కేబీఆర్ పార్క్‌లో గంధం దొంగల పట్టివేత

  హైదరాబాద్ బంజారాహిల్స్‌లో వున్న కేబీఆర్ జాతీయ పార్క్‌లో భారీ స్థాయిలో గంధపు చెట్లు వున్నాయి. గతంలో ఇందిరాపార్క్‌లో వున్న గంధపు చెట్లను గంధపు దొంగలు ఖాళీ చేశారు. ఇప్పుడు వారి కన్ను కేబీఆర్ పార్క్ మీద పడింది. కేబీఆర్ పార్క్‌లో గంధపు చెట్లను నరికేస్తున్న ఐదుగురు గంధం స్మగ్లర్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. గంధపు చెట్ల దొంగలు పెద్ద పెద్ద రంపాలతో గురువారం రాత్రి కేబీఆర్ నేషనల్ పార్క్‌లో చెట్లను నరుకుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీరి వెనుక అసలు సూత్రధారులు ఎవరు వున్నారన్న విషయాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. జాతీయ అటవీశాఖ అధీనంలో వున్న కేబీఆర్ పార్క్‌లో 2 వందలకు పైగా గంధపు చెట్లు వున్నాయి.

గవర్నర్‌తో కేసీఆర్ భేటీ.. 22న టీ క్యాబినెట్ విస్తరణ?

  గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రాత్రి భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య రెండు గంటల పాటు సమావేశం జరిగింది. గవర్నర్ని కేసీఆర్ కలిసింది మంత్రివర్గ విస్తరణ కోసమేనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంతమంది అయితే ఇంకో అడుగు ముందుకేసి ఈనెల 22న మంత్రివర్గ వుంటుందని, కొప్పుల ఈశ్వర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మరో ముగ్గురికి తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం వుందని చెబుతున్నారు. గవర్నర్‌తో కేసీఆర్ జరిపిన సమావేశంలో బడ్జెట్ సమావేశాల ఏర్పాటు అంశం, హైకోర్టు ఏర్పాటు అంశం కూడా చర్చకు వచ్చిందని తెలుస్తోంది.

దత్తత తీసుకున్న సచిన్

  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని పుత్తమరాజు కండ్రిగ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ సవాల్‌ని స్వీకరించిన సచిన్ టెండూల్కర్ పుత్తమరాజు కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకుని మూడున్నర కోట్ల రూపాయలతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమకూర్చనున్నారు. నవంబర్ 16న సచిన్ టెండూల్కర్ ఈ గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. పుత్తమరాజు కండ్రిగ గ్రామంలో రోజంతా అందుబాటులో తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ, చెత్తనిర్మూలన వ్యవస్థ, శ్మశానం, సెల్ ఫోన్ టవర్లు, వైఫై జోన్, బ్యాంకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాలలను నిర్మిస్తారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం గురించి గురువారం సతీ సమేతంగా ప్రధాని నరేంద్రమోడీనికి కలిసి సచిన్ టెండూల్కర్ వివరించారు. ప్రధాని ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ను మరింత విస్తరించాలని సచిన్ టెండూల్కర్ నరేంద్రమోడీని కోరారు.

కరెంటు విషయంలో హరీష్ ఆగ్రహం

  తెలంగాణ రాష్ట్రంలో కరెంటు సరఫరా విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపక్షాల నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లుతున్నారనితెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు కార్యాలయం ఎదుట ధర్నా చేసి ఈ ప్రాంత రైతాంగానికి విద్యుత్ సరఫరా చేసేలా చేయాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో రోజుకు 15 కోట్లు ఖర్చు చేసి అధిక ధరకు కొనుగోలు చేస్తూ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు వివరించారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చుకుంటే 27 మిలియన్ యూనిట్ల కరెంటును అదనంగా సరఫరా చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో విద్యుత్ ప్లాంట్లు, భారీ నీటి ప్రాజెక్టులు లేకపోయినా, సింహాద్రి ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయి, అనేక అవాంతరాలు ఎదురైనా రికార్డు స్థాయిలో సరఫరా చేస్తున్నామన్నారు.

తెలంగాణ హైకోర్టుకు రంగం సిద్ధం

  తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంగీకారం తెలిపినట్టు సమాచారం అందుతోంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్దయర్శి రాజీవ్ శర్మ గురువారం ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు గురించి చర్చించారు. హైకోర్టు ఏర్పాటుకు చీఫ్ జస్టిస్ సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో కింగ్‌కోఠీలోని పరదా ప్యాలెస్ లేదా ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ డి భవనంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేసే అవకాశం వుందని తెలుస్తోంది. ప్రస్తుత హైకోర్టు భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకే తాత్కాలికంగా కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం.

నేడు ఖమ్మంకు పవర్ స్టార్

  పవన్ కళ్యాణ్ నేడు  తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి వెళ్ళనున్నారు. ఖమ్మంలో శ్రీజ అనే 13 సంవత్సరాల బాలిక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. ఆమె పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్‌ని జీవితంలో ఒక్కసారైనా చూడాలన్నది ఆమె కోరిక. ఆ బాలిక ఆకాంక్షను తీర్చడం కోసం పవన్ కళ్యాణ్ ఖమ్మంలో ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రికి శుక్రవారం నాడు వెళ్తున్నారు. మేక్ ఎ విష్ ఫౌండేషన్ సంస్థ సాధిక్ అనే తీవ్ర వ్యాధిగ్రస్త బాలుడి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అవ్వాలన్న కోరికను రెండు రోజుల క్రితం తీర్చింది. సాధిక్ ఒక్కరోజు పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ సందర్భంగా మేక్ ఎ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌ని కలవాలని అనుకుంటున్న బాలిక శ్రీజ గురించి ప్రస్తావించారు. ఆ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ శ్రీజని కలవటానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. నేడు ఖమ్మంలో ఆమెను కలుస్తారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆయన రాజమండ్రిలో ప్రకటించారు.

రేపటి నుంచే విశాఖ విమానాలు...

  హుదూద్ తుఫాను విధ్వంసం నుంచి కోలుకుంటున్న విశాఖకు శుక్రవారం నుంచి విమానాలను నడుపనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వెల్లడించారు. తుఫాను కారణంగా విశాఖ విమానాశ్రయం పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ అంశంమీద అశోక్ గజపతి రాజు గురువారం విశాఖ విమానాశ్రయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, ‘‘విశాఖ విమానాశ్రయంలో ప్రస్తుత పరిస్థితి మెరుగుపడింది. శుక్రవారం నుంచి విమానాల రాకపోకలు యథావిధిగా జరుగుతాయి. అలాగే వచ్చేనెల ఒకటో తేది నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులనూ విశాఖ విమానాశ్రయానికి అందుబాటులోకి తెస్తున్నాం. హుదుద్ తుఫాను వల్ల తీవ్రంగా ధ్వంసమైన విమానాశ్రయాన్ని సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి పునరుద్ధరించారు’’ అన్నారు.

343 బిలియన్ డాలర్ల బాలల వ్యభిచారం

  ఇటీవల నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి దేశంలో బాలల వ్యభిచారానికి సంబంధించిన చేదు వాస్తవాలను వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో చిన్నారులతో జరుగుతున్న వ్యభిచారం 343 బిలియన్ డాలర్ల వ్యాపారంగా కైలాష్ సత్యార్థి చెప్పారు. నేపాల్, బంగ్లాదేశ్‌ల నుంచి అపహరించిన అమ్మాయిలతో ఈ తరహా వ్యభిచారం నిరాఘాటంగా సాగుతోందని సత్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. సత్యార్థి నేతృత్వంలోని గ్లోబల్ మార్చ్ అగెయినెస్ట్ చైల్డ్ లేబర్ పైన ఓ అధ్యయనం చేసింది. భారతదేశంలో బాలలతో చేయిస్తున్న ఈ తరహా వ్యభిచారం తరతరాలుగా కొనసాగుతోందని ‘ఎకానమిక్స్ బిహైండ్ ఫోర్స్ డ్ లేబర్ ట్రాఫికింగ్’ పేరిట విడుదలైన ఆ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం భారత్‌లో 32 లక్షల మంది చిన్నారులు బలవంతంగా వ్యభిచార కూపంలో కొనసాగుతున్నట్టు తేలింది.

విడిపోయినందుకు కరెంటు కష్టాలు: కేటీఆర్

  విడిపోతే అందరికీ వారసత్వంగా ఆస్తులు వస్తాయని, తమకు మాత్రం కరెంటు కష్టాలు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం నాడు ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమర్స్ ట్రైనింగ్ సెంటర్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘సాధారణంగా ఎవరైనా విడిపోతే ఆస్తులు వస్తాయి. మాకు మాత్రం కరెంటు కష్టాలు వచ్చాయి. గత ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే తెలంగాణకు విద్యుత్ కష్టాలు వచ్చాయి. వచ్చే ఏడాది జూన్, జూలై నాటికి వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయబోతున్నాం. అంచేత రైతులు ఆత్యహత్యలు చేసుకోవద్దని కోరుతున్నాం. విద్యుత్ సమస్యని పరిష్కరించేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. 2015 చివరికి థర్మల్ విద్యుత్ అందుబాటులోకి వస్తుంది’’ అన్నారు.

కొత్త రుణాలు ఇవ్వట్లేదు చూడండి సార్...

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్‌కు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ సుజనా చౌదరి ఫిర్యాదు చేశారు. రఘురాం రాజన్ బుధవారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా వీరు ఈ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రఘురాం రాజన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కూడా సమావేశమయ్యారు. ‘రుణ మాఫీ’ పొందిన రైతులకు కొత్త రుణాల మంజూరులో బ్యాంకులు ఆశించిన మేరకు సహకరించడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్  రిజర్వ్‌బ్యాంకు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న విషయాన్ని రఘురాం రాజన్ దృష్టికి కేసీఆర్ తీసుకువచ్చారు.

విశాఖ మీద దుష్ప్రచారం తప్పు: పవన్ కళ్యాణ్

  తుఫాను విపత్తు ఎదుర్కొన్న విశాఖపట్నం మీద దుష్ప్రచారం జరుగుతోందని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను వచ్చింది కాబట్టి విశాఖపట్నంలో ఐటీ రంగం అభివృద్ధి చెందదంటూ దుష్ప్రచారం చేయడం భావ్యం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం నాడు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. తుఫాను బాధితులను ఆదుకోవడానికి తనవంతు సాయంగా 50 లక్షల రూపాయల చెక్‌ను చంద్రబాబు నాయుడికి అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ‘‘క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే నాయకత్వ లక్షణాలు చంద్రబాబులో వున్నాయి. వెయ్యి కోట్ల రూపాయల తక్షణ సాయం ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, ప్రజలకు అండగా వున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం తగదు. అందరూ చంద్రబాబుకి సహకరించాలి. విశాఖ స్మార్ట్ సిటీ అవబోతున్న వేళ ఈ విపత్తు బాధ కలిగిస్తోంది. ఈ వైపరీత్య సమయంలో విశాఖకు ఐటీ రంగం రాదని దుష్ప్రచారం జరుగుతూ వుండటం బాధాకరం’’ అన్నారు.

వర్మగారూ.. ఈ పాదాలనూ కాస్త చూడండి...

  ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాను తీసిందే సినిమా అనుకునే టైప్. బాలీవుడ్ ఆయన క్రియేటివిటీని తట్టుకోలేక సాగనంపడంతో ఇప్పుడాయన హైదరాబాద్‌లోనే మకాం వేసి పిచ్చిపిచ్చి సినిమాలు తీస్తూ జనాల బుర్ర తింటున్నారు. రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీయకుండా చూడు దేవుడా అని ప్రార్థించే ప్రేక్షకులు కూడా ఈమధ్యకాలంలో బయల్దేరారు. అలాంటి వర్మ ఇప్పుడు తన దృష్టిని షార్ట్ ఫిలిమ్స్ మీద కేంద్రీకరించారు. పాదాల మీద షార్ట్ ఫిలిం తీసిన వర్మ గారూ... సెలబ్రిటీల పాదాలను మాత్రమే కాదు... ఇలాంటి పాదాలను కూడా ఒకసారి చూడండి.. ఎందుకంటే, ఈ పాదాలు మీ పాదాలకంటే చాలా బావుంటాయి.  

విమానంలో మానభంగయత్నం

  ఓ విమాన ప్రయాణికుడు మరో ప్రయాణికురాలిపై విమానం గాల్లో వున్న సమయంలో టాయ్‌లెట్‌లో అత్యాచారయత్నం చేశాడు. హవాయి నుంచి జపాన్ వెళ్తున్న విమానంలో ఈ సంఘటన జరిగింది. హవాయి నుంచి విమానం బయలుదేరిన రెండున్నర గంటల తర్వాత మైఖేల్ టనోయె (29) అనే ప్రయాణికుడు టాయ్‌లెట్‌లో జపాన్కు చెందిన ఓ ప్రయాణికురాలిపై అత్యాచారయత్నం చేశాడు. ఆ జపాన్ యువతి అతనితో తీవ్రంగా పోరాడి టాయ్‌లెట్లో ఉన్న ఎమర్జెన్సీ బటన్ నొక్కింది. విమాన సిబ్బంది టాయ్‌లెట్ తలుపులు తీయడానికి తలుపులు కొట్టినా ఆ వ్యక్తి తలుపు తీయలేదు. దాంతో తలుపు స్క్రూలు ఊడదీసి ఆ యువతిని  కాపాడారు. అయితే ఆ రేపిస్టుతోపాటు విమానంలో ప్రయాణిస్తున్న అతని తల్లి మాత్రం తన కుమారుడి మానసిక ఆరోగ్యం బాగా లేదని, అందుకే అలా చేశాడని అంటోంది. ఈ సంఘటన వల్ల విమానం వెనక్కి తిరిగి మళ్ళీ హవాయికి వెళ్ళిపోయింది. హవాయి పోలీసులు రేపిస్టును అరెస్టు చేశారు. అతనికి భారీ శిక్ష పడే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.