ప్రజలకే కాదు.. కార్యకర్తలకూ పట్టని వైసీపీ బస్సుయాత్ర!?
posted on Oct 27, 2023 @ 1:23PM
మంత్రులు, ఎమ్మెల్యేలు సామాజిక సాధికార యాత్ర పేరుతో ప్రత్యేక బస్సులు వేసుకొని యాత్రకు బయలుదేరారు. మంత్రులకు చేసే పనేం లేదన్న విషయం తెలిసిందే. ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అన్ని నిర్ణయాలూ సీఎం జగన్ తీసుకుంటారు. జగన్ తీసుకుంటారనే కంటే ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శా సజ్జల రామకృష్ణారెడ్డే చూసుకుంటారంటే సరిగ్గా సరిపోతుంది. ఆయా శాఖలకు సంబంధించి కార్యక్రమాలపై మీడియా సమావేశాలను కూడా సజ్జలే అడ్రస్ చేస్తారు. దీంతో పని లేని మంత్రులకు ఏదో పని చెప్పాలికదా అన్నట్లుగా సీఎం జగన్ ప్రభుత్వ ఘనతలను ప్రజలకు చాటండంటూ బస్సు యాత్ర పేరిట వారిని జనంలోకి పంపించేశారు. ఇక ఎమ్మెల్యేల సంగతి చప్పనవసరం లేదు. వారికీ వారి వారి నియోజకవర్గాలలో ఎటూ పనిలేదు. అన్నీ వాలంటీర్లే చూసుకుంటారు. సో వారినీ జనం మీదకు తోలేశారు సీఎం జగన్.
బస్సు యాత్ర పేరిట జనంలోకి వెళ్లి వారు చేయాల్సిందేమిటయ్యా అంటే మా ప్రభుత్వం ఇది చేసింది.. అది చేసింది. మా ప్రభుత్వ హయాంలో ఇంత అభివృద్ధి జరిగింది. అంత అభివృద్ధి జరిగింది అని చెప్పుకోవడం కాదు. ఎందుకంటే అదేం జరగలేదన్న విషయం ప్రజలకే కాదు.. బస్సు యాత్ర పేరిట జనంలోకి వస్తున్న మంత్రులూ, ఎమ్మెల్యేలకు కూడా స్పష్టంగా తెలుసు. అందుకే వారు ఈ బస్సు యాత్ర పేరిట ఒకే మంత్రం జపిస్తున్నారు. ఆ మంత్రుం ఏమిటంటే..విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడటం. ఆ విమర్శలను జనం పట్టించుకుంటున్నారా? లేదా అన్నది వారికి అనవసరం. మీడియాలో వచ్చి అది సీఎం జగన్ కంట పడితే చాలు. వారి లక్ష్యం నెరవేరిందని సంబరపడిపోతారు.
జనం ఛీత్కారాలు, తిరుగుబాట్లు వారికేం కొత్త కాదు. గతంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలోనే వారికి జనం ఛీత్కారాలు అనుభవేకవైద్యం అయ్యాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలోనూ ఎక్కడా ఈ ఐదేళ్లలో ఇది చేశాం అని చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. వైసీపీ నేతలు, మంత్రులూ ఏదైనా కార్యక్రమం పెట్టుకుని జనంలోకి వచ్చినా.. వారికి ఎదురౌతున్నది ప్రజా తిరస్కారం మాత్రమే. సమస్యలపై నిలదీతలు, హామీలను విస్మరించారంటూ జనం ఆగ్రహం ఇవే వారికి ఎదురౌతున్నది. అయితే ఈ సారి బస్సు యాత్రలో వారికి గొప్ప ఉపశమనం కలిగింది. అదేమిటంటే వారి యాత్రను జనం అస్సలు పట్టించుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా పట్టుమని వంద మంది కూడా రాని పరిస్థితి. ముఖ్యమంత్రి సభలకు అయితే నయానో భయానో, బెదరించో, బామాలో జన సమీకరణ చేసేవి పార్టీ శ్రేణులు. విషయం తెలిసి కూడా చేతి చమురు వదుల్చుకుని బస్సు యాత్రలకు కూడా జనసమీకరణ కోసం కష్టపడటం ఎందుకనుకున్నారో ఏమో కార్యకర్తలు కూడా కాడి వదిలేవారు. దీంతో వైసీపీ బస్సు యాత్రలు ఎవరికీ పట్టని కార్యక్రమంగా మారిపోయాయి.
తొలి రోజు మూడు ప్రాంతాల నంచీ ఏకకాలంలో ప్రారంభమైన బస్సు యాత్రలలో ఇదే పరిస్థితి సాక్షాత్కరించింది. ఖాళీ కుర్చీలను ఉద్దేవించి చేసిన ప్రసంగాలలో కూడా నేతలు చంద్రబాబునాయుడిని, జనసేనానిని విమర్శించడానికే పరిమితమైపోయారు తప్ప.. మరో మాట వారి నోటి వెంట రాలేదు. ఇంతకీ ఈ యాత్రలో వైసీపీ వారికి కలిగిన ఉపశమనం ఏమిటంటారా.. జనం పట్టించుకోకపోవడంతో గడపగడపకూలోలా వారికి నిరసన సెగలు తగలలేదు. మొత్తంగా వైసీపీ ఆర్భాటంగా ప్రారంభించిన ఈ యాత్రను ప్రజలే కాదు, వైసీపీ శ్రేణులు కూడా పట్టించుకోలేదన్నదే పరిశీలకులు విశ్లేషణ.