలక కమిటీల్లో చోటు కల్పించకుండా... ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లకు పెద్దపీట వేయడం సరికాదంటున్నారు.   అసలు ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందని పొంగులేటి లాంటి లీడర్లను కూడా కోర్ కమిటీలోకి ఎలా తీసుకుంటారని రాష్ట్ర నాయకత్వాన్ని సీనియర్లు నిలదీస్తున్నారు. అయితే, ఈ పాత-కొత్త పంచాయతీతో తలపట్టుకుంటున్న టీబీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్... ఇది తాత్కాలిక కమిటీ మాత్రమేనని, త్వరలో సీనియర్లతో చర్చించి, అందరికీ న్యాయం చేస్తామని బుజ్జగిస్తున్నారట. ముఖ్యంగా ధర్మారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ లాంటి నేతలు... రాష్ట్ర నాయకత్వంపై మండిపడినట్లు తెలుస్తోంది. అయితే, లక్ష్మణ్ ఎంత ప్రయత్నించినా పాత-కొత్త వాళ్ల మధ్య అంతరాన్ని తగ్గించలేకపోతున్నారని... పాతవాళ్లను నొప్పించకుండా... కొత్తవారిని నిరుత్సాహపర్చకుండా... ఇద్దర్నీ ఏకతాటిపైకి తీసుకురావడం పెను సవాలుగా మారిందని అంటున్నారు.

లోక్ సభలో ఇదే నినాదం... గాంధీ కుటుంబానికి భద్రత ఎందుకు తీసేసారు ?

గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఎత్తివేయడంపై లోక్ సభలో నిలదీశారు కాంగ్రెస్ పార్టీ అధినేత రంజన్ చౌదరి. ఎందుకు అకస్మాత్తుగా భద్రతను తొలగించారో  చెప్పాలని ప్రశ్నించారు. గాంధీ ఫామిలీకి మాజీ ప్రధాని వాజ్ పేయి కూడా ఎస్పీజీ ద్వారా భద్రత కల్పించారని గుర్తు చేశారు. 1991 నుంచి 2019 వరకు రెండు సార్లు ఎన్డీయే అధికారం లోకి వచ్చిందని ఆ సమయంలో ఎప్పుడూ ఎస్పీజీ భద్రత తొలగించలేదన్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ భద్రత తొలగింపుపై ప్రధాని మోదీ , హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో సుమారు 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వెల్ లోకి దూసుకువెళ్లారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఆ తరువాత సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ ఒంటరి గానే పార్లమెంటుకు వచ్చారు. ఆమెతో పాటు కారులో వచ్చిన సీఆర్పీఎఫ్ జవాన్ ను ఒకటో నెంబర్ గేటు వద్దే ఆపేశారు. సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలకు ఎస్పీజీ భద్రత తొలగించిన తర్వాత సీఆర్పీఎఫ్ దళాలు వారికి సెక్యూరిటీని కల్పిస్తున్నాయి. అటు సోనియా గాంధీ కుటుంబ భద్రతపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంచలన లేఖ రాసింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అతని భార్య గురుషరణ్ కౌర్ ల భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అందించాలని సీఆర్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కు లేఖ రాసింది. ఈ నెల 8 వ తేదీన సోనియా గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించి జడ్ ప్లస్ కేటగిరి రక్షణ భద్రతలను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్పగించిన నేపథ్యంలో ఈ లేఖ రాసింది. సోనియా గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఉన్నప్పుడు కేటాయించిన టాటా సఫారీ స్కార్పియో బుల్లెట్ ప్రూఫ్ కారులను వినియోగించేవారు. ఎస్పీజీ భద్రతను తొలగించడంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలని కూడా ఎస్పీజీ ఉపసంహరించుకుంది. సోనియా గాంధీ కుటుంబానికి ఒక్కొక్కరికి వంద మంది సాయుధ కమాండోలతో జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించిన నేపథ్యంలో బులెట్ ప్రూఫ్ వాహనాలని కూడా సత్వరం అందించాలనీ సీఆర్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ను కోరింది.

రఘురామకృష్ణంరాజుపై జగన్ సీరియస్... క్రమశిక్షణా చర్యలు ఉంటాయని వార్నింగ్

  నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు జగన్ దృష్టికి రావడంతో సీఎం మండిపడ్డారు. అలాగే, రఘురామకృష్ణంరాజు వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన జగన్మోహన్ రెడ్డి.... నరసాపురం ఎంపీ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇంగ్లీష్ మీడియంపై రాష్ట్రంలో రగడ జరుగుతున్నవేళ... లోక్ భలో రఘురామకృష్ణంరాజు... మాతృభాషా పరిరక్షణపై అస్పష్టంగా మాట్లాడారని జగన్ దృష్టికి వెళ్లింది. మీడియాలో కూడా ఆవిధంగా కథనాలు రావడంతో... పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డితో చర్చించిన జగన్మోహన్ రెడ్డి.... పార్లమెంట్ లో రఘురామకృష్ణంరాజు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా పార్టీలో ఎవరు మాట్లాడినా క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించిన జగన్.... రఘురామకృష్ణంరాజుకి క్లాస్ పీకాలని వైవీని ఆదేశించారు. అంతేకాదు, ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా... పేద పిల్లల అభ్యున్నతిని అడ్డుకోవడమేనన్నారు. అయితే, తాను తెలుగు భాష అభివృద్ధి గురించి మాత్రమే లోక్ సభలో మాట్లాడానని, తమ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీష్ మీడయానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనలేదని రఘురామకృష్ణంరాజు మీడియాకి వివరణ ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా తాను మాట్లాడాననడం పచ్చి అబద్ధమన్నారు. అసలు, ఇంగ్లీష్‌ అన్న పదమే వాడలేదని చెప్పారు. కావాలంటే లోక్ సభలో తాను మాట్లాడిన ప్రసంగ వీడియోను చూడొచ్చని అన్నారు. తాను ఎప్పుడూ ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించలేదని తెలిపారు. తెలుగు భాషను ప్రేమించడమే తప్పయితే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అంటున్నారు.  తెలుగు భాషకు అన్యాయం చేస్తున్నారంటూ టీడీపీ ఎంపీ కేశినేని ఆరోపణలు చేయడంతో... తాను కౌంటర్ ఇచ్చానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తెలుగు భాషాభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం ఏమీచేయలేదని... చంద్రబాబు హయాంలో తెలుగు అకాడమీనే పట్టించుకోలేదని... కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక... తెలుగు అకాడమీని పునరుద్ధరించారని లోక్ సభ దృష్టికి తీసుకెళ్లానన్నారు. అయితే, తెలుగు అకాడమీ విభజన జరగకపోవడంతో నిధులు ఆగిపోయాయని, త్వరగా విభజన పూర్తిచేసి నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అంతేగాని, ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తూ ఒక్క మాట కూడా తాను అనలేదన్నారు. అయినా తాను ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం కాదన్నారు. తనను ఎవరూ సంజాయిషీ అడగలేదని, కేవలం మీడియాలో వార్తలను చూసే స్పందిస్తున్నానని అన్నారు. ఒకవేళ సంజాయిషీ అడిగితే వివరణ ఇస్తానన్నారు రఘురామకృష్ణంరాజు. అయినా, తెలుగు భాష... ఇంగ్లీష్ మీడియం వేర్వేరు అంశాలన్న రఘురామకృష్ణంరాజు.... తెలుగు అంటే తనకెంతో ఇష్టమని... తెలుగు భాషను తాను ప్రేమిస్తానని... తెలుగు అంటే తనకు ప్రాణమని చెప్పుకొచ్చారు. ఒకవేళ తెలుగు భాషను ప్రేమించినందుకు తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటానంటే అందుకు సిద్ధమేనన్నారు. తెలుగు భాషాభివృద్ధికి నిధులు అడగడం నేరమైతే... తాను శిక్షార్హుడినే అంటున్నారు రఘురామకృష్ణంరాజు. మరి, రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలిపై ఎప్పట్నుంచో గుర్రుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ప్రియురాలి కోసం వెళ్లాడా? లేక రా ఏజెంటా? పాక్ మీడియా ఉగ్రవాద ముద్ర ఎందుకేస్తోంది?

  పాకిస్తాన్‌ చెరలో ఉన్న తెలుగు యువకుడు ప్రశాంత్‌ను క్షేమంగా భారత్‌ రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత యువకుల అరెస్ట్‌పై వివరాలు ఇవ్వాలని ఇప్పటికే పాకిస్తాన్‌ను కోరిన కేంద్ర హోంశాఖ.... పాక్‌ సమాధానం తర్వాత తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తోంది. పాస్ పోర్ట్‌, వీసా లేకుండా తమ భూభాగంలోకి ప్రవేశించారంటూ ప్రశాంత్‌ను పాకిస్తాన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రశాంత్‌తోపాటు మధ్యప్రదేశ్ వాసి వారిలాల్‌ను కూడా అరెస్ట్ చేశారు. అనంతరం ఇద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టి...జైలుకు తరలించారు. ప్రశాంత్‌పై పాక్ చట్టం 334/4 కింద అభియోగాలు నమోదు చేశారు. అలాగే, విశాఖ గాజువాకలో ప్రశాంత్ అదృశ్యమైనట్లు పాకిస్తాన్ తన ఎఫ్‌ఐఆర్‌తో పేర్కొంది. అయితే, ప్రశాంత్‌ను ఇంటర్వ్యూ చేసిన పాకిస్తాన్ మీడియా... ఉగ్రకోణంలో కథనాలు ప్రసారం చేస్తోంది. ప్రశాంత్ సాఫ్ట్ వేర్ కావడంతో.... అధునాతన పద్ధతిలో ఉగ్రదాడి చేయడానికి పాక్‌‌లోకి పంపారంటూ అనుమానాలను వ్యక్తంచేస్తోంది. అయితే, ప్రశాంత్... అసలు పాకిస్తాన్ బోర్డర్‌ దగ్గరకు ఎందుకు వెళ్లాడో తెలియదంటున్నారు తండ్రి బాబూరావు. బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు సహ ఉద్యోగి స్వప్నికతో ప్రేమలో పడ్డాడని, ఆమె కోసం కుటుంబంతో విభేదించి వెళ్లిపోయాడని తెలిపారు. అయితే, ప్రశాంత్ రెండేళ్ల నుంచి కనిపించడం లేదంటోన్న బాబూరావు.... గతంలో చైనా, ఆఫ్రికా దేశాలకు వెళ్లొచ్చాడని తెలిపారు. ఇక, ప్రశాంత్ అదృశ్యమైనట్లు 2017లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు సైబరాబాద్ సీసీ సజ్జనార్ తెలిపారు.  అయితే, ప్రశాంత్ ...ఎందుకు సరిహద్దులు దాటి వెళ్లాడు? నిజంగానే పాస్‌పోర్ట్, వీసా లేకుండా పాక్‌లో ప్రవేశించాడా? ఒకవేళ వెళ్తే ఎందుకెళ్లాడు? ఇలా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. తన ప్రియురాలిని వెతుక్కుంటూ వెళ్లాడని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే... మరోవైపు ప్రశాంత్ రా ఏజెంట్ అంటూ వదంతులు చెలరేగాయి. మరి, ప్రశాంత్ ఇష్యూ... భారత్‌-పాక్ మధ్య మరో దౌత్య వివాదంగా మారుతుందో? లేక విడిచిపెడుతుందో చూడాలి. అయితే, ఉగ్రదాడుల కోసమే పాకిస్తాన్లోకి ప్రవేశించారంటూ పాక్ మీడియా కథనాలు ప్రసారం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

జనసేనాని కలిసింది వాళ్లనేనా? పవన్ ఢిల్లీ టూర్ పై రూమర్లు

  జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన చడీచప్పుడు లేకుండా ముగిసిపోయింది. అలా వెళ్లారు... ఇలా వచ్చేశారు. అసలెందుకెళ్లారో... ఎందుకొచ్చేశారో కనీసం సమాచారమే లేదు. ప్రధాని మోడీ... కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని ప్రచారం జరిగినా... అసలు కలిశారో లేదో తెలియదు. అసలు, మోడీ-షా అపాయింట్ మెంటే దొరకలేదని ప్రచారం కూడా జరిగింది. అయితే, అంత సడన్ గా పవన్ ఢిల్లీ వెళ్లాడంటే... బీజేపీ లేదా కేంద్ర పెద్దల పిలుపు లేకుండా వెళ్లడని అంటున్నారు. కానీ, ఢిల్లీలో ఎవరెవర్నీ కలిశాడో మాత్రం బయటికి రాలేదు. దాంతో, పవన్ ఢిల్లీ పర్యటనలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ కంటే వెయ్యిరెట్లు ఎక్కువగా జగన్ సర్కారుపై విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్... ఎన్నడూలేనంత ఘాటు విమర్శలే చేశారు. అయితే, ఇసుక కొరతపై విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్... నవంబర్ మూడులోపు ప్రభుత్వం స్పందించకపోతే, ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలుస్తానని చెప్పారు. ఆ మాట ప్రకారమే పవన్ ఢిల్లీ వెళ్లొచ్చారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం ఇష్యూస్ పైనే పవన్ ఢిల్లీ వెళ్లొచ్చి ఉంటే... జనసేన ఎందుకు అధికారికంగా ప్రకటించలేదని అంటున్నారు. జనసేనాని ఢిల్లీ టూర్ వివరాలను బయటపెట్టకపోవడంతో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ టీడీపీ ఎంపీలే... పవన్ ను ఢిల్లీ రమ్మన్నారన్న ప్రచారం జరుగుతోంది. జగన్ సర్కారుపై పోరాడటానికి తన బలం సరిపోవడం లేదని... తనకు బీజేపీ పెద్దల మద్దతు కావాలంటూ వీళ్ల ద్వారా కాషాయ పెద్దలకు జనసేనాని విన్నవించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేనతోపాటు ఏపీలో బీజేపీ బలపడాలంటే... జగన్ పై పరోక్షంగానో... ప్రత్యక్షంగానో... ఉమ్మడి పోరాటం చేయాల్సి ఉందని... అందుకు కేంద్రం అండ్ కాషాయ పెద్దల మద్దతు కావాలని కోరినట్లు చెబుతున్నారు. అయితే, పవన్ ఢిల్లీ పర్యటనపై రకరకాల రూమర్లు వినిపిస్తుంటే... జనసేన వర్గాలు మాత్రం అది పర్సనల్ టూర్ అంటూ సింపుల్ గా తేల్చేస్తున్నారు.

చిక్కుల్లో సురేష్ బాబు... రామానాయుడు స్టూడియో పై ఐటీ దాడులు

హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో పై ఐటి అధికారుల దాడులు జరుపుతున్నారు. రామానాయుడు స్టూడియోస్ , సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఈ రోజు ( నవంబర్ 20న)  ఉదయం నుంచి ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. హుటాహుటిన అక్కడికి చేసురుకున్నారు సురేష్ బాబు. అధికారులను కలిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవన్ని ఎప్పుడు చేసే  సాధారణ సోదాలే కంగారు పడాల్సింది ఏమి లేదని అన్నారు. నిర్మాత సురేష్ బాబు ఇంట్లో ఉదయం ఐదు గంటల నుంచే సోదాలు జరుగుతున్నాయి. మొత్తం మూడు టీమ్స్.. మూడు చోట్ల శోదాలు కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి నిర్మాత సురేష్ బాబు నివాసం.. అపోలోఆస్పత్రికి దగ్గరలో ఉన్న సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయంతో పాటుగా.. రామానాయుడు స్టూడియోస్.. మొత్తం మూడు చోట్ల కూడా నాలుగు టీమ్స్ పూర్తిగా సోదాలు చేస్తున్నారు. గత కొంత కాలంగా ఐటీ రిసర్చ్ కి సంబంధించి సురేష్ ప్రొడక్షన్స్ కి సంబంధించి ఏవైతే లావాదేవీలు ఉన్నాయో వాటికి సంబంధించి డీలింగ్స్ ని కూడా సేకరిస్తున్నారు. మొత్తం ఈ మూడు కార్యాలయాలు ప్రధానంగా ఉన్నాయి కాబట్టి రామానాయుడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ మొత్తం ఈ మూడు చోట్ల ఐటీ సోదాలు చేస్తున్నారు. వాళ్ళ దెగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ల్స్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు. సురేష్ బాబు నడుపుతున్న థియేటర్లు నష్టంలో ఉన్నాయని ఆయన కొద్ది రోజుకు క్రితం తెలిపిన విషయం తెలిసిందే.

శ్రీవారి సొమ్ము భద్రంగా జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చెయ్యనున్నారు

  టిటిడి పాలక మండలి కీలక నిర్ణయం తీసుకోనుంది. శ్రీ వారి సొమ్మును ఇక పై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్ డ్ డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ బ్యాంకులో భద్రత లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకోనునట్లు తెలిపారు. త్వరలోనే 15 వందల కోట్లను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వంలో టీటీడీ సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో పలువురు భక్తులు కోర్టును ఆశ్రయించారు. 14 వందల కోట్లను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు సూచనల మేరకు జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేయాలని పాలక మండలి తీర్మానం తీసుకోనుంది. దీని పై ప్రతిపాదనను కూడా సిద్ధం చేసింది.అయితే టీటీడీ తీసుకోబోతున్న ఈ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీ వారి భక్తులు.  ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు వెయ్యి కోట్ల రూపాయలను ఇండస్ అండ్ బ్యాంక్ అనే ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. నేనొక భక్తుడిగా హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం వేశానని పిటీషన్ దాఖలు చేసిన వ్యక్తి తెలిపారు. హైకోర్టు చాలా ఘాటుగా స్పందించి జాతీయ బ్యాంకులు ఉండగా ప్రైవేటు బ్యాంకులో ఏ ఉద్దేశంతో డిపాజిట్ చేశారని చెప్పి టిటిడిని ప్రశ్నించటం జరిగింది. అప్పుడు తాత్కాలికంగా షార్ట్ టర్మ్ డిపాజిట్ కోసం వెయ్యి కోట్ల రూపాయల మేము ఇండస్ అండ్ బ్యాంక్ లో వేశామని ఆ గడువు ముగిసినాక వెనక్కి తీసుకుంటామని ఈవో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు దాదాపు 12 వేల కోట్ల రూపాయలు శ్రీవారి నిధులున్నాయి. ఆ నిధులన్ని కూడా ఖచ్చితంగా భవిష్యత్ లో జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ లు చేయాలి. భద్రత విషయం దృష్టిలో పెట్టుకొని ఉండాలని శ్రీ వారి భక్తుడు హెచ్చరించారు.

ఆంధ్రా నుండి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా!!

  కృష్ణా జిల్లా నందిగామలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఓ వైపు రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల ఉపాధి లేక కూలీలు అల్లాడుతుంటే మరోవైపు దర్జాగా అక్రమ రవాణా సాగిపోతుంది. కృష్ణా జిల్లా నుండి పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతున్న ఇసుక లారీలను చెక్ పోస్టు దగ్గర పోలీసులు పట్టుకున్నారు. నందిగామ డివిజన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా కట్టిన చర్యలు తీసుకుంటున్నామని.. అదే విధంగా 110 కిలో మీటర్లు ఉన్న డివిజన్ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. మొత్తం 7 చెక్ పోస్టులు, 6 మొబైల్ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు నందిగామ డీఎస్పీ చెప్పారు.  ఇటీవల కాలంలో నందిగామ పరిధిలో చెక్ పోస్టుల పరిధిలో పోలీసులు లారీలను పట్టుకున్నారు. జొన్నల గడ్డ, అనాసాగరం, కీసర ప్రాంతాల్లో లారీలను ఆపి పరిశీలిస్తే పాత బిల్లులతో పర్మిట్లు ఉన్నాయి. వాటిని ఉపయోగించి కృష్ణా జిల్లా నుంచి తెలంగాణకు ఇసుక తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు. పర్మిట్ లు తీసుకున్న వాహన దారులు మోతాదుకు మించి లోడ్ ను లారీల్లో నింపుతున్నట్లు ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు గుర్తించారు. వాటికి జరిమానా కూడా విధించారు. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు ఇసుక వారోత్సవాలు జరుపుతుంటే మరోవైపు అక్రమార్కులు ఏదో ఓ రూపంలో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

కొడాలి నానిని క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయాలి!!

  మంత్రి కొడాలి నానిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. తిరుమల ఆలయం పై మంత్రి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని  మండిపడ్డారు బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. శ్రీ వారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన మంత్రి నాని పై చర్యలు తీసుకోవాలంటూ..  ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్యమతస్థులు తిరుమల శ్రీ వారి దర్శనానికి వచ్చినపుడు డిక్లరేషన్ ఇవ్వాలన్న చట్టం కాపీలను ఆయన పోలీసులకు అందజేశారు. మంత్రి నాని పై కేసు నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని భానుప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక అయిన తిరుమల తిరుపతి దేవస్థానాల్లో గుడికి కానీ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తానంటే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలని.. గుడిని చట్టాల్ని అగౌరపరిచే విధంగా  రాష్ట్ర మంత్రివర్యులు కొడాలి నాని గారి వ్యవహార శైలి కోట్లాది మంది హిందువుల మనోభవాలు కించపరిచేలా ఉందని ఆయన తెలియజేశారు.  అయ్యా నాని గారు మీరు మాట్లాడే భాష కోట్లాది మంది శ్రీవారి భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి వెంటనే మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. మీరు మాట్లాడిన పదాలు కూడా నేను ఇక్కడ మాట్లాడలేనని.. కానీ భక్తులందరికీ తెలిసిరావాలని.. గౌరవ మంత్రిగా ఉండి మీరు మాట్లాడిన మాటలు 'నీ అమ్మ మొగుడు కట్టాడా తిరుపతి గుడిని'  అని ఎలా సంభోదించారు. ఒకసారి తిరుమల ఆలయ చరిత్ర తెలుసుకోండి. కొన్ని దశాబ్దాల క్రితం శతాబ్దాల క్రితం చోళులు పల్లవులు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు వీరందరూ స్వామి మీద ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మించినట్టి ప్రసిద్ధమైన ఆలయం తిరుమల. ఈ రోజు కలియుగ వైకుంఠంగా ఉన్నటువంటి ఈ ఆలయం పట్ల ఆలయంలో ఉన్న వ్యవహారాల పట్ల మీరు వ్యాఖ్యానించిన  మాటలని వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఇలా హిందువుల మనోభావాలను గాయపరిచిన కొడాలి నానిని వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయవలసిందిగా బీజేపీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. హిందువులు కాకపోతే డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి గెజిట్ ఉంది. దీనికి కూడా చట్టం ఉంది.. చట్టాన్ని కూడా గమనించకపోతే ఎలా అంటూ ఘాటుగా స్పందించారు.

ఎమ్మార్వోని కాదు ఇక పీఆర్వోని కలవాలి.. రెవెన్యూ కార్యాలయాల్లో కొత్త పద్ధతి

  ఎమ్మార్వో కార్యాలయాలకు వెళ్తున్నారా.. తహసీల్దార్ ఆర్డీవోలను కలవాలనుకుంటున్నారా.. అయితే ఇక పై వారిని నేరుగా కలిసే అవకాశం లేదు. తహసిల్దార్ విజయా రెడ్డి హత్య అనంతరం అధికారులకు.. ప్రజలకు.. మధ్య కొత్త వ్యవస్థ రాబోతుంది. వారి మధ్య పీఆర్వో విధానం రాబోతుంది. తహసిల్దార్ విజయరెడ్డి హత్యానంతరం ఎమ్మార్వో కార్యాలయాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల్లో పీఆర్వోలను నియమించటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఎన్నో సమస్యలతో రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే వారు నేరుగా అధికారులను కలవకుండా పీఆర్వోలను కలిసే విధానం రాబోతుంది. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలు మొదటగా పీఆర్వోను కలుస్తారు. తమ సమస్యలు ఎంత వరకు వచ్చిందని వారిని అడుగుతారు. వారి వినతి పత్రాలను పీఆర్వోలు అధికారులకు అందజేస్తారు. పరిష్కారం ఎంత వరకు వచ్చిందో తెలుసుకొని ప్రజలకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తారు.  పీఆర్వో విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సమస్యలు సరిగ్గా పరిష్కరిస్తే ఎందుకు దాడులు జరుగుతాయంటున్నారు సామాజిక కార్యకర్త ఆర్ శ్రీనివాస్.పీఆర్వో వ్యవస్థను ప్రవేశ పెట్టడం చాలా సంతోషకరమైన వార్త అలాగే ప్రజలు అధికారులు.. తోటి సిబ్బంది కూడా సహకరించాలి. సిబ్బంది కూడా ప్రజలతో సహకరించి.. ఏ సమస్య ఉన్నా క్షుణ్ణంగా వాళ్లు పరీక్షిస్తేనే ఆ సమస్య పరిష్కారమవుతుందని శీనివాస్ వెల్లడించారు.  మరోవైపు విజయారెడ్డి హత్యానంతరం రెవెన్యూ అధికారులకు భద్రత అవసరమని ముఖ్యంగా మహిళా రెవెన్యూ ఆఫీసర్లకు భద్రత తప్పనిసరి అంటున్నారు. ఇంకో వైపు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులకు , మళ్లీ పీఆర్వోలు ఎందుకంటున్నారు మరికొంతమంది అధికారులు. ప్రజా సమస్యలు పరిష్కరించడం కొరకు నియమితులైన అధికారులు వాటిని పరిష్కరించకుండా పీఆర్వో వ్యవస్థ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అంటున్నారు.ప్రజల మనస్తత్వం మారనంత వరకు ఎంత సెక్యూరిటీ ఎన్ని చట్టాలు వచ్చినా ఉపయోగం లేదు అంటున్నారు మరికొందరు అధికారులు. వ్యవస్థలోని కొన్ని లోపాలు కూడా దీనికి కారణమంటున్నారు.

కిటికీలకు 80 లక్షలా!.. బంగారంతో చేపిస్తున్నారా?.. జగన్ పై ప్రశ్నల వర్షం

  వ్యవసాయ రంగంపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టిడిపి సీనియర్ నేత ఆలపాటి రాజా. కోటి మంది రైతులుంటే 40 లక్షల మందికే భరోసా ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఆదా చేస్తున్నామని చెప్పుకునే వైసిపి జగన్ ఇంటి కిటికీలకు రూ.80 లక్షలు ఖర్చు చేయడం ఏంటని నిలదీశారు. గతంలో కోటి మంది రైతులున్నారు. ఇవాళ కనీసం నలభై లక్షల మంది రైతులను కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉంది. అంతే కాకుండా కౌలు రైతులకి మేం భరోసా అన్నారు.. ఇవాళ కౌలు రైతులను గుర్తించే విషయంలోనే మీరు విఫలమైతే మీరు వారికి ఏం న్యాయం చేయగలుగుతారు. బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు మీరు ఎంత ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక శ్వేత పత్రం ఎక్కడైనా రిలీజ్ చేశారా..? రైతు భరోసా అని చెప్పి చాలా గొప్పగా ఈనాడు చెప్పుకుంటున్నారు. కొన్ని లక్షల రూపాయలు మీరు రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ఇవాళ పబ్లిసిటీ పేరుతో దుర్వినియోగం చేశారు. ఇందులో ఏమి ఆదా చేస్తున్నారు. మేము రివర్స్ టెండర్ల ద్వారా ఆదా చేస్తామన్నారు ఏ రకమైన ఆదా చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ ల రంగు మార్చినందుకు రూ.1100  కోట్ల రూపాయల ఖర్చయ్యింది. ఆఖరికి మీరు కట్టుకున్న ఇంటికి రూ.20 కోట్ల రూపాయల ఖర్చెందుకు పెడతారన్నారు. బాత్ రూము టాయిలెట్స్ కి 10 లక్షల రూపాయలు.. కిటికీలకూ 80 లక్షల రూపాయలు ఏమి వెండితో చేయిస్తున్నారా కిటికీలూ లేద బంగారంతో చేపిస్తున్నారా. మీ ఇంటికి రోడ్డు వేయటానికి రూ.5 కోట్ల రూపాయలా ఏమిటిది..? ప్రజాధనం అని మర్చిపోకండి అంటూ జగన్ ప్రభుత్వ నిర్వాకంపై మండి పడ్డారు.  

వాట్ యన్ ఐడియా కలెక్టర్ సాబ్.. "కిలో ప్లాస్టిక్ కు కిలో బియ్యం"

  ఆయనొక కలెక్టర్.. ప్రజారోగ్యం, ప్రజా సంక్షేమమే ఆయన లక్ష్యం. మొన్న దీపావళికీ నో క్రాకర్స్ అన్నారు. ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొన్న దీపావళి టపాసులు నిషేధం.. నేడు ప్లాస్టిక్ పై యుద్ధం.. ములుగు జిల్లా వెలుగే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు కలెక్టర్ నారాయణరెడ్డి. దీపావళికి టపాసులు కాల్చకుండా.. గ్రీన్ దివాళీ జరుపుకొందామని అవగాహన ఇచ్చిన ఆయన ఈ సారి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కిలో ప్లాస్టిక్ కు కిలో బియ్యం స్కీమ్ ను తీసుకొచ్చారు. ప్లాస్టిక్ ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఇక్కడ కూడా అదే జిల్లా లోని అన్ని గ్రామ పంచాయతీల్లో 171 గ్రామ పంచాయతీల్లో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వంద శాతం నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఉన్న ప్లాస్టిక్  వెనక్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక కేజీ ప్లాస్టిక్ వేస్ట్ కు ఒక కేజీ మంచి బియ్యాన్ని ఇచ్చే విధంగా ప్రొగ్రాం చేపట్టామని అధికారులు వెల్లడించారు. ములుగు జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు కలెక్టర్. వాడి వదిలేసిన ప్లాస్టిక్ కవర్లు ,బాటిల్స్ వ్యర్థాలన్నింటినీ సేకరిస్తున్నారు. కిలో ప్లాస్టిక్ సేకరిస్తే కిలో సన్న బియ్యం అందిస్తున్నారు. ఇప్పుడు స్కీమ్ ఉద్యమంలా సాగుతోంది. ప్రజలంతా ప్లాస్టిక్ సేకరణలో భాగస్వాములయ్యారు. ప్రజలకు బియ్యం అందించేందుకు ప్రత్యేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు.ఇక్కడ సేకరించిన ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయడానికి అప్పగించి అదే విధంగా రీసైకిల్ చేయలేని క్యారీ బ్యాగ్స్ లాంటి వాటిని సిమెంట్ ఫ్యాక్టరీ పంపించే విధంగా కూడా చర్యలు తీసుకుటున్నట్లు సమాచారం. వీటితో పాటుగా మహిళా సంఘాలకు పేపర్ తో బ్యాగ్ తయారు చేసే విధంగా ఒక యూనిట్ ను ప్రారంభించే విధంగా సంఘం నుంచి తీసుకుంటున్నాం.తర్వాత క్లాత్ ద్వారా కూడా మనకు క్లాత్ బ్యాగ్స్ ను కూడా వినియోగంలోకి తీసుకురావాలనుకుంటునట్లు తెలియజేశారు.   త్వరలో మేడారం మహా జాతర ప్రారంభమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాంటీ ప్లాస్టిక్ జాతర నిర్వహించాలని ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తున్నారు కలెక్టర్. రాబోయే మేడారం కూడా అంటే సుమారు నెలకు కోటి ముప్పై లక్షల జనాభా ఒక వారం రోజుల్లో వస్తారు. అలాంటప్పుడు ఒక్క సింగిల్ పీస్ ప్లాస్టిక్ కూడా ఉండకుండా చూసుకునే విధంగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతుందన్నారు. తప్పకుండా అందరి సహకారంతో  ప్లాస్టిక్ ఫ్రీ ములుగుతో పాటు ప్లాస్టిక్ ఫ్రీ మేడారం కూడా సాధిద్దామని అధికారులు ఆశిస్తున్నారు.ఏ ప్రయత్నమైనా ఒక్కరితో మొదలవుతుంది.అది ఆచరణలో సరిగ్గా అమలైతే మహాయజ్ఞంలా సాగుతుందనడానికి, కిలో ప్లాస్టిక్ కు కిలో బియ్యం పథకం నిదర్శనం. ప్రజలంతా ప్లాస్టిక్ ఏరివేత పనిలో పడ్డారు. త్వరలో ములుగు ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుతుంద ని ఆశిస్తున్నారు.  

చిత్తూరు జిల్లా టీడీపీ రాజకీయం.. ఓడిపోయాక బిజినెస్ చేసుకుంటున్న అమరనాథరెడ్డి

  నూతనకాల్వ అమరనాథరెడ్డి చిత్తూరు జిల్లా టీడీపీ రాజకీయాల్లో కీలకమైన నేత. జిల్లా నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అమరనాథరెడ్డి ఇప్పుడు అధికారానికి దూరం కావడంతో రాజకీయంగా కంటే వ్యాపారపరంగానే బిజీ అయ్యారు. ఇదే ఇప్పుడు జిల్లా పార్టీ కేడర్ లో చర్చగా మారింది. 1996 లో అమరనాథరెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి చిత్తూరు ఎంపీగా గెలవడంతో.. పుంగనూరు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అమరనాథ్ రెడ్డి 36,046 ఓట్ల ఆధిక్యంతో గెలిచి పొలిటికల్ ఎంట్రీ చేశారు. ఆ తర్వాత నియోజక వర్గం పునర్విభజనతో 2009 లో పలమనేరు అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా మరోసారి గెలిచారు. రాష్ట్ర విభజన సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు వైఖరిని తప్పుపడుతూ ఆ పార్టీకి దూరమైన అమరనాథరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో పలమనేరు నుంచి మళ్లీ గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యి, మంత్రిగా పని చేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో షాక్ కొట్టడంతో ఎమ్మెల్యే పదవికి కూడా దూరమయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి అమరనాథరెడ్డి పూర్తిగా సైలెంటయ్యారు. కొంతకాలం రాజకీయం కంటే వ్యాపారమే మేలని భావిస్తున్నారు.  ఓటమి ఎరుగని తండ్రి నూతనకాల్వ రామకృష్ణారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అమరనాథరెడ్డి రాష్ట్రంలో టీడీపీ ఓటమిని.. పలమనేరులో తన ఓటమిని.. జీర్ణించుకోలేకపోతున్నారు. మే 23 న ఓట్ల లెక్కింపు తర్వాత అమరనాథరెడ్డి జిల్లాలో కనిపించడం లేదు. కొన్ని రోజులు విదేశాల్లో గడిపారు. ఆ తర్వాత అప్పుడప్పుడు పలమనేరులో కేడర్ ను కలుస్తూనే ఎక్కువ సమయం బెంగళూరుల్లో వ్యాపారంపైనే అమర్ దృష్టిపెట్టారు. చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేసి ఆ తర్వాత జిల్లాకు రావడం లేదనే టాక్ నడుస్తుంది. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో వ్యాపార సంబంధాలు కూడా ఉండడంతో అమరనాథరెడ్డి సైలెంటయ్యారు అనేది ఓ వార్త. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం కంటే వ్యాపారమే బెటర్ అని అమర్ భావించి వుంటారన్న చర్చ కూడా ఉంది. త్వరలోనే స్థానిక సంస్ధల ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉండటంతో అమర్ మౌనం వీడి దూకుడు ప్రదర్శిస్తారని జిల్లా పార్టీ యంత్రాంగం భావిస్తుంది. జిల్లా టీడీపీలో మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్న అమర్ మౌనం వీడి దూకుడు ప్రదర్శించారని కేడర్ కూడా కోరుకుంటోంది.