పుల్ల ఇడ్లీ.. వాట్ ఆన్ ఐడియా సర్‌జీ..
posted on Oct 1, 2021 @ 1:32PM
టిఫిన్స్ అందు ఇడ్లీ టిఫిన్ వేరయా. సౌత్ఇండియా స్పెషల్ ఇడ్లీ. యావత్ దేశం మెచ్చిన టిఫిన్. తెల్లగా, మెత్తగా ఉండే ఇడ్లీని నేరుగా తింటే పెద్ద టేస్ట్ ఏమీ ఉండదు. అదే ఇడ్లీని చట్నీతో కానీ, సాంబార్‌తో కానీ తింటే.. రుచి అదుర్స్. అందుకే ఇడ్లి-సాంబార్-చట్నీ కాంబినేషన్ అదుర్స్.
రుచి ఓకే కానీ, సాంబార్ ఇడ్లీ తినడమే కాస్త కష్టం. ఇడ్లీని ముక్కలు ముక్కలు చేసి.. సాంబార్‌లో వేసి.. కాసేపటి తర్వాత స్పూన్‌తో జుర్రుకుని తింటాం. అయితే, బెంగళూరులోని ఓ హోటల్‌కు వెళితే ఇకపై అలాంటి ఇబ్బందేమీ ఉండదు. ఎందుకంటే.. వాళ్లు వెరైటీగా "పుల్ల ఇడ్లీ" తయారు చేశారు కాబట్టి.
అవును, పుల్ల ఇడ్లీనే. పుల్ల ఐస్‌క్రీం మాదిరే ఈ పుల్ల ఇడ్లీ. ఇడ్లీకి పుల్ల ఉంటుంది అంతే. ఎంచక్కా ఆ పుల్లను పట్టుకొని.. ఇడ్లీని సాంబార్‌లో ముంచుకొని తినేయొచ్చు. అలానే చట్నీలో సైతం అద్దుకొని ఇడ్లీని ఈజీగా తినొచ్చు. స్పూన్‌తో కష్టపడాల్సిన పనిలేదు.. చేతులకంతా అంటించుకొనే ఇబ్బంది లేదు. ఈజీ టూ ఈట్.. కంఫర్ట్ టు ఈట్.
పుల్ల ఇడ్లీ.. ఐడియా అదుర్స్ కదూ. అందుకే, ఇది ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేసింది. ఆయన తన ట్విటర్‌లో ఈ పుల్ల ఇడ్లీ గురించి పోస్ట్ పెట్టగానే తెగ వైరల్ అవుతోంది. పుల్ల ఇడ్లీ ఫొటోను ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేస్తూ.. ‘బెంగళూరు.. దేశ వినూత్న ఆవిష్కరణలకూ రాజధాని అయిన ఈ నగరం, తన సృజనాత్మకతను ప్రదర్శించకుండా ఉండలేకపోతోంది’ అంటూ కామెంట్ చేశారు.
పుల్ల ఇడ్లీ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. అలా ఎలా తింటారని కొందరు.. చెయ్యి కడుక్కోవాల్సిన అవసరం లేదని.. నీటి వృథా తప్పుతుందని.. ఇలా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఆనంద్ మహీంద్రా పోస్ట్‌తో బెంగళూరు పుల్ల ఇడ్లీ తెగ ఫేమస్ అయిపోతోంది.