ప్రచారం చేస్తారా.. ఫాం హౌస్ ప్రకటనలకే పరిమితమౌతారా?
posted on Oct 17, 2025 @ 3:06PM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలోనైనా ఫామ్ హౌస్ వీడి బయటకు వచ్చి ప్రచారం చేస్తారా? లేక ప్రకటనలకే పరిమితమౌతారా? అన్న చర్చ జోరుగా జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆయన బహిరంగంగా సభలూ, సమావేశాలలో పాల్గొన్న సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అంతకు ముందు నిత్యం ప్రజలతో మమేకమై ఉండే కేసీఆర్.. పార్టీ అధికారం కోల్పోయిన తరువాత పూర్తిగాక్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏమైనా చెప్పదలచుకున్నా ఎంపిక చేసుకున్న నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడి పంపిస్తున్నారు.
ఇప్పుడు బీఆర్ఎస్ కు చావో రేవో అన్నట్లుగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ అయినా ఆయన పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వస్తారా లేదా అన్న అనుమానం రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తున్నది. బిఆర్ఎస్ ఓటమి తరువాత కేసీఆర్ దాదాపుగా రాజకీయ అస్త్రసన్యాసం చేశారా అనిపించేలా ఆయన ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. అధికారం కోల్పోయిన తరువాత పార్టీ రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొంది. స్వయంగా ఆయనే కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావాల్సి వచ్చింది. పలు అవినీతి ఆరోపణలూ పార్టీ కీలకనేతలపై వచ్చాయి. చివరకు కన్న కూతురే పార్టీకి రాజీనామా చేసినా.. కేసీఆర్ మౌనం వీడలేదు. ఫామ్ హౌస్ దాటి అడుగుబయటపెట్టలేదు.
ఇక జూబ్లీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను కూడా ఫామ్ హౌస్ కు పిలిపించుకుని అక్కడే పార్టీ బీఫామ్ అందజేశారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ ఈ ఉప ఎన్నికల కోసం ప్రజా క్షేత్రంలోకి వస్తారా? పార్టీ గెలుపు కోసం మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేస్తారా? అంటే బీఆర్ఎస్ శ్రేణులే నమ్మకంగా ఔనని సమాధానం చేప్పలేకపోతున్నారు.
అయితే కేసీఆర్ తరువాత పార్టీ బాధ్యతలు మోయడానికి సిద్దమైన కేటీఆర్ ఈ ఉపఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇక్కడ విజయం ఆయనకు, ఆయన నాయకత్వ సమర్థతకు లిట్మస్ టెస్ట్ లాంటిదని చెప్పవచ్చు. అందుకే జరుగుతున్నది ఉప ఎన్నికే అయినా ఇది రేవంత్ ప్రభుత్వ ప్రతిష్ఠతకు, కేటీఆర్ నాయకత్వ పటిమకు పరీక్ష అనడంలో సందేహం లేదు. అందుకోసమైనా, కేటీఆర్ ను పార్టీలో తిరుగులేని నాయకుడిగా నిలబెట్టడానికైనా కేసీఆర్ జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని పార్టీ కేడర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. కేసీఆర్ కనుక ఒక సారి ప్రజాక్షేత్రంలోకి వచ్చి తన గళం వినిపిస్తే.. ఇప్పటిదాకా పార్టీని చుట్టుముట్టిన సమస్యలన్నీ దూదిపింజెల్లా తేలిపోతాయని క్యాడర్ నమ్ముతోంది. పరిశీలకులు సైతం అదే అంటున్నారు.
అయితే కేసీఆర్ ఇప్పుడు కూడా పామ్ హౌస్ కే పరిమితమై అజ్ణాతవాసాన్ని కొనసాగిస్తే మాత్రం ముందుముందు బీఆర్ఎస్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్ ఇప్పుడైనా క్రియాశీలంగా మారి.. జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ తరఫున విస్తృతంగా ప్రచారం చేయకుంటే... సపోజ్ ఫర్ సపోజ్ ఈ ఉప ఎన్నిక ఫలితం బీఆర్ఎస్ కు అనుకూలంగా రాకపోతే.. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ మనుగడ, ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతోంది. అందుకే బీఆర్ఎస్ నీటమునిగినా, పాలమునిగినా అందుకు కారణం కేసీఆర్ అవుతారని అంటున్నారు.