నేను రాజకీయం చేయను... కానీ మీరు సమర్థంగా పనిచేయాలని చెప్పాను: చంద్రబాబు

* హైదరాబాదులో చంద్రబాబు మీడియా సమావేశం * కరోనా నిర్ధారణ పరీక్షలు తగినంతగా చేయలేకపోతున్నారని విమర్శలు * ఇప్పటికే అనేక లేఖలు రాశానని వెల్లడి దేశంలో, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కరోనా నిర్ధారణ పరీక్షలు సరిగా నిర్వహించలేకపోతున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తాను ఈ విషయంపై రాజకీయం చేయబోనని, కానీ ప్రభుత్వం సమర్థంగా పనిచేయాలని చెప్పానని తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం కరోనా విపత్తు నిర్వహణలో విఫలమవుతోందని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన రీతిలో కరోనా పరీక్షలు చేయలేకపోవడం వల్ల, వాస్తవాలు మరుగునపడిపోయి ఎక్కడికక్కడ వ్యాపించే పరిస్థితులు వచ్చాయని వివరించారు. దాని పర్యవసానమే పదుల సంఖ్యలో కేసులు ఒక్కసారిగా వచ్చాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని అన్నారు. కరోనా టెస్టు సెంటర్లు తక్కువగా ఉన్నందువల్ల, సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఒక కరోనా వ్యక్తి బయటికి వెళితే 6 రోజుల్లో 3,600 మందికి వ్యాపింపచేయగలడని హెచ్చరించారు. కరోనాపై ఇప్పటికే కేంద్రానికి, రాష్ట్రానికి అనేక లేఖలు రాశానని, ఇంకా రాస్తానని చంద్రబాబు చెప్పారు. కరోనా నివారణలో ఈ ప్రభుత్వానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

మర్కజ్ నిజాముద్దీన్ ఘటన వెనుక వాస్తవాలివే.. పరిస్ధితి ఎందుకు చేదాటిపోయిందంటే..

వందేళ్ల చరిత్ర కలిగిన మర్కజ్ నిజాముద్దీన్ ఏటా సమావేశాలు నిర్వహిస్తుంటుంది. చర్చలు, నమాజులు వంటి కార్యక్రమాలు ఇక్కడ సర్వసాధారణం. దేశ విదేశాల నుంచి ఇక్కడికి హాజరయ్యే వారి కోసం ఏటా సమావేశాల తేదీలను ముందే ఖరారు చేస్తారు. ఈసారీ తేదీలు ముందే ఖరారు అయ్యాయి. కానీ 21న ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ పిలుపుతో మధ్యలోనే ఆపేశారు. అప్పటికే వివిధ దేశాలతో పాటు రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింలు సమావేశాల్లో బిజీగా ఉన్నారు.  జనతా కర్ఫ్యూ నేపథ్యంలో జమాత్ ను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న మర్కజ్ రాత్రి 9 గంటల వరకూ ఎవరినీ బయటికి పంపలేదు. తర్వాత అదే రోజు రాత్రి ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించింది. జనతా కర్ఫ్యూ ముగిసినా, తర్వాత రోజు ఉదయం లాక్ డౌన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్ధరాత్రి పలువురు విదేశీయులు వెళ్లిపోయారు. కానీ దేశీయంగా ఉన్న వారు మాత్రం పూర్తిగా వెళ్లలేకపోయారు. అప్పటికే కొందరు విదేశీయుల్లో కరోనా లక్షణాలు ఉండటంతో వారు ఇతరులకు అంటించారు.  లాక్ డౌన్ ఉన్నందున అక్కడే ఉండిపోయిన వందలాది మందిని ఖాళీ చేయాలని స్ధానిక అధికార యంత్రాంగం మధ్యలో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చింది. లాక్ డౌన్ ఉన్నందున స్వస్ధలాలకు వెళ్లేందుకు వీలుగా వీరికి పాస్ లు మంజూరు చేయాలని మర్కజ్ నిర్వాహకులు కోరడంతో అధికారులు 17 వాహనాలకు అనుమతి ఇచ్చారు. అయినా కొందరు వెళ్లలేకపోయారు. 28న అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించాగా.. వీరిలో కొందరిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వీరిని క్వారంటైన్ కు పంపారు. లాక్ డౌన్ నిబంధనలు ఉండగానే మర్కజ్ లో జనం మర్కజ్ లో ఉండటంపై ఫేస్ బుల్ లో పోస్టులు వెలిశాయి. దీంతో కేజ్రివాల్ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. అయితే లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వాధికారులతో చర్చిస్తున్నట్లు మర్కజ్ సమాధానం ఇచ్చింది. అయితే ఆ తర్వాత కేజ్రివాల్ సర్కారు చర్యలకు ఆదేశించడంతో మర్కజ్ ఇవాళ మరోసారి వివరణ ఇచ్చింది. విదేశీయులకు కరోనా పరీక్షలు నిర్వహించకపోవడంతో పాటు వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ ప్రటకన తర్వాత వెంటనే పంపకపోవడమే కొంప ముంచినట్లు తెలుస్తోంది.

అమెరికా, చైనాలకు ఏపీ నుంచి ఆక్వా ఎగుమతులు 

*సంక్షోభం నుంచి అవకాశం సృష్టించుకున్న ఏపీ ఆక్వా రంగం  *69 ప్రాసెసింగ్‌ యూనిట్లలో 41 చోట్ల పని ప్రారంభమైందన్న అధికారులు.  విశాఖపట్నం పోర్టు నుంచి 13, కాకినాడ పోర్ట్‌ నుంచి 4 కంటైనర్లతో, అమెరికా, చైనాలకు ఆక్వా ఉత్పత్తులు ప్రారంభమైనట్టు అధికారులు చెప్పారు. ప్రాససింగ్‌ కేంద్రాల్లో వర్కర్స్‌ పాసుల జారీ చేసేందుకు జిల్లాల్లో ఉన్న కంట్రోల్‌ రూమ్‌లతో మాట్లాడుతున్నామని  ఫిషరీస్‌ అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వివరించారు. వారినుంచి వచ్చే సమస్యల స్వీకరణ, వాటి పరిష్కారంకోసం పనిచేస్తున్నారని వారు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఎక్కడా నిత్యావసరాల కొనుగోలు కోసం జనం గుమిగూడకుండా చూడాలని సీఎం ఆదేశం. కోవిడ్‌ –19 సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ.. ఆమేరకు నిత్యావసరాలు కొనుగోలు చేసేలా చూడాలన్న సీఎం. పట్టణాలు, నగరాల్లో ఉదయం 6గంటల నుంచి 11 గంటలవరకూ, మిగిలిన ప్రాంతాల్లో 6 గంటలనుంచి 1 గంటవరకూ సమయం పాటించాలని ముఖ్యమంత్రో సూచించారు.

ఐఏఎస్ నిర్వాకం ! ఒణుకుతున్న జగన్ టీమ్!!

అద్దంకి పోయిన సింగడు పోనూ పోయాడు, రానూ వచ్చాడని సామెత. ఆయనో ఐ ఏ ఎస్ అధికారి. అలాంటి..ఇలాంటి ఆఫీసర్ కూడా కాదు. సీనియర్ మోస్ట్ ఐ ఏ ఎస్ .... చేస్తోంది అత్యంత కీలకమైన ఉద్యోగం.. చాలా ముఖ్యమైన పోర్ట్ ఫోలియో .. ఎక్కే విమానం..దిగే విమానం ....ఊపిరి సలపలేనంత పని.. ఒకటే ఒత్తిడి... మన దేశం లో లాక్ డౌన్ ప్రకటించకముందు , ఆయన ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధిగా సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా దేశాలకు వెళ్లి, పారిశ్రామిక రంగ పెట్టుబడుల నిమిత్తంఅక్కడి అధికార యంత్రాంగాలతో చర్చలు జరిపారు... అంతే కాదు... అక్కడి నుంచి కిందటి వారమే , తిరిగి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చారు. ఆయన ఒక్కరే కాదు... ఆయనతో పాటు ఆయా దేశాల డెలిగేషన్స్ బృందాలు కూడా వచ్చాయి.. ఆయా డెలిగేషన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి కార్యాలయానికి రావటం, సమావేశం కావటం, ఇవన్నీ కూడా చక చకా జరిగిపోయాయి... అయినాకూడా సి ఎం ఓ ఈ విషయాన్నీ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు ..... ఒక పక్క ప్రపంచం మొత్తం అతలాకుతలమై పోతుంటే, సీరియస్ నెస్ కొరవడిన ఆ అధికారి చేసిన నిర్వాకం వల్ల , ఇప్పుడు సి ఎం క్యాంప్ కార్యాలయం వద్ద సిబ్బంది గడ గడా వణికిపోతున్నారు. ప్రధాన మంత్రి లాక్ డౌన్ ప్రకటించక ముందే, ఆ సీనియర్ మోస్ట్ ఐ ఏ ఏ ఎస్ అమరావతికి తిరిగి వచ్చేసినప్పటికీ, సెల్ఫ్ క్వారంటైన్ పాటించకపోవడం రాజధాని ప్రాంత వాసులందరినీ , ప్రత్యేకించి సి ఎం ఓ నూ  కలవరపెడుతోంది. ఐరోపా దేశాల్లో ..ఒక దేశం ప్రధాని సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిన విషయాన్ని, మరో దేశ యువరాణి కరోనా తో మరణించిన విషయాన్నీ, జర్మనీ లో అయితే ఏకంగా కరోనా కల్లోలం కారణంగా అక్కడి ఆర్ధిక మంత్రి ఆత్మహత్య చేసుకున్న విషయాన్నీ ఇంత  కన్వీనియెంట్ గానూ, చాలా తేలిగ్గానూ తీసుకున్న ఆ ఐ ఏ ఎస్ అధికారి విషయం లో చీఫ్ సెక్రెటరీ గానీ, సి ఎం ఓ గానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం చూస్తుంటే, భయమేస్తోందని సెక్రటేరియట్ కారిడార్లు వ్యాఖ్యానిస్తున్నాయి. హతవిధీ.... ఇంతగా సీరియస్ నెస్ కొరవడిన వ్యవస్థలు సాక్షాత్తూ సి ఎం కార్యాలయాల్లోనే పని చేస్తుంటే, ఇక కరోనా నియంత్రణ లో చిత్తశుద్ధి కోసం మాట్లాడుకోవటం లో అర్ధం లేదనేది ఉద్యోగుల భావన!  ఇక్కడో విషయం గమనించాలి.. ఒక పక్క సి ఎం జగన్ మోహన్ రెడ్డి రేయింబగళ్లు, రివ్యూలు చేస్తూ..కరోనా కట్టడికి ఎక్కడికక్కడ మార్గదర్శకాలు, సూచనలు చేస్తుంటే, ఈ ఐ ఏ ఎస్ ఒళ్ళు పై తెలీకుండా, ఏకంగా ఆ రెండు దేశాలు--సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా లకు చెందిన బృందాలను తన కూడా పెట్టుకుని సి ఎం ముందు హాజరు పర్చడమేమిటని ఐ ఏ ఎస్ లే చెవులు కొరుక్కుంటున్నారు. పై పెచ్చు, ఆ ఐ ఏ ఎస్ సెల్ఫ్ క్వారంటైన్ ను కూడా పాటించకుండా జన బాహుళ్యం లోకి వచ్చేయటం కూడా సెక్రెటేరియేట్ వర్గాలను, సి ఎం ఓ సీనియర్లనూ ప్రస్తుతం కలవరపెడుతున్న అంశం.. కరోనా ను కట్టడి చేయటానికి సహకరించాలంటూ, సి ఎం జగన్ ఏమో రెండు చేతులూ జోడించి ప్రజలకు నమస్కరిస్తుంటే, ఈ ఐ ఏ ఎస్ మాత్రం...తనకేమీ పట్టనట్టు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

పిఎం, సిఎం సహాయ నిధులకు గవర్నర్ బిశ్వ భూషణ్ చేయూత

ప్రధాని సంరక్షణకు నిధికి నెల జీతం, సిఎం సహాయ నిధికి రూ.లక్ష ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కరోనా విపత్తు నేపధ్యంలో తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్ర ప్రధమ పౌరుని హోదాలో కరోనా వ్యాప్తి నిరోధం కోసం తన వంతు ప్రయత్నాన్ని చేస్తూ మఖ్యమంత్రి  మొదలు అయా శాఖల ఉన్నతాధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. తనకున్న సుదీర్ఘ ప్రజా జీవితం ఆలంబనగా అధికార గణంకు సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల కులపతి హోదాలో విద్యార్ధులను సైతం ఆ దిశగా కార్యోన్ముఖులను చేయాలని ఉపకులపతులను ఆదేశించారు. రాష్ట్ర రాజ్యాంగ అధినేతగా అన్ని చేస్తూనే, వ్యక్తిగతంగా కూడా తన పెద్ద మనస్సును చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి సైతం స్వయంగా వివరించిన బిశ్వభూషణ్ రాష్ట్ర ఆరోగ్య స్ధితి గతులను మెరుగు పరిచేందుకు తన వంతుగా చిరు విరాళంను అందిస్తున్నానన్నారు.

ఏపీ లో  కొత్తగా 17 కేసులు నమోదు: కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

రైతు భరోసాకేంద్రాల ఆధ్వర్యంలో జనతామార్కెట్‌ల ఏర్పాటుపై ఆలోచన చేయాలన్న సీఎం ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్‌ సదస్సుకు హాజరైనవారు, వారి కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరించే పనిలో ఏ పీ అధికారులు బిజీ అయ్యారు. రాష్ట్రంనుంచి వెళ్లిన వారు, అదేరోజు రైల్లో ప్రయాణం చేసిన వారి వివరాలను సేకరించామని తెలిపిన అధికారులు. జమాత్‌ నిర్వాహకులనుంచి, పోలీసులనుంచి, రైల్వే వారినుంచి..  ఇలా వివిధ రకాలుగా సమాకారాన్ని సేకరించి వారిని క్వారంటైన్‌కు, ఐసోలేషన్‌కు తరలిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వివరించారు. వీరిపై ప్రధానంగా దృష్టిసారించి ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. ఢిల్లీ వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారు స్వచ్ఛందంగా ముందకు వచ్చి చికిత్స తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వైద్యం తీసుకుంటే ఎవ్వరికీ ఏం కాదు, వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయనీ, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు కలిసి వారి అందర్నీ గుర్తించి వారికి పరీక్షలు చేసి, వైద్య సదుపాయాలు అందేలా చేయాలనీ సి ఎం సూచించారు.  అర్బన్‌ ప్రాంతాల్లో ప్రతి కుటుంబంపైనా సర్వే జరుగుతుందా? లేదా? అని ఆరాతీసిన సీఎం. ప్రతిరోజూ ప్రతి కుటుంబాన్ని పరిశీలించాలని, సర్వే నిరంతరాయంగా కొనసాగాలని ,షెల్టర్లలో ఉన్నవారికి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారిని క్వారంటైన్‌ చేయాలనీ సో ఎం సూచించారు.  అర్బన్‌ ప్రాంతాల్లో రైతు బజార్లు, మార్కెట్ల వికేంద్రీకరణపై సీఎం ఆరా తీశారు. సూపర్‌ మార్కెట్లు, రైతు బజార్లు ద్వారా డోర్‌ డెలివరీని ప్రోత్సహిస్తున్నామన్న అధికారులు. ప్రతి దుకాణం ముందు ప్రకటించిన∙ధరలతో పట్టికను ప్రదర్శించాలని స్పష్టంచేసిన సీఎం. ఏప్రిల్‌ 1 నుంచి అన్ని దుకాణాల ముందు పెట్టిస్తామన్న అధికారులు. దీనిపై మానిటరింగ్‌ చేయాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు.  గిట్టుబాటు ధరలు కల్పించడానికి  తీసుకుంటున్న చర్యలపై ఆరాతీసిన సీఎం. తాత్కాలిక పరిష్కారంగా ప్రస్తుతానికి రైతులనుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయమన్న సీఎం. అరటి, టమోటా లాంటి రైతులకు ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశం . నిల్వచేయలేని పంటల విషయంలో తలెత్తుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సీఎం ఆదేశం తక్షణం సంబంధిత అధికారులు కూర్చొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలంటూ గట్టిగా ఆదేశించిన సీఎం లాక్‌డౌన్‌ సమయంలో అన్ని దుకాణాల వద్ద పండ్లు అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నామన్న అధికారులు. దీనివల్ల రిటైల్‌ వ్యాపారం పెరుగుతుందన్న అధికారులు. దీనివల్ల రైతులకు కొంతైనా మేలు జరుగుతుందన్న అధికారులు ఆమేరకు ప్రయత్నాలు చేస్తున్నామన్న అధికారులు శాశ్వత పరిష్కారాలపైనా దృష్టిపెట్టాలని స్పష్టం చేసిన సీఎం. రైతు భరోసాకేంద్రాల ఆధ్వర్యంలో జనతామార్కెట్‌ల ఏర్పాటుపై ఆలోచన చేయాలన్న సీఎం. గ్రామాలు, పట్టణాలు, నగరాల వారీగా డిమాండ్‌కు తగినట్టుగా ఈ మార్కెట్లు ఏర్పాటు చేసేలా ఆలోచన చేయాలన్న సీఎం. ఆమేరకు డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను నెలకొల్పే దిశగా ఆలోచన చేయాలన్న సీఎం. ఏ ప్రభుత్వంలోనైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాటిని పరిశీలించి మంచి విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఢిల్లీ ఇస్త‌మాకు వెళ్లారా? వెంట‌నే మీ స‌మాచారం ఇవ్వండి!

మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ డాక్ట‌ర్ మొహ‌మ్మ‌ద్ ఇలియాస్ రిజ్వీ విజ్ఞ‌ప్తి. మూడు రోజుల ఇస్త‌మా కోసం ఢిల్లీ మ‌ర్క‌జ్‌కు వెళ్లి తిరిగి వచ్చిన వారు, వారిని కలిసిన వ్యక్తుల సమాచారం వెంటనే ఇవ్వాల‌ని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ  డాక్ట‌ర్ మొహ‌మ్మ‌ద్ ఇలియాస్ రిజ్వీ విజ్ఞ‌ప్తి చేశారు.   ఢిల్లీ మ‌ర్క‌జ్‌లో జ‌రిగిన అంత‌ర్జాతీయ ఇస్త‌మాలో పాల్గొని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తిరిగి వచ్చిన వారందరూ తమ సమాచారాన్ని స్వచ్ఛందంగా మీ జిల్లా యంత్రాగానికి తెలపాలని రిజ్వీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తిరిగివచ్చిన వారిలో కొంత మందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించినందువల్ల మీరు, మీతో పాటు మిమ్మ‌ల్ని క‌లిసిన వ్య‌క్తులు మీ  కుటుంబ సభ్యులు, వారిని కలసిన వ్యక్తులు అందరూ హోమ్ ఐసోలేషన్ లో కి వెళ్లాల‌ని మైనార్టీ సంక్షేమ శాఖా ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో జరిగిన జమాత్ లో పాల్గొన్న వారందరూ బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించి క్వారంటైన్ లో వుండాలని ఆయ‌న సూచించారు.

పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచండి!మంత్రి విశ్వరూప్

తీవ్రంగా ప్రబలు తున్న కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డులలో ను పారిశుద్ధ్యాన్ని బాగా మెరుగు పరచాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మునిసిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి ఇవతల వైపు ఉన్న చింతగుంట చెరువు, హౌసింగ్ బోర్డు కాలనీ, మరియు మెట్ల కాలనీలను సందర్శించి డ్రైనేజ్ వ్యవస్థను, రహదారులను పరిశీలించారు. ముందుగా చింత గుంట చెరువును సందర్శించిన మంత్రి అక్కడి స్థలాన్ని పరిశీలించి 216 హైవే నుండి చింత గుంట చెరువు వరకు సి.సి రోడ్డును వెంటనే వేయవలసిందిగా మునిసిపల్ అధికారులను ఆదేశించారు.  అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీని సందర్శించిన మంత్రి కాలనీ లో మురుగు నీరు వేగం గా ప్రవహించేలా డ్రెయిన్లు వెడల్పును విశాలంగా చేయాలని, ఇప్పటికే ఆమోదం పొందిన సి.సి రహదారులు, డ్రెయిన్లు పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని మంత్రి మునిసిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే చింత గుంట చెరువులో  పది మందిని, హౌసింగ్ బోర్డు కాలనీ లో పది మందిని శానిటేషన్ వర్కర్లను ఏర్పాటు చేసి పారిశుధ్యా న్ని మెరుగు పరచాలని మునిసిపల్ అధికార్లను మంత్రి ఆదేశించారు. అనంతరం పట్టణంలోని మెట్ల కాలనీని మంత్రి సందర్శించి గతంలో 10 లక్షల రూపాయలతో మంజూరు అయిన డ్రైన్ కు సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

సరిహద్దుల్లో చిక్కుకున్నా మంత్రి చొర‌వ‌తో  తండాకు చేరుకున్న కూలీలు!

తెలంగాణా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చూపిన చొరవతో వ‌ల‌స కూలీలు త‌మ సొంత గూటికి చేరుకున్నారు. సూర్యపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పాచ్యతండా కు చెందిన 26 మంది కూలిపనులకు గాను పొరుగున ఉన్న ఆంద్రప్రదేశ్ లోని పులిచింతల ఆయకట్టు పనులకు వెళ్లారు. లాక్ డౌన్ నేపథ్యంలో సరిహద్దుల్లో చిక్కుకున్నారు.  అక్కడే పని లేక సొంత గూటికి చేరుకోలేక పులిచింతల ప్రాజెక్ట్ అవల చిక్కుకున్నారు. ఎంత బ్రతిమలాడిన నిబంధనలు ఒప్పుకోవు అంటూ సరిహద్దుల్లో వారి రాకను పోలీసులు అడ్డుకున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో మంత్రి జగదీష్ రెడ్డి సెల్ నెంబర్ తెలుసుకుని ఫోన్ లో నేరుగా మంత్రి జగదీష్ రెడ్డిని సంప్రదించారు. విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి సరిహద్దుల్లో చిక్కుకున్న పాచ్యతండా వాసులను వారి సొంతూరికి చేర్చాలంటూ ఆదేశించారు. ఆదేశించడంతో పాటు పలుమార్లు వాకబు చేస్తూ వారు సొంతూరికి చేరేదాకా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వచ్చారు.దీనితో రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కోదాడ ఆర్ డి ఓ కు వారిని నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకు రావాలి అంటూ పురమాయించారు. దానితో రంగంలోకి దిగిన ఆర్ డి ఓ పోలీస్ అధికారులను సమన్వయం చేసుకుని ఆదివారం పొద్దు పోయేంత వరకు వైద్యపరీక్షలు నిర్వహించి వారి వారి సొంత గ్రామాలకు చేరేలా ఏర్పాట్లు పూర్తిచేశారు.ఎట్టకేలకు యింటికి చేరుకున్న తండా వాసులు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఫోన్ ఎత్తడం తో పాటు సురక్షితంగా తమను గమ్యానికి చేర్చిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఢిల్లీ వెళ్లినవారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి: సీఎం జ‌గ‌న్‌

ఢిల్లీ వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారు స్వచ్ఛందంగా ముందకు వచ్చి చికిత్స తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. వైద్యం తీసుకుంటే ఎవ్వరికీ ఏం కాదు, వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయ‌ని సీఎం అన్నారు.  వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు కలిసి వారి అందర్నీ గుర్తించి వారికి పరీక్షలు చేసి, వైద్య సదుపాయాలు అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జగన్ సూచించారు. కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం సమీక్షించారు. కోవిడ్‌ –19 నివారణా చర్యలపై ముఖ్య‌మంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికారులు కొత్తగా 17 కేసులు నమోదయ్యాయని వివరించారు.  వీరిలో చాలా మంది ఢిల్లీలో ల్లో నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్‌ సదస్సుకు హాజరైనవారు, వారి కుటుంబ సభ్యులేనని వెల్లడించారు. రాష్ట్రంనుంచి వెళ్లిన వారు, అదేరోజు రైల్లో ప్రయాణం చేసిన వారి వివరాలను అధికారులు సేకరించారు. జమాత్‌ నిర్వాహకుల నుంచి, పోలీసుల నుంచి, రైల్వే  నుంచి  ఇలా వివిధ రకాలుగా సమాచారాన్ని సేకరించి వారిని క్వారంటైన్‌కు, ఐసోలేషన్‌కు తరలిస్తున్నామని అధికారులు సి.ఎం. దృష్టికి తీసుకువెళ్లారు. అర్బన్‌ ప్రాంతాల్లో ప్రతి కుటుంబంపైనా సర్వే జరుగుతుందా? లేదా? అని సి.ఎం. ఆరా తీశారు. ప్రతిరోజూ ప్రతి కుటుంబాన్ని పరిశీలించాలని, సర్వే నిరంతరాయంగా కొనసాగాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు ముందుకు వచ్చి వారు ఆరోగ్య వివరాలు అందించాలని, వారు ముందుకు రాకపోతే వారి కుటుంబ సభ్యులకు నష్ట కలుగుతుందని సి.ఎం. ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  అర్బన్‌ ప్రాంతాల్లో రైతు బజార్లు, మార్కెట్ల వికేంద్రీకరణపై సీఎం ఆరా తీశారు. సూపర్‌ మార్కెట్లు, రైతు బజార్లు ద్వారా డోర్‌ డెలివరీని ప్రోత్సహిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రతి దుకాణం ముందు  ధరలతో పట్టికను ప్రదర్శించాలని  సీఎం ఆదేశించారు.

ఏపీలో పర్యవేక్షణకు సమన్వయ బృందాలు!

లాక్ డౌన్ పటిష్ట అమలు, నిత్యావసర వస్తువులు సరఫరా,సేవలు పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో సమన్వయ బృందాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రజలకు వివిధ నిత్యావసర సేవలు అందేలా చూడడం ఇందుకు సంబంధించి ఏమైనా సమస్యలు ఫిర్యాదులు ఉంటే రాష్ట్ర స్థాయిలోని 1902 కంట్రోల్ రూమ్ ద్వారా స్వీకరించి వాటిని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిల్లో సమన్వయ బృందాలను ఏర్పాటు చేస్తూ జిఓఆర్టి సంఖ్య 223 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఈసమన్వయ బృందాలు లాక్ డౌన్ సక్రమంగా అమలు అయ్యే లి చూడడంతో పాటు ఆ సమయంలో ప్రజలకు వివిధ నిత్యావసర సేవలు సక్రమంగా అందేలా చూస్తుంది.అంతేగాక వివిధ నిత్యావసర వస్తువులు డిమాండ్ ను ముందుగానే అంచనా వేసి ఆయా నిత్యావసర వస్తువులు కూరగాయలు ఆయా ప్రాంతాలకు సరఫరా జరిగేలా ఈసమన్వయ బృందాలు చూస్తాయి.నిత్యావసర వస్తువులు సేవలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఫిర్యాదులు ఉంటే 1902 కంట్రోల్ రూమ్ ద్వారా స్వీకరించి వాటిని రాష్ట్ర,జిల్లా స్పందన కంట్రోల్ రూమ్లు ద్వారా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. పౌరసరఫరాలు, పోలీస్, డైరీ డెవలప్మెంట్, పశుసంవర్థక,మత్స్య, మున్సిపల్, పంచాయతీరాజ్, కార్మిక తదితర శాఖల అధికారులు రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ కు రోజువారీ నివేదికను (Daily Situation Report)సమర్పించాలని సిఎస్ స్పష్టం చేశారు. సంబంధిత సమన్వయ బృందం ఓవరాల్ ఇన్చార్జి రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ సమన్వయంతో వివిధ నిత్యావసర సేవలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని ఆదేశించారు.అదే విధంగా జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్లు కూడా రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ తో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. అదేవిధంగా వివిధ నిత్యావసర వస్తువులు తయారీ,రవాణా, సేవలుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే అలాంటి సమస్యలు, ఫిర్యాదులను ఈసమన్వయ బృందాలు తెల్సుకుని రాష్ట్ర, జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ లో ద్వారా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర సమన్వయ బృందాలు: కేంద్ర ప్రభుత్వం,ఇతర రాష్ట్రాలతో  ఓవరాల్ సమన్వయ ఇన్చార్జి  టిఆర్ఆండ్బి ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు ఆయనతోపాటు మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి, మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న,ఎ.శ్రీకాంత్, ఎన్ఫోర్స్మెంట్ ఐజి వినీత్ బ్రిజ్ లాల్,ఐజి లీగల్ హరికుమార్ ఉన్నారు. అలాగే మాన్యుఫాక్చరింగ్ మరియు నిత్యావసర వస్తువులు సమన్వయ బృందం ఇన్చార్జి గా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆయనతోపాటు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం,కార్మిక శాఖ ప్రత్యేక కమీషనర్ రేఖా రాణి,ఎంపి ఫైబర్ సిఇఓ సుమీత్ ఉన్నారు. నిత్యావసర వస్తువులు సరఫరా రాష్ట్ర, జిల్లా సమన్వయ ఇన్చార్జి గా  పౌరసరఫరాల శాఖ కమీషనర్ కె.శశిధర్ ఆయనతోపాటు ప్రద్యుమ్న,ఉద్యానవన శాఖ కమీషనర్ చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హెచ్ అరుణ్ కుమార్, మార్క్ ఫెడ్ ఎండి శ్రీ కేష్ లక్తర్,ఆయిల్ ఫెడ్ ఎండి శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా నిత్యావసర వస్తువులు రవాణా పర్యవేక్షణ కు ఇన్చార్జి గా రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ విసి మరియు ఎండి  వై.భాను ప్రకాశ్ ఆయనతోపాటు రవాణా శాఖ కమీషనర్ పి.సీతారామాంజనేయులు,సిఐడి డిజి డా.సిఎం త్రివిక్రమ్ వర్మ, సర్వే శాఖ డైరెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. స్థానిక సంస్థల్లో నిత్యావసర వస్తువులు,తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణ ఇన్చార్జిగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఆయనతో పాటు మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఆశాఖ కమీషనర్ జిఎస్ఆర్కె విజయకుమార్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్,ఎసిబి డిఐజి యం.రవిప్రకాశ్, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు రంజిత్ భాషా ఉన్నారు. అలాగే స్వచ్చంద సంస్థలు,వాలంటరీ గ్రూపులు,సిఎస్ఆర్ నిధులు సమీకరణ తదితర అంశాలకు ఇన్చార్జి గా సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు కె.హర్షవర్ధన్,బిసి సంక్షేమ శాఖ సంచాలకులు బి.రామారావు,గ్రేహాండ్స్ ఎస్పి రాహుల్ దేవ్ శర్మ ఉన్నారు. మీడియా మేనేజిమెంట్ ఇన్చార్జి గా సమాచార శాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి,ఎపిటిఎస్ ఎండి నందకిశోర్,డిఐజి ఎస్పి రాజశేఖర్ బాబు ఉన్నారు.

కూరగాయల ధరలు అడిగి తెలుసుకున్న మంత్రి!

వరంగల్ రూరల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ ని తెలంగాణా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి గౌరవ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజలతో మాట్లాడి, ధరలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు.  అధిక ధరలకు కూరగాయలు అమ్మినా, బ్లాక్ మార్కెట్ కి తరలించినా, కృత్రిమ కొరత సృష్టించినా, కఠిన శిక్ష లు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ప్రజలు స్వీయ నియంత్రణ తో, లాక్ డౌన్ పాటించాలా గుంపులుగా ఉండవద్దని, ముఖాలకు మాస్క్ లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞ‌ప్తి చేశారు.  

సీడ్స్ రవాణాకు ఆటంకాలు లేకుండా చూడండి!

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు విత్తనాలు ( సీడ్స్ ) సరఫరాకు రవాణా పరంగా ఎదురవుతున్న ఆటంకాలు లేకుండా చూడాలని సీడ్స్ ఉత్పత్తిదారులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను కోరారు. మంగళవారం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ నివాసంలో వినోద్ కుమార్ కు వారు తమ సమస్యలు వివరించారు. లాక్ డౌన్ వల్ల తమకు రాష్ట్రంలో గానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ రవాణా పరంగా సమస్యలు ఎదురవుతున్నాయని వారు వినోద్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా 400 సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయని, సుమారు మూడు లక్షల మంది రైతులు విత్తన ఉత్పత్తిదారులుగా ఉన్నారని వారు వినోద్ కుమార్ కు తెలిపారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి విత్తనాలు ప్రాసెస్ చేసి దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు సరఫరా చేస్తున్నామని వారు పేర్కొన్నారు. వివిధ రకాల పంటలు చేతికి అందుతున్న నేపథ్యంలో రైతుల నుంచి విత్తనాలు ప్రాసెసింగ్ చేసేందుకు యూనిట్లకు చేరాల్సి ఉండగా లాక్ డౌన్ వల్ల జిల్లాల్లో క్షేత్ర స్థాయి పోలీసులు సీడ్స్ రవాణాను అడ్డుకుంటున్నారని వారు వినోద్ కుమార్ కు విన్నవించారు. లాక్ డౌన్ నుంచి నిత్యావసరాల సరుకుల కింద విత్తనాల రవాణాకు సీఎం కేసీఆర్ మినహాయింపు ఇచ్చినా జిల్లాల్లో క్షేత్ర స్థాయి పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి పోలీసుల ఇబ్బందుల వల్ల  సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్లకు కూలీలు కూడా రాలేని దుస్థితి ఏర్పడిందని వారన్నారు. దేశవ్యాప్తంగా అవసరమైన 80 శాతం సీడ్స్ తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయని,  అలాంటప్పుడు రాష్ట్రంలోనే ఇబ్బందులు వస్తే ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై తక్షణమే స్పందించిన వినోద్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.  విత్తన ఉత్పత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. లాక్ డౌన్ నుంచి సీడ్స్ సరఫరాను సీఎం కేసీఆర్ మినహాయింపు ఇచ్చారని వినోద్ కుమార్ డీజీపీ కి గుర్తు చేశారు. వెంటనే రంగంలో దిగిన డీజీపీ మహేందర్ రెడ్డి డీఐజీ సుమతిని నోడల్ అధికారిగా నియమించి విత్తన ఉత్పత్తిదారులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూడాలని ఆదేశించారు. విత్తన ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరిపిన సుమతి... వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విత్తన ఉత్పత్తిదారులు, పోలీసులు, ట్రాన్స్ పోర్ట్ సిబ్బందితో కలిపి వాట్సాప్ గ్రూప్ ను తయారు చేశారు. ఎవరికి ఎక్కడ సమస్యలు ఎదురైనా వెంటనే వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారాన్ని అందజేయాలని డీఐజీ సుమతి కోరారు.

ఏపీ ఉద్యోగులకు ఊరట.. రెండు విడతల్లో మార్చినెల జీతం

ఏపీలో కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. దీంతో మార్చినెల జీతాలు, పింఛన్లు కూడా ఇవ్వలేని పరిస్ధితి ఉంది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు, వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం జగన్ ఉద్యోగ సంఘాలకు తెలిపారు. ఈ మేరకు తనను కలిసిన ప్రభుత్వం ఉద్యోగులసంఘం నేత సూర్యనారాయణకు సీఎం జగన్ ఈ విషయం చెప్పారు. మార్చి నెలకు గానూ చెల్లించాల్సిన వేతనాలను రెండు విడతల్లో చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు.  ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అన్ని ప్రభుత్వశాఖల నుంచి వచ్చే ఆదాయనికి తీవ్రంగా గండిపడింది. నెలనెలా రావాల్సిన పన్నులతో పాటు మైనింగ్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ ఆదాయాలు కూడా నిలిచిపోయాయి. దీంతో వేల కోట్ల రూపాయల రాబడి పోయినట్లయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల నుంచి తాజా వివరాలు తీసుకున్న ప్రభుత్వం రోజుకు రెండు కోట్ల రూపాయల ఆదాయం కూడా రావడం లేదని తేల్చింది. ఇలాంటి పరిస్ధితుల్లో ఉద్యోగుల వేతనాలు, జీతాలు,  పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది.  తెలంగాణ ప్రభుత్వం తరహాలో కోతలు పెట్టకుండా రెండు విడతల్లో జీతాలు, వేతనాలు, పింఛన్లు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఉద్యోగసంఘాల తరఫున 100 కోట్ల నిధులను ప్రభుత్వానికి ఇచ్చిన ఉద్యోగులు.. రెండు విడతల జీతానికి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.

స్టేడియంలో కూరగాయల మార్కెట్!

ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్ ను తాత్కాలికంగా సరూర్ స్టేడియంలోకి తరలించడానికి జ‌రుగుతున్న ఏర్పాట్లను తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ప్రజలకు ఏ ఇబ్బంది రానివ్వకుండా  రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ల, పలు ఖాళీ ప్రదేశాలకు త‌ర‌లిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. కరోనా వైరస్ ప్రబలకుండా ప్రజలు గుమిగూడే అవకాశం లేకుండా, కొనుగోళ్లకు వచ్చిన ప్రజలు ఖచ్చితంగా సామాజిక దూరం పాటించేలా ఈ  ఏర్పాట్లు చేస్తున్నారు. మొబైల్ రైతుబజార్ల ద్వారా వీలయినన్ని ఎక్కువ ప్రాంతాలకు తక్కువ ధరకు తాజా కూరగాయల్ని పంపిస్తున్నారు.    ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించి కరోనా వైరస్ ప్రబలకుండా సహకరించాల‌ని మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.  కరోనాను ఎదుర్కొనే విషయంలో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటున్నామ‌ని, ఈ పరిస్థితుల నుండి బయటపడేందుక ప్రజల సహకారం సంపూర్ణంగా ఉండాలని ఆయ‌న అన్నారు.

ఏపీలో మరో 17 కరోనా కేసులు.. ఢిల్లీ వెళ్లిన వారు మొత్తం 711

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులలో కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. గత రాత్రి వరకు 164 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా 147 మందికి నెగిటివ్ రాగా 17 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40 కి చేరింది. ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో అత్యధిక మందికి కరోనా సోకిందని తేలడంతో.. వారితో సన్నిహితంగా మెలిగినవారు, వారితో కలిసి ప్రయాణించిన వారిలో ఆందోళన నెలకొంది. దీంతో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిపై ఏపీ సర్కార్ పై దృష్టి పెట్టింది. రాష్ట్రం నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారి లెక్క తేల్చింది. ప్రార్థనలకు వెళ్లినవారు మొత్తం 711 మందిగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారందరూ తమ దగ్గరలోని ప్రభుత్వాసుపత్రులకు వెళ్లి చెక్ చేయించుకోవాలని.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బయట తిరిగితే అరెస్ట్ చేస్తాం

గుంటూరు లో 103 కేసులు చెక్ చేశాం...అందులో 5గురికి పాజిటివ్ కేసులు వచ్చాయని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. గుంటూరు లో 2,మాచర్ల లో 2 కేసులు..కారంపూడి లో ఒక కేసు బయటపడింది..మొత్తం ఇప్పటికే 9 కేసులు వచ్చాయని తెలిపారు. 180 మంది లో 140 మంది ని గుర్తించాం.. 40 మంది కోసం వెతుకుతున్నాం అన్నారు.  ఢిల్లీ లో మీటింగ్ కి వెళ్లిన వారు... వారి భార్య లకు పాజిటివ్ కేసులు వచ్చాయనీ గుంటూరు జిల్లా కలెక్టర్ చెప్పారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు స్వచ్చందంగా టెస్ట్ చేయించుకోవాలి..అలా కాకుండా మాకు పట్టుబడితే కఠినంగా చర్యలు ఉంటాయి. నోటీసులు అందుకొని బయట తిరిగితే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తాo. కారంపూడి, మాచర్ల, గుంటూరు లో కర్ఫ్యూ విధించాము. పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో ఇంటికే వెళ్లి కూరగాయలు, నిత్యావసర వస్తువుల ఇస్తామన్నారు కలెక్టర్.

జ‌మాత్ స‌మావేశాలు ఎంత మంది జీవితాల్ని...

త‌బ్లీక్ జ‌మాత్‌కు చెందిన మూడు రోజుల ఇస్త‌మా ఈ నెల 13-15 ఢిల్లీలోని నిజాముద్దీన్ మ‌ర్క‌జ్‌లో జ‌రిగింది. ఈ స‌మావేశంలో 75 దేశాల నుంచి ఎనిమిదివేల మంది వరకూ హాజరైనట్లుగా గుర్తించారు. ఇండోనేషియా.. మలేషియా.. సౌదీ.. కజకిస్థాన్ ఇలా చాలా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఇలా హాజరైన విదేశీయుల సంఖ్య ఏకంగా రెండు వేలు. మూడు రోజుల స‌మావేశాలు ముగిసిన‌ప్ప‌ట్టికీ ఇంకా మ‌ర్క‌జ్ భ‌వ‌నంలోని ఆరు అంతస్తుల డార్మటరీల్లో 280 మంది విదేశీయులు ఉన్నట్లుగా తేలింది. అక్కడున్న మొత్తం 300 మందికి కొవిడ్ 19 లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో 175 మందికి పరీక్షలు నిర్వహించగా పలువురికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా తేలింది. అనారోగ్యంగా ఉన్న 75 మందిని ఆదివారమే ఢిల్లీలో గుర్తించారు. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించి ఒకేచోట వేల మంది ఎలా ఉన్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరింత షాకింగ్ అంశం ఏమంటే.. మూడు రోజుల ఇస్త‌మా జరిగిన స్థలం నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ ను అనుకునే ఉండటం. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఇప్ప‌డు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మౌలానాపై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. లాక్‌డౌన్ కార‌ణంగా స్వస్థలాలకు వెళ్లేందుకు వాహనాలు లేక ఇక్కడే ఉన్నారని మ‌ర్క‌జ్ భవనం ప్రతినిధి చెబుతున్నారు.