స్పీకర్ నోటీసులు:29లోగా వివరణ ఇవ్వాలని ఆర్డర్
posted on Dec 20, 2011 7:48AM
హైదరాబాద్ : శాసనసభలో అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్ విప్‌ని ధిక్కరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయ.స్ జగన్ వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ నోటీసులు జారీచేశారు. తాము జారీ చేసిన విప్‌ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన 16 మంది తమ పార్టీ శానససభ్యులపై కాంగ్రెసు స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. నోటీసులు జారీ చేయడానికి ముందు విప్ కొండ్రు మురళి స్పీకర్ మనోహర్‌ను కలిశారు. విప్‌ను ధిక్కరించిన 16 మంది శానససభ్యులపై అనర్హత వేటు వేయాలని ఆయన స్పీకర్‌ను కోరారు. ఆ తర్వాత స్పీకర్ వారికి నోటీసులు జారీ చేశారు.ఈనెల 29లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఈ విషయమై వచ్చే నెలలో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కాగా, మరోసారి ఈ నెల 27వ తేదీన తన ముందు హాజరు కావాలని స్పీకర్ ప్రజారాజ్యం పార్టీకి చెందిన శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డిని ఆదేశించారు. శోభా నాగిరెడ్డి విషయంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో ఈ చిక్కులు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ శోభా నాగిరెడ్డికి జారీ చేసిన విప్ చెల్లుతుందా, లేదా అనేది చూడాల్సి ఉందని అంటున్నారు.
కాగా, తాము విప్‌ను ధిక్కరించినట్లు అంగీకరిస్తే వైయస్ జగన్ వర్గానికి చెందిన 16 మంది కాంగ్రెసు శాసనసభ్యులపై వెంటనే వేటు పడే అవకాశం ఉంది. వారు అంగీకరించకపోతే కొంత సమయం పట్టవచ్చునని అంటున్నారు. వీరిపై అనర్హత వేటు ఒకేసారి పడుతుందా, లేదా అనేది ఉత్కంఠభరితంగానే ఉంది.