కోమటిరెడ్డిపై కాంగ్రెస్ మెతక వైఖరి.. మతలబేంటి?
posted on Sep 18, 2025 @ 10:34AM
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ రెబల్ మాత్రమే కాదు అంతకు మించి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నేరుగా సొంత పార్టీ ప్రభుత్వాన్నే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఆయన దాటని హద్దు లేదు. తొలుత తనకు మంత్రి పదవి హామీ ఇచ్చి మాట తప్పారంటూ తన విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసుకున్నా.. ఇటీవలి కాలంలో ఏకంగా పార్టీనే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.
మంత్రిపదవి దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి.. తొలుత సీఎం రేవంత్ పై, ఇప్పుడు మొత్తంగా కాంగ్రెస్ పై తిరుగుబావుటా ఎగురవేశారు. తాజాగా తెలంగాణ లిబరేషన్ డే సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 17) ఆయన అమరవీరుల స్ఫూపం వద్ద నివాళి అర్పించారు. ఆ సందర్భంగా ఆయన తెలంగాణ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో పరిస్థితిని నేపాల్ లో పరిస్థితితో పోల్చి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కార్ పై ప్రజలు తిరుగుబాటు చేసి తరిమికొట్టే పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.
అయినా కాంగ్రెస్ నుంచి చిన్నపాటి స్పందన కూడా లేదు. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్టానుసారంగా పార్టీ పరువు మంటగలిసేలా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నా.. కాంగ్రెస్ చర్య తీసుకునే విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందన్నది అంతుపట్టడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఏకంగా కాంగ్రెస్ సర్కార్ పై ప్రజా తిరుగుబాటు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన తరువాత కూడా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై తనకు ఎటువంటి ఫిర్యాదూ రాలేదని టీపీసీసీ చీఫ్ అనడం పలు సందేహాలకు తావిస్తున్నది. అసలు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ సుమోటోగా తీసుకుని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్న కాంగ్రెస్ వర్గాల నుంచే వినవస్తున్నది.