కడప జిల్లాపై చిరు దృష్టి
posted on Nov 3, 2011 @ 10:16AM
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకా అయిన కడప జిల్లాపై తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి కన్నేసినట్లుగా కనిపిస్తోంది. పిసిసి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తే కడప డిసిసి అడగాలని మాజీ పిఆర్పీ నేతలు భావిస్తున్నట్లుగా సమాచారం. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఓ వైపు కొత్త పిసిసి కార్యవర్గం కోసం కసరత్తు చేస్తుంటే, తనను నమ్ముకొని తనతో పాటు కాంగ్రెసులోకి వచ్చిన వారికి అందులో చోటు దక్కించుకోవడం కోసం చిరంజీవి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బొత్స పిసిసి తన కార్యవర్గంలో మార్పులు చేర్పులు చేయాలని గత కొంతకాలంగా భావిస్తున్నారు. ఆయన కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే సమయానికి తన వర్గానికి చెందిన వారి పేర్లను రెడీగా ఉంచాలని చిరు భావిస్తున్నారట. గత 2009 సాధారణ ఎన్నికల్లో పిఆర్పీకి అధిక మెజార్టీ వచ్చిన నియోజకవర్గాలు, జిల్లాల పైన చిరు దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది.