టీడీపీ+జనసేన+బీజేపీ.. అందుకేనా వైసీపీ బెదురు?
posted on Oct 1, 2021 @ 1:42PM
మంత్రి కొడాలి నాని పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ.. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లతో పొత్తు పెట్టుకొని పోటీ చేసి.. దమ్ముంటే జగన్‌ను గద్దె దింపాలని సవాల్ చేశారు కొడాలి నాని. ఆయన ఊరికే చేశారా? లేక, తనకొచ్చిన సమాచారం మేరకే అలా అన్నారా? అనే చర్చ నడుస్తోంది. ఆ డిటైల్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి..
బీజేపీతో జనసేన తెగదెంపులు. ఈ మధ్య చాలా వెబ్ పోర్టల్స్‌లో ఈ టైటిల్ కనిపిస్తోంది. బీజేపీ, జనసేనల మధ్య దూరం పెరిగింది.. తిరుపతిలో జనసేన బీజేపీకి సపోర్ట్ చేయలేదు.. త్వరలోనే పవన్ కల్యాణ్ బీజేపీకీ బై బై చెప్పేస్తారు.. అంటూ రకరకాల కథనాలు వండివారుస్తున్నారు. ఆ ప్రచారం అలా జరుగుతుండగానే.. బద్వేల్‌లో ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం ఆ రెండు పార్టీలు కలిసి చర్చలు జరిపేందుకు సమాయత్తమవుతున్నాయి. సో, వారి మధ్య దూరం ఉన్న మాట వాస్తవమే అయినా.. ఆ రెండు పార్టీలూ ఇప్పట్లో విడిపోవని అర్థమైపోతోంది.
ఇక టీడీపీతో జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా? లేదా? అనేదే కీలకం. పవన్ కల్యాణ్-వైసీపీల మధ్య పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరింది. వైసీపీకి ఇప్పుడు ప్రధాన శత్రువు జనసేననే అనే రేంజ్‌లో ఆ రెండు పార్టీల మధ్య జగడం నడుస్తోంది. స్వతహాగా ఆవేశపరుడైన పవన్‌కల్యాణ్.. ఈసారి జగన్‌కు గట్టి ఝలక్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. కానీ, జనసేన బలం అంతంతమాత్రం. కొన్ని జిల్లాలకే పరిమితం. ఇక బీజేపీకంటే జనసేననే కాస్త బెటర్. ఆ లెక్కన జనసేన-బీజేపీ కలిసి పోటీ చేసినా.. వైసీపీని గద్దె దింపడం అంత ఈజీ కాకపోవచ్చు. ఆ లక్ష్యం నెరవేరాలంటే.. టీడీపీతో పొత్తు ఒక్కటే మార్గం.
ఏపీలో సంస్థాగతంగా టీడీపీ అత్యంత బలంగా ఉంది. నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే.. టీడీపీకే మెజార్టీ స్థానాలు ఖాయం. వైసీపీని దెబ్బకొట్టగల ఏకైక పార్టీ తెలుగుదేశమే. ఎంతకాదన్నా.. జనసేన, బీజేపీలు అత్యంత నమ్మదగిన పార్టీ టీడీపీనే. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు అనధికారికంగా పొత్తు పెట్టుకొని కొన్ని స్థానాలు గెలుచుకున్నాయి కూడా. జనసేన, బీజేపీ కేడర్ సైతం టీడీపీతో పొత్తు కోరుకుంటోంది. గతంలోనూ ఆ మూడు పార్టీలు కలిసి పని చేసిన అనుభవం ఉంది. అప్పట్లో కాస్త పొరపొచ్చలు వచ్చినా.. అవి మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు తక్కువే. అందుకే, బలమైన శత్రువు, ఉమ్మడి లక్ష్యమైన వైసీపీకి గుణపాఠం చెప్పాలంటే.. టీడీపీ-జనసేన-బీజేపీల మైత్రి అవసరమనే విశ్లేషణలు జరుగుతున్నాయి. ఆ మేరకు ఆయా పార్టీల్లో అంతర్లీనంగా చర్చలు కూడా జరుగుతున్నాయి. పార్టీల అధిష్టానంపై కిందిస్థాయి నుంచి ఒత్తిడి కూడా పెరుగుతోంది. అధినేతలు సైతం ఆ దిశగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఆ విషయం తెలిసే.. మంత్రి కొడాలి నాని అలా సవాల్ చేశారని అంటున్నారు. జనసేన పార్టీ బీజేపీ, టీడీపీతో పొత్తుపెట్టుకునైనా.. సీఎం జగన్‌ను మాజీ చేయగలదా అంటూ సవాల్ చేయడం వెనుక అసలు కారణం అదే అంటున్నారు.
ఆ మూడు పార్టీలు గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసుంటే.. వైసీపీకి ఏపీలో అడ్రస్ లేకుండా పోయేది. విడివిడిగా పోటీ చేశాయి కాబట్టే.. ఓట్లు చీలి.. వైసీపీ సీట్లు ఎగరేసుకుపోయింది. గత ఎలక్షన్స్‌లో జరిగిన పొరబాటు ఈసారి జరగకుండా చూస్తారా? వైసీపీ దుర్మార్గపు పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిపిస్తారా? జగన్‌ను గద్దె దించి.. ఏపీని కబంధహస్తాల నుంచి కాపాడుతారా? చూడాలి ముందుముందు ఏం జరుగుతుందో..