ఆనవసర ఆపరేషన్లతో నిలువుదోపిడీ.. దేశంలో వైద్య విలువలు పతనం?
posted on Oct 15, 2025 @ 9:47AM
దేశంలో చికిత్స, వైద్యం పేరున అంతులేని దోపిడీ జరుగుతోంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ పార్లమెంటరీ కమిటీయే అంగీకరించింది. దేశంలో ఆరోగ్య రంగం పతనం అంచున ఉందని నివేదికలు చెబుతున్నాయి. విషయమేంటంటే దేశంలో జరుగుతున్న ఆపరేషన్లలో 44శాతం వరకూ నకిలీవేనని ఒక వార్తా సంస్థ నివేదిక కుండబద్దలు కొట్టింది. అంటే అవసరం లేని, మోసపూరితంగా ఆపరేషన్ల పేర ఆస్పత్రులు ప్రజలను దోచుకుంటున్నాయని వెల్లడించింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఆరోగ్యం విషయంలో ప్రజలలో ఉన్న భయాన్ని సొమ్ము చేసుకుంటున్నాయన్న మాట. ఆ వార్తా సంస్థ నివేదిక ప్రకారం దేశంలో గుండె ఆపరేషన్లు అంటూ చేస్తున్న శస్త్రచికిత్సల్లో 55 శాతం అవసరంలేనివే. అలాగే గర్భాశయం తొలగించే శస్త్రచికిత్సలు, మోకాలి మార్పిడి ఆపరేషన్లు, ఇక క్యాన్సర్ ఆపరేషన్లలో కూడా దాదాపు సగం అనవసరమైనవేనని నివేదిక వెల్లడించింది. అలాగే నార్మల్ డెలివరీ అయ్యే కేసులలో కూడా కానుపు కష్టమౌతుందంటూ ఆస్పత్రులు సిజేరియన్లే చేస్తున్నారని ఆ వార్త సంస్థ నివేదికలో తేలింది. దేశంలో జరిగే సిజేరియన్ ఆస్పత్రులలో 45 శాతానికి పైగా అనవసరమైనవేనని పేర్కొంది.
ఇలా అనవసరమైన ఆపరేషన్లు, లేదా నకిలీ ఆపరేషన్లు చేయడానికి ఆస్పత్రులు వైద్యులకు నెలకు కోటి రూపాయల వరకూ వేతనాలిచ్చినియమించుకుంటున్నాయని పేర్కొంది. మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలోని ప్రముఖ ఆస్పత్రులలో ఈ వార్తా సంస్థ సర్వే నిర్వహించి మరీ ఈ వివరాలను వెల్లడించింది.
ఇంకా దారుణమైన విషయమేంటంటే.. తమ ఆస్పత్రులలో పని చేస్తున్న వైద్యులలో ఎవరు ఎక్కువ మెడికల్ టెస్టులు చేయిస్తారో, ఔట్ పేషెంట్లుగా వచ్చిన వారిలో ఎక్కవ మందిని ఇన్ పేషెంట్లుగా చర్చుతారో, అలాగే ఎవరు అవసరం, అనవసరంతో సంబంధం లేకుండా అధిక ఆపరేషన్లు చేస్తారో వారికి వేతనాల పెంపు, బోనస్ లు దక్కుతున్నాయని కూడా సర్వే తేల్చింది.
అంతే కాకుండా ఠాకూర్ సినిమాలో చూపించిన విధంగా రోగి మరణించిన తరువాత కూడా అతని పరిస్థితి విషమంగా ఉందంటూ చికిత్స చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయని ఆ సర్వేలో వెల్లడైనట్లు తెలిపింది. ఈ రకంగా దేశంలో జరుగుతున్న వైద్య మోసాలను పార్లమెంటరీ కమిటీ కూడా ధృవీకరించింది. మోసాలు బయటపడిన సందర్భాలలో ఆయా ఆస్పత్రులకు జరిమానాలు విధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే మోసం ద్వారా వచ్చే ఆదాయంతో పొలిస్తే జరిమానాలు చాలా చాలా తక్కువగా ఉండటంతో ఆస్పత్రులు మోసం బయటపడినప్పుడు జరిమానా చెల్లించి చేతులు దులిపేసుకుని తమ దందాను మళ్లీ యథా ప్రకారం కొనసాగిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు.