అనుచిత పోస్టుల కేసు... జగన్ సమీప బంధువు అరెస్ట్
posted on Dec 16, 2025 9:15AM
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు అర్జున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అప్పటి విపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై ఇష్టారీతిగా అసభ్య పోస్టులు పెట్టిన కేసులో ఈ అరెస్టు జరిగింది.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలు, అప్పటి తన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవించక తప్పడం లేదు. జగన్ గద్దె దిగి రెండేళ్లు అవుతున్నా నాడు జగన్ అధికారం అండ చూసుకుని చెలరేగి అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయినందుకు ఫలితం అనుభవించక తప్పడం లేదు. జగన్ హయంలో ఇష్టారీతిగా వ్యవహరించి, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులతో చెలరేగిపోయిన వైసీపీ నేతలు పలువురు తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే విదేశాలకు పరారైపోయారు. అయితే పోలీసులు వారికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి మరీ అరెస్టులు చేస్తున్నారు.
అధికారం శాశ్వతం, ఏపీలో ఇక తమకు ఎదురేలేదన్నట్లు అక్రమాలు, దౌర్జన్యాలతో చెలరేగిపోయి, జగన్ మెప్పు కోసం సోషల్ మీడియాలో విపక్షాల ముఖ్యనేతలు, వారి కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెడుతూ రాక్షస ఆనందం పొందిన వైసీపీయులు ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడెక్కడికో పరారైన వైసీపీ నేతలను పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి మరీ అదుపులోనికి తీసుకుంటున్నారు.
తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్ సమీప బంధువు అర్జున్‌రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంలో అప్పటి ఆ వింగ్ ఇన్చార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డితో కలిసి అర్జున్‌రెడ్డి యాక్టివ్‌గా పని చేశాడు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి వైసీపీ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారంటూ అర్జున్‌రెడ్డిపై గతేడాది నవంబరులో గుడివాడలో కేసు నమోదైంది.
అప్పట్లో అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా విదేశాలకు పారిపోయాడు. తర్వాత పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. తాజాగా అతను విదేశాల నుంచి తిరిగి రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అర్జున్‌రెడ్డిని అడ్డుకుని గుడివాడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఏపీ నుంచి వెళ్లిన పోలీసు బృందాలు అదుపులోనికి తీసుకుని సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నోటీసులు అందజేశారు. అయితే అర్జున్‌రెడ్డి అప్పటికే తన లాయర్లను ఎయిర్‌పోర్టుకి రప్పించుకున్నారు. అతనిపై ఉమ్మడి కడప జిల్లా సహా పలు జిల్లాల్లో కేసులున్నాయి. వైఎస్ జగన్‌కు బాబాయ్ వరుసయ్యే వైఎస్ ప్రకాశ్‌రెడ్డి మనుమడే అర్జున్‌రెడ్డి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్‌యాదవ్, అర్జున్‌రెడ్డిల మధ్య వివేక హత్య జరిగిన రోజు రాత్రి ఫోన్ సంభాషణలు జరిగినట్లు అభియోగాలున్నాయి. దీనిపై దర్యాప్తు చేసి, అనుబంధ చార్జ్‌షీట్ వేయాలని హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ఇటీవల సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే.
మరోవైపు బద్వేలుకు చెందిన వైసీపీ నేత బత్తల శ్రీనివాసులరెడ్డిని కడప చిన్నచౌకు పోలీసులు హైదారాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం అయిన నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై బత్తల శ్రీనివాసులరెడ్డి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీనిపై కడపకు చెందిన టీడీపీ నేతలు గత ఏడాది నవంబరులో చిన్నచౌకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాసులురెడ్డిపై చిన్నచౌకుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. కాగా.. కూటమి అధికారంలోకి రాగానే బత్తల శ్రీనివాసులరెడ్డి గల్ఫ్ వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ నుంచి ఆయన హైదారబాద్‌కు రాగానే ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చిన్నచౌకు పోలీసులు హైదారబాద్‌కు వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకుని కడపకు తీసుకువచ్చారు. మొత్తానికి అరెస్టుల భయంతో అసలే బిక్కుబిక్కు మంటున్న వైసీపీ శ్రేణులకు ఈ తాజా అరెస్టులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.