ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు.. దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు
posted on Sep 18, 2025 @ 12:22PM
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు విచారణలో ఈడీ దూకుడు పెంచింది. మద్యం కుంభకోణం సొమ్మును మనీ లాండరింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలలో గురువారం (సెప్టెంబర్ 18) ఉదయం సోదాలు ప్రారంభించింది. ఈ సోదాలు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఏకకాలంలో ప్రారంభమయ్యాయి. మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ పై ఈడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న డిస్టిలరీల నుండి ఈడీ వాంగ్మూలాలు తీసుకుంది. అంతే కాకుండా ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కేశిరెడ్డిని కూడా ఇప్పటికే ఈడీ విచారించింది. ఇప్పుడు ఆ వాంగ్మూలాలు, విచారణలో తేలిన అంశాల ఆధారంగా మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆఫీసులు, నివాసాలలో సోదాలు ప్రారంభించింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, తమిళనాడు సహా పలు ప్రాంతాలలో ఈ సోదాలు జ రుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో బినామీ సంస్థలు, సూట్ కేసు కంపెనీలు, హవాలా ద్వారా దాదాపు 3500 కోట్లు మనీలాండరింగ్ జరిగిందని సిట్ దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై ఈడీ నజర్ పెట్టింది.