అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా
posted on Sep 18, 2025 @ 10:47AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం (సెప్టెంబర్ 18) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరౌతారా? లేదా? అని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వారి హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ ఉత్కంఠకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో తెరపడింది. ప్రజా సమస్యలు జగన్ కు ఆయన పార్టీ సభ్యులకు పట్టవని మరో సారి రుజువైపోయింది. అసెంబ్లీ సమావేశాలకు జగన్ సహా వైసీపీ సభ్ములెవరూ హాజరు కాలేదు. వారు ఎక్కడా కనిపించలేదు.
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రులు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజులు అసెంబ్లీకి హాజరై ప్రజాసమస్యలపై మాట్లాడానికి వైసీపీ సభ్యులను ఆహ్వానించారు. గైర్హాజర్ కొనసాగితే అనర్హత వేటుపై హెచ్చరించారు. అంతెందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సభకు వచ్చి సమస్యలపై, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై మాట్లాడేందుకు సిద్ధమా అని సవాల్ కూడా విసిరారు. అయినా జగన్ స్పందించలేదు. ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు ఆయన సహా, ఆయన పార్టీ ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టారు.
ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే.. వాటిని పట్టించుకోని జగన్.. తన పార్టీ ఎమ్మెల్యేలతో గురువారం (సెప్టెంబర్ 18) మధ్యాహ్నం తరువాత సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం ఏర్పాటు చేయడంతో అక్కడ ఆయన ఏం మాట్లాడనున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా అధికారంలో లేని పార్టీ ఎమ్మెల్యేలతో సదరు పార్టీ అధినేత అసెంబ్లీ సమావేశాల సమయంలో సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. కానీ జగన్ మాత్రం అసెంబ్లీని బాయ్ కాట్ చేసి ఏమ్మెల్యేలకు ఏం దిశా నిర్దేశం చేస్తారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.