విద్యార్థిని మృతి.. హత్యా? ఆత్మహత్యా?

  తిరుపతిలోని ఓ ప్రైవేట్ కాలేజీ క్యాంపస్‌లో రేఖ అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె స్వస్థలం కడప జిల్లా రైల్వేకోడూరు. సోమవారం రాత్రి ఆమె తన హాస్టల్ గదిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. అయితే రేఖ తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె మరణం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె కళాశాల యాజమాన్యం వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుని వుండొచ్చొని, లేకపోతే ఆమె తలను గోడకేసి కొట్టి చంపిన ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె శరీరంపై ఉరి వేసుకుని చనిపోయిన ఆనవాళ్లు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రేఖ తలను బలంగా గోడకేసి కొట్టి ఉండటం వల్లే చనిపోయి ఉంటుందన్నారు.

నేడు విశాఖకు మోడీ

  హుదూద్ తుఫాను ప్రభావానికి గురైన విశాఖపట్నం పరిసరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్రలో ప్రధాని పర్యటన 2 గంటల పాటు జరుగుతుంది. మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు విశాఖ నుంచి ఆయన ఏరియల్ సర్వే మొదలవుతుంది. ఏరియల్ సర్వే అనంతరం, విశాఖలో ఏర్పాటు చేసిన తుఫాను ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకిస్తారు. ఈ ప్రదర్శన కోసం సుమారు 100 ఫొటోలను హైదరాబాదులో ప్రింట్ వేయించి వైజాగ్ పంపించారు. తాను తుఫాను పరిస్థితి గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అన్ని విషయాలు తెలుసుకుంటూ వచ్చిన నరేంద్ర మోడీ.. అందుకు తగినట్టుగా సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర యంత్రాంగాన్ని కూడా ఆదేశించారు. ప్రధాని పర్యటన సందర్భంగా, హుదూద్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరనున్నారు. నష్టపోయిన పంటలు, నివాస గృహాలు, మౌలిక వసతులు, సమాచార, విద్యుత్, రవాణా వ్యవస్థల గురించి మోడీకి చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. తక్షణ సాయంగా రూ.2 వేల కోట్లను అందించాలని ఇప్పటికే కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని ఒరిస్సాకి వెళ్లి, అక్కడ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు.

ఫ్రెంచ్ ఆర్థికవేత్త టిరోల్‌కి నోబెల్

  ఫ్రెంచ్‌ ఆర్థికవేత్త జీన్‌ టిరోల్‌ ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి విజేత అయ్యారు. పెట్టుబడి మార్కె ట్‌ శక్తి, నియంత్రణలపై చేసిన పరిశోధనలకుగాను ఆయనకు ఈ బహుమతి లభించింది. 1999 తర్వాత అమెరికా వెలుపలి వ్యక్తికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి రావడం ఇదే ప్రథమం. నోబెల్‌ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ వర్థంతి సందర్భంగా డిసెంబర్‌ పదో తేదీన ఈ బహుమతులు అందచేస్తారు. నోబెల్‌ బహుమతికి ఎంపిక కావడం తనను ఎంతో కదలించి వేసిందని టిరోల్‌ అన్నారు. సమకాలీన ప్రపంచంలో  ప్రభావవంతులైన ఆర్థికవేత్తల్లో టిరోల్‌ ఒకరని, భిన్న రంగాల్లో ఆయన ఎంతో విస్తృతమైన పరిశోధనలు చేశారని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. టిరోల్‌ (61) ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని టోలోస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఆర్థికవేత్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన మెసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (మిట్‌) ఆయన పిహెచ్‌డి చేశారు.

చిరంజీవి ఇంటికి వాస్తు కళ

  ఎవరైనా సక్సెస్‌లో వుంటే అది తమ గొప్పే అనుకుంటారు. ఫెయిల్యూర్‌లో వుంటే వాళ్ళ దృష్టి తాము నివసించే ఇంటి వాస్తు మీద పడుతుంది. ఇప్పుడు మాజీ మెగాస్టార్ చిరంజీవి కూడా తాను రాజకీయాల్లో రాణించకపోవడానికి కారణం తన ఇంటి వాస్తు సరిగా లేకపోవడమేనని అనుకుంటున్నట్టు సమాచారం. అందుకే తన ఇంటి వాస్తును సమూలంగా మార్చేసి పూర్తి పర్‌ఫెక్ట్ వాస్తు వున్న ఇంటిగా మార్చాలని సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన కుటుంబం మొత్తం ఇల్లు ఖాళీ చేసి విదేశాలకు విహార యాత్రలకు వెళ్ళిపోయిందట. వారు తిరిగి వచ్చే సరికి ఇల్లంతా కొత్తగా, వాస్తుతో కళకళలాడుతూ వుంటుందట. చిరంజీవి కేంద్ర మంత్రిగా వున్నప్పుడు ఢిల్లీలో ఆయనకు కేటాయించిన ఇంటికి కోట్లు ఖర్చుపెట్టి భారీగా వాస్తు మార్పులు చేయించారు. అయినప్పటికీ ఆయన మంత్రిగా రాణించలేకపోయారు కదా.. ఇప్పుడు హైదరాబాద్‌లోని తన సొంత ఇంటికి వాస్తు మార్పులు చేయించినంత మాత్రాన ఏం ఒరుగుతుంది అని హేతువాదులు ప్రశ్నిస్తున్నారు.

తుఫాను: సీఎం తక్షణసాయం ప్రకటన

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుదూద్ తుఫాను బాధితులకు తక్షణ సాయం ప్రకటించారు. సోమవారం సాయంత్రానికి బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చక్కెర, 5 లీటర్ల కిరోసిన్ పౌరసరఫరాల దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నట్టు చంద్రబాబు చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, పరిస్థితిని సమీక్షించిన అనంతరం విశాఖ కలెక్టరేట్‌లో చంద్రబాబు మాట్లాడారు. తుఫాను కారణంగా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చంద్రబాబు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, పశువులు చనిపోతే 25 వేలు, మత్సకారుల వలలకు 5 వేలు, పడవ నష్టపోతే 10 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. విశాఖ నగరంలో (నేడు) సోమవారం సాయంత్రంలోగా విద్యుత్తును పునరుద్ధరించాలని ఆయన అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గం స్థాయిలో పరిస్థితిని సమీక్షించాలని, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ శ్రమిద్దామని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. తనకు ఎంతో ఇష్టమైన విశాఖ నగరానికి ఇలా జరగడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు.

శశిథరూర్‌ని పదవి నుంచి గెంటేశారు

  మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశిథరూర్ మీద కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం బాగుందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీని పొగడ్డమే శశిథరూర్ చేసిన తప్పు. పొగిడింది చాల్లే ఆపమన్నా శశిథరూర్ ఎంతమాత్రం వినలేదు. దాంతో కేరళ కాంగ్రెస్ పార్టీ శశిథరూర్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సాగనంపాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే పార్టీలో సీనియర్ నాయకుడు అయిన దిగ్విజయ్ సింగ్ ఈ విషయాన్ని లైట్‌గా తీసుకున్నట్టు మాట్లాడ్డంతో శశి థరూర్ మీద చర్యలు వుండవన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. అయితే శశిథరూర్‌ని పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది.

కల్లు దుకాణాల మీద కేసు

  హైదరాబాద్ నగరంలో వీధివీధినా కల్లు దుకాణాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంలో భాగంగా దసరా నుంచి కొన్ని దుకాణాలు కూడా ప్రారంభమయ్యాయి. కల్లు గీత కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు హైదరాబాద్‌ ప్రజలకు రుచికరమైన, ఆరోగ్యకరమైన, నాణ్యమైన కల్లును అందించడమే ఈ కల్లు దుకాణాలు ప్రారంభించడం వెనుక వున్న ఉద్దేశం. అయితే ఈ కల్లు దుకాణాలు ఏర్పాటు చేయడం తగదంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. అసలు హైదరాబాద్‌ నగరంలో తాటి, ఈత చెట్లే లేవని, అందువల్లో గతంలో హైదరాబాద్ నగరంలో కల్లు దుకాణాలను రద్దు చేశారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు తాటి, ఈత చెట్లు లేని హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల కల్తీకల్లు ఏరులై పారే ప్రమాదం వుందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

తుఫాను ప్రభావం: చంద్రబాబు ఏరియల్ సర్వే

  హుదూద్ తుఫాను ప్రభావానికి లోనైన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం తెల్లవారు జామున చంద్రబాబు ఏరియల్ సర్వేకి వెళ్ళారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం లతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని పరిస్థితులను కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఏరియల్ సర్వే తర్వాత చంద్రబాబు విశాఖపట్నం చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులందరిని విశాఖ చేరుకోవాలని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించారు.వారికి తుపాను సహాయ చర్యలపై కార్యాచరణ అప్పగించి, రంగంలోకి దించారు. ముప్పై మంది ఐఎఎస్‌లను సహాయ, పునరావాస చర్యల పర్యవేక్షణ నిమిత్తం కేటాయించారు. మండలానికో ఐఏఎస్‌కి బాధ్యతలు అప్పగించారు. సహాయక చర్యలు పూర్తి అయ్యే వరకు చంద్రబాబు నాయుడు విశాఖలోనే వుంటారు.

విద్యార్థినిపై వేట కొడవలితో దాడి

  హైదరాబాద్ శివార్లలోని బండ్లగూడ అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థి మరో విద్యార్థినిపై కొడవలితో దాడి చేసి గాయపరిచాడు. తనను ప్రేమించడం లేదనే సాకుతో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రవళిపై ప్రదీప్ అనే ఉన్మాది కత్తితోదాడి చేశాడు. దాడి చేసిన తర్వాత ప్రదీప్ అక్కడే విషం తాగాడు. కాలేజీలోని విద్యార్థులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో విద్యార్థినిపై పదునైన వేట కొడవలితో దాడి చేసి అక్కడే విషం తాగిన యువకుడు ప్రదీప్ మరణించినట్టు సమాచారం. దాడికి గురైన విద్యార్థిని రవళి చికిత్స పొందుతోంది. రవళి ప్రమాదం నుంచి బయటపడినట్టు సమాచారం.

నర్సుకి ఇబోలా... అమెరికాలో ఎలర్ట్

  ఇప్పటి వరకూ ఆఫ్రికన్ దేశాలను హడలెత్తిస్తున్న ఇబోలా వ్యాధి ఇప్పుడు అమెరికాని కూడా భయపెడుతోంది. అమెరికాకు చెందిన థామస్ ఎరిక్ డంకన్ అనే వ్యక్తి లైబీరియా నుంచి సెప్టెంబర్ 20న డల్లాస్‌కి వచ్చాడు. డల్లాస్‌కి వచ్చిన తర్వాత అతనికి ఇబోలా వైరస్ సోకిందని తెలిసి హడలిపోయిన అమెరికా అతనికి ప్రత్యేక పద్ధతులలో చికిత్స నిర్వహించింది. అయితే 42 సంవత్సరాల వయసు వున్న డంకన్ ఆ తర్వాత చనిపోయారు. డంకన్‌కి చికిత్స చేసిన ఒక అమెరికన్ నర్సుకు కూడా ఎబోలా వ్యాధి వైరస్ సోకినట్టు కనుగొన్నారు. డంకన్ దగ్గరకి చికిత్స నిమిత్తం వెళ్ళిన సమయంలో నర్స్ సరైన రక్షణ పద్ధతులు పాటించకపోవడం వల్ల సదరు నర్సుకు కూడా ఎబోలా వ్యాధి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఎబోలా వ్యాధి ఇంకా విస్తరించకుండా వుండటానికి అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

శ్రీదేవి టైటిల్ మార్చేదే లేదు... వర్మ

  దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించాలనుకున్న కళాఖండం ‘సావిత్రి’ అనే సినిమా పేరును ‘శ్రీదేవి’గా మార్చిన విషయం తెలిసిందే. తన పేరును సినిమా పేరుగా పెట్టడానికి వీల్లేదంటూ ప్రముఖ నటి శ్రీదేవి రామ్ గోపాల్ వర్మకు లాయర్ నోటీసులు పంపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శ్రీదేవి తనకు పంపిన నోటీసులకు వర్మ స్పందించారు. నటి శ్రీదేవి జీవితానికి , తాను తీయబోయే శ్రీదేవి సినిమాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అంచేత తన సినిమాకు ‘శ్రీదేవి’ అనే టైటిల్‌ని మార్చనని స్పష్టంగా చెప్పేశారు. పాతికేళ్ల యువతికి, టీనేజ్ యువకుడికి మధ్య కథ ఇదని, పేర్లకు హక్కులు ఉండవని వర్మ శ్రీదేవికి సమాధానమిచ్చారు.

రేపు విశాఖకు వస్తున్న మోడీ

  హుదూద్ తుఫాన్ విశాఖపట్టణాన్ని అల్లకల్లోలం చేసింది. విశాఖపట్టణంలో ఇప్పుడు వాతావరణం చాలా భయానకంగా వుంది. ఎక్కడ చూసినా చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయి వున్నాయి. ఇప్పుడిప్పుడే నగర ప్రజలు బయటకి వస్తున్నారు. తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి వుంది. కరెంటు లేదు. కమ్యునికేషన్ వ్యవస్థ కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. విశాఖలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తాను తెలుసుకుంటున్నానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కూడా ఫోన్‌లో మాట్లడానని చెప్పారు. విశాఖ ప్రజలకు అండగా వుండటానికి మంగళవారం నాడు తాను విశాఖను సందర్శించనున్నానని నరేంద్ర మోడీ ట్విట్టర్లో తెలిపారు.

రైతుల ఆత్మహత్యలన్నీ కేసీఆర్ ప్రభుత్వ హత్యలే

  తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలన్నీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యలేనని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టీటీడీపీ నాయకులు తెలంగాణలో నిర్వహిస్తున్న బస్సు యాత్రలో భాగంగా ఎర్రబెల్లి ఆదివారం నాడు కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ లైన్లు వేసే కాంట్రాక్ట్ తన బంధువుకు రాలేదన్న అక్కసుతోనే కేసీఆర్ ఈ విద్యుత్ లైన్ నిర్మాణ నిర్ణయాన్ని మార్చుకున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. అయితే అసలు విషయాన్ని మరుగున పెట్టేసి నక్సల్స్ సమస్య వల్లనే కరెంటు లైన్లు వేయడం లేదని ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు.

హుదూద్ తుఫాను ప్రభావం... విశాఖ అల్లకల్లోలం..

  ముంచుకొచ్చిన హుదూద్ తుఫాను విశాఖపట్టణం నగరాన్ని అల్లకల్లోలం చేసింది. విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయాయి. సెల్ టవర్లు కూలిపోయాయి, అనేక ఇళ్లు కుప్పకూలాయి, అపార్టుమెంట్లు బీటలు వారాయి. పెద్దపెద్ద చెట్లు రోడ్డుకు అడ్డంగా విరిగి పడిపోయాయి. కమ్యూనికేషన్లు దారుణంగా దెబ్బతిన్నాయి. హోర్డింగులు పడిపోయాయి. తుఫాను కారణంగా భారీ సంఖ్యలో జంతువులు మరణించాయి. అయితే రవాణాకు పరిస్థితులు ఎంతమాత్రం అనుకూలంగా లేకపోవడం వల్ల అధికారులు ఆ పశువులను తొలగించడం ఎలాగా అని మల్లగుల్లాలు పడుతున్నారు. రోడ్లమీద పడి ఉన్న పశు కళేబరాలు కుళ్ళిపోవడం కారణంగా అంటువ్యాధులు ప్రబలుతాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.