గాలి కేసుపై సీబీఐ విచారణ వేగవంతం
posted on Nov 3, 2011 @ 10:32AM
హైదరాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ నోరు విప్పడం లేదు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ గనుల తవ్వకాల కేసుపై మాత్రమే వేగంగా ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి గనుల తవ్వకాల కేసులో ఇప్పటికే సిబిఐ అధికారులు అప్పటి గనుల శాఖ మంత్రి, ఇప్పటి హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ప్రశ్నించారు. గనుల లీజులో వైయస్ జగన్ ఒత్తిడి ఏమైనా ఉందా అనే విషయంపై సిబిఐ అధికారులు ఆమెను ఆరా తీసినట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి పేరు గానీ వైయస్ జగన్ పేరు గానీ ఆమె చెప్పలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిబిఐ గాలి జనార్దన్ రెడ్డి కేసులో తమ ముందు హాజరు కావాలని జగన్‌కు నోటీసులు పంపించింది. గాలి జనార్దన్ రెడ్డికి బ్రాహ్మణి స్టీల్స్‌కు 10,670 ఎకరాలను వైయస్సార్ ప్రభుత్వం తక్కువ ధరకు కేటాయించడమే కాకుండా దానికి వాడుకునేందుకు ఇనుప ఖనిజం గనులను కూడా ఇచ్చింది. ఈ వ్యవహారంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి పనిచేసిందనే భావనతో ఉన్నారు. అంతేకాకుండా ఓఎంసిలో పెట్టుబడులు ఉన్న ఆర్ఆర్ గ్లోబల్, రెడ్ గోల్డ్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థలు జగన్ కంపెనీల చిరునామాలోనే ఉన్నాయి. ఇక్కడ అక్రమ గనుల సొమ్ము జగన్ కంపెనీల్లోకి చేరిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, సిబిఐ ముందు జగన్ హాజరయ్యే తేదీని వాయిదా వేయాలని జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 4వ తేదీన జగన్ సిబిఐ ముందుకు రానున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.