మనవడి ఆరోగ్యం... మీ చేతుల్లోనే!

ఓ సినిమాలో బ్రహ్మానందం తన జీవితంలో ఉన్న కష్టాలన్నింటికీ తాతే కారణం అని హడావుడి చేస్తుంటాడు. ఎవరి జీవితాన్ని వాళ్లు తీర్చిదిద్దుకోవాల్సిందే కాబట్టి, బ్రహ్మానందం అన్న మాటలు నవ్వులనే పండించాయి. కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం తాత పాత్ర తప్పకుండా ఉందంటున్నారు సిడ్నీకి చెందిన కొందరు పరిశోధకులు. అనడమే కాదు నిరూపిస్తున్నారు కూడా...   ఆ మధ్య ఎప్పుడో తండ్రి ఆరోగ్యం పిల్లల మీద ప్రభావం చూపుతుందంటూ అమెరికాలో ఒక పరిశోధన తేల్చి చెప్పింది. పిల్లల్ని కనాలనుకునేవారు సరైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండాలనీ, లేకపోతే వారి పిల్లల్లో ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయని సదరు పరిశోధన తేల్చింది. అది నిజమే కానీ! తాతల ఆలవాట్లు సవ్యంగా లేకపోతే, తండ్రి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఉపయోగం లేదని తాజా పరిశోధన చెబుతోంది. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు కొన్ని ఎలుకలకు రకరకాల ఆహారాలను అందించి చూశారు. సదరు ఆహారాలను తీసుకున్న ఎలుకల తొలి తరాన్నీ, ఆ తరువాతి తరాన్నీ నిశితంగా పరిశీలించారు. అలా తేలిన ఫలితాలే ఇవి.    పరిశోధకుల అభిప్రాయం ప్రకారం తాతయ్యలలో చక్కెర పదార్థాలను తీసుకునే అలవాటు, చిరుతిళ్లను లాగించే బలహీనతా ఉంటే... వారి మనవళ్లలో జీవక్రియ (మెటాబాలిజం) సంబంధమైన సమస్యలు త్వరగా తలెత్తుతాయని తేలింది. వీరి మనవళ్ల శరీరంలో చక్కెర నిల్వలు అదుపు తప్పిపోవడం, డయాబెటీస్, ఫ్యాటీ లివర్‌ వంటి సమస్యలు తలెత్తే అవకాశం అధికమట. దీనికి తోడు తండ్రి ఆహారపు అలవాట్లు కూడా సవ్యంగా లేకపోతే ఇక చెప్పేదేముంది! రెండు తరాలుగా వస్తున్న చెడు అలవాట్లకు మనవడు పూర్తిగా శిక్షను అనుభవించాల్సి వస్తుంది.   ఏతావాతా తేలిందేమంటే... పుట్టబోయే బిడ్డ మీద తండ్రి ఆహారపు అలవాట్ల కంటే తాతగారి అలవాట్లే ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అంటే మన జీవనశైలి మరో రెండు తరాల ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా మసులుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలా ఎందుకు జరుగుతుందీ అంటే కారణం చెప్పలేకపోతున్నారు కానీ... జరుగుతుంది అనడంలో మాత్రం ఎలాంటి సందేహమూ లేదంటున్నారు. అయితే తాత, తండ్రుల ఆరోగ్యపు అలవాట్లు కేవలం మగపిల్లల మీదే ప్రభావం చూపడం మరో విచిత్రం!   ఇన్నాళ్లూ బిడ్డ ఆరోగ్యానికి కారణం జన్యువులేననీ, మహా అయితే అతని తల్లి అలవాట్లు అతని మీద ప్రభావం చూపే అవకాశం ఉందనీ అంతా భావిస్తూ వచ్చారు. కానీ రానురానూ బయటపడుతున్న ఇలాంటి పరిశోధనలు పిల్లల ఆరోగ్యంలో తండ్రుల పాత్ర, ఆ మాటకు వస్తే తాతల పాత్ర తక్కువేమీ కాదని తేలుస్తున్నాయి. మరి సవ్యమైన ఆహారపు అలవాట్లు లేనివారికి పుట్టినవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే... దానికీ ఓ సలహాను పడేస్తున్నారు పరిశోధకులు. ఒక అద్దెకారుని ఎంత భద్రంగా చూసుకోవాలో, మీ శరీరాన్ని కూడా అంతే భద్రంగా చూసుకోమని చెబుతున్నారు. ఎడాపెడా వాడేయకుండా, ఏదో ఒక సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్న జాగరూకతతో మెసులుకోమంటున్నారు. ఇంతకంటే తాత, తండ్రుల నుంచి వచ్చిన బలహీనతల నుంచి రక్షించుకునేందుకు మరో మార్గమేదీ లేనేలేదట! - నిర్జర.

గురక ఇక దూరం!

ఇంట్లో ఎవరైనా గురక పెట్టేవారుంటే వాళ్లు సుఖంగా నిద్రపోతారేమో కానీ, మిగతావారికి మాత్రం జాగారం తప్పదు. ఎందుకంటే గురక సమస్య మనకంటే మన తోటివారినే ఎక్కువగా విసిగిస్తుంది. ఇక కొత్త చోట గురక పెడితే అది అవతలివారికి మన మీద దురభిప్రాయాన్ని కలిగించే ప్రమాదమూ లేకపోలేదు. చుట్టుపక్కల వారు చూసీ చూడనట్లు ‘మీకు బాగా గురకపెట్టే అలవాటు ఉన్నట్లుందే!’ అని బయటపడినా కూడా ‘అబ్బే అలాంటిదేమీ లేదు!’ అంటూ దాటవేస్తూ ఉంటారు చాలామంది. అలా నామోషీపడి మన గురక అలవాటుని లేదన్నట్లుగా భ్రమిస్తే చివరికి నష్టపోయేది మనమేనంటున్నారు నిపుణులు.   ఇవీ కారణాలు! ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే గాలికి కొండనాలికకి అడ్డుపడుతూ ఉండటం వల్ల గురక శబ్దం వస్తుంది. ఇలా జరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి.   - కొండనాలిక చుట్టూ కొవ్వు పేరుకునిపోయి, శ్వాస వెళ్లే ద్వారం సన్నబడిపోవడం. - ఆస్తమా, సైనస్ వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు. - జలుబు, కఫంతో కూడిన దగ్గు వంటి తాత్కాలిక సమస్యలు. - ఊబకాయం వల్ల నోటి ద్వారా గాలిని పీల్చుకోవలసి రావడం. - ధూమపానం వల్ల శ్వాసనాళాలు మూసుకుపోవడం. - మద్యపానం కలిగించే మత్తులో గొంతులోని కండరాలు అదుపుతప్పడం. - ఆలస్యంగా అందులోనూ భారీగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల మీద ఒత్తిడి ఏర్పడటం.   ఇవీ సూచనలు! గురక కేవలం ఒక అనారోగ్యం కాదు. మన శరీర వ్యవస్థలో ఏదో లోపం ఏర్పడిందని చెప్పే సూచన!   - గుండె జబ్బులు ఉన్నవారిలో గురక అలవాటు అధికంగా ఉంటుంది. గురక అలవాటు ఉన్నవారిలో గుండెపోటు రావడానికి   30 శాతానికి పైగా అవకాశం ఉందంటున్నారు నిపుణులు. - పక్షవాతానికీ గురకకీ మధ్య కూడా చాలా తీవ్రమైన సంబంధం ఉందంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఐరోపా ప్రజలను         పరిశీలించినప్పుడు వారిలో గురకకీ, పక్షవాతానికీ మధ్య ఏకంగా 67 శాతం సంబంధం ఉన్నట్లు తేలిందట. - లోలోపల మానసిక సమస్యలతో కుంగిపోతూ సరిగా నిద్రపట్టనివారిలో గురక పెట్టే అలవాటు ఎక్కువగా    ఉంటుందంటున్నారు వైద్యులు. - అధిక రక్తపోటు, కండరాల సమస్యలు వంటివి కూడా గురకకు దారితీయవచ్చు.   ఇవీ మార్గాలు! గురకను తగ్గించేందుకు అన్నిరకాల వైద్యవిధానాలలోనూ మందులు లభిస్తున్నాయి. ఇవి కాకుండా కొన్ని పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితులలో శస్త్రచికిత్స ద్వారా దీనిని నివారించుకునే అవకాశం ఉంది. కానీ చిన్నపాటి జాగ్రత్తలను కనుక పాటిస్తే చాలామందిలో గురక సమస్యను నివారించవచ్చు. అవేమిటంటే... - రాత్రివేళల్లో మితమైన, అది కూడా త్వరగా అరిగిపోయే ఆహారాన్ని తీసుకోవాలి. ఆ ఆహారం కూడా నిద్రపోయే వేళకి  అరిగిపోయేట్లుగా ఉండాలి. - ప్రాణాయామం వంటి పద్ధతుల ద్వారా శ్వాసకోశంలో ఉన్న సమస్యలను, తద్వారా గురకనూ నివారించవచ్చు. - పడుకునే ముందు కాస్త ఆవిరి పడితే ముక్కు, గొంతులో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి. - వెల్లకిలా పడుకున్నప్పుడే గురక పెట్టే సమస్య అధికంగా ఉంటుంది. అందుకని పక్కకి తిరిగి పడుకుంటే ఈ సమస్య    తాత్కాలికంగా అయినా తగ్గుతుంది. అందుకు తగినన్ని దిళ్లని మెడ కింద పేర్చుకోవాలి. - ఇక వెల్లకిలా పడుకున్నప్పుడు, తల కింది ఎక్కువ ఎత్తు ఉండటం వల్ల కూడా శ్వాసకి అడ్డంకులు ఏర్పడి, గురకకి  దారితీస్తాయి. కాబట్టి తల కింద వీలైనంత తక్కువ ఎత్తుతో పడుకోవడం మంచింది. - ధూమపానం, మద్యపానం వంటి అనారోగ్యకర అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. - అన్ని అనర్థాలకూ మూలకారణం ఊబకాయం. శరీర బరువును, ఆకారాన్నీ నియంత్రించుకుంటే గురకే కాదు... దాంతో  పాటుగా సవాలక్ష సమస్యలు మాయమైపోతాయి. చాలామంది గురక వల్ల కేవలం అవతలివారికే ఇబ్బంది అనుకుంటారు. నిజానికి గురక పెడుతున్నవారు కూడా హాయిగా నిద్రపోతున్నారని చెప్పడానికి లేదు. పైగా గురుక శబ్దం వల్ల వారిలోని గుండె కండరాలు నాశనమైపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గురకని నివారించుకునే ప్రయత్నాలు చేయడానికి ఈ హెచ్చరిక చాలేమో! - నిర్జర.  

వాసన పీలిస్తే అల్జీమర్స్‌ బయటపడుతుంది

  అల్జీమర్స్- మనిషి బతికుండగానే అతని జ్ఞాపకశక్తిని హరించివేసే మహమ్మారి రోగం. తన జ్ఞాపకాలనే కాదు, భాషని సైతం మర్చిపోయేలా చేసే శాపం. వైద్య విజ్ఞానం ఇంతగా ఎదిగినా కూడా ఇప్పటికీ అల్జీమర్స్ ఎందుకు వస్తుందో తెలుసుకోలేకపోతున్నారు. దానికి నివారణ కానీ చికిత్స కానీ చేయలేకపోతున్నారు.   భారత దేశంలో ఒకప్పుడు అల్జీమర్స్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మన దేశంలోనూ అల్జీమర్స్ బారినపడేవారి సంఖ్యలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. ఏటా లక్షలాది మంది భారతీయులు అల్జీమర్స్‌కి లోనవుతున్నట్లు తేలింది. ప్రతి ఇరవై ఏళ్లకీ ఈ సంఖ్య రెట్టింపు అవుతోందనే అంచనాలూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అల్జీమర్స్ గురించి భయాన్ని రేకెత్తించే విషయాలే! కానీ పెన్సిల్వేనియాకు చెందిన కొందరు పరిశోధకుల ప్రయోగంతో అల్జీమర్స్‌ను అతి చవకగా, తేలికగా ముందస్తుగానే కనుగొనే అవకాశం చిక్కింది.   అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన సమస్యలు సాధారణంగా 60 ఏళ్లు పైబడిన తరువాతే కనిపిస్తాయి. అప్పటికే వ్యాధి ముదిరిపోయి ఉంటుంది. అలాగని అల్జీమర్స్‌ సోకే అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తిద్దామా అంటే... అది అత్యంత ప్రయాసతో కూడుకున్న ప్రక్రియ. మెదడు మీద నానారకాల ప్రయోగాలు చేస్తేకానీ అల్జీమర్స్‌ను ముందుగా గుర్తించడం కష్టం. అందుకే వాసన పీల్చడం ద్వారా అల్జీమర్స్‌ లక్షణాలను ముందుగా గుర్తించే అవకాశం ఉందేమో కనుగొనే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అల్జీమర్స్ సోకే వ్యక్తులలో ఘ్రాణశక్తి నిదానంగా తగ్గిపోతుంటుందని ఇదివరకే తేలిపోయింది. ప్రయోగంలో భాగంగా పరిశోధకులు 728 మంది వృద్ధులను ఎన్నుకొన్నారు. వారిని 16 రకాల వాసనలను గుర్తుపట్టమన్నారు. ఈ పరీక్షకు తోడుగా వారి జ్ఞాపకశక్తిని, విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ‘కాగ్నిటివ్‌ టెస్ట్‌’ని కూడా నిర్వహించారు. వాసన పీల్చే పరీక్ష ద్వారా దాదాపు 90 శాతం సందర్భాలలో అల్జీమర్స్ దాడిని ముందస్తుగానే గ్రహించగలిగారు.   ఇంతకీ అల్జీమర్స్‌ని దాడిని సులువుగా పసిగడితే ఏంటి ఉపయోగం అన్న సందేహం రావడం సహజం. అల్జీమర్స్‌ను నివారించేందుకు కానీ చికిత్స చేసేందుకు కానీ ఎలాంటి మందులూ లేకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఈ వ్యాధి సోకనుందని తేలితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాని నష్టాన్ని వీలైనంతగా తగ్గించవచ్చు. మంచి పోషకాహారాన్ని తీసుకోవడం, జీవనశైలిని మార్చుకోవడం, వ్యాయామం చేయడం, ధ్యానంలో నిమగ్నం కావడం వంటి చర్యలతో అల్జీమర్స్ దూకుడు తగ్గుతుంది. పైగా ఇలాంటి వ్యక్తులను చుట్టుపక్కలవారు కూడా కాస్త జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండే అవకాశం దక్కుతుంది.   ఇక మీదట మీకు అల్జీమర్స్ సోకనుందేమో అన్న అనుమానం కలిగితే, వైద్యలు ఓ నాలుగు రకాల పూలని వాసని పీల్చి చూడమని అడిగే అవకాశం లేకపోలేదు. ఇంతేకాదు! ముక్కులోంచి స్రవించే ద్రవాలను విశ్లేషించడం ద్వారా కూడా అల్జీమర్స్‌ను ముందుగా గ్రహించే ప్రయోగాన్ని కూడా మొదలుపెట్టారు పరిశోధకులు.      - నిర్జర.

కాపురాన్ని చక్కదిద్దే హార్మోను

ఆక్సిటోసిన్- ఈ పేరు మనకి కొత్త కావచ్చు. కానీ వైద్యులకి కాదు. అప్పుడే పుట్టిన పిల్లవాడి మీద తల్లికి ప్రేమ కలగడం దగ్గర్నుంచీ, టీనేజి కుర్రకారు ప్రేమలో పడటం వరకూ కథంతా నడిపించేది ఈ హార్మోనే! ఒక్కమాటలో చెప్పాలంటే ఇది లవ్ హార్మోను. కానీ సంసారాన్ని చక్కదిద్దడంలో ఈ హార్మోను ఏమేరకు పనిచేస్తుందో చూడాలనుకున్నారు పరిశోధకులు. ఫలితం ఇదీ... అమెరికా, నార్వేలకి చెందిన పరిశోధకులు కాపురంలో ఆక్సిటోన్ పాత్ర గురించి గమనించాలనుకున్నారు. ఇందుకోసం వారు అమెరికా, నార్వేలకు చెందిన దాదాపు 300 మందిని పిలిపించారు. వీరందరినీ కూడా ‘ఒక్కసారి మీ భాగస్వామి గురించీ, వారితో మీకున్న అనుబంధం గురించి తల్చుకోండి,’అని వారికి సూచించారు. అలా తల్చుకునే సమయంలో వారిలో ఆక్సిటోసిన్ స్థాయి పెరగడాన్ని గమనించారు. దాంతో ఆక్సిటోసిన్కూ భార్యాభర్తల అనుబంధానికీ మధ్య సంబంధం ఉందని తేలిపోయింది.   మనిషన్నాక నానారకాల హార్మోనుల పనిచేస్తుంటాయి. ఒకో సందర్భాన్ని బట్టి ఒకో హార్మోను పనిచేయడంలో ఆశ్చర్యం ఏముంటి? అన్న అభిప్రాయం కలగవచ్చు. కానీ ఆక్సిటోసిన్కి సంబంధించి నిజంగానే ఆశ్చర్యం కలిగించే అంశం ఒకటుంది. బంధం సరిగ్గా లేనప్పుడు ఈ ఆక్సిటోసిన్ మరింత ఎక్కువగా ఉత్పత్తి అవుతుననట్లు గ్రహించారు. అంటే భార్యాభర్తలలో ఎవరో ఒకరు సంసారం పట్ల చిరాకుగా ఉంటే... ఆ చిరాకుని సరిదిద్ది కాపురాన్ని చక్కబెట్టుకునేలా, అవతలి వ్యక్తిలో ఆక్సిటోసిన్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతోందట. దాంతో అవతలి వ్యక్తి అభిప్రాయాలను మరింతగా గౌరవించేందుకు, వారితో మరింత జాగ్రత్తగా మెలిగేందుకు ఆక్సిటోసిన్ ఉపయోగపడుతుంది.   భార్యాభర్తలలో ఒకరికి ఆక్సిటోసిన్ తక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటే... అవతలి వ్యక్తిలో ఆ కాపురాన్ని చక్కదిద్దుకునేందుకు ఆక్సిటోసిన్ ఉత్పత్తి ఎక్కువ కావటం ఆశ్చర్యమే! బహుశా ఈ కారణంగానే మొగుడూపెళ్లాల మధ్య చిచ్చు రేగినప్పుడు, ఇద్దరిలో ఎవరో ఒకరు అహాన్ని పక్కనపెట్టి సామరస్యానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలా జరగడానికి కూడా ఓ పరిమితి ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఒక పరిమితి దాటిన తర్వాత ఆక్సిటోసిన్ పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉందట. అంటే పట్టువిడుపుల హద్దులు దాటి, తెగేవరకు లాగితే... ఏ హార్మోనూ పనిచేయదన్నమాట. ఆక్సిటోసిన్ ప్రభావం గురించి తెలిసింది కాబట్టి మున్ముందు దీన్ని చికిత్సలా కూడా అందిచే అవకాశం లేకపోలేదు. ‘నాకు ప్రపంచంలో ఎవర్ని చూసినా చిరాగ్గా ఉంటోంది, నా సొంత తమ్ముడినే చంపాలనుంది, మా ఆవిడ ఎంత మంచిదైనా కూడా ఆమెతో కాపురం చేయబుద్ధి కావడం లేదు...’ అంటూ వచ్చే రోగులకి ఆక్సిటోసిన్ మందులు ఇస్తే మనసంతా ప్రేమతో నిండిపోతుందేమో! - నిర్జర.

మీ గుండే, ఎముకలు క్షేమంగా వుండాలంటే రోజు దానిమ్మ తినండి...

  క్యాన్సర్.. ఈ పేరు వింటేనే జనం భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి. ఇటీవలి కాలంలో క్యాన్సర్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేసే పరిస్థితి.. కానీ ఆలస్యంగా గుర్తిస్తే పరిస్థితి చేజారిపోతోంది. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడ్డామంటే ఇక అంతే సంగతులు. అందుకే ప్రాణాంతకర వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. చిన్న చిన్న ఆహారపు అలవాట్ల ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. అలాంటి వాటిలో ప్రధానమైనది దానిమ్మ. మన రోజువారి ఆహారంలో దానిమ్మను చేర్చడం వల్ల క్యాన్సర్‌ దరిచేరకుండా చేయవచ్చు. ఇది ఒక్కటే కాకుండా దానిమ్మ వల్ల ఉపయోగాలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.  

తోటి ఉద్యోగులతో మంచిగా ఉంటేనే ఆరోగ్యం

  ఉద్యోగం అంటేనే బాధ్యత. ఆ బాధ్యతను పూర్తిచేసేందుకు రకరకాల ఒత్తిళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక ఆ ఒత్తిడికి రాజకీయాలు కూడా తోడైతే చెప్పేదేముంది. నవ్వుతూ చేయాల్సిన ఉద్యోగం కాస్తా నరకానికి మారుపేరుగా మారిపోతుంది. ఉద్యోగం కనుక మనకి తృప్తిని ఇస్తుంటే, తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంటే... మానసికంగానూ, శారీరకంగానూ చాలా లాభం ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. ఇవిగో వారి మాటలు-   దేశదేశాల నిపుణులు ఆస్ట్రేలియా, చైనా, జర్మనీ, నార్వే... ఇలా నాలుగు దేశాలకు చెందిన నలుగురు శాస్త్రవేత్తలు ఉద్యోగానికీ ఆరోగ్యానికీ మధ్య ఉండే సంబంధాన్ని పరిశీలించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు 15 దేశాల్లోని 19 వేల ఉద్యోగుల మీద నిర్వహించిన 58 పరిశోధనల ఫలితాలను ఒక్కచోటకి చేర్చారు. సైన్యం దగ్గర్నుంచీ సేవారంగం వరకూ అన్ని రంగాలలోని ఉద్యోగుల ఆరోగ్యాన్ని సమీక్షించారు.   తోటి ఉద్యోగులే కీలకం సహ ఉద్యోగులతో సత్సంబంధాలు ఉన్నవారు, తాము చేస్తున్న ఉద్యోగం పట్ల తృప్తిగా ఉన్నవారు ఇతర ఉద్యోగులతో పోలిస్తే మరింత ఆరోగ్యంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. వీరి శారీరిక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉన్నట్లు బయటపడింది. పైగా ఉద్యోగపు బాధ్యతలను నెరవేర్చడంలో నిస్త్రాణంగా (Burn out) మారిపోయే ప్రమాదం కూడా వీరిలో తక్కువగా ఉండటాన్ని గమనించారు.   కారణం లేకపోలేదు ఒక సంస్థలో పనిచేసేటప్పుడు ‘నేను అన్న భావనకంటే ‘మనం’ అనే భావన చాలా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. అప్పుడు సదరు ఉద్యోగి తన సహ ఉద్యోగులతో అనుబంధాన్ని ఏర్పరుచుకుంటాడు. తన వెనుక వారు ఉన్నారన్న భరోసాని కలిగి ఉంటాడు. ఉద్యోగులందరిలోనూ ఇదే భావన ఉంటే, సంస్థలో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అంతిమంగా ఇది వారి సంతోషానికీ, ఒత్తిడి లేని జీవితానికీ దారి తీస్తుంది. నలుగురి అండతో సాగిపోయే ఇలాంటి చోట ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.   స్త్రీల మీద ప్రభావం శూన్యం సహ ఉద్యోగులతో అనుబంధంతో మంచి ఆరోగ్యం అనే సూత్రం ఉద్యోగినులకు మాత్రం వర్తించకపోవడం ఆశ్చర్యం. అంటే దాని ఉద్దేశం వారు నిరంతరం రాజకీయాలలో మునిగి తేలుతున్నారని కాదు. ఇప్పటికీ చాలా సంస్థలలో పురుషుల ఆధిక్యతే సాగుతోంది. ఇలాంటి చోట్ల మహిళలు ఎంత చొరవ చూపించినా కూడా, తమకి సంస్థలో సమాన ప్రాధాన్యత లేదన్న భావన కలగడం సహజమే!   అనారోగ్యంతో ఉన్నవారు మంచి సంస్థలలో పనిచేస్తే వారి ఆరోగ్యం హఠాత్తుగా మెరుగుపడిపోతుందని కాదు. సంస్థలలో పనిచేయకుండా వ్యక్తిగతంగా పనిచేసేవారికి ఎలాంటి ఆరోగ్యమూ, తృప్తీ లభించవనీ కాదు. కానీ పదిమందితో కలిసి పనిచేస్తున్నవారు, తమ చుట్టూ సానుకూలమైన బంధాలను ఏర్పరుకుంటే మంచిదన్న సూచనను మాత్రం ఈ పరిశోధనలు మనకి అందిస్తున్నాయి.                      - నిర్జర.

అరటి అంటే అంత అలుసా!

రోజుకో ఆపిల్ తింటే ఆహారంగా- ఉంచుతుంది డాక్టర్ ని దూరంగా. ఇది అసలు మన భారతీయ వాతావరణానికి సరిపోయే మాట కానే కాదు. నిజానికి మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో  పండే పళ్ళని మనం తింటే అవి మన ఒంటికి సరిగా సరిపోతాయట. అంటే అరటి, జామ, కమలా, బొత్తాయి, నేరేడు ఇలాంటివి మన వాతావరణంలో పండే పళ్ళు కాబట్టి ఇవి మన వంటికి కరెక్ట్ గా సూట్ అయ్యే పళ్ళు. వీటిలో అరటిపండు మనకి ఏడాది మొత్తం సులువుగా దొరుకుతుంది. కాని చేతికి అందుబాటులో ఉండటం వల్ల అరటి అంటే చాలా మందికి చులకన. నిజానికి ఒక అరటిపండులో 70% నీరు  ఉంటుందిట. ఎండాకాలంలో దీనిని తినటంవల్ల మనకి త్వరగా అలసట రాదు. అంతే కాదు ఒంట్లో నిస్సత్తువని కూడా దూరం చేస్తుందిట.     *  అరటిపండు తినటం వల్ల హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంటుందిట. న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ వారు ఈ పండు తింటే గుండెపోటు 40% తగ్గే వీలుందని ప్రకటించారు కూడా. *  దీనిలో  పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల గుండె సరిగా పనిచేసేలా చేస్తుంది. ఈ పొటాషియం కిడ్నీలకి, ఎముకలకి కూడా బలాన్నిస్తుంది. *  దీనిలో ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది. ఆహ్హారం అరుగుదలకు తోడ్పడుతుంది. *  కడుపులో అల్సర్లు ఉన్నవారికి ఇదొక మంచి ఔషధం. కడుపు మంటని చక్కగా తగ్గిస్తుంది. *  విటమిన్ B6 చాల ఎక్కువగా ఉండటం వల్ల ఇది హిమోగ్లోబిన్ తయారుకావటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. *  ఈ అరటిపండులో విటమిన్ సి, మెగ్నీషియం, మెంగనీస్ కూడా ఉండటం తో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. *  మన అలసిపోయినపుడు ఒక్క అరటిపండు తింటే చాలు పోయిన ఓపిక తిరిగి వస్తుంది. ఇది ఒంట్లో శక్తిని పెంచటమే కాదు, స్ట్రెస్ ని కూడా బాగా తగ్గిస్తుంది.     *  రాత్రి పూట అరటి పండు ఒక గ్లాసు పాలు తాగితే నిద్ర హాయిగా పడుతుంది కూడా. నిద్ర కి కూడా ఇది మంచి మందులాంటిది. *  డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. * అరటిపండ్లలో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం, జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది. సంస్కృతంలో కదళి ఫలంగా పిలిచే అరటిపండు ఎన్నో ఉపయోగాలకు పుట్టినిల్లు లాంటిది. ఒకప్పుడు ప్రతి పెరడులోను ఈ చెట్టు కనిపించేది. కేవలం పండు మాత్రమే కాదు అరటికాయ కూడా ఒంటికి ఎంతో  మేలు చేస్తుంది. అరటి అక్కులో భోజనం చేస్తే తిన్నది చక్కగా అరిగి జీర్ణ సంభందిత వ్యాధులు దగ్గరకి కూడా రావు. ఇన్ని ఉపయోగాలు ఉన్న అరటిని రోజుకి ఒకటైన తినటం అలవాటుగా మార్చుకుంటే ఎన్నో వ్యాధులు రాకుండా చెక్ పెట్టచ్చు. - కళ్యాణి  

విటమిన్‌ డి ఎక్కువవుతోంది

  మనకి ఏది వచ్చినా పట్టడం కష్టం. ఫలానా ధెరపీ మంచిదనో, ఫలానా ఆహారం తినిచూడండి అనో ఓ వార్త రాగానే... దానిని అల్లుకుని వందలాది వార్తలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. మనం కూడా వాటికి అనుగుణంగానే ప్రవర్తించేస్తుంటాం. ఏం చేస్తాం! ఆరోగ్యం గురించి అవగాహనతో పాటుగా తొందరపాటు కూడా సహజమేనేమో! బహుశా అందుకేనేమో విటమిన్‌ డి ప్రాముఖ్యత గురించి వార్తలు వినిపించగానే కొంతమంది ముందూవెనుకా ఆలోచించకుండా డి విటమిన్‌ సప్లిమెంట్లను తీసుకోవడం మొదలుపెట్టారు. వైద్యులు ఇష్టపడకపోయినా అడిగి మరీ రాయించుకుంటున్నారు. కానీ ఇదేమంత శుభపరిణామం కాదంటున్నారు నిపుణులు.   ఎందుకీ విటమిన్ డి: విటమిన్‌ డి గురించి ఒకప్పుడు పెద్దగా తెలియదు. శరీరంలోకి చేరిన కాల్షియం సరిగా ఒంటపట్టాలంటే విటమిన్ డి అవసరం అన్న విషయం మాత్రమే తెలుసు. కానీ ఈమధ్య మన శరీరానికి విటమిన్‌ డి ఎంత అవసరమో చెబుతూ, ప్రతిరోజూ ఏదో ఒక కొత్త పరిశోధన వెలుగుచూస్తూనే వస్తోంది. ఈ పరిశోధనల ప్రకారం మెదడు ఎదుగుదలలో లోపాల దగ్గర్నుంచీ షుగర్‌ వ్యాధి వరకు, ఎన్నో సమస్యలు రాకుండా డి విటమిన్‌ తోడ్పడుతుంది. ఇక కాల్షియం లోపం వల్ల ఏర్పడే ఆస్టియోపొరోసిస్‌ వంటి సమస్యలు త్వరగా దరిచేరకుండా విటమిన్‌ డి అడ్డుకొంటుందని నమ్ముతున్నారు.   అదనంగా ఎందుకు: మన శరీరానికి విటమిన్‌ డిని అందించే ప్రధాన వనరు సూర్యకాంతి. ఎందుకంటే ఆహారపదార్థాల ద్వారా విటమిన్ డి లభించే శాతం చాలా తక్కువ. అందుకనే ఈ మధ్య కాలంలో నూనె, పాలు, పళ్లరసాలు వంటి ఉత్పత్తులకు విటమిన్‌ డిని కృత్రిమంగా జోడించి మరీ విక్రయిస్తున్నారు. ప్రస్తుత జీవనశైలిలో మనం బయట తిరిగేది తక్కువ కాబట్టి, శరీరానికి అందవలసినదానికంటే తక్కువ విటమిన్‌ డి అందుతోందేమో అన్న అనుమానం ప్రతివారిలోనూ మొదలైంది. ఆ ఆనుమానమే అవసరం లేకపోయినా విటమిన్ డి తీసుకునే అలవాటుని కల్పిస్తోంది.   ఎంత అవసరం! చాలామంది రోజుకి 1000 IUల విటమిన్‌ డి మన శరీరానికి అవసరం అనుకుంటారు. కానీ 2010లో సరిచేసిన పరిమితుల ప్రకారం 70 ఏళ్లలోపువారికి 600 IUలు, 70 ఏళ్లు దాటినవారికి 800 IUల విటమిన్‌ డి అందితే సరిపోతుంది. దీనికి ఓ 200 IUలు తగ్గినా కూడా పెద్ద ప్రమాదం లేదని చెబుతున్నారు. కీళ్లవ్యాధులు వంటి సమస్యలు ఉన్నవారు తప్ప ప్రత్యేకించి విటమిన్ డిను మందుల ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ అటు వైద్యులు ఇటు రోగులు కూడా డి విటమిన్‌ను తీసుకునేందుకు ఉబలాట పడుతున్నారు.   దుష్ప్రభావాలు లేకపోలేదు: అవసరానికి మించి విటమిన్ డి మన శరీరంలోకి చేరితే చిన్నాచితకా దుష్ప్రభావాలు లేకపోలేవంటున్నారు. నీరసం, నిద్రలేమి, తలనొప్పి, అజీర్ణం, వికారం వంటి తాత్కాలిక సమస్యలు ఎలాగూ ఉంటాయట. వీటితో పాటుగా డి విటమిన్‌ వల్ల శరీరంలో అధికంగా కాల్షియం పేరుకుపోవడంతో రక్తనాళాలు గడ్డకట్టడం దగ్గర్నుంచీ కిడ్నీలు దెబ్బతినడం వరకూ రకరకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక గర్భవతులు, పాలిచ్చే తల్లులు అధికంగా డి విటమిన్‌ తీసుకోవడం వల్ల వారి శిశువుకి హానిజరిగే ప్రమాదం ఉందంటున్నారు. అందుకనే ఆటకాయితనంగా విటమిన్ డి జోలికి పోవద్దని సూచిస్తున్నారు. ముందుగా వైద్యుల సలహా సంప్రదింపుల మేరకే మనకు డి విటమిన్‌ అవసరం ఉందా లేదా తెలుసుకోవాలి. ఒకవేళ సూర్యకాంతిలో కాసేపు తిరగడం వల్ల అది అదుపులోకి వస్తుందేమో ప్రయత్నించాలి. ఆ తరువాతే సప్లిమెంట్ల జోలికి పోవాలి.   - నిర్జర.

వయసులో తాగితే జీవితాంతం అనుభవించాల్సిందే!

ఒకప్పుడు తాగుడు అలవాటు 30 ఏళ్లు దాటినవారిలోనే కనిపించేది. ఒకేవేళ కుర్రతనంలో తాగినా, సమాజానికి భయపడుతూ ఓ నాలుగు చుక్కలు పుచ్చుకునేవారు. ఇప్పుడలా కాదు! కుర్రకారు మద్యం మత్తులో కూరుకుపోతున్నారు. కళ్లు బైర్లు కమ్మిపోయేంతగా తాగి కార్లు నడుపుతున్నారు. డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లోనే వేలమంది కుర్రకారు పట్టుబడుతుంటే ఇక ఇంటిపట్టునో, బారుమాటునో పీపాలకి పీపాలు లాగించేవారి సంగతి చెప్పేదేముంది. ఇలాంటివారికి హెచ్చరికగా ఇప్పుడో పరిశోధన వెలుగులోకి వచ్చింది.   తాగితే దీర్ఘకాలిక సమస్యలే కొంతకాలం పాటు తాగి మానేసినవారు పూర్తి ఆరోగ్యవంతులుగా మారిపోతారని ఇప్పటివరకూ నమ్మేవారు. ఈ నమ్మకంలో ఎంతవరకు నిజం ఉందో తేల్చేందుకు పరిశోధకులు ఒక 600 మంది మాజీ సైనికుల అలవాట్లను గమనించారు. వీరిలో 30 ఏళ్లలోపు తెగ తాగేసి తరువాత మానేసినవారు ఎంతమంది ఉన్నారో పరిశీలించారు. ఆ తరువాత కాలంలో మిగతావారితో పోలిస్తే వీరు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలని గమనించారు.     సమస్యలు ఖాయం యవ్వనంలో విపరీతంగా తాగి, ఆ తరువాత కాలంలో మానేసిన వారు 60 ఏళ్లు చేరుకున్నాక ఏవో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడినట్లు తేలింది. ఓ 44 రకాల వ్యాధుల జాబితాలో మద్యపానం అలవాటు లేనివారికి ఓ రెండు వ్యాధులు ఉంటే, మందు పుచ్చుకొని మానేసినవారిలో సగటున మూడు వ్యాధులు కనిపించాయట. ఇక వీరు డిప్రెషన్‌తో క్రుంగిపోయే అవకాశం అయితే రెట్టింపు ఉన్నట్లుగా తేలింది.   కారణం తాగుడు వల్ల మెదడులో నిర్ణయాలు తీసుకోవడం, స్వీయనియంత్రణ కలిగి ఉండటాన్ని ప్రభావితం చేసే భాగాలు దెబ్బతింటాయని తేలింది. దీని వలన మనిషి సిగిరెట్‌ వంటి ఇతరత్రా వ్యసనాలకు బానిస కావడం, ఆహారం మీద అదుపు లేకపోవడం వంటి అనారోగ్య జీవనశైలిని గడుపుతూ ఉంటాడు. పైగా తాగడం వల్ల మన శరీరం మీదా మెదడు మీదా ఎలాంటి ప్రభావాలు ఉంటాయన్నదాని మీద ఇప్పటివరకూ ఓ స్పష్టత లేదు. కానీ మనం ఊహిస్తున్న దానికంటే, శరీరం మీద తాగుడు ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని ఈ పరిశోధన రుజువు చేస్తోంది.   తస్మాత్‌ జాగ్రత్త వయసులో ఉండగా తాగడం సహజమే! అనే అభిప్రాయం నుంచి ఇటు కుర్రకారు, అటు వారి తల్లిదండ్రులు కూడా తప్పుకోవాలి. జీవితంలో ఏ దశలో అయినా మద్యపానం క్షేమం కాదు, దాని తాలూకు ప్రభావమూ తాత్కాలికం కాదు అన్న నిజాన్ని గ్రహించాలి. ఇక తాగుడు మానేసినవారు తమ జీవనశైలి విషయంలో కూడా మార్పులు చేయాలి. తగినంత వ్యాయామం చేయడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, ఇతరత్రా వ్యసనాల జోలికి పోకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.   - నిర్జర.

వర్షంలో ఆడుకుంటున్నారా..? అయితే జాగ్రత్త

  వర్షాకాలం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..బయట వర్షం పడుతుంటూ సరదాగా చిరు జల్లుల్లో తడిసిపోతాం.. ఇంట్లోకి వచ్చి అమ్మ చేతి వేడి వేడి పకోడీలో.. భజ్జీలో తినడం అబ్బా ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం.. అయితే వర్షంలో తడవటం ఆ క్షణం వరకు బాగున్నా.. తడిసిన తర్వాత మన శరీరాలతో ఆడుకోవటానికి వైరస్‌లు కాచుకుని కూర్చుంటాయి. ఈ కాలంలో బ్యాక్టీరియా, ఫంగస్, ఈస్ట్‌లు ఇన్‌ఫెక్షన్లను కలగజేస్తాయి.. అందుకే వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు.   అవేంటో ఒకసారి చూద్దాం: * చర్మాన్ని వీలైనంత పొడిగా ఉంచుకోవాలి. * చేతులు, కాలి వేళ్ల మధ్య తడిని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ..యాంటీ ఫంగల్ పౌడర్ చల్లుకోవాలి. * పాదాలకు ఎక్కువ చెమట పట్టే శరీరతత్వం ఉన్నవాళ్లు ఈ కాలంలో షూస్‌కి బదులు గాలి ఆడే చెప్పులు ధరించడం మంచిది. * నీటిలో ఎక్కువగా పనిచేసే వాళ్లు, గృహిణులు, రైతులు, కూలీలు పాదాలకు, చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. * షుగర్ ఉన్నవాళ్లు దానిని అదుపులో ఉంచుకోవాలి..ఎందుకంటే వర్షాకాలంలో షుగర్ పేషేంట్ల పాదాలకు ఇన్ఫెక్షన్లు చాలా సులభంగా సొకుతాయి. *  వానలో తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు, రెయిన్‌కోట్లు వేసుకోవడం మంచిది. *  పొడిగా ఉంటే బట్టలను ధరించాలి.

ఉప్పు సమస్య మన ఒక్కరిదే కాదు!

  ఉప్పు తినడం తగ్గించండో... చక్కెరని తక్కువగా వాడండో... ఆరోగ్యాలు పాడైపోతున్నాయో... అని కేవలం మన దేశంలోనే కాదు! ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా సలహాలు వినిపిస్తున్నాయి. ఈ సలహాలను బలపరిచేందుకు రోజుకో నివేదికో, వారానికో పరిశోధనో బయటకు వస్తోంది. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ‘విక్టోరియా విశ్వవిద్యాలయం’ Australia’s Health Tracker పేరిట ఒక నివేదికను జారీచేసింది. ఆ దేశంలో ప్రస్తుత ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, వీటిలో ఎలాంటి మార్పులు రావాలి... తదితర అంశాల మీద కొన్ని గణాంకాలను వెల్లడించింది.   - ఈ నివేదిక ప్రకారం 20 కాదు 30 కాదు! దాదాపు 92 శాతం మంది యువత తగిన శారీరిక శ్రమకు దూరంగా ఉంటున్నారంట. ఫలితం! ప్రపంచంలోని ఊబకాయపు జనాభాలో ఆ దేశ యువత ముందుకు దూసుకుపోతోంది.   - యువతే కాదు! పిల్లల పరిస్థితీ ఇలాగే ఉంది. ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నట్లు తేలింది. చిరుతిళ్ల ద్వారా దాదాపు 40 శాతం ఆహారాన్ని అధికంగా తీసుకోవడమే దీనికి కారణం అన్న విషయమూ బోధపడింది.   - ఇక 17 ఏళ్లు దాటినవారిలో పొగతాగడం, మద్యపానం సేవించడం సహజమైన అలవాటుగా మారిపోయిందట. ఈ మద్యపానపు వ్యసనం ఒకప్పుడు మగవారిలోనే ఉండేదనీ, ఇప్పుడు మద్యాపానానికి సంబంధించిన అనారోగ్యాలతో మహిళలు కూడా ఆసుపత్రుల పాలవుతున్నారనీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.   - మొత్తంగా చూస్తే సగటు ఆస్ట్రేలియావాసి అసలు మోతాదుకంటే 62 శాతం అధికంగా ఉప్పుని తీసుకుంటున్నట్లు తేలింది. పైగా చిరుతిళ్ల ద్వారా శరీరంలోకి పేరుకుంటున్న చక్కెర నిల్వలూ తక్కువేమీ కాదని గణాంకాలు రుజువు చేస్తున్నాయి. వీటన్నింటి ఫలింతంగా రక్తపోటు, గుండెజబ్బులు వంటి సమస్యలకి బలవుతున్నారట!   - ఉప్పు, చక్కెరలు అధికంగా తీసుకోవడం; శారీరిక శ్రమ లేని జీవనశైలిని అవలంబించడం కేవలం మధ్య తరగతి, ఉన్నత మధ్యతరగతి వారి సమస్యే కాదంటున్నారు. ఈ నివేదిక ప్రకారం ఆస్ట్రేలియాలోని ఆదిమజాతివారు, పేదవారు కూడా ఆధునిక జీవనవైలిని అవలంబిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు.   - పైన పేర్కొన్న వివరాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని... ప్రజల ఆహారపు అలవాట్లలో, మార్పు రావాలని సూచిస్తోంది విక్టోరియా విశ్వవిద్యాలయం. ప్రజల్లో కనుక ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగి ఉప్పు, చక్కెరలను తగ్గించుకుంటూ.... అవసరమైనంతమేరా వ్యాయామం చేస్తూ ఉంటే, 2025 నాటికి దేశ ప్రజల ఆరోగ్యంలో ఖచ్చితమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆశిస్తోంది.ఆ ఆశ నెరవేరాలనే కోరుకుందాం. ఇది కేవలం ఆస్ట్రేలియాలోని పరిస్థితి మాత్రమే కాదనీ, మన దేశపు సమస్య కూడా అని గుర్తిద్దాం! - నిర్జర.  

Sinusitis

  Sinuses are air filled spaces present in the head region. There are four such spaces frontal, ethmoid, maxillary and sphenoid sinuses. In normal individuals these are lined by epithelium and filled with air. When these are infected, they may present either as thickened epithelium or completely blocked with fluid.    The conditions that may be responsible for sinusitis are: Common cold or any upper respiratory tract infections. Any allergies or the smoke and the environment are the least known causes. Structural deformities like deviated nasal septum or nasal polyps. Depleted immune systems especially those on immunosuppressant drugs. In children most common cause is drinking in lying down position or due to illnesses from other kids.   Acute sinusitis is the one with duration less than 12weeks presents with, runny nose, loss of smell, congestion, facial pain, bad breath and sometimes even dental pain. While the presentation of chronic sinusitis rather quiet, runny nose, nasal discharge, headache, fever and nasal blockade.   The treatment usually consists of antibiotics for the infection, sometimes steroids are also prescribed. In case of allergies anti-histaminic drugs are given. For simple sinus blockade, decongestants suffice. Along with these, we need to keep away from know allergens, warm inhalations and warm compresses for easing pain. Maintaining good hygiene during cold and flu seasons care possibly reduce the number of attacks. If neglected the infection may creep up causing meningitis, brain abscess and even invade the bone. --Koya Satyasri

పురుషులలో రొమ్ము సమస్యలు

ప్రకృతిపరంగా మగవారికి రొమ్ము ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి వారికి రొమ్ముకి సంబంధించిన ఏ సమస్యలూ ఉండనే ఉండవనుకుంటారు. కానీ ఇది అపోహ అనీ, మగవారిలోనూ రొమ్ముకి సంబంధించిన సమస్యలు వస్తాయని వైద్యలు చెబుతున్నారు. అవేమిటంటే...   మగవారిలో పెరిగే రొమ్ములు- గైనకోమాస్టియా ఆడపిల్లలైనా, మగపిల్లలైనా రొమ్ముకి సంబంధించిన కణజాలం ఇద్దరిలోనూ ఉంటుంది. ఆడవారిలో ఈస్ట్రోజన్‌ అనే హార్మోను ప్రభావం వల్ల కౌమార వయసు నుంచి రొమ్ము పెరుగుదల ఉంటుంది. మగవారిలో ఈ ఈస్ట్రోజన్‌ ప్రభావం తక్కువగానూ, ఆండ్రోజన్‌ అనే హార్మోను ప్రభావం ఎక్కువగానూ కనిపిస్తుంది. కౌమార వయసుకి చేరుకున్న మగపిల్లలలో ఒకోసారి శరీరంలోని హార్మోనులు గతి తప్పే ప్రమాదం ఉంది. దీని వల్ల తగినంత ఆండ్రోజన్‌ ఉత్పత్తి కాకపోవడం... అదే సమయంలో ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి అవసరానికి మించి ఉండటం జరిగిందనుకోండి- వారిలోనూ రొమ్ములు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని గైనకోమాస్టియా అంటారు.   కౌమార వయసులో గైనకోమాస్టియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ, దీనికి ఇతరత్రా కారణాలు కూడా లేకపోలేదు. కొన్ని రకాల మందుల దుష్ప్రభావం, కీమోథెరపీ, కిడ్నీ లేదా కాలేయ సమస్యలు కూడా మగవారిలో రొమ్ములు పెరిగేందుకు దోహదపడుతుంటాయి. గైనకోమాస్టియా వల్ల ఆరోగ్యపరంగా ఎద్దగా ప్రభావం లేనప్పటికీ, రొమ్ములతో కనిపించే మగవారు ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. ఒకవేళ కౌమార వయసులోని పిల్లలో ఈ సమస్య ఏర్పడితే వారు తోటివారి ఎగతాళికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి మానసిక కారణాల వల్ల వారి వ్యక్తిత్వమే దెబ్బతినవచ్చు.    సాధారణంగా ఈ సమస్య దానంతట అదే సర్దుకుంటుంది. కానీ నెలల తరబడి కనుక గైనకోమాస్టియా లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. ఎందుకంటే తొలినాళ్లలో కనుక గైనకోమాస్టియాను గుర్తిస్తే పోషకాహారం తీసుకోవడం, తగిన వ్యాయామం చేయడం వంటి చిన్నపాటి చర్యలతో వాటిని నివారించవచ్చు. ఒకోసారి వైద్యులు ఈస్ట్రోజన్‌ ఉత్పత్తిని నియంత్రించే మందుల ద్వారా కూడా వీటిని నయం చేస్తారు. మరీ అత్యవసరం అయితే సర్జరీ ద్వారా మగవారి రొమ్ములలో అధికంగా పేరుకున్న కొవ్వుని తొలగిస్తారు. ఒకప్పుడు చాలా అరుదుగా కనిపించిన ఈ గైనకోమాస్టియా సమస్య పురుగుల మందులు, కాస్మెటిక్‌ ఉత్పత్తుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్ల మరింత తరచుగా కనిపిస్తుండటం ఆందోళన కలిగించే విషయం.   మగవారిలో రొమ్ము క్యాన్సర్‌ మగవారికి ఏదో కారణంగా రొమ్ముల ఏర్పడే అవకాశం ఉందని చాలామందికి తెలుసు! కానీ మగవారిలో రొమ్ము క్యాన్సర్‌ కూడా వస్తుందన్న విషయమే ఎవరూ నమ్మరు! కానీ ఇది నిజం. 90 శాతానికి పైగా రొమ్ము క్యాన్సర్‌లు మహిళలలో కనిపిస్తున్నప్పటికీ, మగవారిలో కూడా ఈ సమస్యల వచ్చే ప్రమాదం లేకపోలేదు. అయితే ఈ సమస్య ఉన్న మగవారు మరింత తీవ్రంగా ప్రభావితం అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే తమలో కూడా రొమ్ము క్యాన్సర్‌ ఉందని మగవారు గుర్తించే సందర్భం తక్కువ. పైగా వారిలో ఛాతీ మీద తగినంత కణజాలం ఉండదు కాబట్టి, క్యాన్సర్‌ వారి శరీరంలోని ఇతర భాగాలకు చాలా త్వరగా వ్యాపిస్తుంది.   గైనకోమాస్టియాలాగానే రొమ్ము క్యాన్సర్‌ కూడా ఈస్ట్రోజన్‌ అసమతుల్యత వల్ల ఏర్పడే ప్రమాదం ఉంది. దీనికి తోడు అతిగా మద్యపానం సేవించడం వల్ల వచ్చే లివర్‌ సిరోసిర్‌ వ్యాధి వల్లా, రేడియేషన్‌కు గురవ్వడం వల్ల కూడా మగవారిలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక వృషణాలకు సంబంధించిన వ్యాధులు కూడా ఒకోసారి రొమ్ము క్యాన్సర్‌కు కారణం అవుతాయట. వంశపారంపర్యంగా ఈ వ్యాధి ఉన్నవారికి, రొమ్ము క్యాన్సర్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు.   రొమ్ము క్యాన్సర్‌ను నిర్ధరించడంలో కానీ, చికిత్స చేయడంలో కానీ ఆగామగా తేడా ఉండదు. మమ్మోగ్రఫీ, బయాప్సీల ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను నిర్ధారిస్తారు. శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ కణితని తొలిగించి... కీమోథెరపీ, హార్మోను థెరపీల సాయంతో వ్యాధిని అదుపులోకి తీసుకువస్తారు. అయితే ఎంత త్వరగా ఈ క్యాన్సర్‌ను గుర్తిస్తే అంత ప్రభావవంతంగా చికిత్స ఉంటుంది. అందుకే మగవారు కూడా ఈ కింది లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి-   - చనుమొనలో ఎలాంటి మార్పులు కనిపించినా అశ్రద్ధ చేయకూడదు. చనుమొన నుంచి రక్తస్రావం జరగడం, పుండు పడటం, రంగుమారడం, ఆకారంలో మార్పు కనిపించడం వంటి లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. - రొమ్ము భాగంలో వాపు, నొప్పి, చర్మం రంగుమారడం. - ఛాతీ భాగంలో గడ్డలు కనిపించడం, చర్మం అడుగున రంగుమారడం. - భుజాల దగ్గర గడ్డలు ఏర్పడం (లింఫ్‌ గ్రంధుల వాపు వల్ల). - హఠాత్తుగా బరువు తగ్గిపోవడం, తరచూ నీరసంగా ఉండటం. - రొమ్ము లోపల ఉన్న ఎముకలలో నొప్పి రావడం.   వీటిలో ఏ సమస్యలు ఉన్నా తక్షణమే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది.వైద్యం విస్తృతంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఎంత త్వరగా మనం ప్రతిస్పందిస్తామన్నదాని మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం మగవారిలో రొమ్ము క్యాన్సర్‌ రాదు వంటి అపోహలను తొలగించుకొని, అవగాహన పెంచుకోవడం అవసరం. - నిర్జర

ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీ సమస్య ఉన్నట్టే...

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ముందు వరుసలో ఉంటాయి. శరీరంలోని మలినాలను తొలగించడానికి, ఎలక్ట్రొలైట్స్ ను సమన్వయం చేయడానికి, రక్తపోటును నియంత్రించడానికి, ఎర్ర రక్తకణాల సంఖ్యను మెరుగుపర్చడానికి... ఇలా ఎన్నో సక్రమంగా జరగడానికి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం. అలాంటిది వాటికేదైనా సమస్య వస్తే? ఎంత కష్టమో కదా? అయితే కాస్త జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనిస్తే... సమస్య ముదిరిపోకముందే కిడ్నీలను కాపాడుకోవచ్చు.   రక్తహీనత గానీ ఏర్పడిందంటే ఓసారి కిడ్నీల గురించి ఆలోచించాల్సిందే. ఎందుకంటే కిడ్నీలు ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగేలా చేసే ఎరిత్రోపొయిటిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తాయి. అది సరిగ్గా విడుదల కాక ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయి ఎనీమియా వచ్చిందంటే కిడ్నీల పని తీరు సరిగ్గా లేకపోవచ్చు. రక్తహీనత తీవ్రమైతే మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందక బద్దకం, దేనిమీదా శ్రద్ధ పెట్టలేకపోవడం, మతిమరుపు వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు కనిపించినా కిడ్నీల మీద ఓ కన్నేయాల్సిందే. ఒకవేళ కిడ్నీల చుట్టుపక్కల నొప్పిగా ఉంటే కిడ్నీలో రాళ్లుగానీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గానీ ఉన్నట్టు లెక్క. ఆకలి తగ్గిపోయినా, ఏదైనా తిన్నప్పుడు ఆ రుచి ఏదైనా లోహం నోటిలో పెట్టుకున్నట్టుగా అనిపించినా అది కిడ్నీల పనితీరు దెబ్బతిని రక్తంలోమలినాలు పెరిగిపోయాయనడానికి సూచన.   తరచుగా ర్యాషెస్, దురద, మంట వంటివి వస్తున్నా గమనించుకోవాలి. రక్తంలో మలినాలు పెరిగిపోతే చర్మం పొడిబారిపోయి ఇలాంటివి వస్తాయి. ముఖం, మోకాళ్లు, కీళ్లు ఉబ్బిపోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో హెచ్చుతగ్గులు కూడా సూచనలే. ఇక  ముఖ్యంగా మూత్ర సంబంధిత సమస్యలు. తరచూ మూత్రం రావడం, లేదంటే రావాల్సినంత రాకపోవడం, మూత్రంలో మంట, నొప్పి, రంగు మారడం, నురగతో కూడిన మూత్రం... ఇవన్నీ కూడా కిడ్నీ పనితీరు దెబ్బ తిన్నదని చెప్పకనే చెబుతాయి. కాబట్టి వీటిలో ఏ లక్షణాలు కనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకండి. వెంటనే వైద్యుణ్ని సంప్రదించండి.  

ఏముంది మునగాకులో..?

‘బతికుంటే బలుసాకు తినొచ్చు’... ఓ పాత నానుడి. ఆ బలుసాకు ఏమోగానీ, ‘రోజూ కాస్త మునగాకు తింటే చాలు, వందేళ్లు బతకొచ్చు అన్నది కొత్త సామెత. ఎందుకంటే... 100 గ్రా. తాజా మునగాకుల్లో... నారింజల్లోకన్నా ఏడు రెట్లు సి-విటమిన్‌, క్యారెట్లలోకన్నా నాలుగింతల కాల్షియం, అరటిపండ్లలోకన్నా మూడు రెట్లు పొటాషియం, పాలకూరలోకన్నా మూడింతల ఐరన్‌, బాదంలోకన్నా మూడు రెట్లు విటమిన్‌- ఇ, పెరుగులోకన్నా రెండింతల ప్రొటీన్లూ ఉంటాయి. అంటే 20 గ్రా. మునగాకు నుంచి మనిషికి నిత్యం అవసరమయ్యే ఎ, సి - విటమిన్లూ, 100 గ్రా. ఆకు నుంచి కాల్షియం, మూడొంతుల ఐరన్‌, సగం ప్రొటీన్లూ దొరుకుతాయి. అందుకే పోషకాహార లోపాన్ని నివారించడానికి దీన్ని మించినది లేదు. అంతెందుకు... ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్‌-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు. మరే చెట్టు ఆకులకీ లేనంత మహత్తు మునగాకుకి ఉంది. ఇది 300 వ్యాధుల్ని నివారించగలదు. మునగాకులో రోగనిరోధకశక్తిని పెంచే 46 యాంటీఆక్సిడెంట్లూ అనేకానేక బయోయాక్టివ్‌ పదార్థాలూ ఉండటంతో శాస్త్రవేత్తలు దీనిమీద పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇందులోని ఓషధుల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్‌లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి. క్యాన్సర్లూ అల్సర్లూ కనుచూపుమేర కనిపించవు. ఆల్జీమర్స్‌ ఎగిరిపోతుంది. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్‌ దరి చేరడానికి భయపడతాయి. గాయాలన్నీ మునగాకు పేస్టుతో గాయబ్‌. అంతేనా... రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకునో లేదా టీస్పూను పొడినో రోజూ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్‌ వృద్ధి, రక్తం సమృద్ధి. ఈరోజుల్లో పసివయసు దాటకుండానే కంటిజబ్బులనేకం. రేచీకటి బాధితులూ ఎక్కువే. వాటన్నింటినీ మునగాకులోని బీటాకెరోటిన్‌ నివారిస్తుందని ఇంటర్నేషనల్‌ ఐ ఫౌండేషన్‌ అంటోంది. ఇంటాబయటా అంతటా ధూళిమేఘాలే... కాలుష్యకాసారాలే. మరి ఆస్తమా, బ్రాంకైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ పిలవకుండానే పలుకుతున్నాయి. ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్నాయి. అందుకే ఆకుల్ని సూపులా చేసుకుని రోజుకి రెండుసార్లు తీసుకుంటే లంగ్సులోని టాక్సిన్లు తొలగి, వ్యాధులన్నీ పారిపోతాయి.

నేరేడు... రోగ నివారిణి

  నేరేడు లేదా గిన్నె చెట్టు (Jamun) ఒక పెద్ద వృక్షం. దీనిని పండ్లు కోసం పెంచుతారు. నేరేడు శాస్త్రీయ నామం 'షైజీజియం క్యుమిని'. ఇది మిర్టేసి కుటుంబానికి చెందినది. భారతదేశం, పాకిస్థాన్, మరియు ఇండోనేషియా లో ప్రధానంగా పెరుగుతుంది.  అంతే కాకుండా ఫిలిప్పైన్స్, మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్ లలో కూడా అక్కడక్కడా కనిపిస్తుంది. భారతదేశానికి పోర్చుగీసు వారు వచ్చినపుడు వారు ఈ విత్తనాన్ని బ్రెజిల్ కు తీసుకుని వెళ్ళారు. అక్కడి పక్షులు కొన్ని దీనిని ఇష్టంగా తింటుండటంతో అక్కడ చాలా వేగంగా వ్యాపించిపోయింది. ఈ చెట్టు చాలా వేగంగా పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది. దాదాపు 30 మీటర్లు ఎత్తు పెరిగే అవకాశం. ఉంది. నేరేడు చెట్లు వంద ఏళ్ళకు పైగా జీవించగలవు.  సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం..వంటివి నేరేడులో పుష్కలం. సిజిజియం క్యుమిన్‌ దీని శాస్త్రీయ నామము. జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి. రోగికి శక్తితోపాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి. కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది. మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి. పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కాబట్టి.. అధిక బరువు ఉన్నవారు.. మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు. ఒక్క పండే కాదు..నేరేడు చెట్టు ఆకులు, బెరడు, గింజలు కూడా ఎంతో మేలుచేస్తాయి. ఆకులు నేరేడు ఆకులతో చేసే కషాయం.. బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం.. చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే.. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఆకు రసంలో పసుపు కలిపి పురుగులు కుట్టినచోట,దురదలు,సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తుంటే.. ఉపశమనం లభిస్తుంది. బెరుడు నేరేడు బెరడుతో చేసే కషాయాన్ని రక్త, జిగట విరేచనాలతో బాధపడేవారికి 30ఎమ్‌.ఎల్‌ నీళ్లలో కలిపి తేనె, పంచదార జోడించి ఇస్తే గుణం ఉంటుంది. నెలసరి సమస్యలకు నేరేడు చెక్క కషాయాన్ని 25 రోజులపాటు 30ఎమ్‌.ఎల్‌ చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. నోట్లో పుండ్లు, చిగుళ్ల సమస్యలకు దీని కషాయం పుక్కిలిస్తే మార్పు ఉంటుంది.   జాగ్రత్తలు:  నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి. భోజనమైన గంట తరువాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం జీర్ణమవుతుంది. అధికంగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్యతోపాటు.. నోట్లో వెగటుగా ఉంటుంది. విరుగుడు: ఉప్పు, వేడినీరు. పండ్లతో పచ్చళ్ళు, జామ్ లు, రసాలు, జెల్లీలు తయారుచేస్తారు.నేరేడు కలపను వ్యవసాయ పనిముట్లు, దూలాలు తయారుచేయుటకు వాడతారు. చెట్టు బెరడులో మరియు విత్తనాలలో 13- 19 % వరకు టానిన్లు ఉంటాయి. విత్తనం నుండి తీసిన రసం అధిక రక్తపోటును నయం చేస్తుంది. ఇవి కొంతవరకు మధుమేహంలో కూడా పనిచేస్తాయి...కాలేయం పనితీరుని మెరుగు పరచడంలో వీటిల్లో ఉండే యాంటాక్సిడెంట్లు కీలకంగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అలానే ఇవి రక్తక్యాన్సర్‌ కారకాలను నిరోధిస్తాయని కూడా అవి తెలుపుతున్నాయి. నేరేడు పండ్లలో అధికమోతాదులో సోడియ, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, మంగనీస్‌, జింక్‌, ఇరన్‌, విటమిన్‌, సీ, ఎ రైబోప్లెవిన్‌, నికోటిన్‌ ఆమ్లం, కొలైన్‌, ఫోలిక్‌, మాలిక్‌ యాసిడ్లు తగిన లభిస్తాయి. దానిలోని ఇనుము శరీరంలో ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది. అనీమియా (రక్తహీనత) తగ్గిస్తాయి. కాల్షియం, ఇనుము, పొటాషియం, విటమిన్- సి పుష్కలంగా ఉండే నేరేడు వ్యాధినిరోధకశక్తిని ఇవ్వడమేకాక ఎముకలకు పుష్టిని ఇస్తుంది. నేరేడు పండుకు గుండెవ్యాధులను నివారించే శక్తి ఉంది. ఇది మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. నేరేడు పండ్లలో గ్లైకమిక్ ఇండెక్స్ అధికంగా ఉన్నందున మధుమేహవ్యాధిని నియంత్రించడానికి సహకరిస్తుంది. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి. నేరేడు ఆకులు మరియు పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు కలిగి ఉన్నాయి మధుమేహాన్ని నియంత్రిస్తుందని పలు అధ్యయనాలు వివరిస్తున్నాయి.అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది. నేరేడు రసాన్ని, నిమ్మరసంతో కలిపి తీసుకొంటే మైగ్రేన్‌కు పరిష్కారం లభిస్తుంది. నేరేడు పళ్లను తీసుకొనే వారిలో పళ్లు,చిగుళ్లు బలంగా ఉంటాయి. గాయాలు త్వరగా మానిపోతాయి. ఇది మాత్రమే కాదు. దీనికి రక్తాన్ని శుద్ధి చేస్తే శక్తి కూడా ఉంది. పోషకాలు (వందగ్రాముల్లో) తేమ: 83.7గ్రా,  పిండి పదార్థం: 19 గ్రా,  మాంసకృత్తులు: 1.3గ్రా,  కొవ్వు: 0.1గ్రా,  ఖనిజాలు: 0.4గ్రా,  పీచుపదార్థం: 0.9గ్రా,  క్యాల్షియం: 15-30మి.గ్రా,  ఇనుము: 0.4మి.గ్రా-1మి.గ్రా,  సల్ఫర్‌: 13మి.గ్రా,  విటమిన్‌ సి: 18మి.గ్రా.   నేరేడుపండ్లలోరకాలున్నాయి. 1. గుండ్రంగా పెద్దగ వుండే ఒక రకం.  2. కోలగా వుండి పెద్దగా వుండే రకం. వీటిని అల్ల నేరేడు అని అంటారు. 3. గుండ్రంగా వుండి చిన్నవిగా వుంటాయి. వీటి చిట్టి నేరేడు అని అంటారు.  

పేను కొరుకుడుకి కారణాలు... నివారణ ఎలాగో తెలుసుకుందాం!

    పేను కొరుకుడు అంటే ఉన్నట్లుండి తలమీద వెంట్రుకలు కొద్దిపాటి ప్రాంతంలో రాలిపోయి చర్మం కనిపిస్తూ ఉంటుంది. ఇది అలర్జీ వల్ల వస్తుందని వైద్యుల అభిప్రాయం. ఈ అలర్జీ తగ్గగానే మళ్ళీ తిరిగి వెంట్రుకలు వస్తాయి. దీనినే పేనుకొరుకుడు అంటారు. అయితే చాలా మంది పేనుకొరుకుడు కారణంగా బట్టతల మాదిరిగా అవుతుందేమో అని అపోహ పడుతుంటారు. గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నపడటాన్ని పేనుకొరుకుడు అని పిలుస్తారు. నిజానికి ఇది పేను వచ్చి కొరకటం కాదు. అలా నానుడిగా సాధారణ జనానికి అర్థం అయ్యే విధంగా అంటుంటారు. దీన్ని వైద్య పరిభాషలో ‘అలోపేషియం ఏరిమేటా’ అని పిలుస్తారు. ఈ పేనుకొరుకుడు జనాభాలోని రెండుశాతం మందిలో కనపడుతుంది.   కారణాలు:  ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌. అనగా వెంట్రుకలకి వ్యతిరేకంగా వాటిలోనే ఆంటీబాడీస్‌ తయారయ్యి అక్కడక్కడ వెంట్రుకలు లేకుండా చేస్తుంది. మానసిక ఆందోళన థైరాయిడ్‌, డయాబెటిస్‌, బి.పి లాంటి సమస్యలు ఉన్నవాళ్లలో ఎక్కువగా చూస్తుంటాం. ఆడా, మగ అనే తేడాలేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా పేనుకొరుకుడు వస్తుంది. చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా 20 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఇది అంటువ్యాధి మాత్రం కాదు. 60 సంవత్సరాలు దాటిన వారిలో ఈ వ్యాధి దాదాపుగా కనిపించదు. పేనుకొరుకుడు తలలో, గడ్డం, మీసాలలో కాని రావచ్చు. దీన్నే అలోపేషియా మూసివర్యాలిస్‌ అంటారు.   *ఆయుర్వేద చికిత్సా: కేవలం మూడు నుండి వారం రోజులలోనే ఊడిపోయిన వెంట్రుకలు మొలవడం సాధ్యమవుతుంది. ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా, ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే..... జుట్టు ఆరోగ్యానికి గురివింద గింజలు: గురివింద గింజలను అరగ దీసి తలకు పట్టిస్తే పేలు మాయమయిపోతాయి. పేను కొరుకుడు నివారిస్తుంది.  రోజూ రెండుసార్లు ఇలాచేస్తుంటే త్వరలోనే మంచి ఫలితం కనపడుతుంది. * మందార ఆకులు పూలతో నెల రోజుల పాటు రోజూ మూడు పూటలా మందార పూలను తలపై రుద్దుతూ ఉంటే పేను కొరుకుడు సమస్య తొలగిపోతుంది. మందార చెట్టు వేరును నూరి, నువ్వుల నూనె కలిపి సేవిస్తే, స్త్రీలలోని అధిక రక్తస్రావ సమస్య తొలగిపోతుంది. లేదా మూడు పూలను కొద్దిగా నేతిలో వేయించి తీసుకున్నా రకస్రావం తగ్గుతుంది. పూల రసానికి సమానంగా చక్కెర కలిపి పానకంలా వండి, మూడు స్పూన్‌ల చొప్పున రోజుకు మూడు సార్లు తాగితే మూత్ర విసర్జనలో ఇబ్బంది తొలగిపోతుంది. , మంట, చురుకు తగ్గిపోతాయి. పరగడుపున, రోజూ నాలుగు పూల చొప్పున 2 ఏళ్ల పాటు నమిలి మింగుతూ ఉంటే తెల్ల మచ్చలు తగ్గుతాయి. మందార ఆకులకు సమానంగా నువ్వుల నూనె కలిపి తైలం తయారు చేసుకుని తలకు రాస్తూ ఉంటే చుండ్రు సమస్య ఉండదు. ఒక స్పూను ఎండించిన పూలచూర్ణాన్ని పాలల్లో కలిపి రెండు పూటలా తీసుకుంటే బలహీనత తొలగి రక్తపుష్టి కలుగుతుంది. ఆకుల కషాయంతో సిఫిలిస్‌ పుండ్లను కడుగుతూ ఉంటే క్రమంగా అవి మానిపోతాయి. ఇది ఓ వ్యాది ..ఆయినా చాలా ఓపిక తో    ఇటు వంటి వ్యాదినీ నయం చేస్కోగలం ఎలా అంటే జిల్లేడు పాలు ఊడిపోయిన చోట రాసినా ఫలితం ఉంటుంది.

వడదెబ్బ నివారణ కొరకు సులభ యోగాలు..

  ప్రస్తుత పరిస్థితుల్లో ఎండ తీవ్రత విపరీతముగా ఉన్నది. వడగాలులు కూడా ఎక్కువుగా ఉన్నాయి . ఇటువంటి సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది.  ఉద్యోగరీత్యా మరియు వ్యక్తిగత పనులనిమిత్తం బయట తిరిగేవారు ఎండ తీవ్రతకు గురి అయ్యి అనారోగ్యానికి గురవ్వడం జరుగును.   ఇప్పుడు నేను చెప్పబోయే వడదెబ్బ నివారణా యోగాలు పాటించి వడదెబ్బ నుంచి విముక్తిపొందగలరు.    *  ఉల్లిపాయ రసమును శరీరానికి పట్టించిన వడదెబ్బ నివారణ అగును.      * వేసవి ఎండలో బయటకి వెళ్లవలసి వచ్చినపుడు తలకు టోపీ ధరించి టోపి లోపల ఉల్లిగడ్డను ఉంచుకొనవలెను. లేదా రుమాలలో ఉల్లిగడ్డని ఉంచి తలకు కట్టుకుని వెళ్లవలెను .   *  నీరుల్లిపాయ రసమును రెండు కణతలకు , గుండెలకు పూసిన వడదెబ్బ వలన కలిగిన బాధ తగ్గును.      *  వడదెబ్బ తగిలినచో ముఖము పైన , శరీరంపైన నీళ్లు చల్లుచూ తలపై ఐస్ గడ్డలను ఉంచి తాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.    *  కుమ్మున ఉడికించిన మామిడికాయ రసములో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనంతో కలిపి తాగుచున్న వడదెబ్బ తగలదు.    * వడదెబ్బ తగిలిన వ్యక్తికి విశ్రాంతిగా పడుకోబెట్టి కాఫీ తాగుటకు ఇచ్చుచున్న వడదెబ్బ నుంచి తట్టుకొనును.    *  48 గ్రాముల చన్నీరు తీసుకుని ఒక తులం తేనె వేసి కలిపి ఇచ్చిన వడదెబ్బ తగ్గును.      * వడగండ్లు పడినపుడు వాటిని సేకరించి విబూదిలో వేసి ఉంచి వడదెబ్బ తగిలినప్పుడు వారికి మూడువేళ్లకు వచ్చినంత తీసుకుని ఒక గ్లాసు మంచినీటితో కలిపి తాగించవలెను .    *  నువ్వులనూనెలో చనుబాలు రంగరించి చెవులలో వేసి గోరువెచ్చని నీటిలో నెయ్యి వేసి ఇచ్చిన వడదెబ్బ బాధలు తగ్గును.    *  తరవాణి తేటలో ఉప్పు కలిపి ఇవ్వవలెను .    *  తాటిముంజలు పంచదారతో కలిపి ఇవ్వవలెను.    *  నాలుకకు పాత ఉశిరిక పచ్చడి రాసి పుల్లని ఆవుమజ్జిగలో ఉప్పు వేసి అన్నములో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసమును తాగించవలెను .      *  చన్నీటితో స్నానం చేయవలెను . వేడివేడి పలచని గంజిలో ఉప్పు కలిపి తాగవలెను .    *  నిమ్మ ఉప్పును నోటిలో వేసుకొనిన నాలుకకు ఊట ఊరి వడదెబ్బ నివారణ అగును. పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా అనిపిస్తే దానిని పాటించి వడదెబ్బ నుంచి విముక్తిపొందగలరు.

బడిలో బహుపరాక్‌

  బడులు తెరిచేశారు. చదువుల పండుగ మొదలైంది. కొత్త పుస్తకాలు కొనుక్కోవడం, వాటికి అట్టలు వేసుకోవడం, యూనిఫారాలను సిద్ధం చేసుకోవడం... ఇవన్నీ తల్లిదండ్రులు దగ్గరుండి సాగించే క్రతువులు. ఇంట్లో పిల్లలను మనం కంటికి రప్పలా కాపాడుకుంటాం. కానీ బడిలో వారు ఎలా ఉంటున్నారో, ఎలాంటి అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారో గమనిస్తూ ఉండటం ఏమంత తేలిక కాదు. అసలే పిల్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఎలాంటి వ్యాధినైనా ఇట్టే పట్టేసుకుంటారు. పిల్లలకు జబ్బు చేస్తే వారికే కాదు, కన్నవారికీ బాధే. అందుకని బడిలో కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం.   - బడులు మొదలవుతూనే వర్షాకాలం కూడా మొదలవుతుంది. ఈ కాలంలో జలుబూ, దగ్గు వంటి అంటువ్యాధులు అతిసాధారణంగా ఒక పిల్లవాడి నుంచి మరో పిల్లవాడికి చేరిపోతాయి. కాబట్టి పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాలి. చ్యవన్‌ప్రాస్, పాలు, బాదం పప్పు, ఆకుకూరలు, పండ్లు వంటి బలవర్ధకమైన ఆహారం మీద మరింత దృష్టి పెట్టాలి.   - పిల్లలకి కర్చీఫ్‌ వాడటాన్ని తప్పకుండా అలవాటు చేయాలి. తాము దగ్గేటప్పుడో, ఎదుటివారు దగ్గేటప్పుడో కర్చీఫుని నోటి అడ్డం పెట్టుకోమని గుర్తు చేయాలి. చేతిరుమాలుని బడిసంచిలో కాకుండా జేబులోనే ఉంచుకునే అలవాటు కలిగించాలి.   - అన్నం తినేముందరా, ఆటలాడుకున్న తరువాతా, మూత్ర విసర్జన చేశాకా.... శుభ్రంగా చేతులు కడుక్కోమని చెప్పాలి. చేతులు కడుక్కోవడం అంటే అంటురోగాలను సగానికి సగం దూరం చేసుకోవడం అన్న నమ్మకాన్ని కలిగించాలి.   - పిల్లవాడికి కండ్ల కలక ఉంటే బడికి పంపకపోవడమే మేలు. ఒకవేళ బడిలో కండ్ల కలకలు ఉంటే... చేతులు తరచూ శుభ్రం చేసుకోమనీ, వీలైనంతవరకూ చేతులతో కంటిని తాకవద్దనీ హెచ్చరించాలి.   - పిల్లలకి చర్మవ్యాధులు చాలా సులభంగా అంటుకుంటాయి. ఇతర పిల్లల ద్వారాగానీ, మట్టిలో ఆడుకునే అలవాటు వల్లగానీ ఈ వ్యాధులు రావచ్చు. కాబట్టి సాక్స్‌తో సహా పిల్లల దుస్తులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. వారు స్నానం చేసేటప్పుడు చర్మవ్యాధులకు సంబంధించిన కురుపులు కానీ, దద్దుర్లు కానీ ఉన్నాయేమో గమనించుకోవాలి.   - పిల్లల్లో ఫ్లూ, ఆటలమ్మ తదితర టీకాలు వేయించారో లేదో గమనించుకోవాలి. ఒకవేళ ఇప్పటివరకూ సంబంధిత టీకాలను వేయించకపోతే వెంటనే వైద్యుని సంప్రదించాలి. దాని వల్ల బడిలోని ఇతర పిల్లల నుంచి అంటువ్యాధులు సోకకుండా నివారించవచ్చు.   - పిల్లలకి నీళ్ల బాటిళ్లను కరచుకుని తాగే అలవాటు ఉంటుంది. ఇలాంటి అలవాటు వల్ల కూడా అంటువ్యాధులు వ్యాపించవచ్చు. అందుకని ఎవరి నీళ్ల బాటిల్ వారే వాడుకోమని పిల్లలను హెచ్చరించాలి.   - పిల్లలను దింపడానికి వెళ్లేటప్పుడు బడిలోని నీటి లభ్యతా, టాయిలెట్ల సౌకర్యం సరిగా ఉందో లేదో ఓ కన్ను వేయాలి. అపరిశుభ్రమైన పరిసరాలు, సౌకర్యాలూ ఉంటే వాటిని బడి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లేందుకు జంకకూడదు.   - పిల్లవాడు కొత్తబడిలో చేరిఉంటే వీటికి అదనంగా అతని మానసిక ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కొత్తబడిలోని వాతావరణానికి అతను అలవాటుపడేవరకూ అతనికి అండగా ఉండాలి.   - నిర్జర.