ఏపీ బీజేపీ నక్క జిత్తులు ప్రారంభం!
posted on May 24, 2024 @ 2:13PM
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో దోస్తీ చేయడం, బీజేపీని కూటమిలో భాగస్వామిని చేయడం టీడీపీ వర్గాలకు మొదట్లో ఉత్సాహం కలిగించింది. ఆ తర్వాత కొద్దిరోజులకే బీజేపీతో చేతులు కలపడం మెడకు రోలు తగిలించుకున్నట్టే అయిందని అర్థమైంది. బీజేపీ వల్ల నష్టమే తప్ప లాభం వుండదనే పాయింట్‌లో టీడీపీ, జనసేన వర్గాలకు క్లారిటీ వచ్చేసింది. అయినప్పటికీ స్నేహ ధర్మాన్ని పాటిస్తూ వచ్చాయి. పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో అభ్యర్థులు గెలవటం కోసం టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తమ శాయశక్తులా కృషి చేశారు. బీజేపీని తమ భుజాల మీద మోసుకెళ్ళడానికి శ్రమించారు. అయితే బీజేపీ లీడర్లు, కేడర్ మాత్రం తమ పార్టీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల మీద మాత్రమే తమ దృష్టిని నిలిపారు. టీడీపీ, జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీల జెండాలతోపాటు బీజేపీ జెండా కూడా రెపరెపలాడిందే తప్ప బీజేపీ నాయకులు, కార్యకర్తలు సహకరించింది సున్నా. సహకరించకపోగా, ఒకపక్క ప్రచారం జరుగుతున్న సమయంలోనే బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు టీడీపీ, జనసేన స్నేహధర్మం పాటించడం లేదని, తమకు సహకరించలేదని ఆరోపణ చేశారు. వైసీపీ దృష్టిలో కూటమి చులకనైపోయేలా చేశారు.
బీజేపీది మొదటి నుంచి ఒకటే సీక్రెట్ ఎజెండా. టీడీపీ, జనసేనతో కూటమి కట్టాలి. ఎలక్షన్లలో కూటమి విజయం సాధిస్తే మావల్లే విజయం సాధించిందని బిల్డప్పు ఇచ్చుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం నెత్తిన కూర్చుని వేధించి సాధించాలి. చంద్రబాబును అడుగు ముందుకు వేయకుండా చేసేలా కాళ్ళకు అడ్డుపడాలి. తద్వారా చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని బలహీనపరిచి రాష్ట్రంలో రెండో స్థానానికి చేరుకోవాలి. 2014లో బీజేపీ ఈ వ్యూహాన్నే పాటించింది. కాకపోతే చంద్రబాబును దెబ్బతీయ గలిగిందిగానీ, తాను రెండో స్థానంలోకి రాలేకపోయింది. 2024 ఎన్నికలలో కూడా బీజేపీ ఇదే వ్యూహంతో కొనసాగుతోంది. ఈ ఎన్నికలలో కూటమి గెలవాలని అందరూ కోరుకుంటున్నారు గానీ, బీజేపీ మాత్రం నిన్నమొన్నటి వరకు ‘నాకు ఎవరు గెలిచినా ఒకటే’ అన్నట్టుగా వుంది. కూటమి తెలిస్తే, అధికారంలో భాగస్వామ్యం... వైసీపీ గెలిస్తే ఆ పార్టీతో స్నేహం కొనసాగింపు అన్నట్టే అన్నట్టుగా, గోడమీద పిల్లిలాగా వుంది.
ఈసారి ఎన్నికలలో ఏపీలో అధికారంలోకి వచ్చేది కూటమేనని గత కొద్ది రోజులుగా అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చింది. చంద్రబాబే మళ్ళీ ముఖ్యమంత్రి అవబోతున్నారని అనధికారికంగా వెల్లడవుతున్న సర్వేలన్నీ చెబుతున్నాయి. నేషనల్ మీడియా కూడా ఏపీలో ప్రభుత్వం మారబోతోందని స్పష్టంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి రాబోతోంది కదా అని ఆనందించాల్సిన బీజేపీ ఆ పని చేయకుండా గుంటనక్క జిత్తులు ప్రదర్శించడం ప్రారంభించింది.
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇక వైసీపీ ఖేల్ ఖతం అయిపోతుంది. ఐదేళ్ళుగా బెయిల్ మీద వున్న జగన్ జైలుకు వెళ్ళక తప్పదు. అప్పుడు వైసీపీ నాయకుడు లేనీ పార్టీ అయిపోతుంది. ఆ పార్టీలో వున్న నాయకులకు ఇప్పటికే దడ ప్రారంభమైంది. చంద్రబాబు పవర్లోకి వచ్చాక వాళ్ళ పరిస్థితి వాళ్ళకే అర్థం కాకుండా వుంది. మారుమనసు పొందిన వాళ్ళలాగా యాక్టింగ్ చేసి టీడీపీలో చేరే అవకాశం కూడా లేదు. అలాంటి వాళ్ళని ఆకర్షించే పనిలో ఇప్పుడు ఏపీ బీజేపీ వుంది. తన ప్రయత్నాలను వల్లభనేని వంశీతో ప్రారంభించింది. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా ప్రవర్తించిన నాయకులు చాలామంది వున్నారు. వాళ్ళందర్నీ చేర్చుకునే ప్లాన్‌లో బీజేపీ నాయకులు వున్నారు. జూన్ 4 తర్వాత ఎఫ్పుడైతే వైసీపీ ఓడిపోతుందో వెంటనే కార్యాచరణలోకి దిగిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇలా వైసీపీ నాయకులను చేర్చుకోవడం ద్వారా, రాష్ట్రంలో ద్వితీయ ప్రత్యామ్నాయం స్థాయికి ఎదగాలన్నది ఏపీ బీజేపీ గుంటనక్క ప్లాన్. ఇలాంటి ప్లాన్లు వేయడం తప్పేమీ కాదు.. కాకపోతే, తెలుగుదేశం, జనసేన పార్టీలతో స్నేహం కొనసాగిస్తూనే ఇలాంటి ప్లాన్లు వేయడం మాత్రం బీజేపీ లాంటి పార్టీకే చేతనైన విద్య.