అమరావతే రాజధాని.. ఇదిగో ఇండికేషన్...
posted on Feb 5, 2022 @ 1:26PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచనలు ఎలా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం అమరావతే రాష్ట్ర ఏకైక రాజధాని అనే నిర్ణయానికి వచ్చిందా? అంటే వచ్చిందనే సంకేతాలే కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. కొద్ది నెలల క్రితం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే కేంద్ర ప్రభుత్వం తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా శంఖుస్థాపన చేసిన, అమరావతిని ఏకైక రాజదానిగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్న వైనం స్పష్టమవుతోందని అంటున్నారు.
అమిత్ షా తమ పర్యటనలో భాగంగా రాష్ట్ర బీజేపీ నాయకులతో జరిపిన చర్చల్లో అప్పటికే ఉదృతంగా సాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలో భాగంగా సాగుతున్న ‘న్యాయస్థానం నుంచి దేవ స్థానం’ మహా పాదయాత్రలో పార్టీ నాయకులు పాల్గొనాలని, ఆదేశించారు. వైఎపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతి రైతులు సాగిస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజదానుల బిల్లును ఉప సంహరించుకుంది. అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే సమయంలో బిల్లును ఉప సంహరించుకున్నా, తమ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని, మళ్ళీ మూడు రాజధానుల్ బిల్లును మరింత పటిష్టంగా తీసుకొస్తామని అన్నారు. అయితే, ఆ ప్రకటన చేసి ఇంచుమించుగా మూడు నెలలు అవుతున్నా, అలాంటి ప్రయత్నం ఏదీ జరుగున్నట్లు లేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
అదలా ఉంటే, ఇటీవల రాజ్యసభలో ఏపీ రాజధానిపై క్లారిటీ ఇవ్వాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇచ్చిన సమాధానంలో కేంద్రం వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేశారు.
అదలా ఉండగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని అని మరో స్పష్టమైన సంకేతం ఇచ్చింది. అమరావతి పరిధిలో తుళ్లూరు-రాయపూడి మధ్య, మూడేళ్ళ క్రితం, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిలో శంఖుస్థాపన జరిగి, ఎన్నికలు, ప్రభుత్వ మార్పు కారణంగా నిర్మాణ పనులు నిలిచి పోయిన నేషనల్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయ నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం పునః ప్రారంభించింది. ఇందులో భాగంగా కార్యాలయం చుట్టూ ప్రహరి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాజధాని ఏదో ఖరారు చేస్తే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మిస్తామని ఆర్బీఐ నుంచి ఏపీకి సమాచారం వచ్చింది. కేంద్రం అమరావతే రాజధాని స్పష్టత ఇవ్వడంతో ఇప్పుడు మిగిలిన కేంద్ర సంస్థలు కూడా నిర్మాణాలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో వంక రాష్ట్ర ప్రభుత్వం కూడా మడమ తిప్పారనే మాట రాకుండా, పరువు నిలుపుకునేందుకు ఇంకా మూడు రాజధానులు అంటోంది కానీ, మూడును మూట కట్టినట్లే కనిపిస్తోంది, అమరావతిలో రెండున్నర మూడేళ్ళ క్రితం ఆగిపోయిన ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణ పనులను ప్రభుత్వం పునః ప్రారంభించింది. అలాగే, రాజ్యసభలో అమరావతే ఏపీ రాజధాని కేంద్రం స్పష్టం చేసిన నేపధ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డిని, “అంతేగా, సాంకేతికంగా అమరావతే రాజధానిగా” అన్నారు. అఫ్కోర్స్, దానికి కొనసాగింపుగా, ప్రభుత్వం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని,పడికట్టు పదాలను చేర్చారనుకోండి అది వేరే విషయం. కాగా, ఈ పరిణామాలను గమనిస్తే, కేంద్ర ప్రభుత్వం జోక్యంతో, రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు రాజధానుల ముచ్చటను, కనీసం ప్రస్తుతానికి అయితే అటక ఎక్కించినట్లే, అంటున్నారు.