మేం తల్చుకొంటే టిఆర్ఎస్ అడ్రసుండదు : బాబు

      టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఫై తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు నిప్పులు చెరిగారు. ‘నేను మీ నాయకుడిలా ఆరు నెలలకొకసారి నిద్ర లేచేవాడిని కాదు’, అని బాబు టిఆర్ఎస్ కార్యకర్తలఫై ఆగ్రహం వ్యక్తం చేశారు.   కరీంనగర్ లో జరుగుతున్న బాబు పాద యాత్రను నిన్న కొంత మంది టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొన్నారు. దీనితో ఆగ్రహించిన బాబు తాము తలచుకొంటే టిఆర్ఎస్ పార్టీకి అడ్రస్ ఉండదని వారిని హెచ్చరించారు. జిల్లాలోని జూబ్లీ నగర్ వద్ద బాబు యాత్రకు తెలంగాణ వాదుల నుండి అడ్డంకులు ఎదురయ్యాయి.   తెలంగాణాఫై తమ వైఖరి చెప్పాలని వారు బాబును డిమాండ్ చేశారు. తెలంగాణా కు వ్యతిరేకం కాదని తాను ఎప్పటినుండో చెపుతున్నానని, భవిష్యత్ లో కూడా తాను ఇదే అభిప్రాయంతో ఉంటానని బాబు స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే మీ పార్టీ అధ్యక్షుడు మిమ్మల్ని ఇక్కడకు పంపిస్తున్నాడని బాబు వారితో అన్నారు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ తాను పోటీ చేసిన స్థానాల్లో గెలిచి ఉంటే తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చేదని బాబు అన్నారు.   తన పాద యాత్ర జరుగుతున్న ప్రాంతాలకు రావద్దని టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తలకు చంద్ర బాబు సూచించారు. నిన్న బాబు పాద యాత్ర జిల్లా లోని జుబ్లీ నగర్, చామనపల్లి, చెర్ల బూత్కూర్, దుబ్బపల్లి, భూపతిపూర్, గర్రెపల్లి ప్రాణాల మీదుగా సాగింది.

ధర్మాన వ్యవహారంఫై సిఎం కు అధిష్టానం క్లాస్ ?

      ధర్మాన ప్రసాదరావు వ్యవహారంఫై ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ లో క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ధర్మానను ప్రాసిక్యూషన్ చేయడానికి సిబిఐ కు రాష్ట్ర మంత్రి మండలి అనుమతి నిరాకరించిన విషయం, ఆ ఫైలును గవర్నర్ నరసింహన్ తిప్పి పంపిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే.   ధర్మాన వ్యవహారంలో ముఖ్య మంత్రి వ్యవహరించిన తీరుఫై పార్టీ పెద్దలు తమ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఢిల్లీ లో పార్టీ కీలక నేతలను ఎవరినీ సంప్రదించకుండా ఈ వ్యవహారాన్ని నడిపిన తీరుఫై వారు కిరణ్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి విషయం చెప్పిన తర్వాతే ప్రాసిక్యూషన్ ఫై నిర్ణయం తీసుకున్నానని మంత్రులకు చెప్పినట్లు తమ వద్ద ఫిర్యాదులు ఉన్నాయని, దీనిఫై వివరణ ఇవ్వాలని కిరణ్ ను అడిగినట్లు సమాచారం.   గవర్నర్ నరసింహన్ ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళిన తర్వాతే, వారికి విషయ తీవ్రత అర్ధం అయిందని, ఆ కారణమే వల్లనే వారు కిరణ్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తదుపరి చర్య తీసుకోవడానికి ఈ నెల 30 న ఈ విషయంలో వచ్చే కోర్టు తీర్పు వరకూ వేచి చూడాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తునట్లు సమాచారం.

మరో టిడిపి నేతకు వైసిపి గాలం ?

      తెలుగు దేశం పార్టీకి చెందిన ఓ శాసన మండలి సభ్యుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలం వేసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా పార్టీ అధిష్టానంఫై అసంతృప్తి తో ఉన్న బొడ్డు భాస్కర రామారావు ను తమ పార్టీలో చేర్చుకొనేందుకు జగన్ పార్టీ నేతలు ప్రయత్నిస్తునట్లు సమాచారం.   రెండు రోజుల క్రితం కొంత మంది జగన్ పార్టీ నేతలు తూర్పు గోదావరి జిల్లా కు చెందిన బొడ్డు ను కలిసి ఆయనను తమ పార్టీలో చేరాలని కోరారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు కూడా. అయితే, ఈ విషయంలో ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. తన నిర్ణయాన్ని తరువాత తెలియజేస్తానని ఆయన వారికి చెప్పినట్లు సమాచారం.   గత సంవత్సరం మార్చిలో జరిగిన ఎన్నికల్లో బొడ్డు తెలుగుదేశం పార్టీ నుండి స్థానిక సంస్థల కోటాలో ఎం ఎల్ సి గా ఎన్నికయ్యారు. ఇటీవల నలుగురు తెలుగు దేశం పార్టీ ఎంఎల్ఏ లు జగన్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కొడాలి నాని (గుడివాడ), తానేటి వనిత (గోపాలపురం), అమర నాధ్ రెడ్డి (పలమనేరు), ప్రవీణ్ కుమార్ రెడ్డి (తంబళ్ళపల్లి)లు ఇటీవల జగన్ పార్టీ తీర్ధం పుచ్చుకొన్నారు.

‘టి’ ఫై తేడా వస్తే మూడినట్లే : హరీష్ రావు

    ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణా ఫై జరిగే అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా కు అనుకూల వైఖరి అవలంభించకపోతే కాంగ్రెస్, తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు మూడినట్లేనని టిఆర్ఎస్ నేత హరీష్ రావు హెచ్చరించారు. లేకపోతే, ఆ మూడు పార్టీలు ఖాళీ అయిపోతాయని స్పష్టం చేశారు.   హైదరాబాద్ లోని తెలంగాణా భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సమావేశం తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల అసలు స్వరూపం బయటపడుతోందని హరీష్ అన్నారు. అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణా ఫై తమ అభిప్రాయాన్ని ప్రకటిస్తామని చెప్పిన చంద్ర బాబు నాయుడు, తీరా అది ఏర్పాటు చేసాక ఈ అంశం ఫై నోరేత్తడంలేదని హరీష్ విమర్శించారు.   అలాగే, ఈ తేదీని ప్రకటించగానే షర్మిలా పాద యాత్ర ఆగిపోయిందని అసలు ఆమెకు మోకాలి నొప్పి వచ్చిందో లేదో ఈ సమావేశం తర్వాత తేలిపోతుందని హరీష్ వ్యాఖ్యానించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి దానం ?

        రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ జగన్ పార్టీలో చేరనున్నారా ? ఆయన చేసిన ప్రకటనను బట్టి దీనికి సమాధానం అవుననే అనిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి తరవాతి ముఖ్య మంత్రి అవుతాడని ఆయన ప్రకటించారు. దీనిని ఎవరూ అడ్డుకోలేరని కూడా దానం ప్రకటించేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ప్రకటనను పదే పదే ఉచ్చరించారు.   ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ లో ఇలాంటి వ్యాఖ్యలు ఏ నాయకుడు అయినా చేశాడంటే దానర్ధం వారు జగన్ పార్టీలో చేరడానికి రెడీ అయినట్లే భావించాల్సి ఉంటుంది. ఒక్క సారి గతంలోకి వెళ్తే, దానం తెలుగు దేశం నుండి కాంగ్రెస్ లోకి మారడం, ఆ తర్వాత మంత్రి పదవి పొందడం అంతా వైఎస్ పుణ్యమేనన్న విషయం తెలిసిందే. వైఎస్ కు అత్యంత ప్రియమైన శిష్యుడుగా దానంకు పేరు ఉండేది.   రాష్ట్ర మంత్రిగా ఉండి దానం చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. వైఎస్ ను జగన్ రోజూ తలచుకొంటాడో లేదో కానీ, తన భార్య మాత్రం రోజూ తలచుకొంటుందని కూడా దానం స్టేట్మెంట్ ఇచ్చేసారు. అంతే కాదు, పాద యాత్రలో గాయపడిన షర్మిలాను తాను త్వరలో పరమర్సిస్తానని కూడా అన్నారు. ఇందులో తప్పేముందని కూడా ఆయన అన్నారు. దానం జగన్ పార్టీలో చేరతారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.     ఆయన నగరంలో గట్టి పట్టున్న నాయకుడు కావడంతో, తమ పార్టీ నగరంలో బలపడడానికి దానం చేరిక తోడ్పడుతుందని జగన్ పార్టీ నేతల అంచనాగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో దానం ఖైరతాబాద్ నుండి గెలవడంలో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం అండ ఉండటం కూడా తోడ్పడింది. ప్రస్తుతం ఎంఐఎం, జగన్ పార్టీ వైపు అడుగులు వేస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడినుండి దానం జగన్ పార్టీ నుండి గెలవడం తేలికే అవగలదు.

జగన్ పార్టీ లక్ష్మిపుత్రుల జాబితాలో కాసాని

        జగన్ పార్టీలో డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టే నేతలకు కొదవ లేక పోవచ్చు. వారు వచ్చే ఎన్నికల్లో పార్టీకి అవసరమైనంత మేరకు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. తాజాగా, ఈ జాబితాలో కాసాని జ్ఞానేశ్వర్ చేరారు. దీనితో, జగన్ పార్టీలో కాసులు గలగలమంటున్నాయి.   కొత్త పార్టీలో చేరే తేదీని త్వరలో ప్రకటిస్తానని కాసాని ప్రకటించారు. తెలంగాణా రాష్ట్ర సమితి ఎంఎల్ఏ లను డబ్బుతో కొనేసి ఎం ఎల్ సి స్థానాన్ని కొట్టేసిన 57 సంవత్సరాల కాసాని లక్ష్మీ పుత్రుడనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్ఆర్ పార్టీ కి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెడతానని కాసాని ఆ పార్టీ నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే సమయంలో, చేవెళ్ళ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయడానికి టికెట్ విషయంలో కూడా హామీ పొందినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో చిరంజీవి పార్టీ మద్దతుతో కాసాని ఇక్కడనుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేశారు.   వచ్చే నెలలో హైదరాబాద్ నగరంలో ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ బిసి గర్జన’ పేరుతో వెనుకబడిన తరగతుల తరపున ఓ ర్యాలీ ని నిర్వహించాలని భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన కాసాని తన ముదిరాజ్ కులం పేరుతో ప్రజా జీవితంలో అడుగు పెట్టారు. గతంలో కొంత కాలం తెలుగు దేశం పార్టీకి దగ్గరగా ఉన్న ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత ప్రజా రాజ్యం పార్టీ మద్దతు కూడా తీసుకున్నారు. కొంత కాలం సొంత రాజకీయ పార్టీ కూడా నడిపారు.

ఎడ్యురప్పా! నాశనమైపో గాక

  గుజరాత్ విజయంతో మంచి ఊపుమీదున్న భారతీయ జనతా పార్టీ, అక్కడ తనకు ఎదురు తిరిగి స్వంత కుంపటి రాజేసుకొన్న కేషుభాయిపటేల్ కి చివరికి బూడిదమిగినట్లే, కర్ణాటకాలోకూడా తనకు వెన్నుపోటుపొడిచి, తన శాసనసభ్యులను ఎత్తుకుపోయి ‘కర్ణాటక జనతపార్టీ’ని స్థాపించిన ఎడ్యురప్పని ‘నువ్వు నాశనమైపోవుదువు గాకా!’ అని కసితీరా శపించిపారేసింది. గుజరాత్ లో కేషు భాయికి పట్టిన గతే నీకూ తప్పకపడుతుందని మనసారా శపించింది.   అయితే, ఆడలేక మద్దిల ఓడన్నట్లు, తన పార్టీలో ఉన్న లుకలుకలని సరిచేసుకోలేని భారతీయ జనతాపార్టీ గడిచిన నాలుగు సం.లలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చుకోవలసిన దుర్గతిలో ఉంది. ఇప్పుడు ఉన్నముఖ్య మంత్రి జగదీశ్ షట్లర్ కుర్చీకూడా ఎడ్యురప్ప గట్టిగా తుమ్మితే ఊడేలా ఉంది. అటువంటి సమయంలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, గుజరాత్ లో మోడీ గెలిచేసినట్లే కర్ణాటకలో కూడా అవలీలగా గెలిచేస్తామని గొప్పలు పోతోంది. అయితే, తానూ గెలవలేకపోయినా ఎడ్యురప్పని గెలవనీయకుండా అడ్డుపడేంత శక్తి కూడా కర్ణాటకలోభారతీయ జనతాపార్టీకి లేవని దానికి తెలుసు. అయినా, మోడీ విజయాన్ని తన విజయంగా భ్రమసి భారతీయ జనతాపార్టీ తనకన్నా శక్తి మంతుడయిన ఎడ్యురప్పని గెలిచేయగలనని కలగంటోంది. గుజరాత్ ఎన్నికలలో విజయానికి తన భారతీయ జనతాపార్టీ ముద్ర కన్నా మోడీ ముద్రే ఎక్కువగా ఫలితాన్ని ఇచ్చిందని అందరికీ తెలుసు.   తనకే గనుక ప్రజలను మెప్పించగల ఆకర్షణ శక్తి గనుక ఉంటె, అది గుజరాత్ తో బాటూ జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయుండేది కాదు. అక్కడ కూడా దాదాపు కర్ణాటకలో ఉన్న లుకలుకలే ఉండబట్టే, తన అధికారాన్ని కాంగ్రెస్ హస్త గతం చేసి బయటకు పోవలసి వచ్చింది భారతీయ జనతాపార్టీకి. మరదే దారిలో సాగుతున్న కర్ణాటకలో అది ఏవిదంగా గెలవగలనని అనుకొంటున్నదో దానికే తెలియాలి.   అదీగాక, మోడీ తన అభివృద్ధి మంత్రంతో గుజరాత్ రాష్ట్రానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు సాదించిపెడితే, కర్ణాటకలో ఇంతవరకు మారిన ముగ్గురు మంత్రులలో ఇద్దరు, తమ గనుల కుంభకోణాలతో లోకాయుక్త చేత అభిశంపబడి రాష్ట్రానికి, పార్టీకీ కూడా మాయని మచ్చమిగిల్చేరు. అందువల్ల, భారతీయ జనతాపార్టీ ముందుగా తన ఇంటిని సరిచేసుకోన్నాక, ఎదురింటి గురించి ఆలోచిస్తే మంచిది. లేదంటే, ఎన్నోఏళ్లుగా గోతి కాడ నక్కలా కర్ణాటకలో బోణీ చేయాలని ఆత్రంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ, పిట్టల పోరు పిల్లి తిని తీర్చేసినట్లు చేజిక్కిన ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని తన ‘హస్త’గతం చేసుకొనే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే, దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కూడా భారతీయ జనతాపార్టీ చేతిలోంచి జారిపోతుంది. ఒకసారి కోల్పోయిన తరువాత మళ్ళీ చేజిక్కించుకోవడం అంత వీజీకాదని భారతీయ జనతాపార్టీ గానీ గ్రహించగలిగితే మంచిది.

కాంగ్రెస్ ఆకాశం నుండి ఊడిపడలేదు: మైసూర

  దేశంలో ఉన్నఅన్ని రాజకీయపార్టీలకి తానూ పెద్దన్నగా భావించుకొనే కాంగ్రెస్ పార్టీకి, వై.యస్సార్.పార్టీ నేత యమ్వి.మైసూరారెడ్డి హితబోధచేస్తూ, ముందుగా ఆదుర్లక్షణం వదిలించుకొని, అఖిలపక్ష సమావేశానికి రాకమునుపే తెలంగాణాపై తన అభిప్రాయం ఏమిటో తప్పనిసరిగా తెలియజేయాలని అన్నారు.   “కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను తెలంగాణాపై తమ అభిప్రాయలు చెప్పమనడం కన్నా ముందు తన మనసులో ఏముందో చెప్తే బాగుంటుంది. అయినా, ఆ పార్టీకి మా గోడు చెప్పుకొనేందుకు, అది వినేందుకు అదేమీ కోర్టులో జడ్జి కాదని తెలుసుకోవాలి. కాంగ్రేసు కూడా దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలలో ఒకటే తప్ప దానికేమి ప్రత్యేక హోదా లేదు. కాంగ్రెస్ ఏమి ఆకాశం నుండి ఊడిపడలేదు అని అది గ్రహించాలి. అందువల్ల, ముందు తెలంగాణపై తన అభిప్రాయం చెప్పడం మంచిది. అయినా, అది ఇతర పార్టీలమీద నెపంపెట్టి ఎన్నాళ్ళు ఆడుతుంది నాటకం? కాంగ్రేసుకి తెలంగాణా పరిష్కరించాలానే చిత్తశుద్ది లేదసలు. అందుకే, హోంమంత్రి మారినప్పుడల్లా మళ్ళీ అఖిలపక్షం అని కొత్తనాటకం మొదలుపెడుతుంది. ఇంత వరకు జరిగిన అఖిలపక్షం సమావేశాలలో అదేమి సాదించింది? కోట్లు ఖర్చుచేసి సోదించిన శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ని అది ఏమూలకు విసిరేసింది? తన ముందు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించకోకుండా ప్రతిపక్షాలను అఖిలపక్షం పేరుతో ఇరికిద్దామని చూస్తె అదే ముందు అందులో ఇరుక్కోక తప్పదు. ఇప్పటికయినా అది నిజాయితీగా తన మనసులో అభిప్రాయం చెప్పాలి,” అని మైసూర కాంగ్రేసుకి హితబోధచేసారు. అయితే, మరొకరి హితబోధలు వినే పరిస్తితిలో కాంగ్రెస్ ఉందా?

జగన్ గూటిలోకి ఇద్దరు ప్రకాశం ఎంఎల్ఏలు ?

      ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు యువ కాంగ్రెస్ శాసనసభ్యులు జగన్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. గొట్టిపాటి రవి కుమార్ (అద్దంకి), బి. శివ ప్రసాద రెడ్డి (దర్శి)లు జగన్ పార్టీ నేతలతో గత కొంత కాలంగా పూసుకొని తిరుగుతున్నారు.   వచ్చే సంక్రాంతి లోపు వీరిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఈ ఇద్దరు నేతల బంధువులు ఇప్పటికే జగన్ పార్టీలో చేరారు. తన నియోజక వర్గానికి చెందిన ప్రజలు తనను జగన్ పార్టీలో చేరాలని వత్తిడి తెస్తున్నారని రవి కుమార్ అన్నారు. ఆయన అనుచరులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల రవిని హైదరాబాద్ పిలిచి మాట్లాదారు. అయినా, రవి తన మనసు మార్చుకోలేదు.   శివ ప్రసాద రెడ్డి గతంలో కొంత కాలం జగన్ పార్టీలో ఉన్నారు. అయితే, అవిశ్వాస తీర్మానం సమయంలో ఆయన కాంగ్రెస్ కు ఓటు వేసారు. అయితే, స్థానిక పరిస్తితుల దృష్ట్యా ఆయన జగన్ పార్టీలో చేరడం తప్పక పోవచ్చని తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా, ఈ ఇద్దరు ఎంఎల్ఏ లు జగన్ పార్టీలో చేరడం తప్పనిసరి అని తెలుస్తోంది.

తెలంగాణా ముడేసి కొండని లాగాలనిచూసిన కవిత

  వై.యస్సార్.పార్టీ నాయకురాలు కొండాసురేఖ తన తండ్రిని ‘తెలంగాణా సాదిన్చలేకపోతే తలనరుక్కొని చస్తానన్నవాడివి, తెలంగాణా తీసుకురాకపోయినా ఇంకా ఎందుకు బ్రతికే ఉన్నావు? అని అడిగినప్పటినుండీ అయన కుమార్తె కవిత ఆమెపై కోపంతో రగిలిపోసాగింది. మళ్ళీ ఆ మర్నాడే కొండాసురేఖ తన తండ్రిని “దమ్ముంటే రా! ఇద్దరం కలిసి డిల్లీవెళ్లి సోనియాగాంధీ ఇంటిముందే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకొని తెలంగాణా పట్ల ఎవరికెంత చిత్తశుద్ధి ఉందో నిరూపించుకొందాము,” అని మరోసారి తన తండ్రికి సవాలు విసిరినప్పటినుండీ ఆమెపై ప్రతీకారం ఎప్పుడు తీర్చుకొందామా అని తపించిపోతున్న కవితకి, వచ్చేవారం డిల్లీలో జరగనున్న అఖిలపక్ష సమావేశం ఒకమంచి అవకాశంగా భావించి, కొండాసురేఖకి ఆమె ఇప్పుడు ప్రతిసవాల్ విసిరింది.   “నీవు నిజమయిన తెలంగాణావాదివే అయితే నువ్వూ, నీపార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి అఖిలపక్షసమావేశానికి హాజరయి, ఒకనాడు ఏ నోటితో పార్లమెంటులో సమైక్యాంధ్ర కావాలని అడిగేడో అదే నోటితో ఇప్పుడు ఆయన చేత జై తెలంగాణా అనిపించు. మీ పార్టీకి చిత్తశుద్దిఉంటే కోర్టు అనుమతి తీసుకొని అతనిని వెంటబెట్టుకొని అఖిలపక్ష సమావేశానికి హాజరయి అసలయిన తెలంగాణావాదివని నిరూపించుకో” అని కవిత, కొండాసురేఖకు సవాల్ విసిరింది. గానీ, మన కొండ ఇంకా కదలలేదు మెదలలేదు.

‘శ్రీ కృష్ణ’ నివేదిక ఇక అట కెక్కినట్లేనా?

        తెలంగాణా ఫై శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ‘ముగిసిన అధ్యాయమని’, ఈ నెల 28 న జరిగే అఖిల పక్ష సమావేశం లో దానిఫై చర్చ జరగదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెపుతున్నాయి. షిండే కొత్తగా హోం మంత్రిగా భాద్యతలు చేపట్టడంతో, ఈ సమస్య ఫైన ఓ అవగాహన కల్పించుకోవడానికి మాత్రమే ఈ సమావేశం పరిమితమవుతుందని వారంటున్నారు.   క్రితం సంవత్సరం జనవరి 5 న జరిగిన అఖిల పక్ష సమావేశం లో అప్పటి హోం మంత్రి చిదంబరం ఈ కమిటీ నివేదికను అన్ని పార్టీలకు అందించారు. ఈ నివేదిక ఫై ఆయా పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి మరోసారి ఇలాంటి సమావేశమే నిర్వహిస్తామని ఆయన ఆ సమావేశంలో ప్రకటించారు. అయితే, ప్రస్తుత సమావేశంలో ‘శ్రీ కృష్ణ’ ఫై చర్చ ఉండదని హోం శాఖ ప్రకటించడంతో ఇక శ్రీ కృష్ణ కమిటీ నివేదిక అట కెక్కినట్లేనని భావిస్తున్నారు.   ఈ సమావేశం అనంతరం తెలంగాణా ఫై స్పష్టమైన అభిప్రాయం ప్రకటించే అంశం కూడా తమకు తెలియదని ఆ శాఖ అధికారులు అంటున్నారు. ఈ అంశం ఫై ఏ విషయమూ తెలుసుకోవాలంటే 28 వరకూ ఆగాల్సిందే.

ఢిల్లీ లో గవర్నర్, సిఎం, బొత్స

      తెలంగాణా ఫై అఖిల పక్ష సమావేశం తేదీ సమీపిస్తుండటంతో కాంగ్రెస్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుతం గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ ఢిల్లీ లో మకాం వేసారు. ఈ ముగ్గురు కీలక వ్యక్తులు ఒకే సారి రాజధానిలో ఉండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.   తెలంగాణాకు తాము వ్యతిరేకం కాదని రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే, కేంద్రంలోనూ, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకూ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీనితో ఆ పార్టీ ఫై వత్తిడి పెరిగింది. 28 కి ముందే ఈ విషయంలో ఓ అభిప్రాయానికి వచ్చేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఆ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో, ధర్మాన అంశం వంటి పార్టీ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.   ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ తో చర్చలు జరిపినట్లు తెలిసింది. తెలంగాణా ఫై సత్వర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా వారు రాహుల్ కు వివరించినట్లు తెలిసింది. ప్రత్యేక రాష్ట్రమా, ప్యాకేజీనా అనే అంశాలు కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ రాత్రికి గవర్నర్, సోనియా, మన్మోహన్ లతో సమావేశం కానున్నారు.

షర్మిలా నా చెల్లెలు..కలుస్తా : దానం

      షర్మిలా తనకు చెల్లెలని, ఆమెకు గాయమైతే పరమర్సిస్తానని మంత్రి దానం నాగేందర్ అన్నారు. అందులో తప్పేంటని కూడా ఆయన వ్యాఖ్యానించారు. చాలా రోజుల నుండి మీడియా కు దూరంగా ఉన్న దానం ప్రస్తుతం ఈ సంచలన వ్యాఖ్యలతో మరలా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.   వై ఎస్ ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని మంత్రి అన్నారు. అయితే, దానం ఈ ప్రకటన తర్వాత కొంత మంది సన్నిహితులు అలా మాట్లాడటం సరి కాదని ఆయనకు సర్ది చెప్పినట్లు తెలిసింది. ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితునిగా మెలుగుతున్న సమయంలో, వేరే పార్టీకి సంభందించిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం సరి కాదని ఆయనకు సలహాలు వచ్చినట్లు సమాచారం.   దానం చేసిన ఈ ప్రకటనను కొంత మంది తమ రాజకీయ అవసరాలకు వాడుకొనే అవకాశం కూడా ఉంది.

కిరణ్ కు తెలంగాణ సెగ: రాళ్ల వర్షం, ఉద్రిక్తత

      ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ఫై వరంగల్ జిల్లా బొమ్మకూరులో తెలంగాణా వాదులు రాళ్ళతో దాడి చేశారు. కాకతీయ ఉత్సవాల ప్రారంభానికి సిఎం అక్కడికి చేరుకున్నారు.   బొమ్మకూరు లో ఏర్పాటు చేసిన సభ స్థలానికి కిరణ్ వెళ్తుండగా, ఆయన కాన్వాయ్ ను తెలంగాణా వాదులు మధ్యలోనే అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, సిఎం కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. తెలంగాణా ఫై స్పష్టత ఇవ్వాలని వారు సిఎం కాన్వాయ్ ని చుట్టుముట్టారు.   ఈ రాళ్ళ దాడిలో కాన్వాయ్ లోని పలు వాహనాల అద్దాలు దెబ్బ తిన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు లాటీ లకు పని చెప్పాల్సి వచ్చింది. దీనితో కొంచెం సేపు అక్కడ ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. కాగా, ఈ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్ల ఫై ముఖ్య మంత్రి అధికారులను మందలించినట్లు సమాచారం.

బ్రహ్మానంద రెడ్డి ప్రాసిక్యూషన్ కు అనుమతి !

        జగన్ అక్రమాస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో అధికారులను విచారించాలన్న సిబిఐ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ సంఘటన జరిగిన సమయంలో రాష్ట్ర మౌళిక వసతుల శాఖ కార్యదర్శిగా ఉన్న ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ అధికారి బ్రహ్మానంద రెడ్డి ని విచారించడానికి కేంద్రం అనుమతి లభించింది.   దీనితో ఈ కేసు వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు. ఈ కేసులో ఆయన నాలుగో నిందితునిగా ఉన్నారు. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఉన్న ఆయన వాన్ పిక్ భూ కేటాయింపుల్లో కొందరికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.   ఇప్పటి వరకూ ఎవరికీ లభించని ప్రాసిక్యూషన్ అనుమతి బ్రహ్మానంద రెడ్డికి మాత్రమే లభించింది. ఆయన రైల్వే అధికారి కావడంతో ఈ విషయంలో రైల్వే శాఖ తన వంతు ప్రయత్నాలు చేసింది. బ్రహ్మానంద రెడ్డి వైఎస్ రాజ శేఖర రెడ్డి ముఖ్య మంత్రి గా ఉన్న సమయంలో డిప్యుటేషన్ ఫై పెట్టుబడుల శాఖలో కార్యదర్శిగా పని చేశారు.

1 న షిర్డీ ఆలయాన్ని పెల్చేస్తామని హెచ్చరిక

      నిత్యం లక్షలాది భక్తులతో కిటకిటలాడే షిర్డీ సాయిబాబా ఆలయాన్ని జనవరి 1 వ తేదీన పేల్చివేస్తామనే ఓ హెచ్చరికతో కూడిన లేఖ ఆలయ సిబ్బందికి అందింది. దీనితో కంగారు పడిన ఆలయ డిఇఓ యశ్వంత్ ఆ లేఖను పోలీసుల చేతికి అందించాడు.   ఆ లేఖ ఫై బుల్దానా జిల్లా పోస్టల్ కార్యాలయం ముద్ర ఉంది. ఈ బెదిరింపు లేఖ ఫై అంకుష్ భూసే, బాస్కర్ కదం, బాలు లహుడ్కర్ అనే వ్యక్తుల సంతకాలు ఉన్నాయి. ఇక్కడ బాంబులు పెట్టేందుకు ఒప్పందం కూడా జరిగిపోయిందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు తాము రూ. 350 కోట్లు తీసుకున్నామని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.   ఈ లేఖతో ఆలయ సిబ్బంది లో టెన్షన్ ప్రారంభం అయింది. ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వ్యవస్తను మరింత పెంచారు. దీనితో పోలీసులు ఆ లేఖలో సంతకాలు చేసిన వ్యక్తుల గురించి ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఇది ఆకతాయిల పనే అని మరో వాదన కూడా ఉంది.

వైఎస్ జగన్ పార్టీలోకి వసంత నాగేశ్వరరావు

        కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వర రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. కృష్ణా జిల్లాలో జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ సభలో ఆయన జగన్ గూటిలో చేరారు.   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా కన్వీనర్ ఉదయ భాను పార్టీ కండువా కప్పి వసంతను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ, వై ఎస్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందిందని అన్నారు.   తనను ఎవరూ పట్టించుకోని రోజుల్లో రాజ శేఖర రెడ్డి తనకు కేడిసిసి బ్యాంకు అధ్యక్ష పదవి కట్టబెట్టారని ఆయన అన్నారు. ఆలాంటి నేత ఋణం తీర్చుకోవడానికే తాను ప్రస్తుతం ఆయన కుమారుడి పార్టీలో చేరుతున్నానని అన్నారు. కొత్త పార్టీలో తాను ఓ సామాన్య కార్యకర్తగా కొనసాగాలని భావిస్తున్నాని వసంత అన్నారు. వసంత గతంలో నాప్కాబ్ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు.

‘28’ తర్వాత తెలంగాణా కాంగ్రెస్ లో సంక్షోభం?

          ఈ నెల 28 న ఢిల్లీ లో జరగనున్న అఖిల పక్ష సమావేశం తర్వాత తెలంగాణా కాంగ్రెస్ లో తీవ్ర పరిణామాలు చోటు చోసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయం ఉండకపోవచ్చని ఈ ప్రాంతానికి చెందిన పార్టీ నేతలు భావిస్తూ ఉండటమే ఇందుకు కారణం.   కనీసం నలుగురు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు టిఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చే అవకాశం ఉంటే మాత్రం ఈ వలసలు ఉండే అవకాశం లేదు. మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవ రావు ను తన పార్టీలో చేర్చుకొనేందుకు టిఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావు తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఆయనను ముందుగా చేర్చుకోగలిగితే, ఇక మిగిలిన వారిని చేర్చుకోవడం పెద్ద కష్టం కాదని కేసిఆర్ అంచనా.   కే.కే.ను వచ్చే 2019 ఎన్నికల్లో జహీరాబాద్ లోక్ సభ నుండి బరిలోకి దింపాలని కూడా టిఆర్ఎస్ అధినేత భావిస్తున్నారని సమాచారం. ఆయన తన పార్టీలో ఉంటే, ఢిల్లీ లో రాజకీయాలు నడపటం తేలిక అవుతుందని కేసిఆర్ భావిస్తున్నారు.   అఖిల పక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం లేని పక్షంలో, తెలంగాణా ప్రజల దృష్టిలో తాము దోషిగా నిలబడాల్సి వస్తుందని, ఎన్నికల సమయంలో తాము ప్రజల వద్దకు ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలని తెలంగాణా కాంగ్రెస్ నేతలు మధనపడుతున్నారు. ప్రత్యెక రాష్ట్రం ఇస్తే, తెలంగాణా లో నక్సల్స్ సమస్య తీవ్రతరం అవడంతో పాటు, కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కిరణ్ సర్కారుకు 'ధర్మ' సంకటం : మంత్రి డీఎల్ చెప్పినా.. !

    “అది మన ప్రభుత్వానికి ఎంతమాత్రం ఆరోగ్యకరమయిన విషయం కాదు” అని ఆరోగ్యా శాఖామాత్యులు డి.యల్. రవీంద్రరెడ్డిగారు ఎంతగా మొత్తుకొంటున్నా వినకుండా, అతని హెచ్చరికలు పెడచెవినపెట్టి అధర్మం అని తెలిసికూడా సిబీఐ చార్జ్ షీట్లో పేరువేసుకొన్న తనమంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావుగారిని వెనకేసుకొస్తూ, ఆయనపై సిబీఐ ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి నిరాకరిస్తూ కాబినెట్ లో నిర్నయించేసి, ‘మేము సంతకాలు పెట్టేసాక గవర్నర్ సంతకం చేయక చస్తాడా?’ అనుకొంటూ నిర్భయంగా ఆ ఫైలును ఆయన ఆమోదం కోసం పంపించేరు విజ్ఞులయిన మన ముఖ్యమంత్రి గారు.   ఆ ఫైలు ఆయన చేతిలో పడినప్పటినుండీ ఆయనకు రాహుకాలం మొదలయినట్లయింది. ఆయన హైదరాబాదులో ఉంటె విపక్షాలు మరియు తెలంగాణా వాదులూ, డిల్లీ వెళ్తే అక్కడ మీడియా వాళ్ళు ‘మీరలా ఆ ఫైలుని కోడి గుడ్లు పొదిగినట్లు పొదుగుతూ ఎన్ని రోజులు కూర్చోంటారంటూ’ ఆయనపై దాడిచేస్తుంటే ఆబాధ బరిన్చలేకో మరేమో గానీ, దానిని మళ్ళీ కిరణ్ సర్కారుకే తిప్పి పంపేసారు “మీ తిప్పలు మీరు పడండి’ అంటూ. "మళ్ళీ మీరు నాకా ఫైలు పంపేముందు కనీసం ఈసారయినా న్యాయనిపుణుల సలహా తీసుకోమని" ఒక నోట్ (ఉచిత సలహా) కూడా దానిపైన బరబారా వ్రాసేసి చేతులుదులుపుకొని ‘హమ్మయ్యా!’ అని ఊపిరితీసుకొన్న గవర్నర్ గారు మళ్ళీ సోనియమ్మ పిలపందుకొని హడావుడిగా డిల్లీ బయలుదేరిపోయారు.   గోడకోట్టిన బంతిలా వెనక్కొచ్చిన ఆ ఫైలుని చూసి కిరణ్ కుమార్ రెడ్డి తలపట్టుకొంటే, వెనకనుండి “చూసారా... నేను ఆ రోజే మరీమరీ చెప్పినా వినకుండా పంపేరు..” అంటూ మన డి.యల్. రవీంద్ర రెడ్డి గారు సన్నాయి నొక్కులు నొక్కతూ ముసిముసి నవ్వులు చిందిస్తూ కనిపించేరు.   మరో గంటో గడియలోనో అయన ‘ధర్మాన ఫైలు మరియు న్యాయసూత్రాలు’ అనే అంశంపై చర్చించేందుకు మన టీవీ తెరలపైకి రాబోతున్నారు.