కొంచమైనా లాజిక్ చూసుకోండయ్యా బాబూ..!
posted on Oct 16, 2025 @ 10:38AM
రాజకీయాలలో ప్రత్యర్థి పార్టీల మధ్య విమర్శలు సహజం. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీపై అధికారంలో లేని పార్టీ, ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా విమర్శలు చేస్తుంటుంది. ప్రభుత్వ విధానాలను ఎండగడుంటుంది. అందులో తప్పుపట్టాల్సిన అవసరం ఇసుమంతైనా లేదు. అయితే ఏ విమర్శలోనైనా, విమర్శకైనా హేతువు అన్నది ఉండాలి. అలా హేతురహితంగా చేసే విమర్శల వల్ల ప్రయోజనం సంగతి అటుంచితే రివర్స్ లో నవ్వుల పాలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ చేస్తున్న విమర్శలు, వ్యవహరిస్తున్న తీరు అలాగే నవ్వుల పాలౌతోంది.
ఏ రాజకీయ పార్టీకైనా ఒక సిద్ధాంతం అంటూ ఉంటుంది. ఒక విధానం అంటూ ఉంటుంది. ఆ సిద్ధాంతానికీ, విధానానికీ కట్టుబడి ఉన్న పార్టీ చేసే విమర్శలకు ఒకింత విలువ ఉంటుంది. ఆ పార్టీ చేసే విమర్శల్లో లాజిక్ ఉంటే జనం కూడా మద్దతు ఇస్తారు. అలా కాకుండా.. నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తాం, ప్రతి అంశాన్నీ రాజకీయం చేసి లబ్ధిని వెతుక్కుంటాం అంటూ జనం నవ్వి పోతారు. పట్టించుకోవడం మానేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి అదే పరిస్థితి ఎదురౌతోంది.
విశాఖపట్నానికి ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్ రావడం పట్ల రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలూ, మేధావులు, వ్యాపార వాణిజ్య వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. 80 వేల కోట్లకు పైగా పెట్టుబడితో గూగుల్.. ఈ డేటా సెంటర్, ఏఐ హబ్‌లను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తుండటం దేశ వ్యాప్తంగా అందరి దృష్టీ ఏపీపై పడేలా చేసింది. తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన 18 నెలల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఏపీ ప్రతిష్ట, ఏపీ సీఎం ప్రతిష్ట ఒక్కసారిగా ఆకాశం ఎత్తుకు పెరిగాయి.
పైగా విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఏఐహబ్ ఏర్పాటుల గురించి కేంద్రం స్వయంగా హస్తినలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ భారీ పెట్టుబడుల గురించి దేశానికి తెలియజేసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ మధ్య జరిగిన ఒప్పందంపై సంతకాల సందర్భంగా కేంద్ర మంత్రులు ప్రత్యక్షంగా హాజరయ్యారు.
మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి భారీ పెట్టుబడులు వచ్చినపుడు ప్రతిపక్షాలు కూడా హర్షం వ్యక్తం చేస్తాయి. ఏపీలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అంటూ లేకపోయినా, ప్రత్యర్థి పక్షంగా ఉన్నవైసీపీ ప్రశంసించలేదు సరికదా, ఈ విషయంపై రాజకీయం చేయడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నించింది. మొదట గూగుల్ డేటా సెంటర్ల వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏముందంటూ పెదవి విరిచింది. ఈ డేటా సెంటర్ వల్ల వచ్చేది కేవలం ఓ రెండు వందల ఉద్యోగాలు మాత్రమేననీ, డేటా సెంటర్లకు నీళ్లు భారీగా అవసరం పడతాయని.. దీని వల్ల వైజాగ్‌లో నీటి సమస్య తలెత్తుతుందని.. విద్యుత్ వినియోగం పెరిగి జనం మీద భారం పడుతుందని.. ఇలా తెలుగుదేశం కూటమి సర్కార్ సాధించిన ఈ బ్రహ్మాండమైన ఎఛీవ్ మెంట్ ను తక్కువ చేసి చూపడానికి వేయగలిగినన్ని కుప్పిగంతులు వేసింది. సరే వైసీపీ విమర్శలకు తెలుగుదేశం కూటమి పార్టీలు దీటుగానే బదులిచ్చాయి. అది వేరే విషయం.
అయితే అదే వైసీపీ గూగుల్ డేటాసెంటర్, ఏఐహబ్ వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని విమర్శించడంతో ఊరుకోలేదు.. అదే సమయంలో రాష్ట్రానికి గూగుల్ రావడంలో క్రెడిట్ అంతా జగన్ దే అంటోంది. ఒకే సమయంలో రెండు రకాలుగా వైసీపీ మాట్లాడుతోంది. జగన్ హయాంలో అదాని వైజాగ్‌లో డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు వచ్చారనీ, ఇప్పుడు గూగుల్‌తో అదానీ అసోసియేట్ అవుతున్నాడు కాబట్టి ఈ భారీ పెట్టుబడి తాలూకు క్రెడిట్ కూడా జగన్‌దే వైసీపీ నేతలు సొంత డప్పు వాయించుకుంటున్నారు. ఓవైపు డేటా సెంటర్లతో ప్రయోజనం లేదని, అంతా నాశనం అని విమర్శిస్తూనే.. ఈ క్రెడిట్‌ను జగన్‌కు కట్టబెట్టడానికి తాపత్రయ పడడం వైసీపీని నవ్వుల పాలు చేస్తున్నది. హేతుబద్ధత లేకుండా విమర్శలు చేయడం, మళ్లీ అదే సమయంలో అధికార పార్టీ క్రెడిట్ కూడా తన ఖాతాలో వేసేసుకోవడానికి తాపత్రేయ పడటం వైపీపీ ప్రతిష్టను మరింత దిగజారుస్తోంది.