మోడీని రిసీవ్ చేసుకోని కేసీఆర్.. అసలు మతలబు ఇదే
posted on Feb 5, 2022 @ 3:04PM
దేశ ప్రధాని ఒక రాష్ట్రంలో అధికారిక పర్యటనలో పాల్గొంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్, ఇతర సీనియర్ మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రొటోకాల్ ను అనుసరించి స్థానికంగా ఎన్నైకైన ఒకరిద్దరు నేతలు ఎదురేగి స్వాగతించడం ఆనవాయితీ. అది ప్రభుత్వ మర్యాద. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీని స్వాగతించేది లేదని డిసైడైపోయారు. నువ్వొస్తే నేనెందుకు రిసీవ్ చేసుకోవాలె బై. నువ్వు దేశానికి ప్రధానివైతే కావచ్చు.. నేను ఈ రాష్ట్రానికి సీఎంను. అందులోనూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సీఎంను. దేశానికి నువ్వు బాసైతే... ఈ రాష్ట్రానికి నేనే బాస్. ఈ కేసీఆర్ పక్కా లోకల్.. అన్న మెస్సేజ్ ను బీజేపీ లీడర్లకు క్లియర్ గా ఇచ్చేశారు.
బీజేపీ నేతలతో దుష్మనీ పెంచుకుంటున్న కేసీఆర్... ఆ దూరాన్ని కూడా ఇప్పుడు కచ్చితంగా మెయింటెయిన్ చేస్తున్నారు. ఫిబ్రవరి ఫస్టున కేంద్ర బడ్జెట్ పై చెలరేగిపోయి విమర్శించిన కేసీఆర్... ప్రధాని మోడీ మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. విమర్శల స్థాయి దాటి తిట్ల పురాణం దాకా వెళ్లారు. రాయడానికైనా ఓసారి ఆలోచించుకోవాల్సిన మాటలు వాడారు. అదే సమయంలో మోడీ హైదరాబాద్ కు వస్తున్నారు కదా... మీరు హాజరవుతారా అని విలేకర్లు ప్రశ్నిస్తే.. దాని సంగతి దాందే... దీని సంగతి దీందేనంటూ తనకెంతో ఔన్నత్యం ఉందంటూ కలరింగ్ ఇచ్చుకున్నారు. మోడీ పర్యటన టైమ్ దగ్గర పడుతున్నప్పుడు కూడా ఇక్రిశాట్లోనే గాక ముచ్చింతల్ లో కూడా ప్రధానితో వేదిక పంచుకుంటారని ప్రకటించారు. ఇక్రిశాట్ లో 7 నిమిషాలు, ముచ్చింతల్ లో 8 నిమిషాలు కేసీఆర్ ప్రసంగిస్తారని టీఆర్ఎస్ అధికార మీడియా డిక్లేర్ చేసింది. కానీ జరిగింది మాత్రం వేరే.
2020 నవంబర్ లో మోడీ చివరిసారిగా హైదరాబాద్ వచ్చారు. కోవాగ్జిన్ ఉత్పత్తి చేస్తున్న బయోటెక్ ప్రయోగాల స్థాయిని పరిశీలించేందుకు హాజరయ్యారు. అప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే పర్యటనలో మోడీతో పాటు తాను కూడా పాల్గొంటానని కేసీఆర్ ప్రతిపాదిస్తే... కోవిడ్ విజృంభిస్తున్న దృష్ట్యా ఈ పర్యటన కేవలం బయోటెక్ వరకే పరిమితం చేస్తున్నామని, ప్రొటోకాల్ తో కూడిన రిసీవింగ్ లాంటి లాంఛనాలు కుదరవని ప్రధానమంత్రి కార్యాలయం తేల్చి చెప్పింది. దాంతో ఆ రోజు మోడీ పర్యటన కేవలం బయోటెక్ కే పరిమితమై, అట్నుంచి అటే మోడీ తిరుగుపయనం కూడా అయ్యారు. అంతకుముందు పుణే పర్యటనను కూడా మోడీ కార్యాలయం ఇదే విధంగా డిజైన్ చేయడం గమనించాలి.