జాతీయ మీడియా టార్గెట్ కేంద్ర కేబినెట్ లోని దక్షిణాది మంత్రులేనా?
posted on Dec 10, 2025 9:23AM
కేంద్ర మంత్రత్వ శాఖలన్నిటిలోనూ అత్యంత రిస్కీ శాఖ అంటూ ఏదైనా ఉందంటే అది పౌర విమానయాన శాఖ మాత్రమే. ఇటీవలి కాలంలో ఈ శాఖను కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కార్ తెలుగువారికే అప్పగిస్తోంది. అది కూడా భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం కే ఈ శాఖ కేటాయిస్తోంది. గతంలో అంటే 2014-19లో ఎన్డీయే కూటమి తన భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం ఎంపీ అయిన అశోక గజపతి రాజుకు ఈ శాఖ కట్టబెట్టింది. ఇప్పుడు 2024లో మళ్లీ ఈ శాఖను తెలుగుదేశం యువ ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడికి అప్పగించింది. వాస్తవానికి పౌర విమానయాన శాఖ అత్యంత క్లిష్టమైనది, అత్యంత కీలకమైనదీ కూడా. ప్రమాదాలు, వివాదాలు సాంకేతిక లోపాలు వంటివి విమనాయానాల్లో సహజం. దేశంలో ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా, సాంకేతిక లోపంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినా, విమానంలో సాంకేతిక లోపం తలెత్తి సర్వీసు రద్దైనా పౌర విమానయాన శాఖ మంత్రి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచనలతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. శాఖాపరమైన పనులు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా జరిగేలా చూస్తున్నారు. అందరూ ఆయన పని తీరును భేష్ అంటూ ప్రశంసిస్తున్నారు.
అదలా ఉంటే.. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు, విమానాలలో సాంకేతిక లోపాల వంటి కారణాలు పౌరవిమానయాన శాఖకు తలనొప్పిగా పరిణమించాయి. తాజాగా ఇండిగో వ్యవహారం మరొ పెద్ద సమస్యగా పరిణమించింది. డీజీసీఏ నిబంధనలు పైలట్లకు విశ్రాంతి కోసం ఏర్పాటు చేస్తే.. అవి కాస్తా ఆ శాఖా మంత్రి అయిన రామ్మోహన్ నాయుడుకు విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని డిఫెండ్ చయడం కోసం జాతీయ మీడియా పౌర విమానయాన సంస్థ మంత్రిని స్కేప్ గోట్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నది. జాతీయ మీడియా ఉద్దేశ పూర్వకంగా దక్షిణాది మంత్రులపై దాడి చేస్తున్నదా అన్న అనుమానం కలుగుతోందంటున్నారు విశ్లేషకులు. ఇండిగో సంస్థ ప్రణాళికా లోపం, నిర్వహణ వైఫల్యం కారణంగా ఆ సంస్థకు చెందిన విమాన సర్వీసులు పెద్ద సంఖ్యలో రద్దై ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. ఇందుకు బాధ్యత వహించాల్సింది పూర్తిగా ఇండిగో సంస్థ. ఇప్పటికే ఆ సంస్థపై చర్యలకు మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉపక్రమించారు. సుప్రీం కోర్టు కూడా కేంద్రం తీసుకుంటున్న చర్యలను సమర్థించి, ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అయినా జాతీయ మీడియా మాత్రం ఇండిగో సంక్షోభాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి వైఫల్యంగా ప్రొజెక్టు చేయడానికి ప్రయత్నిస్తున్నది.
ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు జరిగాయి. అయితే జాతీయ మీడియావాటికి ఆ శాఖ మంత్రిని బాధ్యుడిని చేస్తూ కథనాలు వండి వార్చలేదు. ఇప్పుడు ఇండిగో వ్యవహారంలో మాత్రం పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యత వహించాలంటూ గగ్గోలు పెడుతోంది. అంటే జాతీయ మీడియా ఉత్తరాది, దక్షిణాది వివక్ష చూపుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.