కాంగ్రెస్ కు తగలనున్న మరో గట్టి ఎదురుదెబ్బ
posted on Nov 3, 2011 @ 10:39AM
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగలనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఒక కాంగ్రెస్ అనుబంధ ప్రజా ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి జంప్ అయిన విషయం తెల్సిందే. ఇదే దారిలో మరికొంతమంది ప్రజా ప్రతినిధులు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇదిలావుండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు వెళ్లిపోవచ్చని అధిష్టానం భావిస్తోందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. అయితే, తెలంగాణ కోసం గట్టిగా పట్టుబడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కనీసం ఐదుగురు పార్టీని వీడొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎంపీల జాబితాలో పొన్నం ప్రభాకర్, ఎస్.రాజయ్య, మందా జగన్నాథం, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిలు ఉన్నట్టు ముందు వరుసలో ఉన్నారు. వీరు ఐదుగురు పార్టీని వీడాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే, నిజామాబాద్ ఎంపీ మధు యాష్కి, మహబూబాబాద్ ఎంపీ బలరామ్ నాయక్, పెద్దపల్లి ఎంపీ వివేక్‌లు మాత్రం పార్టీని వీడే విషయంలో వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం. తెలంగాణపై కాంగ్రెస్ వెనుకడుగు వేసినా లేక నాన్చుడి ధోరణిని ప్రదర్శించినా ఈ ఐదుగురు ఎంపీలు పార్టీని వీడొచ్చని భావిస్తున్నారు. మిగిలిన ముగ్గురు ఎంపీలు మాత్రం పార్టీలోనే ఉంటూ అధిష్టానంపై తీవ్రమైన ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. దీంతో ఈ ఐదుగురు ఎంపీలకు గాలం వేసే దిశగా తెరాస వర్గాలు భావిస్తున్నాయి.