కాంగ్రెస్ లో ఆగని కల్లోలం.. సోనియాపైనే నేతల భారం
posted on Oct 1, 2021 @ 1:42PM
కాంగ్రెస్ పార్టీ అంటే అదో మహా సముద్రం ... ఇప్పుడా మహా సముద్రంలో మహా తుపాను సంభవించింది. పంజాబ్ లో ఏమి జరుగుతోందో వేరే చెప్పనక్కర లేదు. మాజీ క్రికెటర్ సిద్దూ పార్టీని ఒక ఆటాడుకుంటున్నారు. సిద్దూ చెపితే వినాలి, అనే విధంగా ... కాంగ్రెస్ అధిష్టానం ఆయన కోరిందే తడవుగా పీసీసీ అధ్యక్ష పదవిని బంగారు పళ్ళెంలో పెట్టి అప్పగించింది. అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ కెప్టెన్ అమరీందర్ సింగ్ అభ్యంతరం చెప్పినా రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా కెప్టెన్ ను పక్కన పెట్టి సిద్దూకు పట్టం కట్టారు. అయినా, ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోగా, దూరం పెరిగింది.
అంతే కాదు గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించింది అన్నట్లు, వ్యవహారం విషమించడంతో, ఈ అవమానాలు ఇక చాలని, కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజేనామా చేశారు. సిద్దూ సంతోషించారు.కానీ, ఎందుకనో, కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని కాదని, చరణ్’జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రి చేసింది. సిద్దూకు నచ్చలేదు. చన్నీ మంత్రివర్గంలోని కొందరు మంత్రులకు మచ్చలున్నాయని పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మళ్ళీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందని అంటున్నారు. సిద్దూ ముఖ్యమంత్రి చన్నీని కలిసి జరిపిన చర్చలు ఫలించాయి. ఆ విధంగా పంజాబ్ సంక్షోభం తీ కప్పులో తుపానులా సమసి పోయింది.
ఇది పంజాబ్ కు సంబందిచిన వ్యవహారం అయితే, జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల బృందం ‘జీ 23’ , కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మధ్య వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ‘జీ 23’ అంటే ‘జీ హుజూర్ 23’ అని కాదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటిముందు నిరసనకు దిగారు.రాళ్లు రువ్వారు. కోడి గుడ్లు విసిరారు. ఆయన కారు అద్దాలు బద్దలు కొట్టారు. ఈ సంఘటన కాంగ్రెస్ అధిష్టానం అనుమతితో జరిగిందో లేక కార్యకర్తలు తమంతట తాముగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో తెలియదు కానీ, దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్రంగా మండి పడ్డారు. ఖండించారు. ఇలాంటివి దాదాగిరి చర్యలేనని మండిపడ్డారు. కపిల్ సిబల్ వంటి సీనియర్లు ఇచ్చే సూచనలు, సలహాలను స్వాగతించాలే కానీ.. అణచివేత, దౌర్జన్యం వంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
‘పార్టీ తరపున పార్లమెంట్ బయట, లోపల పోరాటం చేసే కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రుడు. అటువంటి వ్యక్తి ఏ రూపంలోనైనా చేసే సూచనలు, సలహాలను స్వాగతించాలే కాని.. అణచివేత, దౌర్జన్యం వంటి చర్యలు పనికిరావు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ.. కపిల్ సిబల్ ఇంటిపై దాడి, దౌర్జన్యం చేసిన వార్తలు తనను షాక్‌కు గురిచేశాయన్నారు. ఇటువంటి దుర్మార్గమైన చర్యలు పార్టీకి చెడ్డపేరు తెస్తాయని.. వీటిని తీవ్రంగా ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. అసహనం, హింస వంటివి కాంగ్రెస్ పార్టీ విలువలకు వ్యతిరేకమని ఆనంద్ శర్మ అభిప్రాయపడ్డారు. చిదంబరం సహా ఇంకా అనేకమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తల చర్యను తీవ్రంగా ఖండించారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్‌లో నాయకత్వలేమి, పంజాబ్ సంక్షోభం వంటి పరిణామాలపై గళమెత్తిన సీనియర్ నాయకులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు లేకుండానే నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే కపిల్ సిబాల్ ‘జీ 23’ అంటే ‘జీ హుజూర్ 23’ కాదని అన్నారు. కపిల్ సిబల్ పై దాడిని, జీ23 నాయకులే కాదు, నట్వర్ సింగ్ వంటి సీనియర్ నాయకులు కూడా తీవ్రంగా ఖండించారు. పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజాజరుతోందని కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా పరిస్థితి చేయి దాటుతున్న వైనాన్నిగుర్తించే కావచ్చు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జీ23 నాయకులు కోరిన విధంగా, త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, ఎప్పుడు అన్నది స్పష్టం చేయలేదు.
గతంలోనూ ఇదిగో అదిగో అంటూ ఎప్పటికప్పుడు సీడబ్యున్సీ సమావేశాని వాయిదా వేస్తూవస్తున్నారని, ఈ సారి అలా జరగకుండా చూడాలని నాయకులు కోరుతున్నారు. మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి సంక్షోభాలు కొత్త కాదని, గతంలోనూ అనేక ఆటుపోట్లను ఎదుర్కున్న కాంగ్రెస్ పార్టీ పడిలేచిన కెరటంలా మళ్ళీ అధికార పగ్గాలను అందుకుందని కొందరు కాంగ్రెస్ నేతలు థీమాగా ఉన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యమా? అనేదే ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు,అభిమానులను వేధిస్తున్న ప్రశ్న.