ఓటమి ఖాయం.. వైసీపీ పదే పదే అంగీకరిస్తున్నది ఇదే!

గెలుపు ఆశలు వదిలేసుకుంది. వస్తేగిస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది లేకుంటే అదీ లేదని డిసైడైపోయినట్లు కనిపిస్తోంది. దింపుడు కళ్లెం ఆశతో కొందరు వైసీపీ అభ్యర్థులు మాత్రం రీపోలింగ్ కావాలంటున్నారు. ఇందుకోసం కోర్టును కూడా ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల తరువాత రీపోలింగ్ కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 

అసలు పోలింగ్ పూర్తయిన క్షణం నుంచీ వైసీపీలో గాభరా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా మీడియా ముందుకు వచ్చి పోలింగ్ సక్రమంగా జరగలేదంటూ ఆరోపణలు గుప్పించడం ప్రారంభించారు. సాధారణంగా ఓటమి భయంతోనే ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తారు. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి ఆరోపణలకు దిగడమంటే.. ఫలితం వెలువడడానికి ముందే చేతులెత్తేసిందని అర్ధం. వైసీపీ నేతలు సరిగ్గా అదే చేశారు. ఆ పార్టీ కీలక నేత, వైసీపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి మొదలు పెడితే పార్టీలో నోరున్న నాయకులుగా గుర్తింపు పొందిన అందరూ కూడా తెలుగుదేశం తమ అవకాశాలు దెబ్బతీసిందన్న ఆరోపణలు గుప్పించేశారు.

పోలీసులు, ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ఆ పార్టీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి తమను దెబ్బతీశారని విమర్శలు గుప్పించారు. ఇక అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అయితే తమ నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ బూత్ లలో తెలుగుదేశం యథేచ్ఛగా రిగ్గింగుకు పాల్పడిందని ఆరోపిస్తూ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్ ను ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతో ఏకంగా కోర్టుకు వెళ్లారు. అంబటి రాంబాబు పోటీ చేసిన సత్తెన పల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు పోలింగ్ బూతులలో రిగ్గింగ్ జరిగిందని రీపోలింగ్ నిర్వహించాలంటూ కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. అలాగే మోహిత్ రెడ్డి పిటిషన్ ను కూడా కొట్టేసింది. 

ఈ పిటిషన్ల సంగతి అలా ఉంచితే.. వైసీపీ నేతలు ఎన్నికల అక్రమాల గురించి ఆక్రోశం వెల్లబుచ్చుతూ, రీపోలింగ్ అంటూ గగ్గోలు పెడుతుండటం చూసిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నది అర్ధమైపోయింది. ఓటమి భయాన్ని ఇసుమంతైనా దాచుకోకుండా వైసీపీ కీలక నేతలు చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేశారని ఆరోపణలకు గుప్పించడం చూస్తుంటే ఓటర్లు తమ ఆయుధాన్ని ఎవరివైపు ఎక్కుపెట్టారన్నది అర్ధమైపోతోంది. ఈవీఎంల ధ్వంసం, ఓటర్లను స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం లేకుండా హింసాకాండకు పాల్పడినా.. జనం బెదరకుండా నిలబడి పట్టుదలతో ఓటు వేయడం చూస్తుంటే.. వైసీపీ సర్కార్ పట్ల వారిలో ఎంత ఆగ్రహం గూడుకట్టుకుని ఉందో అవతగతమైపోతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం లేదని పోలింగ్ కు ముందే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన బేల ప్రకటనతోనే  తన ఓటమి భయాన్ని వెల్లగక్కారు. ఆయన ప్రకటనతోనే వైసీపీ శ్రేణులు, నేతలూ, చివరాఖరికి అభ్యర్థులు కూడా డీలా పడిపోయారు. ఆయన ప్రకటన తరువాత వైసీపీ నియోజకవర్గ స్థాయి నేతలు పోల్ మేనేజ్ మెంట్ విషయంలో కూడా శ్రద్ధ తీసుకోలేదని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఇక సొమ్ము పంపిణీ విషయంలో కూడా అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపలేదనీ, వారిపై చివరి నిముషంలో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా అంటున్నారు. మొత్తం మీద ఫలితాల వరకూ వేచి చూడనవసరం లేకుండానే తమ ఓటమిని వైసీపీ అంగీకరించేసినట్లుగా కనిపిస్తోంది. 

Teluguone gnews banner