ఈ ఉపఎన్నికలే జగన్ పార్టీకి చివరి ఎన్నికలు: బాబు
posted on Dec 20, 2011 8:02AM
హైదరాబాద్: అవినీతి రొంపిలో కూరుకుపోయి కొట్టుకులాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఉపఎన్నికలే చివరి ఎన్నికలు కాబోతున్నాయని తెదేపా చీఫ్ చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. ఆ పార్టీ ఎలా పతనమవుతుందో మనం చూస్తామని పార్టీ వర్గాలతో బాబు చెప్పుకొచ్చారు. వరంగల్ జిల్లాలో తెదేపా నాయకులను ఉద్దేశించి బాబు ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని అర్థం చేసుకన్నారనీ, రాష్ట్రంలో అస్థిరతకు కారణమైన కాంగ్రెస్ పార్టీయే సమస్యకు పరిష్కారం కనుగొనాలని అన్నారు. పార్టీ పరిస్థితిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు యుద్ధరంగంలో ఉన్నట్లు పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కెసిఆర్ ఎక్కడినుంచో ఊడిపడలేదని, తాము మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే కెసిఆర్ బయటకు వెళ్లి పార్టీ పెట్టారని ఆయన అన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కయి పోలవరం టెండర్లు దక్కించుకోవడానికి ప్రయత్నించారని ఆయన విమర్శించారు. పోలవరం టెండర్లకు సంబంధించిన ఫైళ్లను స్పీకర్ వద్ద ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నాగం జనార్దన్ రెడ్డికి చాలా గౌరవం ఇచ్చామని, దాన్ని నాగం కాపాడుకోలేదని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు జరిగే పరకాల శాసనసభా స్థానానికి ధర్మారెడ్డిని, స్టేషన్ ఘనపూర్ సీటుకు కడియం శ్రీహరిని ఆయన అభ్యర్థులుగా ఎంపిక చేశారు.